Osama Bin Laden
-
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్‌లో వైరల్‌గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..
ఉత్తర ప్రదేశ్‌లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్ లాడెన్ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే సబ్ డివిజనల్ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్ లాడెన్ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూపీపీసీఎల్ చైర్మన్ ఎం దేవరాజ్ సీరియస్ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్‌ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్‌లో ఫరుఖాబాద్ జిల్లాలోని కయామ్ గంజ్ సబ్‌డివిజన్ 2కి పోస్టింగ్ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. ఐతే విచారణలో.. గౌతమ్ లాడెన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..) -
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
అమెరికన్లంటే ద్వేషం.. తెరపైకి అల్‌ఖైదా కొత్త చీఫ్ పేరు!
న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే.. అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది. ► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు. ► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు. ► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. ► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు. ► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. ► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు. ► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్. ► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. ► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!. ► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్కు ఎక్కువగా ఉన్నాయి. -
ప్రభుత్వ ఆఫీసులో బిన్ లాడెన్ ఫొటో కలకలం.. ఎక్కడో తెలుసా..?
ఒసామా బిన్ లాడెన్.. ఈ ఉగ్రవాది పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దాడికి పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అధినేత లాడెన్. ఈ దాడి తర్వాత అతడిని హతమార్చడానికి అమెరికాకు పదేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి అమెరికా దళాలు లాడెన్‌ను మట్టుబెట్టాయి. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయలంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టడం అంతేకాకుండా లాడెన్‌ను ప్రపంచ అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్‌గా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్ (DVVNL)లో సబ్-డివిజినల్ ఆఫీసర్ (SDO)గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీర్ అంటూ ప్రశంసించాడు. ఆ ఫొటోలో ‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్’ అంఊ రాసుకొచ్చాడు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యూపీలోని ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు అధికారి రవీంద్రను సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు. కానీ, రవీంద్ర ప్రకాశ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. బిన్ లాడెన్ కాపీలు తన వద్ద ఇంకా చాలానే ఉన్నాయని తెలిపారు. Picture of Osama Bin Laden in the office of power department SDO in UP's Farrukhabad district. "World's best junior engineer" is the title bestowed to him. Sources claim the photo has now been removed after the matter surfaced in media. pic.twitter.com/atae0kQbGF — Piyush Rai (@Benarasiyaa) June 1, 2022 -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి. బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్‌తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది
కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది. ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది. భయానక ఘటన: పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది. దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. ఇంకా ఉంది: అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు. ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి. చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది -
నవాజ్ షరీఫ్‌కు బిన్ లాడెన్ ఆర్థిక సాయం
ఇస్లామాబాద్: అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ తాజాగా బయటపెట్టారు. ఆమె గతంలో నవాజ్ షరీఫ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్ అబిదా హుస్సేన్ ప్రైవేట్ న్యూస్ చానెల్ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011 మేలో పాకిస్తాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. -
విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..
వాషింగ్టన్ : అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (2001 సెప్టెంబరు 11) బీన్ లాడెన్ టీమ్ జరిపిన ఉగ్ర దాడులు చరిత్ర మరవలేదు. ఉగ్రవాదలు సృష్టించిన రక్తపాతానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్‌ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేలమంది అమాయక పౌరులను పొట్టనపెట్టకుంది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు. ఏం జరిగింది.. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా తీవ్రవాదులు.. వాణిజ్య సేవలందించే నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించారు. హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేలమంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.. ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి. తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిస్పందించింది. అల్‌ఖైదా తీవ్రవాదులకు సాయం చేసే తాలిబన్లను తుదముట్టించే విధంగా ఆఫ్గనిస్తాన్‌పై దండెత్తింది. అంతేకాక ఉగ్రవాదాన్ని ఏరివేతకు కఠిన చట్టాన్ని అమలుచేసింది. పలు ఇతర దేశాలు కూడా వాటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మరియు చట్టం యొక్క అమలు అధికారాలను విస్తరించుకున్నాయి. కొన్ని అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు దాడుల నేపథ్యంలో వారంలోని మిగిలిన రోజుల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫలితంగా తిరిగి ప్రారంభించే సమయానికి తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిలియన్ల డాలర్లు విలువ చేసే కార్యాలయ ప్రాంతం ధ్వంసమవడం ద్వారా లోయర్ మన్‌హట్టన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. చదవండి: 9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు తెర వెనుక ఇంత జరిగిందా.. సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు బిన్ లాడెన్ 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్‌ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన దాడులు జరపగలిగింది. ప్రపంచ దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. -
ట్రంప్ ఓడిపోతే, 9/11 తరహా దాడి!
