Munugode By Election Results 2022
-
Munugode Bypoll Result 2022: అధికార దుర్వినియోగంతో దక్కిన విజయం
తెలంగాణ చరిత్రలోనే మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 12 మంది ఎంపీలు, మునుగోడులో తిష్ఠ వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ప్రతి రెండు గ్రామాలకూ ఒక ఎమ్మెల్యేని మోహరించారు. మండలానికి ముగ్గురు మంత్రులను నియమించి భారతీయ జనతా పార్టీ నాయకులను, గ్రామస్థాయిలో ఉండే యువతను టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగి పోతాయనీ, పింఛన్ దారులకు పింఛను రాదనీ, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇన్ని కుయుక్తులతో సాధించినది విజయమేనా? ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 97,006 ఓట్లు తెచ్చుకొని 10,309 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,693 ఓట్లు పొంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణికించారు. కాంగ్రెస్ 23,906 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ తమకు పోటీనే కాదనీ, కాంగ్రెస్సే ప్రత్యర్థి అని ఎన్నోసార్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు; ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ మును గోడులో భారతీయ జనతా పార్టీకి మంచి ప్రజాదరణ కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోలేక ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు’ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయి కంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని సాధించిన విజయమే తప్ప కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి కానీ, ఆయన పరిపాలనా విధానం చూసి గానీ వచ్చింది కాదు. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని భావించి... విజయం కోసం తన అంగ బలాన్నీ, అధికార బలాన్నీ ఉపయోగించారు. తాను చీదరించి మనుగడ లేకుండా చేసిన కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టు కున్నారు. అందుకే కనీస మెజారిటీ అన్నా టీఆర్ఎస్కు దక్కింది. ఈ ఉప ఎన్నిక... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఓటమి భయంతో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రెండు గ్రామాలను అప్పగించి ఆయా గ్రామాలలో మెజార్టీ చూపిం చకపోతే వచ్చే ఎలక్షన్లలో వారికి సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలిసింది. దీన్నిబట్టి కేసీఆర్ బీజేపీని చూసి ఎంతగా భయపడ్డారో తెలుస్తోంది. ఇంతజేస్తే... మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాలలో బీజేపీకి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఆ విధంగా మంత్రులకు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదన్నమాట. కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇన్ఛార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఉండి... ప్రతి ఒక్క ఓటరుకూ రూ. 4,000 ఇచ్చినా టీఆర్ఎస్కు బీజేపీ కన్నా 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి వరుసగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ఆరెగూడెం, లింగోజిగూడెం గ్రామాలలో టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నిజంగా మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో; చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ, అనుకున్నంత మెజారిటీ సాధించలేక పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే భావించిన టీఆర్ఎస్ చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలలో 30 వేల పైన ఓట్లు కొత్తగా నమోదు చేయించడం జరిగింది. ఇలా హడావిడిగా ఇన్ని కొత్త ఓట్లు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అవుతుంది అని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రెండు మూడు వేల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలోని నివాసితులవి కాగా, మిగతా ఓట్లన్నీ టీఆర్ఎస్ నాయకులు... మునుగోడు పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తల చేత ఓటు కోసం అప్లై చేయించినవే అని చెప్పవచ్చు. ఇదే రకమైన విధానాన్ని కేసీఆర్ పట్టభద్రులకు జరిగిన రెండు శాసనమండలి ఎలక్షన్లలో కూడా ఉపయోగించారు. అలాగే ఒకటవ తారీఖు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకూ డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి, మద్యాన్ని ఏరులై పారించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభుత్వానికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తనకు తాను జాతీయ నేతగా ప్రకటించుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ఫామ్‌హౌస్ డ్రామాకు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు టీఆర్ఎస్ తెరలేపడం జరిగింది. అయినప్పటికీ మునుగోడులోని ఓటర్లు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాటకాన్ని నమ్మలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఫామ్ హౌస్ డ్రామా రక్తి కట్టలేదు. ఈ మొత్తం ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంబంధించిన ఒక రూపాయి కూడా పట్టుబడకపోవడం ప్రభుత్వ వ్యవస్థల దుర్వి నియోగానికీ, అధికార యంత్రాంగం టీఆర్ఎస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసింది అనడానికీ నిదర్శనం. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చిన అనేక సర్వేలు చూసిన తర్వాత అయోమయానికి గురవు తున్న టీఆర్ఎస్ నేతలకు... ఏమి చేయాలో పాలుపోక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం దేనికి అద్దం పడుతుంది? ఈ పనులేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డు కోలేవు. ఇటీవలి కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. అధికారం దిశగా అడుగులు వేస్తోంది. - ఎన్. రామచందర్ రావు మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
మునుగోడు ఫలితంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఆ దిశగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పచ్చ జెండా ఊపేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్థిని గెలిపించి ‘తెలంగాణ మోడల్’ను భారత దేశమంతా అమలు చేయమని ఆశీర్వదించారు. మేమంతా ఇప్పుడు ‘భారత్ రాష్ట్ర సమితి’ వెంటేనని తెలంగాణ మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను వివరించాల్సిన అవశ్యకత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని 64 ప్రత్యేక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, చేనేత బీమాలు తెలంగాణ సమాజంలో కేసీఆర్ మార్కును చూపిస్తున్నాయి. ఒక వైపు కాళే శ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో రాష్ట్రంలో సాగు లోకి వచ్చిన భూ విస్తీర్ణం అమాంతం పెరిగిపోయి గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, సర్కారే ధాన్యం కొనుగోలు చేయడం, గొర్రె పిల్లలు పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటివి కూడా గ్రామీణఆర్థిక వ్యవస్థను రోజురోజుకూ పటిష్టం చేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2018 ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీల్లో మెజారిటీ నెరవేర్చటం, మిగిలినవి ప్రగతిలో ఉండటం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో విజయవంతమై రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుండటం శుభ పరిణామం. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో నిరు పేదలు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడి నుంచి పూర్తిగా తప్పించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ రూపాల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తే... కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఎక్కువ ఆదాయం పంపే రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన అసవరం ఉంది. ఇక దేశంలో సామాజిక పింఛన్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఎంతో ముందున్నది. (క్లిక్: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో వెనకబడిన, అణచివేతకు గురవుతున్న ప్రాంతాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవశ్యకత నేడు ఎంతో ఉంది. సహజ సంపదలు ఎన్ని ఉన్నా... వాటిని వినియోగించు కోలేని స్థితి పలు రాష్ట్రాల్లో పక్కాగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లకు సాకారమైన కాళేశ్వరం... నేడు తెలంగాణ ప్రగతిలో మేలి మలుపు అయింది. వివిధ నదుల కింద ప్రాజెక్ట్‌ల నిర్మాణం ద్వారా, అనేక పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచి సంపద సృష్టించి, ఆ సంపదను మళ్లీ ప్రజలకే పంచడం కేసీఆర్ ప్రత్యేకత. అందుకే మునుగోడు ఓటరు కేసీఆర్‌ని దీవించి భారత్ రాష్ట్ర సమితికి పచ్చాజెండా ఊపారు. - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉభయ రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు – ‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను. ‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్‌ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు. ‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’ ‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి ఏమన్నడు?’’ ‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్ఎస్కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’ ‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్ ఖాన సుంటి కె.ఎ. పాల్ ఏమన్న అన్నడా?’’ ‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్ అన్నడు. ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’ ‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’ ‘‘సార్ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి ఒకడు ఫోన్ గొట్టిండు. అన్నా! పౌరన్ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు. ‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేయాలి: కేఏ పాల్
నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు వేసిన సీల్ మారిందని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్‌కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్ చెప్పారు. -
మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నికల్లో మెజారిటీ తగ్గిందని, రావాల్సిన ఓట్లు రాలేదంటూ విజయం సాధించిన పార్టీతోపాటు అపజయం పాలైన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రక్రియలో లెక్క ఎక్కడ తప్పింది? ఓట్లు ఎందుకు తారుమారయ్యాయి..? అన్న దానిపై అన్ని ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. భారీ మెజారిటీ వస్తుందని టీఆర్ఎస్, తప్పకుండా గెలుస్తామన్న ధీమాలో బీజేపీ, మహిళా సెంటిమెంట్ పని చేస్తుందని, ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించినా వారి అంచనాలను మునుగోడు ప్రజలు తారుమారు చేశారు. భారీ మెజారిటీ అంచనా వేసుకున్న టీఆర్ఎస్ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ 30 వేల నుంచి 40 వేల మెజారిటీ వస్తుందని అంచనా వేసుకుంది. అన్ని మండలాల్లోనూ ఆధిక్యంలోనే ఉన్నా తక్కువ మెజారిటీ రావడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి రెండుసార్లు బహిరంగ సభలకు రావడంతోపాటు 12 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నామినేషన్ మొదలుకొని పోలింగ్ చివరి వరకు నియోజకవర్గంలో ఉండి. ఆ తర్వాత నియోజకవర్గ పొలిమేరల్లో ఉండి మరీ పర్యవేక్షించారు. బీజేపీకి 86 వేలకు పైగా ఓట్లు వస్తాయని ఊహించలేదు. 2018 ఎన్నికల్లో కేవలం 12వేలకు పైగా ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఒకేసారి 86 వేలకు పైగా రావడంతో టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ పెద్ద ఎత్తున తగ్గింది. దీనిపై పార్టీ నేతలు పోస్టుమార్టం చేస్తున్నాయి. ఏ మండలంలో ఎందుకు మెజారిటీ తగ్గిందన్న అంశంపై దృష్టి సారిస్తున్నారు. గెలుస్తామనుకున్న బీజేపీ బీజేపీ ఈ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతేడాతోనైనా గెలుస్తామని భావించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్మయుద్ధం పేరుతో టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసి మరీ ప్రచారం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులంతా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని చెబుతూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. అయినా 10 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్న విశ్లేషణల్లో పడింది. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 3 రౌండ్లలోనే బీజేపీకి ఆధిక్యం వచ్చిందని, మిగతా రౌండ్లలోని పోలింగ్ బూత్‌ల పరిధిలో పార్టీ ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేయడంలో వైఫల్యాలను అంచనా వేసుకునే పనిలో పడింది. వైఫల్యాలే కారణమా.. కాంగ్రెస్ పార్టీ ప్రచార వైఫల్యం వల్లే ఓట్లు తగ్గాయన్న భావనలో ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలోనూ ఇతర ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ పోటీ పడ్డాయి. కాంగ్రెస్ మాత్రం వాటితో పోటీ పడలేని పరిస్థితి. ఇదే సందర్భంలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణకు రావడంతో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్, భట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర నేతలంతా జోడో యాత్రలోనే ఉన్నారు. దీంతో చివరి దశలో ప్రచారం పెద్దగా చేయని పరిస్థితి నెలకొంది. చివరికి పోలింగ్ రోజున ఓటర్లను డబ్బు పంపిణీ విషయంలోనూ వెనుకబడింది. అయినా మహిళా సెంటిమెంట్, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు అన్న భావనతో ఓట్లు భారీ ఎత్తున వస్తాయన్న అంచనాలు వేసుకుంది. అయినా వెనుకబడిపోయింది. ఈ విషయంలో పార్టీలో అంతర్గత సమస్యలు కారణమన్న అంచనాకు వచ్చింది. అయినప్పటికీ స్రవంతికి 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బాగానే ఉందన్నది నిరూపితమైంది. -
సాక్షి కార్టూన్ 08-11-2022
సాక్షి కార్టూన్ 08-11-2022 -
