National Family Health Survey
-
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
‘భార్యను కొట్టినా పర్వాలేదండి’.. తెలుగు రాష్ట్రాలే టాప్..
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తుంటే.. అదే సమయంలో మహిళలు కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5లో చాలా మంది భార్యలు కొన్ని సందర్భాల్లో తమ భర్తలు చేయి చేసుకోవడాన్ని సమర్థించడం గమనార్హం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువగా ఉన్నారు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం తదితర సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గత సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది. చదవండి: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్ తెలుగు రాష్ట్రాలే టాప్.. నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ (83.8 శాతం) అగ్ర స్థానంలో, ఏపీ (83.6 శాతం) రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు (81.9 శాతం) భార్యలపై చేయి చేసుకోవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు. భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా, పురుషుల్లో తగ్గుతోంది. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు. -
కారున్నోళ్లు కేరాఫ్ చిన్న రాష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద రాష్ట్రాల కన్నా చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత కేంద్రాల్లోని జనాభాకే అత్యధిక శాతం సొంత కార్లున్నాయి. ఈ సంఖ్య గోవా రాష్ట్రంలో అత్యధికంగా ఉండగా.. బీహార్ రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది. గోవా తరువాత కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 24.2 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. ఈ విషయాన్ని 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గోవాలో పట్టణాల్లో 49.1 శాతం మందికి, గ్రామాల్లో 39.6 శాతం మందికి సొంత కార్లున్నాయి. మొత్తం మీద గోవాల్లో 45.2 శాతం జనాభాకు సొంత కార్లున్నాయి. బీహార్‌లో పట్టణాల్లో 6.4 శాతం జనాభాకు, గ్రామీల్లో 1.2 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. బీహార్‌లో 2.0 శాతం మందికి మాత్రమే సొంతకార్లున్నాయి. డిల్లీలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక శాతం మందికి సొంతకార్లుండటం గమనార్హం. కాగా, దేశం మొత్తం మీద 7.5 శాతం జనాభాకే సొంతకార్లున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 22.1 శాతం, పంజాబ్‌లో 21.9, నాగాలాండ్‌లో 21.3, సిక్కింలో 20.9, ఢిల్లీలో 19.4, అరుణాచల్ ప్రదేశ్‌లో 19.3,మణిపూర్‌లో 17, మిజోరాంలో 15.5 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్లో మాత్రమే అత్యధికంగా 10.9 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. ఆ తరువాత కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మందికి కార్లుండగా మిగతా రాష్ట్రాలో చాలా తక్కువ శాతం మందికే సొంత కార్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2015–16లో 2.0 శాతం మాత్రమే సొంతకార్లుండగా.. 2019–21లో ఆ సంఖ్య 2.8 శాతంకు పెరిగింది. 2019–21లో ఏపీలో పట్టణ ప్రాంతాల్లో 5.8 శాతం జనాభాకు సొంతకార్లుండగా గ్రామాల్లో కేవలం 1.4 శాతం మందికే సొంతకార్లున్నాయి. అలాగే ఏపీలో సైకిళ్లు ఉన్న వారి జనాభా 30.9 శాతం ఉంది. మోటార్ సైకిళ్లు లేదా స్కూటర్ ఉన్న వారి జనాభా ఏపీలో 47 శాతం ఉంది. తెలంగాణలో మొత్తం 5.2 శాతం జనాభాకు సొంత కార్లుండగా.. ఇందులో పట్టణాల్లో 10.8 శాతం, గ్రామాల్లో 2.1 శాతం జనాభాకు సొంతకార్లున్నాయి. -
54% మహిళలకే సొంత సెల్‌ఫోన్
సాక్షి, అమరావతి: సాంకేతిక యుగంలోనూ భారతదేశంలోని మహిళలు పురుషుల కంటే సొంత సెల్ఫోన్ల వినియోగంలో వివక్ష ఎదుర్కొంటున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7,24,115 మంది మహిళలను ఇంటర్వ్యూ చేస్తే అందులో సగంమంది మాత్రమే తమకు ప్రత్యేకంగా సెల్‌ఫోన్ ఉందని చెప్పారు. వీరిలో 71 శాతం మందికి మాత్రమే టెక్ట్స్ మెసేజ్‌లు చదవగలిగే సామర్థ్యం ఉందని తేలింది. మహిళా సాధికారత అన్వేషణలో భాగంగా 15–49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఉపాధి, సంపాదనపై నియంత్రణ, యాజమాన్య హక్కులు, మొబైల్ ఫోన్ వినియోగంపై 2019–21 మధ్య ఈ సర్వే నిర్వహించారు. అగ్రస్థానంలో గోవా దేశవ్యాప్తంగా దాదాపు 66.29 కోట్ల్ల మంది మహిళలున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వేలో సొంత సెల్ఫోన్లు వినియోగిస్తున్న మహిళల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. గోవాలో సర్వేచేసిన 2,030 మంది మహిళల్లో 91.2 శాతం మందికి సొంత ఫోన్లున్నాయి. మధ్యప్రదేశ్‌లో 48,410 మంది మహిళల్లో 38.5 శాతం మందికే ఫోన్లున్నాయి. తెలంగాణలో 60 శాతం మందికి సొంత ఫోన్లు ఉన్నాయి. సొంత సెల్ఫోన్లు వినియోగిస్తున్న మహిళల శాతం ఏపీలో 48.9గా ఉంది. దేశవ్యాప్తంగా 2015–16 సర్వేతో పోలిస్తే తాజా గణాంకాలు మెరుగుదలను సూచిస్తున్నాయి. సొంత ఫోన్లు ఉన్న మహిళలు గతంలో 46 శాతం ఉండగా అది ఇప్పుడు 54 శాతానికి చేరింది. ఈ వృద్ధి నెమ్మదిగా ఉండటంతో కొందరు నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం, లక్షద్వీప్, పుదుచ్చేరి, నాగాలాండ్, మిజోరంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వయసును బట్టి..: ఈ సర్వే ప్రకారం మహిళల్లో సొంత సెల్ఫోన్ల వినియోగం వయసును బట్టి పెరుగుతోంది. 15–19 ఏళ్ల వయసు గల యువతుల్లో 32 శాతం ఉంటే.. 25–29 ఏళ్ల మహిళల్లో 65 శాతానికి పెరిగింది. సొంత మొబైల్ ఫోన్ ఉన్న మహిళల్లో టెక్ట్స్ మెసేజ్ చదివే సామర్థ్యం వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది. ఇది 15–19 సంవత్సరాల వయసు గల వారిలో 89 శాతం ఉంటే.. 40–49 సంవత్సరాల వయసు గల వారిలో 53 శాతానికి తగ్గింది. -
శానిటరీ నాప్కిన్స్.. సగం మందికే తెలుసు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలోనూ దేశంలో చాలామంది మహిళలకు శానిటరీ నాప్కిన్స్/ప్యాడ్స్ గురించి తెలియదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 15–24 ఏళ్ల మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ నాప్కిన్స్ బదులు గుడ్డలు వాడుతున్నట్లు తేలింది. అవగాహన లేమి, రుతుస్రావంపై మూఢ నమ్మకాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా లేని గుడ్డలు ఉపయోగిస్తుండడం వల్ల మహిళలు రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వే ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. 2019–21 వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 15–24 ఏళ్ల వయసున్న మహిళలను ప్రశ్నించారు. రుతుస్రావ సమయంలో మామూలు గుడ్డలే వాడుతున్నట్లు 50 శాతం మంది బదులిచ్చారు. స్థానికంగా తయారు చేసిన నాప్కిన్లు వాడుతున్నట్లు 15 శాతం మంది చెప్పారు. అపరిశుభ్ర పద్ధతులు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గురుగ్రామ్‌లో సీకే బిర్లా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఆస్తా దయాల్ చెప్పారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భిణుల్లోనూ అనారోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బిహార్‌లో అత్యల్పం నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది మహిళలు శానిటరీ నాప్కిన్లు ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 73 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యల్పంగా బిహార్‌లో 59 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 61 శాతం, మేఘాలయాలో 65 శాతం మంది నాప్కిన్లు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పీఎంబీజేపీ)ని ప్రారంభించింది. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్ అందిస్తున్నట్లు సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్, సామాజిక ఉద్యమకారిణి రంజనా కుమారి తెలిపారు. శానిటరీ ప్యాడ్ వినియోగించే విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. -
భార్య ‘నో’ అన్నా ఓకే: భర్తలు మారారు!