వాషింగ్టన్ : నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై 9/11 దాడుల తరహా సూత్రధారి, దివంగత ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ మేనకోడలు నూర్ బిన్‌లాడెన్ మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని, ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ప్రమాదమని, ట్రంప్ గెలిస్తేనే మరోసారి భయంకరమైన 9/11 తరహా దాడులు జరగకుండా అడ్డుకోగలరన్నారు. అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా, వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆరోపించిన ఆమె బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాకు ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాదు బైడెన్ గెలిస్తే 9/11 తరహా దాడి మరొకటి అమెరికాపై జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలిజంతో పొత్తు పెట్టుకున్నారని నూర్ ఆరోపించారు. ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదులను నిర్మూలించడంద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్రదాడుల నుంచి కాపాడారని నూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు అమెరికాకు వెళ్లానన్నారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీకి నిలిచినప్పటినుంచి ఆయనకు తాను ఫ్యాన్ అయిపోయానని, ఇపుడు కూడా ట్రంప్‌ను కచ్చితంగా ఎన్నుకోవాలన్నారు. తద్వారా అమెరికాకు మాత్రమే కాదు, మొత్తం పాశ్చాత్య నాగరికత భవిష్యత్తుకు చాలాముఖ్యమైనదన్నారు. సెప్టెంబర్ 11 దాడుల 19వ వార్షికోత్సవానికి ముందు ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పెన్సిల్వేనియాలో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీపడుతున్న జో బైడెన్ పాల్గొననున్నారు. -
‘పోలో’కు ఢిల్లీ మెట్రోలో తొలి పోస్టింగ్..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు స్థానిక స్టేషన్లలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం ‘పోలో’ను కలవవచ్చు. ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలు కలిగిన చురుకైన పోలోకు ఢిల్లీ మెట్రో స్టేషన్లలో తొలి పోస్టింగ్ లభించింది. ఇది స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనున్నది. (7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!) కాగా అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదని శిక్షకులు తెలిపారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. మిగతా జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వంటివి ఏకధాటిగా 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయని, అవి ఒక టాస్క్‌ను మాత్రమే చేస్తాయని చెప్పారు. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి. ఇక నుంచి ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
ఎట్టకేలకు ఇండియా 'బిన్ లాడెన్' పట్టివేత
గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అసోంలోని ‘ఒసామా బిన్ లాడెన్’ను కూడా ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. అసోంలో లాడెన్ ఏంటి అనుకుంటున్నారా?.. గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు 'ఒసామా బిన్ లాడెన్' అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురు గ్రామస్తులను చంపింది. ఈ ‘లాడెన్’ను పట్టుకునేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఎట్టకేలకు ఈ ఏనుగు పట్టుబడిందని అసోం జిల్లా ఉన్నతాధికారులు తాజాగా తెలిపారు. దీనిని పట్టుకోవడానికి డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవిలో అటవీశాఖ అధికారులు ట్రాక్ చేశారు. నిపుణులైన షూటర్లు, బాణాలతో మత్తు మందిచ్చి పట్టుకున్నామని అటవీశాఖ అధికారి తెలిపారు. ఇప్పుడు ‘లాడెన్’ ఏనుగును సమీపంలో మానవ నివాసాలు లేని అడవికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో 24గంటల వ్యవధిలో లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. అటవీ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2,300 మంది ప్రాణాలు కోల్పోగా.. 2011 నుంచి ఇప్పటివరకు 700 ఏనుగులు చంపివేయబడ్డాయి. -
అవును.. ఆయన చనిపోయింది నిజమే : ట్రంప్
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా బిన్ లాడెన్ (30) మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు నోరు విప్పారు. హమ్జా హతమైందని నిజమేనని చెప్పారు. ఉగ్ర నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అమెరికా సేనలు జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గానిస్తాన్/పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా మృతి చెందినట్టు వైట్‌హౌజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా.. హమ్జా మృతి చెందినట్టు గత నెలలోనే వార్తలు వెలువడ్డాయి. దీని వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో నిరాకరించారు. (చదవండి : మమ్మల్ని చాలా సార్లు బెదిరించాడు: ట్రంప్) ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ.7కోట్లు) ఇస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి : బిన్ లాడెన్ కుమారుడు హతం!) (చదవండి : విషాద జ్ఞాపకానికి 18 ఏళ్లు..) -