‘బిడ్డా మీ ఆటలు సాగవింక.. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఉర్కించి కొడతాం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో నాయకుల పరస్పర విమర్శలు రాజకీయ వేడిని తగ్గనీయడం లేదు. తాజాగా టీఆర్ఎస్ గెలుపును తక్కువ చేసి మాట్లాడతున్న నాయకులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందికి నీతులు వల్లించే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఈ వందల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి. చొప్పరి వేణు నీతో ఉంటాడా లేదా? ఈటల హత్య రాజకీయాలు చేసే వ్యక్తి. ప్రవీణ్ యాదవ్‌ను పోలీసుల టార్చర్ తో చంపింది నిజం కాదా? నన్ను కూడా చంపే ప్రయత్నం చేయలేదా? ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తే కానీ గొడవలు.. మీ భార్య సొంత ఊరిలో ఎలా గొడవలు చేశారు. పలివెల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డినీ చంపే కుట్ర చేశారు’ అని విమర్శలు చేశారు. (చదవండి: తెలంగాణ సర్కార్‌కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?) ఇష్టానుసారంగా మాట్లాడితే కబర్ధార్! ‘వివేక్ నీ మొహానికి మళ్ళీ ఎంపీ గా గెలవగలవా? నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే స్థితి లేదు. కేటీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ కబర్దార్. కేసిఆర్, కేటీఆర్ పైన ఇక నుండి ఏం మాట్లాడిన ఉర్కించి కొడతాం. బిడ్డ బీజేపీ నాయకుల్లారా ఇక నుండి మీ ఆటలు సాగవు. ఈటల రాజేందర్ నువ్వు గెలిచి ఏడాది దాటింది. హుజూరాబాద్ లో చేసిందేమిటి. రూ. 3000 పెన్షన్ అన్నవ్ ఇప్పటి వరకు ఇచ్చావా? రోడ్లు, డ్రైనేజ్ లైన అభివృద్ధి చేసినవా?’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా, వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందని ఈటల రాజేందర్ విమర్శించిన సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారని, అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారని ఆరోపించారు. (చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!) -
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్ఎస్, మునుగోడు ఉప ఎన్నిక గెలుపును కీలక మలుపుగా భావిస్తోంది. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినట్లుగానే మునుగోడు విజయం కూడా బీఆర్ఎస్కు కొత్త మలుపును ఇస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: బీఆర్ఎస్గా టీఆర్ఎస్.. అభ్యంతరాలపై పత్రికా ప్రకటన రిలీజ్ కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మునుగోడుకు పరిమితం చేయకుండా.. ఉపఎన్నికలో గెలుపును కేవలం మునుగోడుకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ రాజకీయాల కోణంలో ప్రొజెక్ట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుత ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడును పెంచడమో లేదా వేగాన్ని తగ్గించడమో చేస్తుందని ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందనే కోణంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. ప్రస్తుత ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే అంశంపైనా టీఆర్ఎస్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలోని ఓ బృందం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేయాల్సిన అడుగులపై కసరత్తు కొనసాగిస్తుందని, అదే సమయంలో 2023 ఎన్నికలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించేలా తమ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడమే తమకు అత్యంత ప్రధానమని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్నికల రాజకీయాలను ఎండగట్టడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు మునుగోడు గెలుపును వ్యూహంగా మలుచుకోవడంపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎన్నిక సరే.. మునుగోడుతో ఎన్నో మలుపులు
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ,బీజేపీల మద్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఎన్నెన్నో ట్విస్టులు, జిమ్మిక్కులు జరిగిన తీరు రాజకీయాలకు అంత వన్నె తెచ్చేవి కావు. కాని గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ రోజులలో ఈ ప్రమాణాల గురించి పెద్దగా ఆలోచించడం అనవసరమనిపిస్తుంది. రాజకీయంగా చూస్తే టీఆర్ఎస్ గెలిచిన మాట నిజమేకాని, ఆశించినంత మెజార్టీ రాకపోవడం ఆ పార్టీకి కొంత నిరాశేనని చెప్పకతప్పదు. టీఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డి అంత బలమైన అభ్యర్ధి కాదని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈ మాత్రం మెజార్టీ అయినా రావడం ఆ పార్టీకి ఊరట అని భావించాలి. భవిష్యత్తుకు సంకేతం.! ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని తద్వారా తెలంగాణలో గట్టి పునాది వేసుకోవాలని విశ్వయత్నం చేసిన బీజేపీకి తీవ్ర ఆశాభంగమే ఎదురైందని చెప్పాలి. కాని రెండో స్థానంలోకి రావడం ద్వారా కాంగ్రెస్‌ను బాగా దెబ్బతీసినట్లయింది. భవిష్యత్తులో తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చినందుకు బీజేపీ సంతోషపడుతోంది. అందువల్లే ఓడిపోతే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖాతాలోకి, గెలిస్తే బీజేపీ ఖాతాలోకి వస్తుందన్న విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో తన పట్టు పూర్తిగా కోల్పోకపోయినా, డిపాజిట్ పోవడం , మూడో స్థానానికే పరిమితం కావడం పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయినా టీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగిన రాజకీయ యుద్దంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి 23వేల ఓట్లు తెచ్చుకోవడం విశేషమే . ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా మూడువేల లోపు ఓట్లకే పరిమితం అయింది. ఇక్కడ ఆ పరిస్థితి రాలేదు. ఎన్నికలో ఎవరిది పైచేయి.? స్థూలంగా చూస్తే తెలంగాణలో బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ కళ్లెం వేస్తే, ఇంతకాలం తనకు ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించడం ద్వారా, రెండో స్థానాన్ని సాధించడం ద్వారా ఆ పార్టీని బీజేపీ కొంత ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి. గత సాదారణ ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పక్షాన 22వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై ఆలోచన చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లాలని ఆలోచించారు. ఆ క్రమంలో ఆయన కొన్నిసార్లు బీజేపీని ప్రశంసించడం, ఆ పార్టీలోకి వెళ్లనున్నట్లు సంకేతాలు ఇవ్వడం, మరికొన్నిసార్లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లు చెప్పడం వంటి రాజకీయం నడిపారు. కేంద్రంలోకాని, తెలంగాణలో కాని కాంగ్రెస్ అధికారం రావడం సాద్యం కాదని ఆయన భావించడమే ఇందుకు కారణం. అదే సమయంలో తన నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ తొలుత ఆయన పార్టీ మారడాన్ని అంగీకరించలేదు. అందుకే ఆయన చాలా సమయం తీసుకున్నారు. అంతేకాదు. ఒక దశలో తన సోదరుడు, ఎంపి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు. తమకు ఆ బాద్యతలు అప్పగిస్తే పార్టీని తెలంగాణలో అదికారంలోకి తెస్తామని వారు అదిష్టానానికి చెప్పారు. కాని కాంగ్రెస్ అధినాయకత్వం టీడీపీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యత అప్పగించింది. కోమటిరెడ్డి కొత్త దారి రేవంత్ ఎంపిక తర్వాత కోమటిరెడ్డి సోదరులు బాగా హర్ట్ అయ్యారు. అప్పటి నుంచి రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళ్లాలన్న గట్టి ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా కలిశారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నుంచి ఒక గట్టి నేత తమ పార్టీలోకి వస్తే బీజేపీకి మరింత ఊపు వస్తుందని భావించారు. రాజగోపాలరెడ్డి బీజేపీలోకి చేరడానికి ముందుగా నియోజకవర్గం అంతటా పర్యటించి తన మద్దతుదారులను మానసికంగా సిద్దం చేశారు. మెజార్టీ మద్దతుదారులను తనవైపు తిప్పుకున్నా, కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడని క్యాడర్ కూడా గణనీయంగానే ఉందని చెప్పాలి. అదే ఇప్పుడు కోమటిరెడ్డిని దెబ్బతీసింది.కాంగ్రెస్ పార్టీకి పది వేల నుంచి పదిహేనువేల ఓట్లు లోపే వస్తాయని వారు అనుకున్నారు. కోమటిరెడ్డి బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఈ ఉప ఎన్నిక వచ్చేదికాదు. వ్యూహాలు - ప్రతి వ్యూహాలు బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి , తన పట్టును పరీక్షించుకోవడానికి ఉప ఎన్నిక తీసుకు వచ్చింది. మరో ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఇది రిహార్సల్ అని, సెమీ ఫైనల్స్ అని ప్రచారం జరిగింది. మునుగోడులో గెలిస్తే ఒక ఊపు వచ్చి తెలంగాణ అంతటా బీజేపీకి బలమైన అభ్యర్ధులు దొరికి అధికారం వైపు వెళ్లవచ్చని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కాని వారి లక్ష్యం కొంతమేరే నెరవేరింది. వచ్చే సాధారణ ఎన్నికలలో గెలవాలంటే బీజేపీ ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుంది. టీఆర్ఎస్ వ్యూహాలను పరిశీలిస్తే బీజేపీ ఎత్తుగడలను ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పసిగట్టారు. అందులోను హుజూరాబాద్ లో బీజేపీ పక్షాన ఈటెల రాజేందర్ గెలవడంతో టీఆర్ఎస్ పై ప్రజలలో వచ్చిన అనుమానాలను పోగొట్టాలంటే మునుగోడు ఎట్టి పరిస్థితిలోను గెలిచి తీరాలని ఆయన అనుకున్నారు. మిషన్ మునుగోడు ఎన్నికల రాజకీయాలలో తలపండిన కేసీఆర్ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రచారం ఆరంభించారు. మంత్రి జగదీష్ రెడ్డికి పూర్తి బాద్యతలు అప్పగించారు. ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తన రాజీనామా వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రచారం చేసినా, దానిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని వెళ్లారు. మొత్తం మంత్రులు,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని మునుగోడులో ప్రచారానికి పంపించారు. తానుకూడా ఒక గ్రామానికి ఇన్ చార్జీగా ఉంటానని చెప్పడం ద్వారా నేతలకు ఈ ఎన్నిక ఎంత ముఖ్యమైనదో ఆయన తెలియచేశారు. బీఆర్ఎస్కు ఇదే నాంది జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు మునుగోడు గెలుపు ఒక మలుపు అవుతుందని ప్రచారం చేశారు. ఇదే సమయంలో బీజేపీ విధానాలను తప్పుపడుతూ విమర్శలు కురిపించేవారు. ప్రభుత్వాలను కూలగొడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని చెప్పడానికి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని విజయవంతంగా తెరపైకి తెచ్చారు. దీనిని ఎదుర్కోవడానికి బీజేపీ చాలా కష్టపడవలసి వచ్చింది. వారు ఇదంతా డ్రామా అని ప్రచారం చేసినా, బీజేపీకి కొంత డామేజీ జరిగిందని చెప్పాలి.కోమటిరెడ్డికి కేంద్రం 18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని, అంత మొత్తానికి ఆయన అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణ చేసింది. మొత్తం 18వేల కోట్లు రాజగోపాలరెడ్డి జేబులోకి వచ్చాయేమోనని ప్రజలు అనుమానించే తీరులో ఈ ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ ఎంత వివరణ ఇచ్చినా పెద్దగా ఉపయోగం జరగలేదు. ఇంత చేసినా పది వేలే.! మామూలుగా ఎన్నికల్లో పది వేల మెజార్టీ మంచి మెజార్టీనే అవుతుంది. కాని టీఆర్ఎస్ గతంలో సాధించిన విజయాలు,మునుగోడులో కేంద్రీకరించిన తీరు, సర్వేలలో పదినుంచి పదిహేను శాతం ఆదిక్యతతో గెలుస్తుందని వచ్చిన అంచనాలు ..వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే ఇది గొప్ప మెజార్టీ కాదన్న అభిప్రాయం ఏర్పడింది. టీఆర్ఎస్ కు, బీజేపీకి మద్య నాలుగుశాతం ఓట్ల తేడానే ఉంది. ఈ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా వ్యయం చేశాయన్నది వాస్తవం. టీఆర్ఎస్ నాలుగువేల చొప్పున, బీజేపీ మూడువేల చొప్పున, కాంగ్రెస్ వెయ్యి రూపాయల చొప్పున డబ్బు పంపిణీ చేశాయని చెబుతున్నారు.ఇవి కాకుండా స్థానిక నేతలను లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. స్టేట్ పోలీస్ x సెంట్రల్ ఫోర్సెస్ రోజూ ఓటర్లకు మద్యం , చికెన్ వంటివి సరఫరా చేశారు.కాగా బీజేపీ డబ్బును పట్టుకోవడానికి రాష్ట్ర పోలీసులను టీఆర్ఎస్ వాడుకుంటే, ఆదాయపన్ను శాఖ అదికారులను బీజేపీ వాడుకుంది. ఈ విషయంలో టీఆర్ఎస్ బాగా సఫలం అయిందని చెప్పాలి. పట్టుబడిన డబ్బులో అత్యధికం బీజేపీకి చెందినవారిదే కావడమే ఇందుకు ఉదాహరణ. ఆదాయపన్ను అదికారులు మంత్రి జగదీష్ రెడ్డి పిఎ ఇంటిలోకాని, మరికొన్ని చోట్ల కాని దాడులు చేసినా, అంతంతమాత్రంగానే డబ్బు పట్టుబడిందని చెబుతున్నారు.సిబిఐ, ఈడి వంటి సంస్థలను వాడుకుని ప్రత్యర్ధి పార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందన్న ప్రచారాన్ని కూడా టీఆర్ఎస్ విజయవంతంగా తీసుకు వెళ్లింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని బీజేపీ ప్రచారం చేసినా, టీఆర్ఎస్ ఆరోపణల ముందు ఇది ఆగలేదనిపిస్తుంది. ఏతావాతా చెప్పాలంటే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ, వచ్చే సాధారణ ఎన్నికలలో పరిస్థితి అంత తేలికగా ఉండదన్న సంకేతం వచ్చింది. కారు కళ్లు తెరుస్తుందా? ఈ ఎన్నిక ద్వారా ఒక విషయం అర్థమయింది. టీఆర్ఎస్ పూర్తి అప్రమత్తం కావాల్సిన తరుణం అని చెప్పాలి. అలాగే బీజేపీకి తెలంగాణలో అదికారం వచ్చేంత సీన్ ఇప్పటికైతే రాలేదన్న సంగతి కూడా అర్ధం అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈ రెండు పార్టీల మధ్య బకరా అయిపోయింది. అక్కడికి సీనియర్ నేత, దివంగత పాల్వాయి గోవర్ధనరెడ్డి కి ఉన్న పలుకుబడి ఆయన కుమార్తెగా కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి కొంత ప్రయోజనం కలిగించింది. అయినా అది సరిపోలేదు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఉప ఎన్నిక సమయంలోనే తెలంగాణ లో పాదయాత్ర చేసినా, దాని ప్రభావం పడకపోవడం పార్టీకి కొంత నష్టమే అని చెప్పాలి. దీని ప్రభావం పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై పడుతుంది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. వారు మరింత క్రియాశీలకం అయి అదిష్టానానికి పిర్యాదులు చేయవచ్చు. ఈయన పీసీసీ అద్యక్షుడు అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోవడం రేవంత్ కు అప్రతిష్ట తెచ్చే అంశమే అవుతుంది.బీజేపీ అభ్యర్ది సోదరుడు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు కూడా చర్చనీయాంశం అయింది. ఆయన తన సోదరుడికి అనుకూలంగా పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనకు క్రమశిక్షణ సంఘం నోటీసు కూడా ఇచ్చింది.ఈ పరిణామం కూడా కాంగ్రెస్‌కు నష్టం చేసింది. వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా?లేక బీజేపీలోకి వెళతారా అన్నది తేలవలసి ఉంది. ఎన్నో గుణపాఠాలు కాంగ్రెస్ అభ్యర్ధికి ఆర్దిక బలం అంతంత మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీల్చకపోతే తమకు నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ ఈమెకు ఆర్దిక సాయం చేశారన్న ఆరోపణలను బీజేపీ గుప్పిస్తోంది. అందులో కొంత వాస్తవం ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ , తెలంగాణ ఆవిర్భావం తర్వాత కోలుకోలేని విధంగా మారింది.ల పెద్దగా ఉనికి లేని బీజేపీ రెండో స్థానంలోకి వచ్చి టీఆర్ఎస్ కు సవాలు విసురుతూ కాంగ్రెస్ ను వెనక్కి నెడుతోంది. తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ కే క్యాడర్ అదికంగా ఉంది. అది బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవడం కూడా కాంగ్రెస్‌కు సవాలే. మొత్తం మీద మూడు పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కొత్త గుణపాఠాలను నేర్పిందని అనుకోవచ్చు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. బీజేపీ ఓటమిపై ఇప్పటికే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో నైతిక విజయం బీజేపీదే. మేము గెలిచి ఓటమి చెందాము. ఓటర్లకు ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచింది. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరించారు. విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేశారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తాము. గతంలో మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చాము. మునుగోడులో ప్రచారానికి బీజేపీ నుంచి బయట నాయకులు ఎవరూ రాలేదు. ఎవరిది సంసారమో, ఎవరిది వ్యభిచారమో ప్రజలకు తెలుసు. ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ‘ధనబలంతో బీజేపీ.. ప్రజల గొంతు నొక్కాలని చూసింది’ -
Cartoon: డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ -
సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కిలారి పాల్ (కేఏ పాల్) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్‌ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్ సెంటర్ వద్ద సైతం పాల్ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..) ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: కేఏ పాల్ నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్ఎస్ కుట్ర ఎంటో అర్థమవుతోందని, అధికారులంతా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. -
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన
-
మునుగోడులో బెడిసికోట్టిన బీజేపీ స్కెచ్
-
కేసీఆర్ చాణుక్యమే గెలిపించింది
-
ఉత్కంఠ భరిత ఉపపోరులో టీఆర్ఎస్ ఘనవిజయం
-
'కారు' మెజారిటీకి గండి పెట్టిన రోడ్డు రోలర్, రోటీ మేకర్
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
టీఆర్ఎస్కు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు.. కమలం ఆశలకు గండి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల పొత్తు కలిసొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ఈ పొత్తు దోహదపడింది. నియోజవర్గంలో సీపీఐ, సీపీఎంలకు ఉన్న బలం టీఆర్ఎస్కు తోడవడంతో ఆ పార్టీకి గెలుపు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో వారి ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత మేర టీఆర్ఎస్ వైపు మళ్లడం కూడా టీఆర్ఎస్కు లాభం చేసింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందడం ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావించింది. అయితే, బీజేపీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి ఆ రెండు పార్టీల మద్దతు పొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున సీపీఎం, సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో 15 వేల వరకు ఉన్న తమ ఓటు బ్యాంకును టీఆర్ఎస్కు మరల్చడంలో సక్సెస్ అయ్యారు. కమ్యూనిస్టులు కలిసి రావడంతో టీఆర్ఎస్కు మేలు చేకూరింది. తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
సాక్షి కార్టూన్ 07-11-2022
-
Munugode Bypoll Results: సీఎం కేసీఆర్ సారు గ్రామంలో కారు జోరు
మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్చార్జిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్‌లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్‌కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి. కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో 47 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్‌లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్‌కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
నిబంధనల ప్రకారమే మునుగోడు ఉపఎన్నిక