న్యూఢిల్లీ: మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సతీమణి సంభోగానికి ఒప్పుకోకపోయినా సర్దుకుపోతామని 66 శాతం మంది పురుషులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల మహిళలు తమ భర్తలతో కలయికకు అభ్యంతరం చెబుతున్నారు. భర్తకు సుఖవ్యాధులు, వేరే మహిళతో వివాహేతర సంబంధం, ఆలసట లేదా కోరిక లేకపోవడం వంటి కారణాలతో 80 శాతం స్త్రీలు శృంగారానికి నో చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ...అయినా ఇబ్బంది పెట్టం మహిళా సాధికారతపై అధ్యాయంలోని 'భర్తతో సురక్షితమైన లైంగిక సంబంధాలను చర్చించే వైఖరులు' అనే విభాగంలోని ఈ ప్రశ్న.. లింగ సమానత్వంలో కీలకమైన ‘అంగీకార’ అంశంగా సర్వేలో నిలిచింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న వారికి ఈ పశ్నను సంధించగా ఐదుగురిలో నలుగురు మహిళలు, పురుషులు పై కారణాలతో ఏకీభవించారు. తమకు ఇష్టం లేకపోతే ఏకాంతానికి ఒప్పుకోబోమని చెప్పిన మహిళల సంఖ్య గత సర్వేతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అలాగే భార్యలను ఇబ్బంది పెట్టబోమని చెప్పిన భర్తల సంఖ్య 3 శాతం పెరిగింది. దండిస్తాం.. కుదరదు తాను కోరుకున్న సమయంలో శృంగానికి ఒప్పుకోకపోతే భార్యను దండించే హక్కు ఉందని 19 శాతం పురుషులు అభిప్రాయపడటం గమనార్హం. భర్తలకు తమను దండించే హక్కు లేదని ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు అంటే 82 శాతం మంది కుండబద్దలు కొట్టారు. (క్లిక్: వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు) అప్పుడు కొట్టడం కరెక్టే భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లం, పిల్లల్ని లేదా ఇంటిని పట్టించుకోకపోవడం, వాదనకు దిగడం, భర్తతో కలయికకు ఒప్పుకోకపోవడం, వంట సరిగా చేయకపోవడం, భర్త పట్ల నమ్మకంగా ఉండకపోవడం, అత్తమామల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించకపోవడం వంటి సందర్భాల్లో భార్యలపై తాము చేయిచేసుకుంటామని 44 శాతం మంది పురుషులు వెల్లడించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదే రకమైన అభిప్రాయాన్ని పురుషులు కంటే మహిళలే ఎక్కువగా (45 శాతం) వ్యక్తం చేశారు. అయితే గత సర్వేతో పోల్చుకుంటే(52 శాతం) ఈ సంఖ్య 7 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం. భార్యలను అదుపులో పెట్టుకోవడానికి కొడతామని చెప్పిన పురుషుల సంఖ్య గతంతో (42 శాతం) పోలిస్తే రెండు శాతం పెరగడం గమనార్హం. సర్వే ఇలా.. 2019-21 మధ్య కాలంలో రెండు దశల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 జూన్ 17 నుంచి 2020 జనవరి 30 వరకు మొదటి దశ సర్వే చేశారు. 2020 జనవరి 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన రెండో దశ సర్వే 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగింది. (చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం!) -
India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: మన దేశంలో పెళ్లయిన మహిళల్లో, 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో ఒక ఉపాధి పొందుతున్నారు. ఇదేవర్గం మహిళల్లో 83 శాతం మంది సంపాదనపరులే. 15 శాతం మందికి ఎలాంటి సంపాదన లేదు. 2019 నుంచి 2021 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5లో ఈ విషయం తేటతెల్లమయ్యింది. 15–49 ఏళ్ల మహిళల్లో గతంలో 31 శాతం మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 32 శాతానికి చేరింది. దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సర్వే తెలిపింది. చదవండి: (తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్ అపూర్వతో యతీష్ వివాహం) -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్‌లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్‌ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్‌లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
ఏపీలో తగ్గుతున్న పొగరాయుళ్లు
సాక్షి, అమరావతి: పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్.. అని అన్నాడొకరు. సరదా.. సరదా.. సిగరెట్టు అంటూ ఓ సినిమాలో కేరక్టర్ చిందులేసింది. ఈ మాటలన్నీ వద్దులే.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. పొగ తాగితే వచ్చే రోగాల గురించి ఆలోచన పెరిగింది. దీంతో పొగ తాగే వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతోంది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. చదవండి: (గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం) రాష్ట్రం మొత్తం మీద 2016–17తో పోల్చితే 2019–21లో పొగ తాగేవారి సంఖ్య 4.2 శాతం తగ్గినట్లు సర్వే తెలిపింది. పట్టణాల్లో 3.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.9 శాతం పొగరాయుళ్ల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఇక రోజూ ఇంటి దగ్గర పొగతాగే వారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2016–17లో 28.5 శాతం ఉండగా 2019–21లో 22.1 శాతానికి తగ్గారు. అసలు పొగతాగని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2016–17లో అసలు పొగతాగని వారు 65.4 శాతం ఉండగా 2019–21లో 71.9 శాతానికి పెరిగింది. పొగతాగే వారిలో 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉన్నారు. పొగాకు వినియోగమూ తగ్గుతోంది. పొగతాగే వారిలో ఎక్కువ మంది 24 గంటల్లో ఐదు సిగరెట్లు కాల్చుతున్నట్లు సర్వేలో తేలింది. బీడీ తాగే వారిలో 24 గంటల్లో 10 నుంచి 14 బీడీలు తాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం మీద పొగతాగే వారి సంఖ్య క్రమంగా తగ్గడానికి ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు పెళ్లి అయిన తరువాత పిల్లలు పుట్టాక స్మోకింగ్‌కు దూరం అవుతున్నట్లు తేలింది. ఇటీవలి కాలంలో యువత కూడా పొగాకు వినియోగానికి దూరంగా ఉంటోందని అధికారవర్గాలు తెలిపాయి. -
పోషకాహార లోపాలు ఇంకానా?
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి పెరిగింది. ఈ మార్పు సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. జనాభాలో సగం మందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ఆడపిల్లలు, మహిళల్లో రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది. భారతదేశం అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించి నప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఫ్యాక్ట్ షీట్స్ వెలువడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఎన్ఎఫ్హెచ్ఎస్–5కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒక్కసారి వీక్షిస్తే మిశ్రమ ఫలి తాలు కనిపిస్తాయి. కొన్ని హర్షణీయమైన అంశాలతోపాటు దిగాలు పడాల్సినవీ దీంట్లో ఉన్నాయి. ఒక శుభవార్త ఏమిటంటే.. భౌగోళిక పోకడల విషయంలో మరీ ముఖ్యంగా లింగ నిష్పత్తిలో కొంత మార్పు కనిపిస్తూండటం! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో మొట్టమొదటిసారి చేపట్టన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అంతేకాదు. పుట్టుక సమయంలో లింగ నిష్పత్తి ప్రస్తుతం 929 (2015–16 నాటి ఎన్ఎఫ్హెచ్ఎస్–4లో ఇది వెయ్యి మంది పురుషులకు 919గా నమోదై ఉంది)కి చేరుకుంది. సాఫల్యత రేటు 2.2 శాతం నుంచి రెండు శాతానికి పడిపోవడమూ ఆనందం కలిగించే విషయమే. సాఫల్యత రేటు తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో మరింత తగ్గిపోయినట్లుగా కనిపిస్తూంటే.. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా తేడా ఏమీ లేకుండా పోయింది. ఈ తేడా సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్నది తెలిసిందే. పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వివరాలు విధాన రూపకల్పనలో, సామాజిక స్థాయిలో ఈ అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మహిళ సాధికారత, బాలికల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అవలంబిస్తున్న విధానాలు, ప్రచారాల పుణ్యమా అని ఇప్పుడు ఎంతో కొంత ప్రగతినైతే సాధించాం. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదల, సాఫల్యత రేటులో తరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సాక్షరత విషయంలో ఎంతో అభివృద్ధి నమోదవుతోంది. పదేళ్ల బడిని పూర్తి చేసుకున్న మహిళలు, పురుషుల శాతం కూడా ఎక్కువై 41 శాతం, 50.2 శాతానికి చేరుకుంది. కానీ చేయాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది. ఎందుకంటే ఈ అంకెలు మన శ్రామిక వర్గంలో సగానికపైగా తగిన నైపుణ్యం, అర్హతలకు దూరంగా ఉన్నారని చెబుతున్నాయి. వీటిని సాధించడం ద్వారా మాత్రమే అట్టడుగు శ్రామికులు పేదరికం చట్రం నుంచి బటయపడగలరు. ఆసుపత్రుల వంటి సంస్థల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రమే కాదు... మాతా శిశు సంక్షేమం, పసిపిల్లల టీకా కార్యక్రమం (ఏటా రెండు శాతం వృద్ధి)లో ప్రగతి సాధించిన ఖ్యాతి ఆరోగ్య రంగానికే దక్కుతుంది. కాన్పుల సమయంలో తల్లీబిడ్డల్లో మరణాలు ఒక శాతం వరకు కూడా తగ్గడం ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లోనూ 1.6 శాతం తగ్గుదల నమోదు కావడం విశేషమే. ఈ అంశాల మాటేమిటి? ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. కొంచెం ఆందోళన కలిగించే అంశాలు ఇలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15 – 49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతూండటం ఆందోళనకరమే. ఇంకోలా చెప్పాలంటే జనాభాలో సగంమందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇదేమంత మంచి విషయం కాదు. రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాల్లోనూ కనిపిస్తూంటాయి. శారీరక, మానసిక అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా పిల్లలు, కౌమారుల్లో ఉండాల్సిన చురుకుదనాన్నీ తగ్గించేస్తుంది. ఆటలు, నేర్చుకునే శక్తినీ హరిస్తుంది. తద్వారా వారు సమర్థమైన ఉత్పాదకత కలిగిన పౌరులుగా ఎదగడం వీలుపడదు. పనిచేసే సామర్థ్యం తగ్గడం, తొందరగా అలసిపోవడం వల్ల ఉత్పత్తి, ఆదాయం రెండూ తగ్గిపోతాయి. అంతేకాదు.. కౌమార వయస్కులైన బాలికల్లో దాదాపు 59.1 శాతం మందిలోని రక్తహీనత కాబోయే తల్లులపై ప్రభావం చూపుతోంది. కాన్పు సమయంలో మాతా శిశువుల మరణానికి ప్రధాన కారణంగా మారుతోంది. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. గతంతో పోలిస్తే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ గర్భిణుల్లో ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ల వాడకం ఇప్పటికీ తక్కువగా ఉంది. (41 శాతం మంది వంద రోజులపాటు తీసుకోగా, 26 శాతం మంది 180 కంటే ఎక్కువ రోజులు తీసుకున్నారు). ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యామో పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత స్పష్టత వస్తుంది. ఇంకో ఆందోళనకరమైన విషయం అన్ని వయసుల వారిలోనూ పౌష్టికతను సూచించే అంశాల్లో పెరుగుదల అతితక్కువగా (ఏడాదికి 0.5 శాతం) ఉండటం. ఎన్ఎఫ్హెచ్ఎస్–4, ఎన్ఎఫ్హెచ్ఎస్–5ల మధ్య అవసరానికంటే ఓ మోస్తరు బరువు తక్కువన్న ఐదేళ్లలోపు పిల్లల శాతం 35.8 నుంచి 32.1 శాతానికి తగ్గింది. ఎదుగుదల తగ్గిన పిల్లల శాతం కూడా 38.4 నుంచి 35.5 శాతానికి మాత్రమే తక్కువైంది. సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల ఓ మోస్తరుగా మాత్రమే లేని వారు 21 శాతం నుంచి 19.3 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో సామర్థ్యానికి తగ్గ ఎదుగుల లేమి తీవ్రంగా ఉన్న వారు 7.5 నుంచి 7.7 శాతానికి పెరగడం గమనార్హం. రెండేళ్ల లోపు వయసు వారు తగిన ఆహారాన్ని తీసుకోని వారు 11.3 శాతం వరకూ ఉన్నారు. దీని వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నది నిర్వివాద అంశం. గత ఎన్ఎఫ్హెచ్ఎస్ సమయంలో ఇది 9.6 శాతం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో జరుగుతున్న ఈ పౌష్టికాహర లేమిని విధానకర్తలు, నిపుణులు... పౌష్టికాహర రంగంలో పనిచేస్తున్న వారు విస్మరిస్తూండటం ఎంతైనా ఆందోళన కలిగించే అంశం. ఈ లోపాన్ని సరిదిద్దకుండా పౌష్టికాహార సూచీల్లో చెప్పుకోదగ్గ మార్పులు అసాధ్యమనే చెప్పాలి. అందనంత ఎత్తులో ఇరుగుపొరుగు... కుటుంబ ఆరోగ్యం విషయంలో ఇరుగు పొరుగు దేశాలు మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చైనాలో అటు పురుషులైనా, ఇటు మహిళలైనా వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. రక్తహీనత, 15–59 మధ్య వయస్కులైన మహిళల్లో 16 శాతం మాత్రమే ఉండగా.. ఎదుగుదల లోపం ఐదు శాతం మందిలో, సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల లేదు. ఇటీవలి వరకూ ఎంతో వెనుబడి ఉన్న బంగ్లాదేశ్ కూడా వేగంగా పుంజుకుని.. మనల్ని మించిపోయింది. దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ఆంబులెన్స్ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగాలి. సమగ్ర శిశు సంక్షేమ సేవల (ఐసీడీఎస్) కార్యక్రమాలను సమీక్షించుకుని ఆచరణ సాధ్యమైన ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలను అందించేలా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారం సాధ్యం కాదు. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి ఉంటుంది.! – వీణా రావు, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
ఆడపిల్లల్లోనూ స్మోకింగ్ కల్చర్.. ప్రతి పదిమందిలో ఒకరికి!
సాక్షి, అమరావతి: మన దేశంలో యుక్తవయసు ఆడపిల్లల్లో పొగతాగే అలవాటు పెరుగుతుందా? ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఒకరికి ఈ అలవాటుందా? అంటే అవుననే అంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. 2019–21 సంవత్సరాల కాలానికి జరిగిన ఈ సర్వే చెబుతున్న ప్రకారం 15 ఏళ్లు లేదా అంతకు మించిన వయసున్న వారిలో.. పట్టణ ప్రాంతాల్లోనైతే 9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 10.5 శాతం మంది ఆడపిల్లలు, మహిళలు పొగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లు తేలింది. అదే పురుషుల్లోనైతే దేశవ్యాప్తంగా పొగరాయుళ్ల శాతం 38గా ఉంటే పల్లెల్లో 42.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పొగాకును వినియోగించే పురుషుల శాతం 28.8గా, మహిళల శాతం 5.4గా ఉంది. ఆల్కహాల్‌పై అప్రమత్తత.. ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే 15 ఏళ్లు, ఆపైన వయసున్న పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 19 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 16.5 శాతం మంది తాగుతున్నారు. ఆల్కహాల్ వ్యవహారంలో మహిళలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తంగా కేవలం 1.3 శాతం మంది మహిళలు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు అంగీకరించారు. పొగాకు, ఆల్కహాల్ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయడం ఇదే ప్రథమం. పురుషులు, మహిళల వారీగా లెక్కలు తీయడం కూడా ఇదే మొదటిసారి. ఒబేసిటీ (అధిక బరువు), క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న గ్రూపులను గుర్తించడం, ఒకవేళ అటువంటి ముప్పున్న వర్గాలకు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయాలి వంటి ఆరోగ్య సమస్యలపై ఈ సర్వే దృష్టి సారించింది. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో కేవలం 1.9 శాతం మంది మాత్రమే ముందస్తుగా సెర్వికల్ క్యాన్సర్ వంటి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సర్వేలో తేలింది. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్న మహిళల సంఖ్య మరింత స్వల్పంగా ఉండడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో వీరి శాతం 1.2గా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా అంటే కేవలం 0.7 శాతంగా ఉంది. మొత్తంగా కలిపి చూస్తే దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది మహిళలు మాత్రమే ముందస్తుగా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. పెరుగుతున్న ఒబేసిటీ.. రోజురోజుకు మారుతున్న జీవన విధానం, ఆహారం, ఇతర అలవాట్లతో ఆరోగ్య సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో పోషకాహార లోపాన్ని సైతం గుర్తించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో 2015–16లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఒబేసిటీతో బాధపడితే ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. గతంలో పురుషుల శాతం 18.9గా ఉంటే ఇప్పుడది 22.9కి చేరింది. ప్రస్తుత సర్వేలో 6,36,699 ఇళ్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషుల నుంచి సమాచారాన్ని సేకరించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019 జూన్‌లో ప్రారంభమైన సర్వే రెండు విడతలుగా సాగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. -
ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా వర్తిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఏపీలో 94.4 శాతం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 97.3 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తుండగా పట్టణాల్లో 86.8 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఆరోగ్య బీమాతో అత్యధికంగా ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల కిందకు ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో సర్వేలో విశ్లేషించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 92 శాతం కుటుంబాలకు వర్తిస్తున్నట్లు తేలింది. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచింది. గోవాలో ఆరోగ్య బీమా పథకం 80.4 శాతం కుటుంబాలకు వర్తిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 57.7 శాతం మందికే వర్తిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మిగిలిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలు కాకుండా కేంద్ర పథకాలను వర్తింప చేస్తున్నప్పటికీ ఎక్కువ కుటుంబాలకు బీమా ప్రయోజనం దక్కడం లేదని సర్వే తెలిపింది. ఇవీ కారణాలు.... ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ బాధ్యతలు చేపట్టగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని గాడిలో పెట్టారు. తెల్లరేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు కోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచారు. వార్షిక ఆదాయ పరిమితిని పెంచడంతో నెలకు రూ.40 వేల ఆదాయం పొందే మధ్య తరగతి కుటుంబాలు కూడా పథకం పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ నవశకం ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో ఏపీలో అత్యధిక కుటుంబాలు ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా ముఖ్యమంత్రి చేపట్టారు. గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు 2.86 లక్షల మందికి కొత్తగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. -
ప్రకాశం జిల్లాలో అత్యధికం.. వైఎస్సార్ జిల్లాలో అత్యల్పం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు పైబడిన వారిలో 22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే పేర్కొంది. పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ పీలుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికం.. దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది. తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్‌లో 48.8 శాతం, గుజరాత్లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే పేర్కొంది. -
జగిత్యాల.. ఆడబిడ్డల అడ్డా
సాక్షి, జగిత్యాల: ఆమె ఆధిక్యం.. దాదాపు రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఆడబిడ్డ అంటే భారం, బాధ, వివక్ష అనుకునే అడ్డంకులను దాటి.. అమ్మాయి అంటే ఆనందం అంటూ ‘ఊపిరి’పోస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రం దేశ సగటును మించి పురుషుల కంటే ఎక్కువ మహిళలతోనే కళకళలాడుతోంది. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక (2019–20) ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో సర్వే చేసిన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) ఆడబిడ్డల అడ్డగా జగిత్యాల తొలిస్థానంలో.. నిర్మల్, రాజన్నసిరిసిల్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పురుషులకంటే తక్కువ జనాభాతో హైదరాబాద్(959), ఆదిలాబాద్(992), మల్కాజిగిరి(996), వికారాబాద్(998) జిల్లాలున్నాయి. -
షాకింగ్: ‘మంద’డుగు వేస్తున్న మహిళలు
సాక్షి, నిజామాబాద్: మద్యం మహమ్మారి మహిళలపైనా వల విసురుతోంది! ఆడ వారిని సైతం తన బాధితులను చేసుకుంటోంది. మద్యానికి అలవాటు పడుతున్న స్త్రీల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఉన్న మహిళల్లో 9.8 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే అధికం కావడం గమనార్హం. జిల్లాలో ప్రతి వంద మంది మహిళల్లో సుమారు పది మందికి మందు తాగే అలవాటు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ అతివలకు మద్యం తీసుకునే అలవాటు ఉన్నట్లు తేలింది. మద్యం సేవించే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 6.7 శాతం ఉండగా, మన జిల్లాలో మాత్రం అంత కంటే 3.1 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో భర్త తాగుడుకు అలవాటు పడితే మహిళలు మానిపించి కుటుంబాన్ని చక్కదిద్దుతుంటారు. అలాంటి మహిళలు సైతం క్రమంగా ఈ మద్యం బాధితులు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. 15 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణ.. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దేశ వ్యాప్తంగా ఇటీవల ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించింది. కార్వీ డేటా మేనేజ్మెంట్ సరీ్వసెస్ అనే సంస్థ ద్వారా ఈ సర్వే చేపట్టింది. గతేడాది 2019 జూన్ 30 నుంచి నవంబర్ 14 వరకు సర్వే బృందం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 27,351 కుటుంబాలను కలిసి వివరాలను తీసుకోగా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 891 కుటుంబాలను సర్వే చేసింది. ఈ సర్వేలో 15 ఏళ్లకు పైబడిన వారి నుంచి వివరాలను తీసుకున్నారు. మొత్తం 104 అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వే నివేదికను ఇటీవల వెల్లడించగా, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 40 శాతం మందుబాబులే.. ఇక పురుషుల విషయానికి వస్తే, 40 శాతం మంది మగవారు మందు తీసుకున్నట్లు వెల్లడైంది. జిల్లాలో ఉన్న పురుషుల్లో 40.02 శాతం మందికి సుక్కేసుకునే అలవాటు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే కాస్త తక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 43.3 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. పొగాకు వినియోగంలోనూ.. పొగాకు ఆధారిత ఉత్పత్తుల వినియోగంపై కూడా సర్వే చేసింది. ప్రధానంగా బీడీ, సిగరేట్, తంబాకు, గుట్కా వంటి వాటి అలవాటు ఉన్న వారి వివరాలను కూడా సేకరించారు. జిల్లాలో 8.6 శా తం మంది మహిళలు పొగాకు ఆధారిత ఉత్పత్తులకు అలవాటు పడినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వినియోగించే మహిళల శాతం 5.6 శాతం కాగా, అంతకంటే సుమారు మూడు శాతం ఎక్కు వ మంది మహిళలు జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. పురుషుల విషయానికి వస్తే, జిల్లాలో 20.6 శాతం మంది ఫురుషులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఈ అలవాట్లు ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 22.3 శాతం ఉన్నట్లు తేలింది. -
జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం తగ్గిన సిజేరియన్లు.. జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో 43.2 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. తగ్గని మధుమేహం.. జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది. 141–160 ఎంజీ/డీఎల్ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరింత పెరిగే అవకాశం.. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్‌పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్లు చేయడంలేదు. ఐసీడీఎస్ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది. – పద్మావతి, ఐసీడీఎస్ పీడీ జిల్లా వివరాలు 2015–16(శాతం) 2019–20(శాతం) ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 26.1 24.1 మహిళల్లో అక్షరాస్యత 57 63.6 20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3 30.6 -
అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర జనాభాలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2019–20 సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ప్రకటించింది. 2015–16 సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1,007 మంది మహిళలు ఉండగా, తాజా సర్వే ప్రకారం ఆ సంఖ్య 1,049కి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 1,015 మంది ఉండగా, గ్రామాల్లో 1,070 మంది ఉన్నారు.. కడుపు‘కోత’లే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ఆసుపత్రులు తీరు మార్చుకోవడం లేదు. కడుపు కోయనిదే బిడ్డను బయటకు తీయడం లేదని కేంద్ర సర్వే స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు 57.7 శాతం ఉండగా, ఇప్పుడు 60.7 శాతానికి పెరిగాయి. అందులో పట్టణాల్లో 64.3 శాతం కాగా, గ్రామాల్లో 58.4 శాతంగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 74.5 శాతం కాగా, ఇప్పుడు 81.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం సిజేరియన్ ప్రసవాలు 40.3 శాతం కాగా, ఇప్పుడు 44.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు పెరగటంపై విమర్శలు వస్తున్నాయి. వేధిస్తున్న స్థూలకాయం రాష్ట్రంలో స్థూలకాయ సమస్య పెరుగు తోంది. 15–49 ఏళ్ల వయసులో అధిక బరు వున్న మహిళలు ఐదేళ్ల క్రితం 28.6 శాతంగా ఉంటే, ఇప్పుడు 30.1 శాతానికి పెరిగింది. అందులో పట్టణాల్లో మహిళలు 41.7% కాగా, గ్రామాల్లో 23.8 శాతంగా ఉన్నారు. ఇక అదే వయసున్న పురుషుల్లో స్థూల కాయులు ఐదేళ్ల క్రితం 24.2% మంది ఉండగా, ఇప్పుడు 32.3 శాతానికి పెరిగారు. పురుషులు పట్టణాల్లో 40.2 శాతం మంది స్థూలకాయులు కాగా, గ్రామాల్లో 28.1 శాతం మంది ఉన్నారని కేంద్ర సర్వే తేల్చింది. తగ్గిన శిశు మరణాలు.. రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గింది. ఐదేళ్ల క్రితం ప్రతీ వెయ్యికి 20 మంది మరణించగా, ఇప్పుడు 16.8కు తగ్గింది. పట్టణాల్లో 13.8 ఉండగా, గ్రామాల్లో అది 18.8గా ఉంది. శిశు మరణాల రేటు ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 27.7 ఉండగా, ఇప్పుడు 26.4కు తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఐదేళ్ల క్రితం 31.7 ఉండగా, ఇప్పుడు 29.4గా ఉంది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తున్నవారు 33.1 శాతం.. ఎత్తుకు తగ్గ బరువున్నవారు 21.7 శాతం.. ఐదేళ్లలోపు పిల్లల్లో తక్కువ బరువున్న వారు 31.8 శాతం కాగా, ఐదేళ్ల పిల్లల్లో అధిక బరువున్నవారు ఐదేళ్ల క్రితం 0.7 శాతంగా ఉంటే, ఇప్పుడది 3.4 శాతానికి పెరిగింది. సర్వేలోని మరికొన్ని అంశాలు.. –ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసినా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఐదేళ్ల క్రితం చేతి నుంచి ఒక్కో డెలివరీకి రూ.4,218 ఖర్చు చేసేవారు. ఇప్పుడది రూ. 3,846కు తగ్గింది. పట్టణాల్లో ఖర్చు రూ.3,594 ఉండగా, ఇప్పుడు రూ.3,966 చేరింది. –ఆసుపత్రుల్లో పుడుతున్నవారి శాతం ఐదేళ్ల క్రితం 91.5 ఉండగా, ఇప్పుడది 97 శాతానికి పెరిగింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదేళ్ల క్రితం 30.5 శాతం ఉండగా, ఇప్పుడు 49.7 శాతానికి పెరిగింది. ఇళ్లల్లో ప్రసవాలు ఐదేళ్ల క్రితం 2.8 శాతం ఉండగా, ఇప్పుడు 1.3 శాతానికి తగ్గాయి. –6 నుంచి 59 నెలల్లో రక్తహీనత ఉన్న పిల్లలు ఐదేళ్ల క్రితం 60.7 శాతం ఉండగా, ఇప్పుడు 70 శాతానికి పెరిగింది. –మొత్తం అన్ని వర్గాల మహిళల్లో రక్తహీనత ఐదేళ్ల క్రితం 56.6 శాతం ఉండగా, ఇప్పుడు 57.6 శాతానికి పెరిగింది. –15 ఏళ్లు పైబడినవారిలో షుగర్ లెవల్ ఎక్కువ నుంచి అతి ఎక్కువగా ఉన్న మహిళలు 14.7 శాతం మంది ఉన్నారు. వారు మందులు తీసుకుంటున్నారు. పురుషుల్లో 18.1 శాతం మంది ఉన్నారు. అదే వయసులో బీపీ ఉన్న మహిళలు 26.1 శాతం మంది ఉండగా, పురుషుల్లో 31.4 శాతం మంది ఉన్నారు. –15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో తల్లులైనవారు, గర్భిణులుగా ఉన్నవారు 5.8 శాతం.. ఇది ఐదేళ్ల క్రితం 10.6 శాతంగా ఉండేది. –15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు 84.4 శాతం. మొబైల్ ఫోన్ ఉన్నవారు 60 శాతం. –15 ఏళ్లు పైబడిన వారిలో పొగాకు ఉపయోగించే మహిళలు 5.6 శాతం కాగా, పురుషుల్లో 22.3 శాతం ఉన్నారు. అదే వయసులో మద్యం తాగే మహిళలు 6.7 శాతం కాగా, పురుషులు 43.3 శాతంగా ఉన్నారు. –15 నుంచి 49 ఏళ్ల మహిళల అక్షరాస్యత 66.6 శాతం. అందులో పట్టణాల్లో అక్షరాస్యత 81 శాతం, గ్రామాల్లో 58.1 శాతం.. ఇక పురుషుల అక్షరాస్యత శాతం 84.8 శాతం. –ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న మహిళల శాతం 26.5 శాతం.. కాగా అందులో పట్టణాల్లో 43.9 శాతం, గ్రామాల్లో 15.8 శాతం మంది ఉన్నారు. -
స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు..
మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము! స్త్రీ ధనం కింద బంగారాన్ని కాదు ఐరన్‌ను అందించాలి. కాబట్టి ఈ ధన్‌తేరస్‌కి.. అంటే ధనత్రయోదశికి బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్ మీద దృష్టిపెట్టండి అంటూ ‘ప్రాజెక్ట్ స్త్రీధన్’ పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్ఎమ్ అనే సంస్థ ఓ ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా ధన్‌తేరస్‌కు బంగారు ఆభరణాల దుకాణాలు విడుదల చేసే కమర్షియల్స్‌కు భిన్నంగా ఆ సంస్థ తన యాడ్స్‌ను తయారు చేసింది. ఐరన్ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాన్ని తింటున్న మహిళను చూపిస్తూ ‘ఈ ధన్‌తేరస్‌కు ఈ మహిళ బంగారం కన్నా ఎంతో విలువైన దాన్ని పొందుతోంది’ అనే క్యాప్షన్‌తో ఒక యాడ్‌ను తయారు చేసింది. అలాగే.. చెవికి జూకాలు, మెడలో నగలు, చేతులకు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు పెట్టుకొని నడుస్తున్న యువతిని చూపిస్తూ.. ఇదే ఐరన్ అయితే మీ నరనరాల్లో ప్రవహిస్తుంది ఆరోగ్యంతో మిమ్మల్ని మెరిపిస్తుంది. అంటూ ఇంకో యాడ్‌ను రూపొందించింది. ‘ఐరన్ తీసుకోండి’ అంటూ ఇంకొన్ని యాడ్స్‌ను తయారు చేసి గ్రామీణ, పట్టణ వాసులను చైతన్యపరుస్తోంది. ఈ ప్రచారంలో డీఎస్ఎమ్ తన లాభాపేక్షను చూసుకుంటోందా వగైరా అనుమానాలను పక్కన పెడదాం. మన దేశంలో మహిళలకు ఐరన్ కావాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం. 2018 జనవరిలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడ్తున్నారు. కాబట్టి ఈ ధన్‌తేరస్‌నే ఆరోగ్య సంరక్షణకు శుభారంభంగా భావించి ప్రతిరోజు ఆహారంలో విధిగా ఐరన్ ఉండేలా చూసుకోండి. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యం. -
తిండికలిగితే.. కండగలదోయ్
పోషకాహారం ప్రజలందరికీ చేరకపోవడం అతిపెద్ద సమస్య. ప్రపంచ దేశాలన్నీ వివిధ వేదికలపై దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పోషకాహార లోపం వల్ల ఆర్థిక వ్యవస్థకు, మానవాభివృద్ధికి వాటిల్లుతున్న నష్టాన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నాయి. ఐక్యరాజ్యసమతి ఈ అంశాన్ని సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో (ఎండీజీ) భాగం చేసింది. అయినా ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ వంటి దేశాలు పోషకాహార లేమిపై మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార మిషన్ (ఎన్ఎన్ఎం)ను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెం బర్ను జాతీయ పోషకాహార మాసంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పోషకాహార సందేశాన్ని చేరవేయాలనుకుంటోంది. రక్తహీనతపై అవగాహన.. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదలపై పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది. బాలికలకు విద్య, పోషకాహారం అందచేయాల్సిన అవసరం, తగిన వయసులోనే పెళ్లి చేయడం వంటి అంశాల్ని కూడా ప్రచారంలో పెట్టనుంది. పిల్లలకు తల్లిపాలు, అనుబంధ ఆహారాన్ని తగిన మేరకు అందచేయాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మేళాలు, పోషణ్ వాక్స్, వంటకాల ప్రదర్శనల వంటి ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టనుంది. నీతి ఆయోగ్ సహా పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇందులో పాత్ర పోషించనున్నాయి. 42 కమ్యూనిటీ రేడియోలు, పంచాయతీరాజ్ ప్రతినిధులు, టీచర్లు, స్వయం సహాయక గ్రూపులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు ప్రచార కార్యక్రమాల్లో భాగం కానున్నారు. మెరుగైన ఫలితాల కోసం.. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) 1975 నుంచి అమలవుతోంది. గత యూపీఏ ప్రభుత్వం ఇందులోని కొన్ని లక్ష్యాలను 2005లో తీసుకొచ్చిన ‘నేషనల్ హెల్త్ మిషన్’లో భాగం చేసింది. 2022 నాటికి దేశంలో పోషకాహార సమస్యను పారదోలుతామంటున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఈ దిశగా అమలు చేయదగ్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా రూ.9,046.17 కోట్లతో నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌ను అమల్లోకి తెచ్చింది. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపించిన వారు 38.4 శాతం మంది ఉన్నారు. 2022 నాటికి దాన్ని 25 శాతానికి తగ్గించాలనేది ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఏటా స్త్రీలలో పోషకాహార లోపాన్ని 2 శాతం మేరకు, కిశోర బాలికల్లో రక్తహీనతను 3 శాతం మేర, బరువు తక్కువ జననాలను 2 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతికత సాయంతో పర్యవేక్షించడం, నిర్దేశిత లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు.. ఐటీ ఆధారిత పరికరాలు ఉపయోగించే అంగన్వాడీ వర్కర్లకు.. ప్రోత్సాహకాలివ్వడం, సామాజిక తనిఖీలు చేయడం, పోషకాహార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం, ‘పోషణ’తో సంబంధమున్న పలు శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి కార్యకలాపాల ద్వారా ముందెన్నడూ లేని రీతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017–18, 2019–20 మధ్య 10 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ పథకం ఫలాలు అందించాలని సంకల్పించింది. -
అయితే.. అది సమతులమైనదైతేనే సుమా
మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?ఇదో ఫేమస్ యాడ్‌లోని ప్రశ్న.. నిజానికి ఇప్పుడు మనోళ్లను అడగాల్సిన ప్రశ్నమీ తిండిలో బలముందా అనే.. ఎందుకంటే.. భారతీయులు ఏది పడితే అది తినేస్తున్నారట.. జనాభాలో సగం మంది సమతుల ఆహారం తీసుకోవడమే లేదట. 2015–16 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో సగం మంది.. ముఖ్యంగా మహిళలు సమతుల ఆహారానికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి తోడ్పడే పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, పాల ఉత్పత్తులు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. పది శాతం మంది నిత్యం వేయించిన ఆహార పదార్థాలే తింటుంటే.. మరో 36 శాతం మంది వారానికోసారి ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు. సమతుల ఆహారం అంటే.. సమతుల ఆహారం అంటే సరిపడా ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, మినరల్స్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవడమే. అయితే 45 శాతం మంది మహిళలు మాత్రమే రోజూ పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైనవి తింటున్నారని, పాలు, పెరుగు నిత్యం తీసుకునేవారి సంఖ్య 45 శాతమే అని వారానికి ఒకసారి వీటిని వినియోగించే వారి సంఖ్య 23 శాతమని సర్వే పేర్కొంది. 7 శాతం మంది అసలు పెరుగుగానీ, పాలుగానీ తీసుకోవడం లేదని, మరో 25 శాతం మంది వీటిని అప్పుడప్పుడే తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. 54 శాతం మంది మహిళలు వారానికి ఒకసారి కూడా తాజా పళ్లు తినడం లేదని, చాలా తక్కువ మంది మహిళలే రోజువారీగా చికెన్, మటన్, చేప, కోడిగుడ్డు వంటివి తింటున్నారని తేలింది. పురుషుల పరిస్థితీ ఇంత తీవ్రంగా లేకున్నా.. వీళ్లతో పోలిస్తే.. కొంచెం బెటర్‌గా ఉందట. దేశ జనాభాలోని మొత్తం మహిళల్లో 47 శాతం మంది నిత్యం కూరగాయలను, ఆకు కూరలను తింటున్నారు. మరో 38 శాతం మంది వారానికి ఒకసారి మాత్రమే వీటిని తీసుకుంటున్నారని వెల్లడైంది. పేదరికం..వివక్ష.. జంక్‌ఫుడ్.. మహిళలు అసమతుల ఆహారం తీసుకోవడానికి ప్రధాన కారణం పేదరికం, వివక్ష, జంక్‌ఫుడ్ అని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి చెప్పారు. దేశ ఆహార అలవాట్లలో కూడా లింగ వివక్ష ఉందన్నారు. ఇక్కడ మహిళలు తక్కువ ఆహారం తినడానికి అలవాటు పడిపోయారని, వారి ఆహార అవసరాలను గుర్తించే పరిస్థితులు కూడా లేవని, దీని వల్ల అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఇటీవలి కాలంలో మార్కెట్ పరిణామాలు మారిపోయాయని, దీంతో జంక్‌ఫుడ్‌కు ప్రాధాన్యత పెరిగిందని, ఎక్కువ మంది మహిళలు ముఖ్యంగా యువతులు ఈ అనారోగ్యకర ఆహారం తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశముంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
హలో మాస్టారూ..మీకు బీపీ ఉందా?
నీకు బీపీ వస్తే.. నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే.. ఏపీ మొత్తం వణుకుద్ది.. ఇలా బీపీ మీద సినిమాల్లో బోలెడన్ని డైలాగులు.. ఈ బీపీ అన్నది మనలోనూ.. మన సినిమాల్లోనూ ఓ భాగమైపోయింది. ఎవడికైనా కోపం ఎక్కువైతే.. వాడికి బీపీ ఎక్కువరా అనేస్తాం.. ఇంతకీ ఇప్పుడీ బీపీ బాగోతం మనకెందుకంటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–16లో దేశంలోని రక్తపోటు బాధితుల లెక్కలను తీశారు. తొలిసారిగా ఈ సర్వేలో వీరి సంఖ్యను గణించారు. పలురకాల కోణాల్లో దాన్ని విశ్లేషించారు కూడా.. దీని ప్రకారం సంపన్న వర్గాల్లో బీపీ ఎక్కువట.. ఇక్కడ మహిళల్లో 13 శాతం మందికి.. పురుషుల్లో 18 శాతం మందికి బీపీ ఉంది. దేశ సగటుతో పోలిస్తే.. ఇది ఎక్కువ. దేశంలోని పురుషుల్లో 15 శాతం మందికి బీపీ ఉండగా.. మహిళల్లో అది 11%. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో 14 శాతం మంది రక్తపోటుతో బాధపడుతుండగా.. పట్టణాలకొచ్చేసరికి అది కాస్త పెరిగి 17 శాతంగా ఉంది. మహిళల్లో ఇది గ్రామాల్లో 10%, పట్టణాల్లో 12 శాతంగా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే.. అత్యధికంగా సిక్కింలో 31 శాతం మంది మగవారు రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే అతివల విషయానికొస్తే..సిక్కిం, అస్సాంలో 18 శాతం మంది బీపీ బాధితులేనట. తెలంగాణలో 20% , ఏపీలో 18 శాతం పురుషులకు బీపీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోని మహిళల్లో అది 13 శాతంగా ఉంది. వీటితోపాటు మతాలవారీగా కూడా రక్తపోటు బాధితుల లెక్కలేశారు. దీని ప్రకారం సిక్కుల్లో బీపీ ఎక్కువని తేల్చారు. గుండెపోటు వంటి హృదయ సంబంధిత మరణాల్లో 50 శాతం వాటికి కారణం ఈ రక్తపోటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఆమెకు అనారోగ్యం...
రక్తం పంచిచ్చే అమ్మ.. రక్తం పంచుకుని పుట్టే చెల్లెమ్మ.. అదే రక్తం కరువై అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే ఆడపిల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. చిన్నారులనూ రక్తహీనత ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదీ మన దేశ సగటు మహిళ పరిస్థితి. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇలాంటి చేదు నిజాలెన్నో బయటపడ్డాయి. సాక్షి, హైదరాబాద్: పురుషులతో పోల్చితే మహిళలే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. చిన్నప్పటి నుంచే మహిళల్లో ఈ సమస్య ఉంటోందని వెల్లడించింది. ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత సమస్య ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను తేల్చింది. మన రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువ మంది రక్తహీనత బాధితులున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి 100 మంది మహిళల్లో 58 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్న వారు 55 శాతం మంది ఉన్నారు. సంప్రదాయ పద్ధతులే కారణం..! మన దేశంలోని సంప్రదాయ పద్ధతులే మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రక్తహీనత సమస్య మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. వయసుకు తగ్గ పొడవు, బరువు పెరగట్లేదు. దీంతో వయసుకు తగ్గట్లు శరీరంలో మార్పులు రావట్లేదు. రక్తహీనత సమస్య ఓసారి వచ్చాక అధిగమించడం కష్టంగా పరిణమిస్తోంది. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారానికి, చేసే పనికి చాలా తేడా ఉంటోంది. సరిపడా ఆహారం తీసుకోకపోవడంతో పాటు విరామం లేకుండా పని చేయడం వల్లే ఎక్కువ మంది మహిళలను రక్తహీనత వెంటాడుతోంది. చర్యలు అంతంత మాత్రమే.. మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య అంశాల్లో రక్తహీనత అతిపెద్ద సమస్య. దీని పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతున్నాయి. రక్తహీనత సమస్య నివారణకు మన రాష్ట్రంలో ఏటా రూ.20 కోట్ల విలువైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇవి ఎటూ సరిపోవట్లేదనే అభిప్రాయం ఉంది. గర్భిణులకు మాత్రమే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మాత్రలను పంపిణీ చేస్తోంది. గర్భం దాల్చిన 6 నెలల వరకు, ప్రసవం తర్వాత 6 నెలల వరకు కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ మందులు అందట్లేదు. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఏడాది పాటు ఈ మందులు తీసుకునే మహిళలు 30 శాతానికి మించట్లేదు. దీంతో రక్తహీనత సమస్య బాధితులు ఎక్కువగా ఉంటోంది. బాలికల్లోనూ.. భవిష్యత్ తరం ఆరోగ్య పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో అయితే రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉంది. ప్రతి 100 మంది చిన్నారుల్లో 60 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చని మహిళలతో పోల్చితే ప్రసవం జరిగిన మహిళల్లో రక్తహీనత కాస్త ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. -