‘అతడు చాలా నీచంగా మాట్లాడేవాడు’
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా లాడెన్ హతమైనట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్వేతసౌధ వర్గాలు ఈ విషయంపై నోరు మెదపలేదు. దీంతో హంజా హతం వెనుక అమెరికా హస్తం ఉందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ...హంజా ఎన్నోసార్లు తమ దేశం గురించి చాలా నీచంగా మాట్లాడేవాడని అన్నారు. అదే విధంగా అగ్రరాజ్యం అంతుచూస్తానంటూ బెదిరించేవాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి హంజా మృతి విషయమై మాత్రం తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాగా హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ చానల్, న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాలు వెలువరించాయి. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హంజా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. -
బిన్ లాడెన్ కుమారుడు హిమ్జా బిల్ లాడెన్ మృతి
-
బిన్ లాడెన్ కొడుకు హంజా మృతి!
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ సంచలన వార్త వెలువరించింది. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్ అధికారులు తెలిపినట్లు సదరు ఛానల్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గానీ, శ్వేతసౌధ వర్గాలు గానీ హంజా మరణాన్ని ధ్రువీకరించలేదు. కాగా పాకిస్తాన్‌లోని అబోతాబాద్లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్ లాడెన్ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హంజాను ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్ తరహాలో అటు బిన్ లాడెన్ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన తర్వాతే హంజా మరణవార్త నిజమా కాదా అన్న అనుమానాలు తేటతెల్లమవనున్నాయి. -
‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్ హతం’
వాషింగ్టన్: కరుడుకట్టిన ఉగ్రవాది, ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్ లాడెన్‌ను అంతమొందించడంలో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీకి (సీఐఏ) పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సాయం చేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెల్లడించారు. లాడెన్‌ను పట్టుకోవడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. లాడెన్ ఎక్కడున్నాడనే సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించిందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్‌లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాడెన్‌ను చంపేంత వరకు ఆయన తమ దేశంలో ఉన్నాడనే విషయం తెలియదని ఇప్పటిదాకా పాక్ వాదించిన నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాను తామెప్పుడూ మిత్ర దేశంగానే భావించామని.. అందుకే లాడెన్‌కు సంబంధించిన సమాచారం అందించామని చెప్పారు. అమెరికా మాత్రం తమ దేశంపై నమ్మకం ఉంచలేకపోయిందని వ్యాఖ్యానించారు. -
లాడెన్ హత్యా..గుడ్‌న్యూస్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు అంతమొందించాయనే వార్త వినగానే అప్పటి పాక్ అధ్యక్షుడు జర్దారీ సంతోషం వ్యక్తం చేశారట! అది ‘గుడ్ న్యూస్’అన్నారట! అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు సహాయకుడిగా పనిచేసిన బెన్ రోడ్స్ ఈ విషయం వెల్లడించారు. ‘ది వరల్డ్ యాజ్ ఇటీజ్: ఎ మెమోయిర్ ఆఫ్ ఒబామా వైట్ హౌస్’అనే తన పుస్తకంలో ఇలాంటి పలు సంచలన విషయాలు వెల్లడించారు. అబోతాబాద్లో రహస్య జీవితం గడుపుతున్న లాడెన్ స్థావరంపై 2011 మే 2వ తేదీ రాత్రి అమెరికా ప్రత్యేక బలగాలు దాడిచేసి, హతమార్చాయి. ఈ విషయా న్ని వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా జర్దారీకి ఫోన్ చేసి చెప్పారు. అది వినగానే ‘పర్యవసానాలు ఎలా ఉన్నా, ఇది చాలా మంచి వార్త. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. మీకు, అమెరికా ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు’అని జర్దారీ అన్నట్లు రోడ్స్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా అమెరికా వ్యవహరించటంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ జర్దారీ ఆందోళన చెందలేదని రోడ్స్ తెలిపారు. జర్దారీకి తెలిపిన తర్వాతే ఒబామా లాడెన్ పతనాన్ని అమెరికా ప్రజలకు వెల్లడించారు. -
మీ లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదు!