సాక్షి, హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహించామని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ కావడం దేశ చరిత్రలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత స్థాయిలో కొందరు పొరపాట్లు చేసి దాని పర్యవసాలను అనుభవిస్తారన్నారు. 8న మునుగోడు ఉప ఎన్నిక కోడ్ ముగుస్తుందన్నారు. బీజేపీ ఆరోపణలు.. సీఈఓ వివరణ.. ఉప ఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించగా, రౌండ్లవారీగా ఫలితాల ప్రకటనను కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయమై సీఈఓ వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై ప్రశ్నించారు. దీనిపై సీఈఓ వికాస్‌రాజ్ స్పందించారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అధిక సమయం పట్టిందన్నారు. ఒక్కో రౌండ్లో ఓట్లను లెక్కించిన తర్వాత వాటిని చెక్చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల ఏజెంట్ల నుంచి అంగీకారం తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్ నుంచి ఆమోదంతో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీకి చెంపపెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘డబ్బు, మద్యం, అధికార మదంతో జనం గొంతు నొక్కి, ఓటర్లను కొనాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు మునుగోడు ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్తూ బీజేపీకి చెంపదెబ్బ రుచి చూపించారు..’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ పెద్దలకు మునుగోడు ఉప ఎన్నిక గట్టి ఎదురుదెబ్బఅని పేర్కొన్నారు. వారు ఇంతా చేసి టీఆర్ఎస్ మెజారిటీని తగ్గించగలిగారే తప్ప మునుగోడు విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని.. తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలు టీఆర్ఎస్కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారని కేటీఆర్ అన్నారు. విచ్చలవిడి ధన ప్రవాహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణలోనూ క్రూర రాజకీయ క్రీడకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం తొలిసారిగా ఢిల్లీ నుంచి రూ.వందల కోట్లు తరలించిందని.. డబ్బు, మద్యం, అధికార మదంతో ఓటర్లను కొనాలని అన్నిస్థాయిల్లో ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు కోటి రూపాయలతో దొరికాడు. ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో పట్టుబడ్డాడు. మాజీ ఎంపీ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే దొరికిపోయిన దొంగల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదు. వివేక్ గతంలో ఈటల రాజేందర్‌కు, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి రూ.75 కోట్లను తన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? రూ.75కోట్లు అభ్యర్థి పార్టీ మారగానే ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? రాజగోపాల్‌రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్‌కు రూ.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్‌ను అడ్డం పెట్టుకున్నారు. ఎందుకోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తాము ఫిర్యాదు చేస్తే.. బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షపాత్ర వహించేలా చేశారని ఆరోపించారు. వామపక్షాల నేతలకు కృతజ్ఞతలు మునుగోడులో టీఆర్ఎస్ గెలుపునకు తోడ్పడిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి దోహదపడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు చెప్పారు. నాటకాన్ని నడిపింది మోదీ, అమిత్‌షా ప్రధాని మోదీ, అమిత్ షాలు అహంకారం, డబ్బుతో కళ్లునెత్తికెక్కి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి బలవంతపు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దారని కేటీఆర్ విమర్శించారు. ‘ఉప ఎన్నికను రుద్దిన వారిపై మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనకుండి నాటకం నడిపింది అమిత్ షా, మోదీ అనే విషయం ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఉపఎన్నికలు జరిగిన నారాయణ్‌ఖేడ్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాకలలో కనిపించని.. ధన ప్రవాహం హుజూరాబాద్, మునుగోడులలో ఎందుకు వచ్చిందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. డబ్బున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికల్లోకి వచ్చాకే కలుషితం అయ్యాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనానికి ఈ ఎన్నికలు పరాకాష్ట అని.. 15 కంపెనీల సీఆర్పీఎఫ్, 40 ఐటీ టీమ్‌లను దించి నియోజకవర్గం మీదికి దండయాత్రకు వచ్చారని విమర్శించారు. అయినా గతంకంటే టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం 34.2 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానిని ప్రచారానికి తీసుకొచ్చారని.. తమ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రచారానికి వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు. చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం