political crisis
-
నైతిక ఉల్లంఘన: థాయ్‌లాండ్ ప్రధాని తొలగింపు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్‌లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్‌లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు. -
Bangladesh Political Crisis: అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్ లేడీ!
బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛా వాయువులందించిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ గారాలపట్టి. ఆయన వారసురాలిగా తొలినాళ్లలో బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు గళమెత్తిన నేతగా అంతర్జాతీయ గుర్తింపు. అనంతర కాలంలో రాజకీయ రంగంపైనా తిరుగులేని ముద్ర. దేశ చరిత్రలో ఏకంగా ఐదుసార్లు ప్రధాని పదవిని అధిష్టించిన ఏకైక నేత. ఇంతటి ఘనమైన రికార్డులు షేక్ హసీనా సొంతం. అభిమానుల దృష్టిలో ఐరన్ లేడీగా పేరు. కానీ ప్రధానిగా 2009లో రెండో దఫా పగ్గాలు చేపట్టిన నాటినుంచీ నియంతగా ఆమె ఇంటా బయటా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత గత జనవరిలో విపక్షాలన్నీ మూకుమ్మడిగా బహిష్కరించిన ఏకపక్ష ఎన్నికల్లో ‘ఘనవిజయం’ సాధించి వరుసగా నాలుగోసారి ప్రధాని అయ్యారు. కానీ ఆర్నెల్లు కూడా తిరగకుండానే ప్రజల ఛీత్కారాలకు గురయ్యారు. అవమానకర రీతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశం వీడారు! విద్యారి్థగానే రాజకీయాల్లోకి 1947లో నాటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో జని్మంచారు హసీనా. ఢాకా వర్సిటీలో చదివే రోజుల్లోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. 1975లో సైన్యం ముజిబుర్, ఆయన భార్య, ముగ్గురు కుమారులతో పాటు 18 మంది కుటుంబీకులను దారుణంగా కాల్చి చంపింది. హసీనా, ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ఈ మారణకాండ నుంచి తప్పించుకున్నారు. భారత్‌లో ఆరేళ్ల ప్రవాసం అనంతరం 1981లో హసీనా బంగ్లా గడ్డపై కాలు పెట్టారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. 2001లో ఓటమి చవిచూసినా 2008 ఎన్నికల్లో రెండోసారి గద్దెనెక్కారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. 2004లో గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు.విపక్షాలను వెంటాడి... నిజానికి ప్రధానిగా హసీనా సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. రాజకీయ అస్థిరతతో, ఆర్థిక అవ్యవస్థతో కొట్టుమిట్టాడిన బంగ్లాదేశ్‌ను ఒడుపుగా ఒడ్డున పడేశారు. కానీ 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక విపక్ష నేతలే లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలకు హసీనా తెర తీశారు. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడారు. ట్రిబ్యునల్ ద్వారా శరవేగంగా విచారణ జరిపి పలువురు ఉన్నతస్థాయి విపక్ష నేతలను దోషులుగా తేల్చారు. ఖలీదా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కీలక భాగస్వాములను 2013లో ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. అవినీతి ఆరోపణలపై ఖలీదాకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. వీటికి తోడు ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ఏకంగా 3.2 కోట్లమంది నిరుద్యోగులున్నారు. ఇలాంటి సమయంలో రిజర్వేషన్ల కోటాను తిరగదోడటం హసీనాకు రాజకీయంగా మరణశాసనం రాసింది. నాటి యుద్ధంలో ప్రధానంగా పాల్గొన్నది నేటి అధికార పార్టీ అవామీ లీగే. దాంతో, సొంత పార్టీ కార్యకర్తలకు అత్యధిక లబ్ధి చేకూర్చేందుకే రిజర్వేషన్లను తిరిగి తెరపైకి తెచ్చారంటూ దేశమంతా భగ్గుమంది. కీలక సమయంలో సైన్యం కూడా సహాయ నిరాకరణ చేయడంతో హసీనా రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం వీడాల్సి వచి్చంది.నాడూ ఆరేళ్లు భారత్ ఆశ్రయం ఆపత్కాలంలో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయమివ్వడం కొత్తేమీ కాదు. ముజిబుర్‌ను సైన్యం పొట్టన పెట్టుకున్నాక 1975 నుంచి 1981 దాకా ఆరేళ్లపాటు సోదరి, భర్త, ప్లిలలతో పాటు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందారు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, పండోరా రోడ్ నివాసాల్లో గడిపారు. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో నాటి రోజులను హసీనా గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడు నేను, నా భర్త పశి్చమ జర్మనీలో ఉన్నాం. మాకు ఆశ్రయమిస్తామంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ వర్తమానం పంపారు. ఢిల్లీలో దిగగానే నేరుగా ఆమెను కలిశాను. నా తండ్రితో పాటు కుటుంబంలో 18 మందిని సైన్యం పొట్టన పెట్టుకున్నట్టు ఆమె ద్వారానే నాకు తెలిసింది. రహస్యంగా ఢిల్లీలోనే కాలం వెళ్లదీశాం. నా భర్త ఇక్కడే ఉద్యోగం కూడా చేశారు’’ అని చెప్పుకొచ్చారు హసీనా. -
Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లా
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల ‘లాంగ్ మార్చ్’ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశ నలుమూలల నుంచీ రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్‌కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపళంగా దేశం వీడారు. సోదరితో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. ‘‘శాంతిభద్రతలతో పాటుదేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా. దయచేసి సహకరించండి’’ అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీసు శాఖను ఆదేశించారు. ‘‘అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి’’ అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పారీ్టలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పారీ్టల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ విగ్రహాన్ని సుత్తెలతో పగలగొట్టి నేలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకీ చొరబడ్డారు. పుట్టి ముంచిన రిజర్వేషన్లు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతుండటం తెలిసిందే. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్‌లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టి ముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమే కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్‌తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహా్వనించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ఆ క్రమంలో, ‘యువత ముసుగులో సంఘవిద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నా’రంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ‘ఢాకా లాంగ్ మార్చ్’కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణారి్థగా దేశం వీడాల్సి వచ్చింది! ఆలయాల విధ్వంసం హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. హసీనా భర్త డాక్టర వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. దానికి నిప్పు పెట్టారు. బంగబంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్‌తో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు. దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసంపైనా అల్లరి మూకలు దాడికి దిగాయి. కాసేపటికే ఇంట్లోంచి కేకలు, ఆక్రందనలు, మూలుగులు విని్పంచినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దేశవ్యాప్తంగా హింసాకాండ, ఆస్తుల విధ్వంసం తదితరాలు కొనసాగాయి. నాలుగు ఆలయాలను ధ్వంసం చేశారు. ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల నివాసాలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లపై రాళ్లు రువ్వారు. వాటికి నిప్పు పెట్టారు. రన్‌వే మీదా వెంటాడిన జనం... త్రుటిలో తప్పించుకున్న హసీనా సైనిక విమానంలో సోదరితో కలిసి ఢిల్లీకి ఉన్నపళంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో, వెల్లువెత్తిన జనాగ్రహం బారినుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు! హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్‌వే మీదికి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె, సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి–130జె రవాణా విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గాజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు. హసీనాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించిందీ తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్‌ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసినా ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హసీనా ఇంటి ముట్టడి సర్వం దోచుకెళ్లిన జనం రెండేళ్ల క్రితం శ్రీలంక అంతర్యుద్ధం సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? అధ్యక్ష నివాసాన్ని ముట్టడించిన జనం భవనమంతా కలియదిరిగారు. అధ్యక్షుని కురీ్చలో విలాసంగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సెలీ్పలు దిగారు. కిచెన్‌లో దూరి ఉన్నవన్నీ తింటూ సరదాగా గడిపారు. ఈత కొలనుల్లో ఈదులాడారు. సోమవారం ఢాకాలోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడినట్టు తెలియగానే నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ఆమె అధికార నివాసం ‘గణభదన్’ను భారీ సంఖ్యలో ముట్టడించారు. డ్రమ్ములు వాయిస్తూ, కొమ్ముబూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ, స్విమింగ్‌పూల్స్‌లో ఈదులాడుతూ, భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కొందరు ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. బెడ్రూంలో మంచంపై హాయిగా సేదదీరారు. అంతటితో ఆగకుండా వంట సామగ్రి మొదలుకుని ఫరి్నచర్, పురాతన వస్తువుల దాకా సర్వం ఎత్తుకెళ్లారు. ఎవరికి ఏది చేతికందితే అది తీసుకెళ్లారు. భవనాన్ని పూర్తిగా లూటీ చేసి వదిలారు. ఒక వ్యక్తి లిప్‌స్టిక్‌లు చేతబట్టుకుని మీడియా కంటబడ్డాడు. ‘‘నియంత కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేశాం. మా పోరాటానికి ప్రతీకగా ఈ లిప్‌స్టిక్‌ను నా దగ్గరుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు! దేశ పార్లమెంటులోకి కూడా జనం వెల్లువలా దూసుకెళ్లారు. ప్రజాప్రతినిధురల కురీ్చల్లో కూర్చుని విలాసంగా పొగ తాగుతూ, సెల్పీలు తీసుకుంటూ గడిపారు. ఇక తిరిగి రారు: కుమారుడు లండన్: హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెడ్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఖలేదా జియాకు విముక్తిఢాకా: జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలేదా జియాను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను తక్షణమే విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయానికి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడింది. షేక్ హసీనా మొదటిసారిగా 1996లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఖలేదా జియా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రధాని కుర్చీ వారిద్దరి మధ్య మారుతూ వచ్చింది.నిరసనలు ఇలా... జూన్ 5: స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పు జూన్ 6: యూనివర్సిటీల్లో మొదలైనఆందోళనలు. దేశమంతటికీ వ్యాప్తి.జూన్ 7: విద్యార్థుల రహదారుల దిగ్బంధం జూన్ 15: పెరిగిన నిరసనల తీవ్రత జూలై 15: హింసాత్మకంగా మారిన నిరసనలు జూలై 18: ఆందోళనలు తీవ్రరూపం..19 మంది మృతి. కర్ఫ్యూ, రంగంలోకి సైన్యం జూలై 19: దేశమంతటా హింసజూలై 21: కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్ట్ 3: మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు ఆగస్ట్ 4: దేశవ్యాప్త ఆందోళనల్లో మరో 100 మందికి పైగా మృతి. న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. అయినా చల్లారని జనాగ్రహం ఆగస్ట్ 5: ప్రధాని షేక్ హసీనా రాజీనామా. దేశం విడిచి పలాయనం భారత్‌పై ప్రభావం ఎంత?! బంగ్లా్లదేశ్ సంక్షోభం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హసీనా తొలి నుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారు. ఆమె హయాంలో 15 ఏళ్లుగా ద్వైపాక్షిక బంధం నానాటికీ దృఢమవుతూనే వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేకుల నోళ్లకు హసీనా గట్టిగా తాళం వేశారు. 2009లో ఆమె రెండోసారి గద్దెనెక్కినప్పుడు యూపీఏ–2 మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ఇరు దేశాల బంధం గట్టిపడింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సంబంధాలు మరింతగా బలపడుతూ వచ్చాయి. మన ప్రబల ప్రత్యర్థి చైనాకు బంగ్లాదేశ్ మరీ దగ్గరవకుండా ఉండేందుకు పలు అంశాల్లో బంగ్లాకు ఇతోధికంగా సాయపడుతూ వచి్చంది. ఖలీదా జియా హయాంలో ఇరు దేశాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. భారత వ్యతిరేకతే జియా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉంటూ వస్తోంది కూడా! బంగ్లాదేశ్ మేలు కంటే హసీనా, అవామీ లీగ్ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే భారత్‌కు ప్రధానమని ఆ దేశంలో ఒక వర్గంలో ఉన్న అభిప్రాయానికి ఆమె గట్టి సమర్థకురాలు. జియా హయాంలో ఉల్ఫా తీవ్రవాదులు బంగ్లా కేంద్రంగా ఈశాన్య భారతంలో ధ్వంసరచన చేశారు. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో సాగిన ‘బాయ్‌కాట్ భారత్’ ప్రచారానికి జియా, బీఎన్పీ నేతలు బాహాటంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో జియా జైలు నుంచి విడుదలవడమే గాక సైన్యం దన్నుతో కూడిన మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించవచ్చన్న వార్తలు భారత్‌కు ఇబ్బందికరమే.పరిస్థితిని సమీక్షించిన మోదీబంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతపై కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాలో తాజా పరిస్థితిని మోదీకి జైశంకర్ నివేదించారు. సరిహద్దుల్లో అప్రమత్తత బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్ఎఫ్ హై అలర్ట్ జారీ చేసింది. అదనపు బలగాలను మోహరించారు. మన విద్యార్థులు వెనక్కి ..బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెనక్కొస్తున్నారు. జూలై చివరికల్లా 2,894 మంది తిరిగొచ్చారు. మరో 3,000 మంది త్వరలో రానున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఇదేం రుబాబు పాలన?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు. రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, దాడులు, ప్రతిదాడులు అనే ఊసే గతంలో ఎప్పుడూ లేదు. ఎన్నికలు, పోలింగ్ వరకే రాజకీయాలు. ఆ తరువాత పార్టీ రహితంగా అన్నదమ్ముల్లా అందరూ కలసిమెలసే ఉంటారు. నిన్నమొన్నటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ ఇప్పుడా వాతావరణం మారి, సర్వత్రా అసహనం చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సుమారు పాతిక రోజుల కిందట టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని మునుపెన్నడూ లేని రీతిలో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వరుసగా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట దాడులు, విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అంతమొందిస్తామంటూ ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. ఊరు విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇక శిలాఫలకాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం గురించి చెప్పనవసరమే లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ అభిమానించే మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను సైతం కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చాలాచోట్ల పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుండటం విమర్శలకు తావిస్తోంది. కొత్తగా ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమోననే ఆశతో అధికారం కట్టబెడితే.. ఇలా విధ్వంసకర ఘటనలకు పాల్పడటమేమిటంటూ.. పాలక పక్షాల నేతల తీరుపై దాదాపు అన్ని వర్గాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా పని చేశారనే కక్షతో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్న తీరుపై సర్వత్రా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.