జెనీవా : తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్న దాయాది పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూనే.. మరోవైపు పాక్ బాధితురాలంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డింది. విఫలరాజ్యంగా పేరొందిన పాక్ నుంచి మానవ హక్కులపై లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదని ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 37వ సదస్సులో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ పాక్ చేసిన ఆరోపణలను మన దేశ ప్రతినిధి (ఇండియా సెంకండ్ సెక్రటరీ) మినిదేవీ కుమామ్ తిప్పికొట్టారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను రక్షించి.. ముల్లా ఒమర్‌కు ఆశ్రయమిచ్చిన దేశం తనను తాను బాధితగా చెప్పుకోవడం అసాధారణం’ అని ఆమె అన్నారు. ‘ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267ను ఉల్లంఘిస్తూ.. ఐరాస నిషేధిత ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్ లాంటివారు పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఐరాస నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో రాజకీయ ప్రధాన స్రవంతిలో కొనసాగుతున్నాయి’ అని ఆమె మండిపడ్డారు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తోందని ఆమె అన్నారు. ఎలాంటి భయంలేకుండా ఉగ్రవాదులు పాక్ నడివీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నారని, ఒక విఫలరాజ్యంగా మారిన దేశం నుంచి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసం వినాల్సిన అగత్యం ప్రపంచానికి లేదని ఘాటుగా పేర్కొన్నారు. -
బెనజీర్ హత్య.. విస్మయపరిచే వాస్తవం!
కరాచి : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో సంచలన విషయాన్ని పాక్ వెల్లడించింది. ఆమె హత్య కుట్ర వెనక ఉంది ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్ అని పేర్కొంది. ఆమె మరణించి పదేళ్లు పూర్తి కావస్తున్నందున(డిసెంబర్ 27, 2017) పాక్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ రూపొందించిన ఓ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది. అల్ ఖైదా, బిన్ లాడెన్ ఆధ్వర్యంలోనే ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. అంతేకాదు ఆ సమయంలో బెనజీర్తోపాటు ముషార్రఫ్, జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లుర్ రెహమాన్‌ను కూడా లేపేయాలని లాడెన్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆర్మీ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ‘లాడెన్ తన కొరియర్ ముసా తరీఖ్ను ముల్తాన్‌కు పంపించాడు. వజిరిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలను ముసా తీసుకెళ్లాడు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 22న) భారీ నర మేధానికి అల్‌ఖైదా శ్రీకారం చుట్టింది’ అంటూ ఓ లేఖ ఆర్మీకి అందింది. మరుసటి రోజు అంటే సరిగ్గా ఆమె హత్యకు ఆరు రోజుల ముందు మరో హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ, ఆమె మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. ఇక ఆ ఫ్లాన్ మొత్తం అఫ్ఘనిస్థాన్ నుంచి లాడెన్ స్వయంగా పర్యవేక్షించాడంట. ఈమేరకు డిసెంబర్ 27, 2007న రావల్పిండి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను బాంబు దాడిలో హత్య చేశారు. ఆమె హత్యానంతరం తమ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు ఓ లేఖ కూడా లాడెన్‌కు అందినట్లు ఐఎస్ఐ పేర్కొంది. పరిస్థితులు చల్లబడ్డాకే లాడెన్ తిరిగి పాక్‌కి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ చేసింది లాడెనే అయినా ఆమె మరణం ద్వారా ఎక్కువ లబ్ధి(రాజకీయ) పొందాలనుకున్న వారే ఈ కుట్ర వెనుక ఉన్నారన్నది ఆమె అనుచరుల వాదన. అయితే అది ఎవరన్న ప్రశ్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, తమ భూభాగంలో లాడెన్ తలదాచుకోలేదని పాక్ వాదించినప్పటికీ.. అమెరికా భద్రతా దళాలు మాత్రం అబ్బోట్టాబాద్లో లాడెన్ ను(2011 మే నెలలో) మట్టుపెట్టిన విషయం తెలిసిందే.