polution
-
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు.. హెచ్చరికలు జారీ
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. విజిబులిటి 500 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది.ఢిల్లీలో కాలుష్యం, పొగ మంచు కారణంగా విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో, వాయు కాలుష్యం సీవియర్ ప్లస్ కేటగిరిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రాఫ్-4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్దులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.#WATCH | A layer of fog covered parts of Delhi this morning as the minimum temperature dropped to 7°C, as per IMD. Drone visuals from the Akshardham area shot around 7.30 am pic.twitter.com/shhFO3xpRm— ANI (@ANI) December 19, 2024 #WATCH | Uttar Pradesh | A dense layer of fog engulfs Ghaziabad city as the temperature dips to 8°C, as per IMD. pic.twitter.com/wsVLqdVq5o— ANI (@ANI) December 19, 2024మరోవైపు.. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్ధామ్ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు.#WATCH | Madhya Pradesh | Dense fog and cold wave engulfs Gwalior city as the temperature dips to 7°C, as per IMD. pic.twitter.com/d5tCRWpjdJ— ANI (@ANI) December 19, 2024 -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
మళ్లీ గ్యాస్ చాంబర్‌గా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు చుట్టుముట్టాయి. గాలి దిశలో మార్పు కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. గాలి వేగం తక్కువగా ఉండడంతో గురువారం ఉదయం నుంచి ఆకాశంలో పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409 వద్ద నమోదైంది. ఇది మంగళవారం కంటే 41 సూచీలు అధికం. గురువారం ఉదయం నుంచి రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మధ్యాహ్నం వేళ కూడా సూర్యరశ్మి తక్కువగానే ఉంది. రాత్రి అయ్యేసరికి వాతావరణం మరింత చల్లగా మారిపోతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా జనానికి కంటి, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. బుధవారం ఢిల్లీలోని 13 ప్రాంతాల్లో ఏక్యూఐ 400గా నమోదైంది. శనివారం వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం గాలి పశ్చిమం నుండి ఉత్తరం వైపునకు సగటున గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది. రాబోయే రెండు రోజులలో వివిధ దిశల నుండి గాలి వీయనుంది. శుక్రవారం ఈశాన్యం నుండి వాయువ్య దిశలో గాలి వీయనుంది. దాని వేగం నాలుగు నుండి ఎనిమిది కిలోమీటర్లుగా ఉండవచ్చు. శనివారం వాయువ్యం నుండి పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు ఆరు నుంచి 12 కిలో మీటర్లుగా ఉండవచ్చు. అందుకే ఈ వారం అంతా గాలి నాణ్యత పేలవంగానే ఉండవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. -
కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? 18 ఏళ్లలో ఏం జరిగింది?
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో గత 18 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు మూడున్నర రెట్లు పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణమని వైద్యులు భావిస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్, ఉదర, మూత్ర సంబంధిత క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కారణంగా 11 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పౌర రిజిస్ట్రేషన్ డేటాలోని వివరాల ప్రకారం 2005వ సంవత్సరంలో ఢిల్లీలో క్యాన్సర్ కారణంగా రెండు వేల నుండి రెండున్నర వేల మంది బాధితులు మరణించారు. గత ఏడాది 7400 మందికి పైగా క్యాన్సర్ బాధితులు మరణించారు. పిల్లలు, యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది క్యాన్సర్‌తో మరణించిన వారిలో దాదాపు నాలుగో వంతు మంది 44 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలు కూడా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 14.50 లక్షల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని, అలాగే ఏటా తొమ్మిది లక్షల మంది బాధితులు మరణిస్తున్నారని ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలలో.. కాలుష్యపూరిత ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాతావరణంలో ఎంపీ 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. క్యాన్సర్‌కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అస్తవ్యస్త జీవనశైలి, ధూమపానం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? -
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు మరో ప్లాన్.. సుప్రీంకు వినతి!
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? -
‘సరి- బేసి’ విధానం తొలుత ఏ దేశంలో మొదలయ్యింది?
కాలుష్యం కాటుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ జనం అతలాకుతలం అవుతున్నారు. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ స్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేస్తోంది. దీపావళి అనంతరం ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. అయితే ఈ విధమైన ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో బేసి-సరి ఫార్ములాను అమలు చేసింది. ఆ సమయంలో ఈ విధానం అందరికీ కొత్తగా అనిపించింది. చాలామందికి దీని గురించి అర్థం కాలేదు. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య (3,5,7,9) ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలలో నడుస్తాయి. సరి సంఖ్య గల వాహనాలు (2,4,6,8) రోడ్లపైకి రావడానికి సరిసంఖ్య గల తేదీలలోనే అనుమతి ఉంటుంది. 2016లో ఢిల్లీలో అమలు చేసిన ఈ ఫార్ములాను తొలిసారిగా మెక్సికోలో ప్రవేశపెట్టారు. దీనికి ‘హోయ్ నో సర్కులా’ అనే పేరు పెట్టారు. దీని అర్థం ‘మీ కారు ఈరోజు నడవదు’. అనంతర కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి విధానాలను అమలు చేశారు. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ తదితర ప్రాంతాల్లో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా చదవండి: దీర్ఘాయుష్షు అంటే ఎంత? -
కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే..
ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంతగా పెరిగిపోయిందంటే మనుషులు, జంతువులు, చివరికి పక్షులు కూడా పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ జూలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అక్కడ చెట్లు, మొక్కలు సమృద్ధిగా ఉన్నందున, కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. జూలోని జంతువులు, పక్షులపై కాలుష్య ప్రభావం పడకుండా ఉండేందుకు జూ పార్కు సిబ్బంది అక్కడి చెట్లు, మొక్కలపై నీరు జల్లే పనిని చేపడుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ జూలాజికల్ పార్క్‌లోని చెట్లపై నీళ్లు చల్లాలని అక్కడి సిబ్బందిని ఆదేశించింది. ఈ సందర్భంగా నేషనల్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ ఆకాంక్ష మహాజన్ మాట్లాడుతూ తమ దగ్గరున్న నీరు చల్లే సదుపాయాలు ద్వారా చెట్లు, మొక్కలపై నీరు జల్లుతున్నామని, తద్వారా పక్షులు, జంతువులపై పొగమంచు ప్రభావం తక్కువగా పడుతుందన్నారు. జంతుప్రదర్శనశాల లోపల చాలా పచ్చదనం ఉందని, బయటి ప్రాంతాలతో పోలిస్తే ఆక్సిజన్ లభ్యత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈసారి అక్టోబర్ నుండే జంతువులకు శీతాకాలపు ఆహారాన్ని అందించే పనిని ప్రారంభించామని, ఈ ఆహారం జంతువులలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: ‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది? #WATCH | Sprinkling of water done in Delhi's National Zoological Park, as a measure against the rise in Air Quality Index (AQI) in the national capital (04/11) pic.twitter.com/ufyMDFV4YU — ANI (@ANI) November 5, 2023 -
‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అంటే ఏమిటి? నాలుగు రోజుల్లో వేలమంది ఎలా మృతి చెందారు?
సరిగ్గా 70 ఏళ్ల క్రితం లండన్‌లో ఆ రోజు పగటిపూట హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. గాలి కలుషితమై నల్లగా మారి, అంతటా వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు. నేటికీ ఈ సంఘటన ఇంగ్లండ్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. ఈ ఘటనను ‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అని పిలుస్తారు. విపరీతమైన కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏర్పడిన పొగమంచు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ భయంకరమైన ‘చీకటి’ 1952 డిసెంబర్ తొలిరోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్‌లో విధ్వంసం సృష్టించింది. ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు, పారిశ్రామిక వినియోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం కారణంగా ఈ నల్లని పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు 1952 డిసెంబర్ 5న మొదలై, తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ 9 వరకు కొనసాగింది. లండన్‌వాసులు అప్పటికే దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఘటన వారిని షాక్‌కు గురిచేసింది. ఈ పొగమంచు కారణంగా లక్ష మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాలుష్యం కారణంగా ఇక్కడి ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శ్వాసకోశ వ్యాధులు తలెత్తాయి. లండన్‌లో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుండే మొదలైంది. దీనిని గమనించి 1301లో ఎడ్వర్డ్- I లండన్‌లో బొగ్గును కాల్చడాన్ని నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. 1956లో బ్రిటన్‌లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మెరుగుదల కనిపించింది. ఇది కూడా చదవండి: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది? -
నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉష్ణోగ్రత నియంత్రణ ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది. 2. శబ్ద కాలుష్యానికి చెక్ చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి. 3. స్వచ్ఛమైన గాలి చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 4. ఆక్సిజన్ అందిస్తూ.. కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి. 5. నీటి నిర్వహణ చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 6. మానసిక ఆరోగ్యం పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. 7. శారీరక ఆరోగ్యం చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 8. గోప్యత చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి. 9. ఆర్థికపరంగా.. పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి. 10. వన్యప్రాణులకు ఆవాసం పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 11. కాంతి కాలుష్యం చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 12. ఆహ్లాదాన్ని అందిస్తూ.. చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. 12 Reasons Why Cities Need More Trees: 1. Temperature Control One large tree is equivalent to 10 air conditioning units, and the shade they provide can reduce street temperature by more than 30%. 2. Noise Reduction Trees can reduce loudness by up to 50%. In urban areas… pic.twitter.com/KRfskttfxx — The Cultural Tutor (@culturaltutor) August 28, 2023 -
భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్: తొలి మ్యాచ్ కష్టమేనా?