దాడులు చేస్తున్నారిలా..● జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. వారి పేర్లున్నాయనే కక్షతో ఆ శిలాఫలకం ధ్వంసం చేశారు.● ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజేశ్వరి, ఆమె భర్త, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు ఇంటిపై వరుసగా రెండుసార్లు నాటు బాంబులు, కోడిగ్రుడ్లు, గాజుసీసాలతో దాడికి పాల్పడి, భయానక వాతావరణం సృష్టించారు.● మాజీ మంత్రి రోజాపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను ఖండించడమే పాపమన్నట్లు కాకినాడ సిటీలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన ఆలీషాపై టీడీపీ మద్దతుదారులు దాడికి ఒడిగట్టారు.● పెద్దాపురం మండలం పులిమేశ్వరంలో రైతుభరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక సర్పంచ్ ఆకుల వీరబాబు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు.● రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున మాజీ ఎంపీ మార్గని భరత్‌రామ్ కార్యాలయంలో ఆయన ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేతలు తెలుగు తమ్ముళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.● కడియంలో రైతుబజారుకు అనుబంధంగా రైతుల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న షెడ్డును సైతం తెలుగు తమ్ముళ్లు వెనుక ఉండి అధికారులతో కూల్చివేయించారు. దీనిని గిరజాల బాబు ఆధ్వర్యాన అడ్డుకోగా అక్రమంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు.● రాజానగరం మండలం రాధేయపాలెంలో కూటమి నేతలు విజయోత్సవ ర్యాలీలో సర్పంచ్ దుర్గ భర్త శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు.● కొవ్వూరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంపై దాడి చేసి, కార్ల అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. అనంతరం మెప్మా కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.● నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామ సచివాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని, శెట్టిపేట సొసైటీ భవన నిర్మాణ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని, సమిశ్రగూడెం గీతా మందిరం వద్ద సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.● గోపాలపురం – గుడ్డిగూడెం రోడ్డు శంకుస్థాపన శిలాఫలకాన్ని, చిట్యాలలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు.● అమలాపురం చెన్నమల్లేశ్వరస్వామి దేవస్థానం వద్ద సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని, విలసవల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న 5 రోడ్లకు సంబంధించిన 5 శిలాఫలకాలను కూడా ధ్వంసం చేశారు. రెడ్డిపల్లి గ్రామ సచివాలయం వద్ద గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వసం చేశారు.● మండపేట విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ సమీపాన ఇటీవల ఆవిష్కరించిన రహదారి ప్రారంభ శిలాఫలకాన్ని ధ్వంసం చేసి, అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోలను పగులగొట్టారు. అక్కడితో ఆగని తమ్ముళ్లు వారం తిరగకుండా మరో రెండు శిలాఫలకాలను పగులగొట్టారు. జెండా స్థూపాన్ని జేసీబీతో మురికి కాలువలోకి తోసేశారు. ఈ ఘటనలను వైఎస్సార్ సీపీ నేతలు ఖండించగా, వైఎస్సార్సీపీ నేతలే ధ్వంసం చేసి ఉంటారని తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశంలో అనడం పలువురిని నివ్వెరపరిచింది. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సైతం మీడియా సమావేశంలో జనం విస్తుపోయేలా ఎదురుదాడికి దిగడం గమనార్హం.● రావులపాలెం మండలం కేతరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకురాలు లోవలక్ష్మిపై ఆ గ్రామ టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.● ఆత్రేయపురం మండలం పులిదిండిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ముండేల్లి నాగరాజుపై బీరు సీసాలతో దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు.అనపర్తిలో.. అడ్డూ అదుపూ లేకుండా..చంద్రబాబు ఆదేశాలతో సీటు కోసం చివరి నిమిషంలో టీడీపీ నుంచి బీజేపీ గూటికి చేరి, ఎమ్మెల్యే అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అనపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా దాడులు జరిగాయి. పలు గ్రామాల్లో పట్టపగలే తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై పడి ధ్వంసం చేయడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు. అనపర్తి ఉన్నత పాఠశాలలో బాలబాలికల రక్షణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.10.15 లక్షలతో నిర్మించిన ప్రహరీని సైతం ధ్వంసం చేశారు. నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ప్రహరీని దగ్గరుండి మరీ కూల్చేయడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇంటికి వెళ్తున్న బలహీనవర్గాలకు చెందిన చెల్లుబోయిన కృష్ణ, అప్పన్నలపై అనపర్తి సావరం సెంటర్లో దారి కాచి కూటమి నేతలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. రామవరంలో నల్లమిల్లి సూర్రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు మూకదాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. వారం తిరగకుండానే దొరికిన వారిని దొరికినట్టు ఇనుపరాడ్లతో రక్తం వచ్చేటట్టు కొట్టారు. వరుస దాడులు, ఎమ్మెల్యే అనుచరుల నుంచి చంపేస్తామనే బెదిరింపులతో నల్లమిల్లి సూర్రెడ్డి ప్రాణభయంతో పరారయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రంగంపేట మండలం వడిశలేరులో కార్తి మార్తమ్మ ఇంటిపై మూక దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వారిని బయటకు లాగి మరీ మారణాయుధాలతో విధ్వంసం సృష్టించారు. పాత వీరంపాలెంలో టీడీపీకి చెందిన వి.నాగబాబు, సత్తిబాబులు.. గండి వెంకటేశ్వరరావు ఇంటిపై పడి ఆయనను బయటకు ఈడ్చుకుంటూ వచ్చి మరీ దాడి చేశారు. మహేంద్రవాడకు చెందిన మేడపాటి శివారెడ్డిని రామవరం హైస్కూల్ వద్ద దారి కాచి కర్రలు, కత్తులతో దాడికి పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రామవరానికి చెందిన సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ఇంటిపై రెండు పర్యాయాలు దాడి చేసి, కిటికీ అద్దాలు పగులగొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఎమ్మెల్యే అనుచరగణం ఇలా వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.హింసకు స్వస్తి చెప్పాలిరాజకీయాల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అధికార, ప్రతిపక్షాల శ్రేణులు క్రమశిక్షణగా ఉండాలంటే.. ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేయించేలా ఆయా పార్టీల అధినేతలు చొరవ తీసుకోవాలి. అధికార ప్రతిపక్షం ఏదైనా ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోటీ పడాలి. ప్రజల అభిమానాన్ని పెంచుకోవాలి. హింస, దౌర్జన్యం, దాడులు, కొట్లాటలు, దహనాలు, సోషల్ మీడియాలో ఆకతాయి పోస్టులకు స్వస్తి చెప్పాలి.– దూసర్లపూడి రమణరాజు,సామాజికవేత్త, కాకినాడహామీలు అమలు చేయండికక్ష సాధింపు చర్యలకు పాల్పడటం భావ్యం కాదు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పూర్తి సమయం అభివృద్ధిపై, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, ఇలా శిలాఫలకాల ధ్వంసం వంటి చర్యలకు పాల్పడటం సరికాదు. అందరూ స్వాగతించేలా కొత్త ప్రభుత్వం ఆలోచనలు, పరిపాలన ఉండాలే తప్ప, ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు.– రేవు తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,పీడీఎస్‌యూ, అమలాపురందాడుల సంస్కృతి మంచిది కాదుఎన్నికల్లో విజయం సాధించిన వారు ఓడిపోయిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు. ఏ పోటీలో అయినా ఒకరే విజయం సాధిస్తారు. గెలుపు ఓటములు సర్వసాధారణం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేలు చేసే పని కోసం ఉపయోగించాలి. అధికారంలోకి వచ్చిన వారు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కొనసాగించాలి. దాడుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి.– నూతలపాటి అప్పలకొండ, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు,సామర్లకోటఉపేక్షించేది లేదుప్రజలిచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు. దాడులు, కొట్లాటలు, హింసకు పాల్పడటం, దహనం చేయడం, విగ్రహాలు కూల్చడం వంటి చర్యలకు ఒడిగట్టడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక పనులు చేయడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. చెడు ధోరణి ప్రబలకుండా, అసాంఘిక వ్యవస్థ పెరగకుండా పోలీసు వ్యవస్థ న్యాయసూత్రాలను పాటిస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ముందుముందు ఇలానే దాడులు కొనసాగితే ఉపేక్షించేది లేదు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది.– కురసాల కన్నబాబు,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ -
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Fourth lok Sabha Elections-1967: కాంగ్రెస్ కోటకు బీటలు
తండ్రి నెహ్రూ వారసురాలిగా 1966లో ప్రధాని పీఠమెక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రజాతీర్పు కోరాల్సిన పరిస్థితి! రాజకీయాల్లో ముక్కుపచ్చలారకపోయినా తొలిసారి ప్రజామోదం పొందడంలో ఆమె సక్సెసయ్యారు. కానీ సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. ధరల పెరుగుదల, మందగించిన వృద్ధి, ఉపాధి కల్పన వంటి సమస్యలకు తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి! చివరికి సొంత పార్టియే బయటకు గెంటినా తట్టుకుని నిలవడమే గాక విపక్షాల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకుని సంకీర్ణ శకానికి తెర తీశారు ఇందిర. ఇలా 1967–70 నాలుగో లోక్‌సభ ఎన్నో సంక్షోభాలకు సాక్షిగా నిలిచింది... చివరి జమిలి ఎన్నికలు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలపై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ మనకిదేమీ కొత్త కాదు. 1967 దాకా వరుసగా నాలుగు పర్యాయాలు దేశమంతటా ఇదే విధానంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడా, ఇక్కడా పూర్తి పదవీకాలం పాటు ఆ పార్టీ ప్రభుత్వాలే రాజ్యమేలాయి. నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్ కోటకు బీటలు మొదలయ్యాయి. ఇందిర సారథ్యంలో పార్టీ అస్మదీయ, తస్మదీయ వర్గాలుగా విడిపోయింది. దాంతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 283 స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతం కూడా 44.72 నుంచి 40కి తగ్గింది. ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. స్వతంత్ర పార్టీ ఏకంగా 44 చోట్ల గెలిచి లోక్‌సభలో అతి పెద్ద విపక్షంగా నిలిచింది. అఖిల భారతీయ జన్ సంఘ్ కూడా ఏకంగా 21 సీట్లు అదనంగా నెగ్గి బలాన్ని 35కు పెంచుకుంది. ప్రజా సోషలిస్ట్ పార్టీ 13 సీట్లకు పరిమితమైంది. 1964లో దాన్నుంచి చీలి జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో పుట్టుకొచి్చన సంయుక్త సోషలిస్ట్ పార్టీ 23 సీట్లు గెలిచింది. సీపీఐ ఆరు సీట్లు కోల్పోయి 23కు పరిమితమైంది. సీపీఐ నుంచి ఆవిర్భవించిన సీపీఎం 19 చోట్ల గెలిచింది. 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు లోక్‌సభతో పాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే సగం రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ దక్కింది. యూపీలో ఎన్నికలైన నెల రోజులకే చరణ్‌సింగ్ కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టిల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి నేతల బహిష్కరణలు, రాజీనామాలు ప్రాంతీయ పార్టిల ఆవిర్భావానికి దారితీశాయి. పశి్చమబెంగాల్, బిహార్, ఒడిశాల్లో కాంగ్రెస్ మాజీలు వేరుకుంపటి పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి! తమిళనాట డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టిగా నిలిచింది. మిగతా 8 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇందిర బహిష్కరణ 1969 నవంబర్ 12వ తేదీకి చరిత్రలో ప్రత్యేకత ఉంది. అదే రోజున ప్రధాని ఇందిరను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు! పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, వ్యక్తి ఆరాధనకు కేంద్రంగా మారారనే ఆరోపణలపై కాంగ్రెస్‌లోని ఇందిర వ్యతిరేక వర్గమైన “సిండికేట్’ ఈ చర్య తీసుకుంది. హిందీయేతర నాయకులతో, ముఖ్యంగా దక్షిణాది నేతలతో కూడిన ఈ వర్గంలో కీలక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సిండికేట్ వర్గానికి కామరాజ్ నాయకత్వం వహించారు. ఈ చర్యతో కాంగ్రెస్ రెండు ముక్కలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని 705 మందిలో 446 మంది ఇందిర వెంట నడిచారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ (ఆర్), సిండికేట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఓ)గా పార్టీ చీలిపోయింది. లోక్‌సభలో మెజారిటీ కోల్పోయినా సీపీఎం, డీఎంకే, సీపీఐ దన్నుతో ఇందిర సర్కారు మనుగడ సాగించింది. ఎన్నెన్నో విశేషాలు... ► 1967 లోక్‌సభ ఎన్నికల్లో 61.1 శాతం ఓటింగ్ పోలైంది. మన దేశంలో అప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్ ఇదే. ► ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోని తొలి లోక్‌సభ కూడా ఇదే. 1970 డిసెంబర్లో 15 నెలల ముందే రద్దయింది. ► రెండు వరుస యుద్ధాలు, రెండేళ్లు వరుసగా వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి 20 శాతానికి పైనే తగ్గి ఆహార ధాన్యాలు అడుగంటాయి. ► దిగుమతులకు చెల్లింపుల సామర్థ్యం మరింత క్షీణించింది. ఆహారం కోసం అమెరికా రుణ సాయం తీసుకోవాల్సి వచి్చంది. ► స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా డాలర్‌తో రూపాయి విలువను ఎన్నికల ముందు 4.76 నుంచి 7.5కి తగ్గించారు. ► హరిత విప్లవం ఊపందుకోవడంతో 1971 కల్లా పంటల దిగుబడి 35 శాతం పెరిగింది. ► రాష్ట్రాల సంఖ్య 27కు పెరిగింది. దాంతో లోక్‌సభ స్థానాలు 494 నుంచి 520కి పెరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్
-
బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై రేపు బలపరీక్ష
-
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
రసవత్తరంగా బీహార్ రాజకీయాలు
-
కెనడాకు తగ్గిన భారత యువత
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య వివాదం కారణంగా 2023 ఏడాదికి భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. వాటి సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు అనంతరం విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్లు 86 శాతానికి తగ్గాయని స్పష్టం చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనంతరం వీసా అనుమతులను ఇచ్చే కెనడియన్ దౌత్యవేత్తలను భారతదేశం తొలగించడం, తక్కువ మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేయడంతో ఈ పరిణామాలు ఎదురయ్యాయని మిల్లర్ చెప్పారు. "భారతదేశం నుండి కెనడా వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలించే మా సామర్థ్యం సగానికి తగ్గింది. ఇరుదేశాల మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దాని గురించి నేను చెప్పలేను." అని ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడారు. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం అనంతరం కెనడా దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పంపింది. ఇదీ చదవండి: ఉగ్రవాదులపై ఇరాన్ ఉక్కుపాదం.. పాక్‌పై క్షిపణులతో దాడులు -
సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలి
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది. స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్‌కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్‌ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్‌ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్‌ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్‌ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్ మోదీ ఇలా పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది. ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L — Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
సీఎంగా షిండే ఉంటారా? ఊడతారా?
-
యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరికి సంబంధించిన యూట్యూబ్, సోషల్ మీడియా లింక్‌లను తొలగించాలని బీబీసిని కేంద్ర ఆదేశించింది కూడా. ఆ తర్వాత కొద్ది రోజులకే బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా జరిగాయి. కానీ ఇది ఐటీ దాడులు కాదని పన్నుల లావాదేవీల్లోని అవతవకలపై సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది కూడా. ఐతే వీటిపై ప్రతిపక్షాలు అధికార పార్టీ ఐటీ దాడులతో నిజాలను నొక్కేస్తుందంటూ దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం విదేశీ మీడియా ప్రచురించిన కథనాన్ని ఖండించినందున ఇది రాజకీయం అంటూ పిలుస్తున్నారు. అయినా ఇంత అకస్మాత్తుగా అభిప్రాయాలు, డాక్యుమెంటరీలు అంటూ ఎందుకు వచ్చాయి. 2024 జాతీయ ఎన్నికలకు ఒక సంత్సరం ముందు ఈ డాక్యుమెంటరీ బయటకు వచ్చింది. దీన్ని జై శంకర్ అందరీ దృష్టిని మరల్చేలా మోదీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంగా అభివర్ణించారు. వాస్తవానికి బీబీసీ ఐటీ నిబంనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి మరీ ఈ డాక్యుమెంటరీని తీసిందన్నారు. 1984లో ఢిల్లీలో చాలా విషయాలు జరిగాయి కదా మరీ వాటి గురించి ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదని ప్రశ్నించారు. ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదని నొక్కి చెప్పారు. భారత్‌లో ఎన్నికల సీజన్ ప్రారంభమయ్యే నాటికి కావలనే బీబీసీ ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అదే లండన్, న్యూజిలాండ్ ఎన్నికల సమయంలో ఇలా చేస్తుందా? అని నిలదీశారు. 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై వచ్చిన ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని సార్లు ఇలాంటి బురద రాజకీయాలు భారతదేశ సరిహద్దుల నుంచి కాకుండా బయట నుంచి కూడా వస్తున్నాయన్నారు. భారత్‌పై తీవ్రవాద చిత్రాన్ని ముద్ర వేయడం అనేది కేవలం బీజేపీనే లేక ప్రధాని మోదీని ఉద్దేశించో జరగడం లేదని, గత కొంతకాలంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఈ కథనాల వెనుక ఉద్దేశ్యం విదేశాల్లో భారతదేశ వ్యతిరేక ఎజెండాను తీసుకెళ్లేడమేనని అన్నారు. "మేము ఒక డాక్యుమెంటరీ లేదా యూరోపియన్ నగరంలో చేసిన ప్రసంగం గురించో మాట్లాడటం లేదు. దీని గురించి చర్చిస్తున్నాం. పైగా ఇక్కడి రాజకీయాలను మీడియా ప్రత్యక్షంగా నిర్వహిస్తుంది కూడా. తెర వెనుక చేస్తున్న రాజకీయాలు చేస్తున్నావారికి నిజంగా రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం లేని వాళ్లే చేసే పనులే ఇవి. ఈ కథనం వెనుక ఉన్న వారెవరో రాజకీయాల్లోకి రావాలని సవాలు విసిరారు. పైగా మీడియా, ఎన్జీవో అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ కథనాలతో రాజకీయాల చేయరని మండిపడ్డారు". జైశంకర్. (చదవండి: ఇందిరాగాంధీ నా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు: జై శంకర్) -
‘మహారాష్ట్ర’ సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు ఏర్పడిన అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులున్న ధర్మాసనం శివసేనలో చీలిక, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి సంబంధించిన పిటిషన్‌ను గురువారం విచారించింది. ‘ ఠాక్రే, షిండే చీలికవర్గం తరఫు లాయర్ల వాదనలన్నింటినీ విన్నాం. 2016 నబమ్ రెబియా తీర్పుని పునఃపరిశీలించాలా? దానిని ఏడుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలా?’ అనే విషయంపై తీర్పు రిజర్వ్ చేస్తున్నాం అని తెలిపింది. ఏమిటీ నబమ్ రెబియా తీర్పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్‌లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. అరుణాచల్ ప్రదేశ్‌లో అప్పట్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన సీఎం నబమ్ టుకీయేని గద్దె దించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో అసమ్మతి నాయకుడు కలిఖో ఫుల్ తిరుగుబాటు చేశారు. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. దీనిపై కాంగ్రెస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని అనుసరించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ఊరట లభిస్తుంది. మహారాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, థాక్రే విధేయుడు నరహరి సీతారామ్ జిర్వాల్‌ను తొలగిస్తూ షిండే వర్గం ఇచ్చిన నోటీసు సభలో పెండింగ్‌లోనే ఉంది. చదవండి: ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యం.. -
Liz Truss: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది. పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక లిజ్ ట్రస్ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్ ట్రస్ నెలకొల్పారు. తెరపైకి పలువురి పేర్లు లిజ్ ట్రస్ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్‌ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు. అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు. జీవించి ఉన్న ఏడుగురు మాజీలు ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్ జాన్సన్, థెరెసా మే, డేవిడ్ కామెరూన్, గోర్డాన్ బ్రౌన్, సర్ టోనీ బ్లెయిర్, సర్ జాన్ మేయర్ సరసన ఇప్పుడు ట్రస్ చేరారు. 45 రోజుల ప్రధానమంత్రి యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు. బాధ్యత నెరవేర్చలేకపోయా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే? -
కాంగ్రెస్ లో–కమాండ్
కాంగ్రెస్ పార్టీ మీద గాంధీ కుటుంబం తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఆ కుటుంబం ఎన్నికల్లో గెలుపును సాధించలేకపోతోంది. వరుస ఎన్నికలు దీన్ని రుజువు చేశాయి కూడా! భారత్ జోడో యాత్ర సందర్భంగా అసంఖ్యాక ప్రజల అభినందనలు అందుకుంటున్న రాహుల్ గాంధీ కూడా పార్టీకి ఓట్లు సంపాదించే స్థానంలో లేరు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ క్రియాశీలంగా వ్యవహరించడానికి ఆరోగ్యం అంతగా సహక రించడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం హై కమాండ్ అనేదే లేకుండా పోయిందని రాజస్థాన్ పరిణామాలు నొక్కి చెప్పాయి. లాంఛనప్రాయంగా అధిష్ఠానం ఉనికిలో ఉన్నప్పటికీ దాని ఆదేశాలు పని చేయడం లేదు. గాంధీ కుటుంబ ఆధిపత్యం లేని కాలంలోకి కాంగ్రెస్ ప్రవేశిస్తోందా? సీతారాం కేసరిని 1998లో సాగనంపి, సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కలిసి పిచ్చాపాటీగా మాట్లాడాను. మా సంభాషణ క్రమంలో ఆయన ఏమన్నారంటే... ‘‘ఇప్పుడు ఈ పార్టీ రాబోయే 25–30 సంవత్సరాల కాలం వరకు ఈ కుటుంబం చేతుల్లోకి వెళు తుంది’’ అన్నారు. పీవీ నిజంగానే జ్యోతిష్యుడి అవతారమెత్తారు. పాతికేళ్లపాటు కాంగ్రెస్ వ్యవహారాలను శాసించిన నెహ్రూ–గాంధీ కుటుంబ ప్రభావం ఇప్పుడు క్షీణించిపోతోంది. జీకే మూపనార్, ఎమ్ఎల్ ఫోతేదార్, బూటా సింగ్ లేదా సీతారాం కేసరి వంటి వారిని హైకమాండ్ దూతలుగా పంపినప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వణికిపోయే కాలం ఒకప్పుడు ఉండేది. విషయం చెప్పగానే ఒకే ఒక వాక్యంతో రాజీనామా చేసి వెళ్లిపోయేవారు. లేదా కాంగ్రెస్ అధ్యక్షురాలికి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని కట్టబెడుతూ ఒక ఆదేశం వచ్చేది. దాన్ని అందరూ బుద్ధిగా పాటించిన కాలమది. కానీ భారతదేశం మారుతోంది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా మారుతోంది. మారుతున్న ఈ వాస్తవాన్ని రాజస్థాన్ నాటకీయంగా నొక్కి చెప్పింది. ఈ నాటకీయ ప్రకటన కర్త మరెవరో కాదు, కాంగ్రెస్ సొంత ముఖ్యమంత్రి అశోక్ గెహలోత్ అని చెప్పాలి. జైపూర్‌లో కాంగ్రెస్ శాననసభా పక్ష సమావేశాన్ని ఏర్పర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా చెప్పారు. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిని ఎంచుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షు రాలికి కట్టబెడుతూ సీఎల్పీ నుంచి ఒకే ఒక్క వాక్యంతో కూడిన తీర్మానాన్ని ఆమోదింపచేసుకునేందుకు వచ్చినవారు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్; సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. సోనియాగాంధీ ఈ తరహా పని విధానాన్ని సంపత్సరాలుగా అమలు చేస్తూ వస్తున్నారు మరి. రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ని నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. సచిన్‌కి సీఎం పదవిని కట్టబెడ తామని 2014 నుంచి అధిష్ఠానం హామీ ఇస్తూ వస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనుభవజ్ఞుడైన అశోక్ గెహలోత్ని జాతీయ స్థాయికి తీసుకురావాలని అధిష్ఠానం భావించింది. ఒక రకంగా ఇది ఇరువురు నేతలకూ గెలుపు కట్టబెట్టేదేనని అనిపించింది. యువకుడైన సచిన్ పైలట్ వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి పార్టీ గెలిచే స్థానాలను మరింతగా పెంచుతారని అందరూ భావిస్తున్నారు. ఇక గెహలోత్ అయితే రాజస్థాన్‌లో పార్టీని నిర్మించారు. మూడుసార్లు ముఖ్య మంత్రిగా ఆయన పాలనానుభవం కానీ, కాంగ్రెస్ వ్యవస్థను, భారత దేశాన్ని 40 సంవత్సరాలుగా అర్థం చేసుకుంటూ వచ్చిన సీనియర్‌గా గానీ 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలను మరింతగా పెంచగలరని అందరూ భావిస్తూ వచ్చారు. అధిష్ఠానం కూడా గెహలోత్పై చాలా ఆంచనాలు పెట్టుకుంది. నరేంద్రమోదీ నేతృత్వం లోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యత కోసం చేసే ప్రయత్నంలో గెహలోత్ పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా ఉంటారని అధిష్ఠానం భావించింది. దానికి అనుగుణంగానే గాంధీ కుటుంబం విశ్వాసాన్ని గెహలోత్ పొందుతూ వచ్చారు. ఆ కుటుంబానికి నిజమైన విశ్వసనీయుడిగా ఆయన కనిపించారు కూడా. అయితే పాతకాలపు కాంగ్రెస్ రాజకీయ నేత అయిన గెహలోత్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ అధిష్ఠానం మాట పెడచెవిన పెట్టారు. కాబట్టే అనుకున్న ప్రకారం రాజస్థాన్ సీఎల్పీ సమావేశం జరగలేదు. గెహలోత్ అనుయాయులుగా భావి స్తున్న 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోచోట సమావేశమై, నేరుగా స్పీకర్ నివాసానికి వెళ్లి తమ అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు సమర్పించారు. పైలట్‌ని సీఎంగా చేస్తే అంగీకరించమని ధిక్కారం ప్రకటించారు. వారు పార్టీకే మూడు షరతులు పెట్టారు. అక్టోబర్ 16 తర్వాతే అంటే గెహలోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాతే రాజస్థాన్ సీఎం ఎవరనేది నిర్ణయించాలి(తాజాగా అశోక్ గెహలోత్ తాను అధ్యక్ష పోటీలో లేనని తేల్చేశారు); 2020లో సచిన్ పైలట్‌తో పాటు తిరుగుబాటు చేసిన వారిలో ఏ ఒక్కరినీ సీఎంగా చేయ కూడదు; చివరగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకులు ఎమ్మెల్యేలను బృందాలుగానే తప్ప వ్యక్తులుగా మాట్లాడరాదు. తన పక్షానే మెజారిటీ సభ్యులు ఉన్నారని గెహలోత్ పార్టీ అధిష్ఠానానికి స్పష్టమైన సందేశం పంపారు. అసెంబ్లీకి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించడంతో సూత్రరీత్యా చెప్పాలంటే పార్టీని చీల్చగలనని తేల్చి చెప్పినట్లే అయింది. అదే సమయంలో గెహలోత్కూ, సచిన్ పైలట్‌కూ మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. అవి సాధారణ రాజకీయ విభేదాల స్థాయిని దాటి పోయాయి. జాతీయ నాయకత్వం కూడా వీరి మధ్య ఘర్షణను పరిష్కరించలేకపోయింది. భూపేందర్ సింగ్ హుడాకు విశ్వసనీయులైన హరియాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2016 రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతున్న స్వతంత్ర సభ్యుడు సుభాష్ చంద్ర గెలుపొందడంలో సహాయం చేసినప్పుడు కూడా అధిష్ఠానం ఏమీ చేయలేకపోయింది. ఓటింగ్ సమయంలో ‘తప్పు పెన్’ వాడిన కారణంగా 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో పంజాబ్‌లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి దింపేశాక, ఆ తర్వాత కాంగ్రెస్ ఆ రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయింది. నరేంద్ర మోదీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గాంధీ కుటుంబం తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. పార్టీ కోసం ఆ కుటుంబం ఎన్నికల్లో గెలుపును సాధించలేకపోయింది. పైగా పార్టీకి అవసరమైన డబ్బును కూడా గాంధీ కుటుంబం సేకరించలేక పోయింది. ఆనాటి నుంచి వరుసగా జరుగుతూ వచ్చిన ఎన్నికలు దీన్ని రుజువు చేశాయి కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం భారత్ జోడో యాత్ర సందర్భంగా అసంఖ్యాక ప్రజల అభినందనలు అందు కుంటున్న రాహుల్ గాంధీ కూడా పార్టీకి ఓట్లు సంపాదించే స్థానంలో లేరు. ప్రియాంకా గాంధీ వాద్రా ఆశించినంతగా ఫలితాలు సాధించ లేకపోతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఆరోగ్యం అంతగా సహక రించడం లేదు. పైగా రాజస్థాన్ వంటి సంక్షోభ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని, ఒప్పందం కుదిర్చి, తన సమస్యలను పరిష్కరించ గలిగే అహ్మద్ పటేల్ వంటి అనుభవజ్ఞుల సహాయం కూడా సోనియాకు ఇప్పుడు లభ్యం కావడం లేదు. 92 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నప్పుడు రాజస్థాన్ వ్యవహారాలను చూస్తున్న పార్టీ పరిశీలకులు కనీసం తిరుగుబాటు జరుగుతున్న సంకేతాలను కూడా పసిగట్టలేకపోయారు. రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రం తానేనని చాలామంది భావిస్తున్న ప్పటికీ రాజస్థాన్ పరిణామాలు సచిన్ పైలట్‌కి కూడా షాక్ కలిగిం చాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధిష్ఠానానికి చెంపపెట్టు అయి నట్లయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం హై కమాండ్ అనేదే లేకుండా పోయిందని రాజస్థాన్ పరిణామాలు నొక్కి చెప్పాయి. లాంఛన ప్రాయంగా అధిష్ఠానం ఉనికిలో ఉన్నప్పటికీ దాని ఆదేశాలు పని చేయడం లేదు. గాంధీ కుటుంబ ఆధిపత్యం లేని కాలంలోకి కాంగ్రెస్ ప్రవేశిస్తోందా? 1998లోనే పీవీ నరసింహారావు ఊహించినట్లు పార్టీలో గాంధీ కుటుంబ ఆధిపత్యం ముగిసిపోతున్నట్లేనా? వ్యాసకర్త: నీరజా చౌదరి, సీనియర్ జర్నలిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
అధ్యక్ష పదవికోసం ఆశ పడితే అదే రాక ఉన్న సీఎం పదవి కూడా..
అధ్యక్ష పదవికోసం ఆశ పడితే అదే రాక ఉన్న సీఎం పదవి కూడా పోయెట్లుంది సార్! -
Rajasthan Congress crisis: కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చిన్న చిన్న సమస్యలను సంక్లిష్టం చేసి పీకల మీదికి తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే! ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలతో రాజస్తాన్ రాజకీయాలు ముడిపడటం.. వైరి వర్గాలు తెగేదాకా లాగడం కాంగ్రెస్ పార్టీ గందరగోళ వ్యవహార శైలికి తాజా మచ్చుతునక. ఆదిలోనే తప్పటడుగు... కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఎంచుకోవడం వెనక ఉన్న అజెండాను సరైన రీతిలో స్పష్టీకరించడంలోనే అధిష్టానం తప్పటడుగు వేసింది. దాంతో ఆదిలోనే హంసపాదులా నామినేషన్లకు ముందే ఎడారిలో తుపానును తలపిస్తూ పరిస్థితి చేయిదాటిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్తాన్ రాజకీయాల్లో చాపకింద నీరులా ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నం వికటించింది. అనుభవజ్ఞుడైన గెహ్లాట్‌కు జాతీయ అధ్యక్ష పదవి ఆశచూపి యువ సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలన్నది పార్టీ పెద్దల యోచన. అప్పుడు ఇద్దరికీ సమ న్యాయం చేసినట్టవుతుందని అధిష్టానం భావించింది. కానీ ఇదే విషయాన్ని గెహ్లాట్‌కు స్పష్టంగా చెప్పే విషయంలో అధిష్టానంతో పాటు అగ్ర నాయకులు మీనమేషాలు లెక్కపెట్టి అనవసర ఊహాపోహలకు తావిచ్చారు. రాజస్తాన్‌ను వదలడం సుతరామూ ఇష్టంలేని గెహ్లాట్‌కు ఇది రుచించలేదు. తప్పదంటే తన సన్నిహితునికే సీఎం పదవి కట్టబెట్టాలన్నది ఆయన ఆలోచన. దాంతో గెహ్లాట్ బల ప్రదర్శనకు దిగారు! అస్పష్టత... అయోమయం రాజస్తాన్ రాజకీయ యవనికపై ఆదివారం జరిగిన హైడ్రామా అటు అధిష్టానాన్నీ, ఇటు గెహ్లాట్‌నూ ఇరుకున పెట్టింది. రాజీనామాల వరద ఇద్దరినీ పీకల్లోతు ముంచేసింది. హైకమాండ్ హైకమాండే గనుక ఏం చేసినా చెల్లుతుంది. గెహ్లాట్ పరిస్థితే ఎటుకాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. అధ్యక్ష పదవిని హుందాగా అంగీకరించి, అనుచరులను సముదాయించి అధిష్టానం మాట జవదాటకుండా ఒప్పించగలిగితే తప్ప గెహ్లాట్ ఇప్పుడు రాజకీయ కుర్చీలాటలో ఏ కుర్చీ దొరక్క కిందపడిపోవాల్సి వస్తుందనేది నిపుణుల అంచనా. గెహ్లాట్‌ను కేవలం మధ్యేమార్గంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారే తప్ప నిజానికి కాంగ్రెస్‌లో సీనియర్లకు, అనుభవజ్ఞులకు కొదవలేదు. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ నుంచి సుశీల్ కుమార్ షిండే దాకా చాలామంది ఉన్నారు. అధిష్టానం చెబితే బరిలోకి దిగడానికి వీరంతా సిద్ధంగానే ఉన్నారు. వరుస తప్పిదాలు... కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బహుముఖ పోరు అనివార్యమైన పక్షంలో గాంధీల ఆశీస్సులు లేకుండా గెలవడం అసాధ్యమని అందరికీ తెలుసు. అంతేగాక అధిష్టానం చల్లని చూపు ఎవరిపై ఉంటే వారివైపే రాజస్తాన్ ఎమ్మెల్యేలు ఉండటమూ తప్పనిసరే. ఈ నేపథ్యంలో గెహ్లాట్ గనక అధిష్టానం అసంతృప్తికి లోనయితే సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల కింద కాంగ్రెస్‌తో జతకట్టిన గెహ్లాట్ తన రాజకీయ జీవితంలో ఏనాడూ హైకమాండ్‌ను ధిక్కరించలేదు. పార్టీ కష్టకాలంలోనూ విధేయతను స్పష్టంగా చాటుకున్నారు. కాంగ్రెస్ రాజకీయంగా 2014 నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నప్పటికీ సీనియర్లకు, విధేయులకు సమున్నత రీతిలో అన్ని అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను, విధేయులను కోల్పోయింది కూడా! కానీ పంజాబ్‌లో దెబ్బతిన్న తర్వాత కూడా అధిష్టానం తీరు మార్చుకోకపోవడం దాని కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పరిణామమే. రాజస్తాన్ రాజకీయ పరిస్థితిని అనవసరంగా చేయి దాటనిచ్చి, ఇప్పుడు దిద్దుబాటుకు దిగడమే ఇందుకు తార్కాణం. ఈ ఎపిసోడ్లో తప్పంతా 10–జన్‌పథ్‌దేనన్నది కొందరి వాదన. సీనియర్ నాయకుల్లో జవాబుదారీతనం లేకపోవడం పెద్ద మైనస్‌పాయింటని మరికొందరి వాదన. రాజస్తాన్ విషయంలోనైతే ఇది మరీ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాకు ముందు అందరినీ సీఎల్పీ సమావేశానికి తీసుకొచ్చేలా గెహ్లాట్‌కు నచ్చజెప్పడంలో ఖర్గే, మాకెన్ విఫలమయ్యారు. భేటీకి పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ గైర్హాజరయ్యారు. ఇంత గందరగోళం మధ్య ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను దారిలోకి తెచ్చేందుకు క్రమశిక్షణ మార్గదర్శకాలు జారీ చేయడంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వైఫల్యం ఆశ్చర్యకరం. రాజీనామాలు జరిగిన ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆయన గనక పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఎమ్మెల్యేలకు వారి ఇష్టాయిష్టాలను వెల్లడించే స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది. కానీ వారిని సముదాయించే పాత్రను నిర్వర్తించడంలో సీనియర్ల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. పైగా, ఇంత జరిగినా అధిష్టానం మనోగతం మేరకు ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించడంలో విఫలమైన గెహ్లాట్‌కు గానీ, పీసీసీ చీఫ్‌కు గానీ కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎలా ముగుస్తుందో...! రాజస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా చూడాలన్నది అధిష్టానం ప్రధానోద్దేశం. ఒకరకంగా ఇది గతంలో చేసిన తప్పును చాలా ఆలస్యంగా సరిద్దుకునే ప్రయత్నమే. పైలట్ 2014 నుంచి నాలుగేళ్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని సజావుగా నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. దాంతో ఆయన్నే సీఎం చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గెహ్లాట్‌కు సీఎం పదవి దక్కింది. అంటే తెర వెనక ఎంత లాబీయింగ్ జరిగిందో ఊహించుకోవచ్చు. రెండు ముక్కల్లో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే పైలట్ నేరుగా రాహుల్ నివాసానికి వెళ్లి కలిస్తే గెహ్లాట్ అదే సమయంలో అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అలా మొదలైన లాబీయింగ్ తారస్థాయికి చేరింది. చివరికి అహ్మద్ పటేల్ మాటే చెల్లింది. గెహ్లాట్ సీఎం అయ్యారు. పైలట్ వంటి యువకున్ని సీఎం చేయాలని భావించిన రాహుల్ ఆ తర్వాత గెహ్లాట్ వైపు మొగ్గడంగమనార్హం. సోనియా, ప్రియాంక ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పైలట్ అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తప్పిదాన్ని ఇప్పుడు దిద్దుకునేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా గెహ్లాట్ సారథ్యంలో వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్డం కష్టమని సర్వేల్లోనూ తేలింది. దాంతో పైలట్‌కే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. -
సెల్ఫ్‌గోల్ రాజకీయం!
రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెడుతుంది! కాంగ్రెస్‌లో పరిస్థితి ఇప్పుడు అదే! కొన్నేళ్ళుగా రాష్ట్రం వెంట రాష్ట్రంగా అధికారం చేజార్చుకుంటూ, దేశ రాజకీయ పటంపై పట్టు కోల్పోతున్న పార్టీలో ఇప్పుడు అధిష్ఠానంపై అనుయాయుల ధిక్కార స్వరం గట్టిగా వినపడుతోంది. ఆదివారం రాజస్థాన్‌లో 90 మందికి పైగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రంతో అధిష్ఠానాన్ని బెదిరించినంత పనిచేయడం అందుకు తాజా ఉదాహరణ. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాత్‌ను జైపూర్ నుంచి తప్పించి, ఢిల్లీలో పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టి కథ నడపాలనుకున్న అధినేత్రి సోనియా గాంధీ పరివారానికి ఇది అనూహ్య పరిణామం. నలభయ్యేళ్ళుగా నమ్మినబంటు అనుకున్న వ్యక్తి జైపూర్ నుంచి ఢిల్లీకి రావడానికి ఠలాయించడం ఒక ఎల్తైతే, అధిష్ఠానం అనుకుం టున్న సచిన్ పైలట్ వద్దనీ, తమ వాడే కొత్త సీఎం కావాలనీ అతని అనుయాయులే ‘క్రమశిక్షణా రాహిత్యం’తో ప్రవర్తించడం మరో ఎత్తు. రానున్న పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన పెద్దలు తీరా షోకాజ్ నోటీసులతో ధిక్కార తుపానును నియంత్రించే పనిలో పడాల్సి వచ్చింది. కొన్నేళ్ళుగా దేశరాజకీయాల్లో తన ఉనికినీ, ప్రాసంగికతనూ నిలబెట్టుకోవడం కోసం కిందా మీదా పడుతున్న కాంగ్రెస్‌కు ఇది కష్టకాలం. కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా పాలిస్తున్న రాష్ట్రాలు రెండే – రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్. అక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బోలెడన్ని సమస్యలున్నాయని తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. చిత్రం ఏమిటంటే – ప్రతిచోటా ప్రత్యర్థుల కన్నా స్వపక్షీయుల తోనే కాంగ్రెస్ కకావికలవుతోంది. ప్రతిసారీ తన వేలితోనే తన కళ్ళు పొడుచుకుంటోంది. దశాబ్దా లుగా పార్టీలో అనేక హోదాలు అనుభవించి, క్లిష్టసమయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు పట్టు కొమ్మంటే, తానింకా రాజస్థాన్ సీఎం కుర్చీనే పట్టుకొని వేళ్ళాడాలనుకుంటున్నట్టు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన 71 ఏళ్ళ గెహ్లాత్ ప్రవర్తించడం విడ్డూరం. అంతా అనుకుంటున్నట్టు జరిగితే నేడో రేపో పార్టీ మొత్తానికీ పెద్ద అనిపించుకోవాల్సిన నేత చివరకు పైలట్‌తో పాత లెక్కలు తేల్చుకో వాలనుకోవడం, ఢిల్లీ వెళ్ళినా జైపూర్ తన గుప్పెట్లోనే ఉండాలనుకోవడం స్థాయికి తగిన పని కాదు. సీఎం పీఠం కోసం రెండేళ్ళ క్రితం కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలసి, పార్టీపై తిరుగుబాటుకు సిద్ధపడిన సచిన్ పైలట్ కూడా తక్కువ తినలేదు. అప్పట్లో బీజేపీలోకి దూకడానికీ సిద్ధమై, రాహుల్ తదితరుల బుజ్జగింపుతో ఆఖరికి ఆగిన చరిత్ర ఆయనది. ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ పీసీసీ పీఠం పోయినా, సీఎం కుర్చీపై ఆశతోనే ఆయన పళ్ళబిగువున పార్టీలో కథ నడుపుతున్నారు. గెహ్లాత్ ఢిల్లీకి వెళితే, ముఖ్యమంత్రి అవుతానన్న ఆయన ఆశలు ఇప్పుడు ఎంత వరకు ఫలిస్తాయన్నది చెప్పలేం. పార్టీపై పట్టు సడలిన అధిష్ఠానమేమో మనిషికో మాట ఇచ్చినా, ఇప్పుడేమో ఏదీ నెరవేర్చలేని దుఃస్థితిలో పడిపోయింది. ఈ క్షణంలో గెహ్లాత్ వైపు మొగ్గితే, వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్‌లో పైలట్ పక్క పార్టీల వైపు చూసే ప్రమాదం ఉంది. అవునన్నా, కాదన్నా రాజస్థాన్‌లో సంక్షోభానికి గెహ్లాత్ ఎంత కారణమో, అధిష్ఠానమూ అంతే కారణం. ఒకప్పటిలా శాసనసభా పక్ష అభిమతాన్ని పెడచెవినపెట్టి, తమ ఆదేశాన్ని వారిపై రుద్దాల నుకోవడం పార్టీ పెద్దల అపరాధం. కళ్ళూ చెవులూ విప్పార్చుకొని, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసు కోలేని చేతకానితనం. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి దాకా కనీసం పైకి తటస్థంగా ఉన్నట్టు కనిపించాలని గాంధీ పరివారం చూసింది. తీరా రాజస్థాన్ రగడతో ఆ వ్రతాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఒకపక్క అధిష్ఠానానికి మింగుడుపడని ‘జి–23’ బృందంలో ఒకరైన శశిథరూర్ నామినే షన్ వేస్తున్నారు. మరోపక్కన తాజా రాజస్థాన్ ఘటనలతో గెహ్లాత్ బదులు బరిలోకి దింపేందుకు తమ మాట వినే మరో విశ్వాసపాత్రుడు ఎవరా అని అధిష్ఠానం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రాల్లో వివిధ వర్గాల మధ్య సయోధ్య కోసం అలవిమాలిన వాగ్దానాలిచ్చి, ఆఖరుకు బొక్కబోర్లాపడడం అధిష్ఠానానికి అలవాటుగా మారింది. పంజాబ్‌లో అప్పటి సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల విషయంలో అదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ చేజారింది. వచ్చే ఏడాదే ఎన్నికలు జరిగే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో సైతం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవు తోంది. ప్రతిచోటా గ్రాండ్ ఓల్డ్ పార్టీ పెద్దలకు ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ పరిస్థితి. దృఢమైన నిర్ణయాలు తీసుకోలేక, తీసుకున్న నిర్ణయాలతో వచ్చిపడ్డ సంక్షోభాలను పరిష్కరించలేక అధిష్ఠానం చేష్టలుడిగి చూస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీలో అందరూ తమ మాట వినేలా చేయాలంటే, వ్యక్తిగత ఛరిష్మాతో ఎన్నికల్లో సాధించే ఓట్లు, గెలిచే సీట్లే గాంధీ పరివారానికి కీలకం. పార్టీ కిరీటాన్ని ప్రస్తుతానికి కాదన్న రాహుల్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ‘భారత్ జోడో యాత్ర’తో ఆ పనిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే, అత్యధిక శాతం యువతరం ఉన్న దేశంలో ఏడెనిమిది పదుల వయసు నిండిన నేతలతోనే ఇప్పటికీ రాజకీయం నెరపాలనుకోవడం కాంగ్రెస్ చేస్తున్న తప్పిదం. యువతరంతో అనుబంధం పెంచుకోవడానికి ఆ పార్టీ శ్రమించాలి. పార్టీలోనూ, పాలిస్తున్న రాష్ట్రాల్లోనూ యువతరానికి పగ్గాలిచ్చి, కొన్నేళ్ళుగా తాము చెబుతున్నది చేతల్లో చూపాలి. నాలుగేళ్ళ క్రితం రాజస్థాన్ ఎన్నికల్లో గెలిచినప్పుడే ఆ పని చేసి ఉంటే, ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో! రోజుకో రంగు మారుతున్న రాజస్థాన్ రాజకీయం అధిష్ఠానానికి చెబుతున్న పాఠమిదే! -
గెహ్లాట్ తప్పేం లేదు.. ఆ ముగ్గురే అంతా చేశారు
ఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక సీఎం అశ్లోక్ గెహ్లాట్ తప్పేం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్.. సోనియా గాంధీకి అందించిన నివేదికలో గెహ్లాట్‌కు క్లీన్ చిట్ దక్కినట్లు సమాచారం. ఆదివారం నాటి రాజస్థాన్ పరిణామాలను దగ్గరుండి అజయ్ మాకెన్ గమనించారు. ఒకవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుంటే.. ఎమ్మెల్యేలంతా ఆ సమావేశానికి గైర్హాజరు కావడం, అదే సమయంలో మరో నేత ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం కావడం, ఆపై 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా సమర్పించి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించడం లాంటి పరిణామాలు తెలిసినవే. అయితే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా వెనుక తొలుత గెహ్లాట్ ఉండి ఉంటారని, తన ఇష్ట ప్రకారం తర్వాతి వారసుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనందునే(సచిన్ పైలట్ పేరు సీఎం రేసులో నిలవడంపై వ్యతిరేకత) ఆయన ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ సీనియర్లలో జోరుగా చర్చ జరిగింది. దీంతో గెహ్లాట్(71) తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకుంటారనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. అయితే.. సోనియాగాంధీకి అజయ్ మాకెన్ సమర్పించిన నివేదికలో.. ముగ్గురు ఎమ్మెల్యేల వల్లే తిరుగుబాటు పరిణామాలు సంభవించినట్లు పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రమేయం లేకుండానే ఈ పార్టీ వ్యతిరేక చర్య నడిచిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్టీ చీఫ్ విప్ మహేష్ జోషి, ఆర్టీడీసీ చైర్మన్ ధర్మేంద్ర పాథక్, ఎమ్మెల్యేలను తన ఇంట్లో సమావేశపర్చిన మంత్రి శాంతి ధారివాల్ పేర్లు ఆ నివేదికలో ఉన్నాయి. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సోనియాను మాకెన్ కోరినట్లు సమాచారం. ఆదివారం విడిగా జరిగిన ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశంలో 2020 నాటి సచిన్ పైలట్ తిరుగుబాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు, ఆ సమయంలో ప్రభుత్వాన్ని స్థిరపరిచిన వ్యక్తుల్లో ఒకరినే గెహ్లాట్ వారసుడిగా, రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలంటూ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా తీర్మానం చేశారు. కాదని పైలట్‌ను గనుక ముఖ్యమంత్రిని చేస్తే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని బెదిరించారు కూడా. అంతేకాదు.. అధినేత్రి సోనియా ఆదేశాలను పక్కనపెట్టడంతో పాటు కేంద్రంలోని కీలక నేతలకు కలిసేందుకు, డిమాండ్లు వినిపించేందుకు సైతం ఆ ఎమ్మెల్యేలంతా విముఖత వ్యక్తం చేసినట్లు తేలింది. ఇక ఈ నివేదికను సమర్పించే ముందు ఎమ్మెల్యేలంతా క్రమశిక్షణతో లేరంటూ మాకెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.