తల్లీ..బిడ్డా..బతికేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు ఇంకా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అత్యవసర వైద్య సేవలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా కాన్పు సమయంలో తల్లులు, శిశువుల పరిరక్షణ సవాల్‌గా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నా మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మాతాశిశు సంరక్షణ ఆందోళనకరంగానే ఉందని స్పష్టమవుతోంది. మన రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. రాష్ట్రంలో జరిగే ప్రతి లక్ష కాన్పులలో 92 మంది తల్లులు చనిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసవ సమయంలో తల్లుల మరణాలరేటు ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్షకు 152 మంది తల్లులు మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో మరణాల సంఖ్య 71 ఉంది. చిన్న వయసులో పెళ్లిళ్లు, రక్తహీనత బాలింతల మరణాలకు ఎక్కువగా కారణమవుతోంది. గర్భిణులలో 51 శాతం మందికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఔషధాలు చేరడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాన్పు సమయంలో రక్తస్రావం జరిగితే అందుబాటులో రక్తం లేకపోవడం వల్ల బాలింతల మరణాలు పెరుగుతున్నాయి. గర్భంలోని శిశువు పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమయ్యే స్కానింగ్ వ్యవస్థ గ్రామాల్లో లేకపోవడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ సమస్యలు వచ్చి మరణాలు జరుగుతున్నాయి. శిశుమరణాల పరిస్థితి సైతం రాష్ట్రంలో ఇలాగే ఉంది. రాష్ట్రంలో జన్మించే ప్రతి వెయ్యి మంది శిశువులలో 30 మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 38, పట్టణ ప్రాంతాల్లో 20గా ఉంది. కాన్పు సమయం నుంచి కొన్ని రోజులలోపు ఇలా శిశువులు చనిపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే శిశు మరణాల రేటు మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతోంది. కేరళలో 12, తమిళనాడులో 21 మంది శిశువులు చనిపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శిశు మరణాల రేటు మరీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువులలో 53 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 20గా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఆస్పత్రులను నిర్మిస్తున్నా అవసరమైన మేరకు సిబ్బంది లేకపోవడంతో శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాన్పులు చేసే ఆస్పత్రులలో కచ్చితంగా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యుడు, మత్తు డాక్టరు ఉండాలి. 70 శాతం ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేరు. మూడు కేటగిరీల వైద్యులు ఉన్న ఆస్పత్రులు తక్కువగా ఉండటమే మాతాశిశు మరణాలకు కారణమవుతోంది. -
లావెక్కుతున్నావు తెలుగోడా!
సాక్షి, హైదరాబాద్: బొద్దుగా ఉంటే ముద్దు... అనేది పాత మాట. చక్కనమ్మ ఎంత చిక్కినా అందమే అనేది కొత్త మాట... ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఇప్పుడు ఎక్కువ మంది బరువు తగ్గించే పనిలో నిమగ్నమవుతున్నారు. మెజారిటీ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. దేశ వ్యాప్తంగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువవుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అందరి శరీరాల్ని మార్చేస్తున్నాయి. పురుషులు, మహిళలు తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ మంది బాధితులున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో బరువు పెరుగుతున్న అంశాలపై సర్వే నిర్వహించారు. నగరాలు/పట్టణాలు, గ్రామాల్లోని వారిని ఎంపిక చేసి వివరాలు నమోదు చేసింది. దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఏకంగా మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని 28.1 శాతం మంది మహిళలు, 24.2 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించే మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నవారే. గ్రామీణ మహిళల్లో ఈ సమస్యతో బాధపడుతున్న వారు 18.5 శాతం మంది ఉండగా, పురుషులు 14 శాతం మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అధిక బరువు సమస్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. అధిక బరువు సమస్య ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంకా ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలే ప్రధాన కారణం... ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పులే.. శరీర బరువు పెరుగుదలకు కారణాలవుతున్నాయని కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. శారీరక శ్రమలేని వృత్తిలోకి ఎక్కువ మంది వస్తుండడం కూడా దీనికి ప్రధాన కారణం. ‘చిన్నప్పటి నుంచి ఆటలకు దూరంగా ఉండడంతో కొత్త తరంలో ఎక్కువ మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో ఒకప్పటిలాగా తక్కువ ఆహారం తీసుకునే పరిస్థితి మారింది. రెడిమేడ్‌గా ఉండే ఆధునిక ఆహార పదార్థాలు అందుబాటులో ఉండడంతో రోజులో ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు. ఇవన్నీ అధిక బరువుకు కారణమవుతున్నాయి’అని పిల్లల వైద్య నిపుణులు ఎం.శేషుమాధవ్ తెలిపారు. -
అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు!
- జాతీయ సగటు 41.6 శాతం.. రాష్ట్రంలో 37 శాతమే - అవగాహనపై వైద్య శాఖ నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: భావితరాలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సమాజమైనా ప్రగతివైపు అడుగులు వేస్తుంది. అయితే నవజాత శిశువుల ఆరోగ్యంలో కీలక పాత్ర అయిన తల్లిపాల విషయంలో మన రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా పుట్టిన గంటలోగా శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నా, ఈ దిశగా ప్రయ త్నాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నా మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో మాత్రం పురోగతి కనిపించడంలేదు. దేశంలో ఏటా 26 కోట్ల మంది పిల్లలు పుడుతుండగా సగటున ప్రతిరోజూ 70 వేల మందికిపైగా మహిళలు ప్రసవిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41.6 శాతం మంది నవజాత శిశువులకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతు న్నాయి. అలాగే 55 శాతం మంది శిశువులు మాత్రమే పుట్టిన ఆరు నెలలపాటు పూర్తి కాలం తల్లిపాలు తాగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 37.1 శాతం మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే కావడంతో మన రాష్ట్రంలో పాత జిల్లాల వారీగానే ఈ గణాంకాలు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం నవజాత శిశువులకు పుట్టిన గంటలోగా తల్లిపాలు తాగించే విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో తల్లిపాల పాత్ర ఎంతో కీలకమైనది. తల్లీపిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య, ఆర్థిక ప్రగతి, వ్యాధుల నివారణలో తల్లిపాల సంస్కృతి పాత్ర ముఖ్యమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చింది. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు అందించడంతోపాటు అదనపు ఆహారం ప్రారంభిం చిన తర్వాత నుంచి రెండు ఏళ్ల వరకు వీలైతే మరికొంత కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల ఆర్యోకరమైన భావితరం తయారవుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 1989 నుంచి తల్లిపాల సంస్కృతిని పెంచే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. దేశం లోనూ ఏటా ఈ వారోత్సవాలు నిర్వ హిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని మరిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా మాతాశిశు సంరక్షణకు ఏటా కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ మాతాశిశు రక్షణలో కీలకమైన తల్లి పాల వారోత్సవాలను మాత్రం పట్టించుకోవడంలేదు.