Pollution threat Looms Large on 1st T20 Against IND VS NZ: టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్లో ఆసీస్ చేతి అనుహ్యంగా ఓటమి చెందిన న్యూజిలాండ్.. తదుపరి భారత పర్యటనకు సిద్దమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా నవంబర్17న తొలి టీ20 మ్యాచ్‌లో జైపూర్ వేదికగా భారత్‌తో తలపపడనుంది. అయితే జైపూర్‌లో గత వారం రోజులుగా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే శీతాకాలంలో పొగమంచు కూడా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత కలుషితంగా ఉందని, జైపూర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఈ ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు జైపూర్ చెరుకోగా, కీవిస్ ఆటగాళ్లు సోమవారం(నవంబర్ 15)న చేరుకోనున్నారు. కాగా అంతక ముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా పొగమంచు కారణంగా శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడారు. అప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316 గా నమోదైంది. చదవండి: ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్ -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
విషం పీల్చుతూ.. తాగుతూ..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆయా కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ధాటికి చుట్టుపక్కల గ్రామాలు బలిపీఠంపై ఉన్నాయి. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన నీటిని వాడాలి. కానీ అమరరాజా ఫ్యాక్టరీస్ శుద్ధి చేసిన నీటిని కాకుండా పలుమార్లు ప్రాసెస్ చేసిన నీటిని అక్కడే మొక్కలకు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఆ నీటిని దూరంగా సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేయాలి. కానీ అక్కడే వదిలేయడంతో అవి ఇంకిపోయి మొత్తం భూగర్భజలాలన్నీ పాడవుతున్నాయి. ఇక ఆయా ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢత తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కార్మికులు వేసుకునే దుస్తులపైనే కాదు.. కార్మికుల రక్తంలోనూ ఉంది. 20 శాతం ఉద్యోగుల రక్తంలో సీసం శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని పరీక్షల్లో తేలింది. నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీల్లో పనికి వెళ్లే కార్మికులు ప్రత్యేక యూనిఫాం ధరించాలి. విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందు ఆ యూనిఫాం తీసివేసి,.. వేరే దుస్తులు వేసుకోవాలి. కానీ సదరు ఫ్యాక్టరీల యాజమాన్యం ఎక్కడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు... ఫలితంగా కార్మికుల ప్రాణాలకు అక్కడ భద్రత లేకుండా ఉంది.’’ అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఆందోళన వక్తం చేస్తున్నారు.. ‘అమరరాజా లెడ్తో అంతులేని వ్యధ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పీసీబీ అధికారులు స్పందిస్తూ... నిజంగానే అక్కడి పరిస్థితి అదుపుతప్పుతోంది.. కానీ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. అని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢతకు చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువులూ కాలుష్యకాసారంలా మారాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో పీసీబీ తనిఖీలే లేవట గత టీడీపీ ఐదేళ్ల హయాంలో గానీ, అంతకుముందు నాలుగేళ్లలో గానీ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అమరరాజా ఫ్యాక్టరీస్‌లో ఏనాడూ పీసీబీ తనిఖీలు చేసిన దాఖలాలే లేవని స్వయంగా సదరు అధికారులే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఎప్పుడైనా మొక్కుబడిగా పీసీబీ అధికారులు వెళ్లి రావడం తప్పించి తనిఖీలు, దాడులు, విచారణల ప్రసక్తే లేదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడం వల్లనే వాస్తవాలు బయటికొచ్చాయని చెప్పుకొచ్చారు. అక్కడ కాలుష్య నివారణ ప్రమాణాలు కనీసంగా పాటించడం లేదని తేలిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే వరకూ అక్కడ రోడ్లు కూడా లేవు వాస్తవానికి ఎక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పినా.. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కృషి చేస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీల కాలుష్యపు దుష్ప్రభావంతో కునారిల్లే గ్రామాలకు ఇంకెంత ఖర్చు చేస్తారో చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ అమరరాజా ఫ్యాక్టరీ .. గేటు పక్కనే ఉన్న తారకరామానగర్ గ్రామం గురించే కనీసంగా పట్టించుకోలేదు. పైగా ఓ దశలో ఆ ఊరి ప్రజలను తమ ఫ్యాక్టరీ మీదుగా నడవొద్దని హుకుం జారీచేశారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు దారి ఇచ్చారు. ఆ ఊరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిమెంట్ రోడ్డు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలన వచ్చిన తర్వాతే మా గ్రామంలోకి సిమెంట్ రోడ్లు వచ్చాయని స్థానికంగా నివసిస్తున్న ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఏం చేస్తారో చూడాలి ‘అమరరాజా ఫ్యాక్టరీల కాలుష్యం, అందులోని లెడ్ శాతంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణ చర్యలకు ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువిచ్చింది. ఈ లోగా సదరు యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి...’ అని పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ లోగా తమ పీసీబీ తరఫున ఓ కమిటీ అక్కడ పరిస్థితులపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందన్నారు. – పీసీబీ జేసీఈఈ వెంకటేశ్వరరావు -
అమరరాజా లెడ్తో.. అంతులేని వ్యథ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సరిగ్గా తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడి పంచాయతీలో 1985లో తొలిసారిగా అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్‌ను నెలకొల్పిన యాజమాన్యం.. తర్వాతి కాలంలో అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండ్రస్టీస్ లిమిటెడ్‌ను నెలకొల్పి వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకుంది. ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యం గురించి కనీస మాత్రంగా కూడా పట్టని యాజమాన్య నిర్లక్ష్య ధోరణే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసి వేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈమధ్యనే విచారించింది. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఇకనైనా కాలుష్యశాతం తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించింది. హైకోర్టుతో సహా ఎన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అమరరాజా ఫ్యాక్టరీస్ యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే వాస్తవ పరిస్థితి అవగతమవుతోంది.ఆ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలను దూరప్రాంతాలకు తీసుకువెళ్లి విడిచిపెట్టకుండా చుట్టుపక్కల ఊళ్లలోకి వదిలేయడంతోనే అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. యాసిడ్, కెమికల్స్‌ను అక్కడే భూగర్భంలో వదిలేయడంతో భూగర్భజలాలు మొత్తం కలుషి తమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి ఫలితంగా గ్రామస్తుల్లో చాలామందికి ఒళ్లంతా దురదలు, చర్మవ్యాధులు.. గుళ్లలు, బొబ్బలు, ఆయింట్మెంట్ వాడినా పోని మచ్చలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇదే విషయమై తారకరామానగర్‌కే చెందిన శ్రీనివాసాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్యాక్టరీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేలాదిమంది గ్రామస్తుల ప్రాణాలంటే యాజమాన్యానికి లెక్కేలేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక దన్నుతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇన్నాళ్లూ కాలుష్య శాతం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దాచేశారని ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన మహిళ నాగరత్నమ్మ మాట్లాడుతూ బోరు నీళ్లలో చిలుము వాసన వస్తుందని చెప్పుకొచ్చారు. నీళ్లను వేడి చేస్తే పాత్ర కింద తెల్లగా మడ్డి పేరుకుపోతోందని వాపోయారు. రెండు చెరువులు మాయం ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యపు భూతంతో గ్రామస్తులు అల్లాడిపోతుంటే... మరోవైపు ఊళ్లలో ఉన్న చెరువులను సైతం మింగేసిన అమరరాజా యాజమాన్యం దందాలతో అక్కడి ప్రజలకు నీటిసౌకర్యం కూడా కరువైంది. తారకరామానగర్‌లోని 137 సర్వే నెంబర్లోని 28 ఎకరాల చెరువును చెరబట్టేసిన అమరరాజా ఫ్యాక్టరీ.. మరో నాలుగు ఎకరాల చెరువును పూర్తిగా ధ్వంసం చేసేసింది. చెరువు రూపు రేఖలు మార్చేసి రోడ్లు వేసేసింది. మంచినీటి కోసం బోరింగ్ వద్ద వృథాప్రయాస పడుతున్న ఈమె పేరు కల్పన.. గృహిణి, తారకరామానగర్ వాసి.. ఊరిలో ఇలాంటి బోర్లు చాలానే ఉన్నా ఎక్కడా మంచినీరు రాదు.. ఊరి చివర సుందరయ్యనగర్ సమీపాన ఉన్న ఈ బోరు నీరు చూస్తే పొరబాటున కూడా అవి తాగాలని అనిపించవు. ఎరుపు రంగుతో కూడిన కాలుష్యపు ధార అది. -
పాతిక శాతం పాపం అమెరికాదే!
భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ఓ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి అనంతమైనది. అత్యద్భుతమైనది. ప్రకృతి వనరులే ఏ జీవికైనా ప్రాణప్రదాలు. భూగోళం అంటే మట్టి మాత్రమే కాదు. శతకోటి జీవరాశులకు.. జీవవైవిధ్యానికి పుట్టిల్లు. మనుషులకు మాత్రమే కాదు.. మొక్కలు, జంతువులు, చేపలు, పక్షులు, వానపాములు, పురుగులు, సూక్ష్మజీవులు.. ఇంకా ఎన్నెన్నో జీవజాతులకు ఇదే ఆవాసం. మానవ జాతి సంతతి పెరుగుతున్న కొద్దీ.. ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ ప్రకృతి వనరుల వినియోగం విచక్షణారహితంగా పెరిగిపోతోంది. ఈ లోటును ఏ యేటి కాఏడు తిరిగి పూడ్చుకునే శక్తిని సైతం భూగోళం కోల్పోయింది. 1970 నుంచి గాడి తప్పింది. ప్రకృతి వనరులపై మనుషుల వత్తిడి 1970–2014 మధ్యకాలంలో రెట్టింపైంది. ఎండలు, తుపానులు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాల సంఖ్య, తీవ్రత ఏటేటా పెరిగిపోతున్నాయి. జీవవైవిధ్యం గతమెన్నడూ లేనంత వేగంగా నశిస్తోంది. పక్షులు, చేపలు, ఉభయచరాలు తదితర జీవుల సంతతి ఇప్పటికే 68%కి పైగా ఈ కాలంలో నశించిందని ఒక అంచనా. ఇప్పటి మాదిరిగా ప్రకృతి వనరుల వాడకం తాకిడిని తట్టుకోవటానికి ఒక్క భూగోళం చాలదు, 1.6 భూగోళాలు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మూలుగను పీల్చేయటం ఇదే రీతిలో కొనసాగితే 2050 నాటికి మనకు మూడు భూగోళాలు అవసరం అవుతాయి. కానీ, ఉన్నది ఒక్కటే! అందుకే, పెను ప్రమాదంలో పడిన పుడమిని రక్షించుకోవాలి. భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చని, పరిశుద్ధమైన, ఆరోగ్యదాయకమైన, జీవనయోగ్యమైన భూగోళాన్ని అందించాలంటే ఇప్పుడు మన ఆలోచన మారాలి. అనుదిన జీవనంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల్లో ఈ స్పృహను కలిగించే దిశగా సాక్షి మీడియా గ్రూప్ కదులుతోంది. తన వంతు బాధ్యతగా ‘పుడమి సాక్షిగా..’ పేరిట చిరు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ముచ్చటా మూడు లక్ష్యాలు.. 1. భూతాపం పెరగటం వల్ల కలుగుతున్న దుష్ఫలితాల గురించి తెలియజేయటం. 2. పర్యావరణ సంబంధమైన ముప్పు నుంచి బయటపడటానికి ఎవరి వారు చేయదగిన పనులను సూచించడం, సాధించగల లక్ష్యాలతో పనిచేయడానికి ప్రజలను ప్రేరేపించటం. 3. చేపట్టిన పనుల్లో పురోగతిని గురించి అందరం నిరంతరం అనుభవాలను పంచుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకునేందుకు దోహదపడటం. ఈ కృషిలో భాగమే మీ చేతుల్లో ఉన్న ప్రత్యేక ‘ఫన్డే’ సంచిక. పుడమిని ప్రభావితం చేసే వివిధ ఆలోచనలను, ప్రకృతికి అనుకూలమైన కొన్ని పనుల గురించి ఇందులో చర్చిస్తున్నాం. ‘సాక్షి’ టీవీలో ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్ కార్యక్రమం ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రసారం అవుతుంది. భూగోళం క్షేమం కోసం పాటుపడే ఎందరో ఎర్త్ లీడర్స్, నిపుణులు, ప్రముఖులు, ప్రకృతి ప్రేమికులు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటారు.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా దీక్షతో కొనసాగించాలని ‘సాక్షి’ కంకణం కట్టుకుంది. www.pudamisakshiga.com వెబ్సైట్ ప్రారంభమైంది.. మీరూ పాలుపంచుకోండి.. రండి.. ‘పుడమి సాక్షిగా..’ ప్రణామం చేద్దాం.. మన కోసం మారుదాం.. కలసి కట్టుగా కదులుదాం.. భూతాపం పెచ్చుమీరటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించుకోవటానికి ఉన్నంతలో పూనికతో పనిచేయాలని ప్రపంచ దేశాలు ప్రతిన బూని ‘పారిస్ ఒడంబడిక’ చేసుకొని ఐదేళ్లు గడచిపోయాయి. ఆ లక్ష్యాలు కూడా అరకొరే. అవి కూడా అమలవుతున్నది అంతంత మాత్రమే. తత్ఫలితంగా 2019 వరకు గడచిన ఐదేళ్లూ ఏటేటా భూతాపం అత్యధిక స్థాయిలోనే పెరుగుతూ వచ్చింది. కరోనా వచ్చి మనల్ని నెలలకొద్దీ ఇళ్లకే పరిమితం చేసింది కాబట్టి, 2020లో భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు అంతకుముందు ఏడాది కన్నా 7% తగ్గాయి. అయితే, ఇది తాత్కాలికమే. ఈ గండం గడిస్తే, భూతాపోన్నతి కథ మళ్లీ మామూలేనా? వ్యక్తులు, ప్రభుత్వాల ప్రవర్తనలో ఏమైనా గుణాత్మకమైన మార్పు వచ్చే వీలుందా?? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పారిస్ ఒడంబడికకు మించి.. పారిశ్రామిక విప్లవ యుగానికి ముందు అంటే.. 1880ల నుంచి ఇప్పటికి 1.2 డిగ్రీల సెల్షియస్ మేరకు భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగింది. పారిస్ ఒడంబడికలో కుదిరిన అంగీకారం మేరకు ప్రపంచ దేశాలు ప్రకృతి వనరుల వాడకం తగ్గించుకుంటే ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించదని భావించారు. అయితే, వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను బట్టి చూస్తే 2100 నాటికి 2.6 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరుగవచ్చంటున్నారు. అయితే, ఆయా దేశాల్లోని ప్రభుత్వ విధానాల్లో విప్లవాత్మక మార్పు తేకుండా ఇలాగే కొనసాగితే వచ్చే 80 ఏళ్లలో భూతలంపై ఉష్ణోగ్రత 3.2% (2.9–3.9%) వరకు పెరిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరి పాపం ఎంతెంత? 2020లో వెలువడిన ఉద్గారాలు కొంచెం తక్కువైనా.. ఇప్పటికే వాతావరణంలో పోగు పడి ఉన్న హరిత గృహ వాయువులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందువల్లనే, గడచిన ఏడాది కూడా అడవులు తగలబడటం, కరువులు, తుపానులు, మంచుకొండలు కరిగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగిందే గానీ తగ్గలేదు. అడవుల నరికివేత వంటి భూమి వినియోగ పద్ధతి మార్చటం వల్ల వెలువడిన ఉద్గారాలను ఇందులో కలపనే లేదు. ఎంత ‘అభివృద్ధి’ చెందిన వారమైతే ప్రకృతికి అంత ఎక్కువగా చేటు చేస్తున్నాం. ప్రపంచ జనాభాలో 50% ఉన్న పేదల మూలంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల కన్నా.. జనాభాలో 1% ఉన్న అతి సంపన్నులు చేస్తున్న ప్రకృతి వ్యతిరేక పనుల వల్ల వెలువడే ఉద్గారాలే ఎక్కువ అని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (యుఎన్ఇపి) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ నివేదిక చెబుతోంది. 2019 ఉద్గారాలు 59 బిలియన్ టన్నులు యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ నివేదిక 2020 ప్రకారం.. 2019లో భూగోళం ఉపరితల వాతావరణంలోకి చేరిన (బొగ్గు పులుసు వాయువుతో సమానమైన) కర్బన ఉద్గారాలు 59.1 గిగా టన్నులు. 59.1 గిగా టన్నులంటే 59.1 బిలియన్ టన్నులు (ఇంకా విడమర్చి చెప్పాలంటే.. 5,910 కోట్ల టన్నులు). 2019లో ప్రపంచ ఉద్గారాలలో మన దేశం వాటా 7%. గత పదేళ్లలో విడుదలైన ఉద్గారాలలో 55% మన దేశంతోపాటు చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలే కారణమని యుఎన్ఇపి నివేదిక తెలిపింది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. కరోనా నేర్పిన గుణపాఠంతోనైనా ఇది సాధ్యమవుతుందా? ప్రకృతికి హాని కలిగించే నాలుగు పనుల్లో కనీసం ఒక్కదాన్నయినా మానుకోగలుగుతామా అని పర్యావరణ శాస్త్రవేత్తలు మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2050 నాటికి ఉద్గారాలను భూగోళానికి, మన జీవనానికి ప్రమాదం లేని స్థాయికి తగ్గించుకోవటానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని 51% ఉద్గారాలను వదులుతున్న 127 దేశాలు చెబుతున్నాయి. అయితే, ఈ మాటలు ఆయా దేశాల పారిశ్రామిక, ఇంధన, వ్యవసాయ తదితర తక్షణం అమల్లోకి తేగల విధానాల్లోకి ఎంతవరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. ఏం చెయ్యగలం? ఆశ ఇప్పటికీ బతికే ఉంది. భారత్ సహా కాలుష్య కారక దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో పెనుమార్పులు చేసుకొని ఇప్పటికైనా ఏటా 7.2% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవాలి. 2030 నాటికల్లా వార్షిక ఉద్గారాలు 25% తగ్గించుకోవాలి. తద్వారా వచ్చే పదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతను 3.2 డిగ్రీల నుంచి 2 డిగ్రీలకు పరిమితం చేసుకోగలిగే అవకాశాలు 66% మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జరగాలంటే.. ప్రపంచ దేశాలు విద్యుత్తు వాడకంలో నైపుణ్యం పెంచుకోవాలి. సౌర, పవన విద్యుత్తుల వినియోగం వైపు మళ్లాలి. పరిశ్రమలు పునరుత్పాదక ఇంధనాల వాడకం దిశగా కదలాలి. మీథేన్ విడుదల తగ్గించాలి. వాహన కాలుష్యం తగ్గించడానికి రవాణా రంగంలో విద్యుత్తు, సౌర విద్యుత్తుతో నడిచే వాహనాల సంఖ్య పెంచాలి. వ్యవసాయ, నిల్వ పద్ధతులు ప్రకృతికి అనుగుణంగా మారాలి. ఆహార వృథాను తగ్గించాలి. మాంసాహారం తగ్గించి శాకాహారంపై ఎక్కువ ఆధారపడటం నేర్చుకోవాలి. అడవుల నరికివేత ఆపి, అడవుల విస్తీర్ణం పెంచాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి. ప్రతి టెర్రస్పైనా సేంద్రియ ఇంటిపంటల సాగు విస్తరించాలి.. ఇలా చేస్తే నగరాల్లో గాలి నాణ్యత, నీటి లభ్యత పెరుగుతాయి. జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతాయి. ఏతావాతా చెప్పేదేమంటే.. ప్రభుత్వాలతో పాటు వ్యక్తిగా ప్రతి ఒక్కరి ఆలోచన, జీవనశైలి ప్రకృతికి అనుకూలంగా మారాలి. మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవికమైన ఉద్గారాల తగ్గింపు చర్యలను తక్షణం అమల్లోకి తేగలగాలి. అప్పుడే మనతోపాటు భూగోళంపై సమస జీవుల మనుగడ మరీ అధ్వాన్నమైపోకుండా మిగులుతుంది. ఇందుకోసం ‘పుడమి సాక్షిగా’ ప్రతిన బూని, పూనికతో కదులుదాం. - పంతంగి రాంబాబు భూతాపోన్నతి అంటే? మనం చేసే పనుల వల్ల పంచభూతాలు కలుషితం అయిపోతున్నాయి. బొగ్గు, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించటం వల్ల కలుషిత వాయువులు (కర్బన ఉద్గారాలు) వాతావరణంలో విడుదలై భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలోకి చేరిన ఉద్గారాలకు ప్రతి ఏటా మరికొన్ని ఉద్గారాలు తోడవుతున్నాయి. వాటి పరిమాణం అంతకుముందు ఏడాది కన్నా ఎక్కువగానే ఉంటున్నది. వాతావరణంలోకి చేరిన ఈ హరిత గృహ వాయువులు భూతాపానికి కారణమవుతున్నాయి. భూమి పై నుంచి వేడిని అనంత విశ్వంలోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటూ ఉన్నాయి. అందువల్ల భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఉష్ణోగ్రత అసహజంగా పెరిగిపోతోంది. దీన్నే భూతాపోన్నతి (క్లైమెట్ ఛేంజ్) అంటున్నాం. మనుషులందరూ భూతాపం పెరుగుదల నిదానించేలా చేయగలిగితేనే భవిష్యత్తులో మనతోపాటు సకల జీవరాశి మనుగడా బాగుంటుంది. ప్రకృతికి హాని కలిగిస్తున్న పనులేవో గుర్తించి, వాటిని తగ్గించుకోవటం ఒక్కటే మార్గం. కాలుష్య ప్రతాపం కనీసం 300 ఏళ్లు మనిషి సగటు జీవిత కాలం మహా అయితే వందేళ్లు. కానీ, మనిషి వల్ల భూమ్మీద ఏర్పడుతున్న కలుషిత వాయువుల జీవిత కాలం అంతకు 3 నుంచి 10 రెట్లు ఎక్కువ. ఏ ఏడాది భూతల వాతావరణంలోకి చేరే కర్బన ఉద్గారాలు ఆ యేడాదే అంతమైపోవు. కనీసం 300 నుంచి 1,000 ఏళ్ల పాటు వాతావరణంలోనే తిష్ట వేసి భవిష్యత్తు తరాలకు చుక్కలు చూపిస్తాయి. పారిశ్రామిక యుగం (క్రీ.శ.1750) ప్రారంభమైనప్పటి నుంచి కర్బన ఉద్గారాల విడుదల మొదలైంది. తొలి పారిశ్రామిక దేశం యునైటెడ్ కింగ్డమ్. కాలుష్య కారక తొలి దేశం కూడా ఇదే. క్రీ.శ. 1751లో మొదటి ఏడాది వాతావరణంలోకి యు.కె. వెలువరించిన కర్బన ఉద్గారాలు దాదాపు కోటి టన్నులు. ప్రపంచ దేశాలన్నిటి ఇప్పటి ఉద్గారాల కన్నా 3,600 రెట్లు తక్కువ. అప్పటి నుంచీ పారిశ్రామికీకరణ అన్ని దేశాలకూ విస్తరించింది. జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలూ పెరుగుతున్నాయి.. ఏటేటా అంతకు ముందెన్నడూ లేనంతగా కర్బన ఉద్గారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పాతిక శాతం కాలుష్య పాపం అమెరికాదే! యు.కె.తో ఉద్గారాల జాతర మొదలైనా ఆ తర్వాత కాలంలో పారిశ్రామికీకరణలో అమెరికా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అతి ఎక్కువగా కాలుష్య కారక వాయువులను విడుదల చేస్తూ వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ క్రీ.శ. 1751 నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకూ విడుదల చేసిన (క్యుములేటివ్ ఎమిషన్స్) ఉద్గారాల్లో 25% బాధ్యత అమెరికాదే. ఈ 269 ఏళ్లలో అమెరికా అత్యధికంగా దాదాపు 400 బిలియన్ టన్నుల ఉద్గారాలను వాతావరణంలోకి వదిలింది. అమెరికా ఉద్గారాల్లో సగం మేరకు వదిలిన చైనా రెండో స్థానంలో ఉంది. 22%తో 28 ఐరోపా దేశాల కూటమి మూడో స్థానంలో ఉంది. కాలుష్య పాపం చారిత్రకంగా చాలా తక్కువే అయినప్పటికీ, ఇవ్వాళ ఎక్కువగా ఉద్గారాలు వదులుతున్న దేశాల జాబితాలోకి భారత్, బ్రెజిల్ కూడా చేరుకున్నాయి. చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌లోని 28 దేశాల తర్వాత మన దేశమే అత్యధికంగా ఉద్గారాలను వెలువరిస్తోంది. గత దశాబ్ద కాలంలో వెలువడిన ఉద్గారాల్లో 55% ఈ 31 దేశాల నుంచి వెలువడినవే. అప్పుడు, ఇప్పుడూ కూడా అతి తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తున్న ఖండమేదైనా ఉందీ అంటే అది ఆఫ్రికా మాత్రమే. -
ఆకాశంలో బ్లాక్ రింగ్.. ఏలియన్స్ వచ్చేశారు!
లాహోర్ : పాకిస్తాన్‌లోని లాహోర్ ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. నల్లరంగులో ఉన్న వింత ఆకారం ఒకటి ఆకాశంలో తేలియాడుతూ కనిపించింది. మేఘం మాదిరి గగనతలంలో తేలియాడుతున్న బ్లాక్ రింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలుష్యం కారణంగా బ్లాక్ రింగ్ ఏర్పడిందని కొందరు పేర్కొనగా.. వినాశనానికే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మానవుడు చేస్తున్న కాలుష్యం వల్లే ఆకాశంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంకొంత మంది నెటిజన్లు పేర్కొన్నారు. లాహోర్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్లే పొగ అంతా వలయాకారంలో మారి ఆకాశంలో తేలియాడుతున్నదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తు జోకులు పేలుస్తున్నారు ‘ ఇది కచ్చితంగా ఏలియన్స్ పనే.. వాళ్లు వచ్చేస్తున్నారు’, ఏలియన్స్ పాకిస్తాన్‌లోని వెళ్లరు. కచ్చితంగా వారు అమెరికాలోనే ల్యాండ్ అవుతారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఆక్సిజన్ ఫర్ సేల్!
-
దీపావళికి పర్యావరణహిత టపాసులు
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది. -
ఢిల్లీలో మళ్లీ కోరలు చాస్తోన్న కాలుష్య రక్కసి
-
‘యాదాద్రి’ @ జీరో కాలుష్యం!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ‘జీరో కాలుష్య’కారక ప్రాజెక్టుగా నిర్మిస్తున్నామని తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు వల్ల గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పరిరక్షించేందుకు రూ.5,597.44 కోట్ల వ్యయంతో పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ప్రకటించాయి. దీనికి అదనంగా కాలుష్య వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఏటా రూ.430 కోట్లను కాలుష్య నివారణకు ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పురోగతిపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశంనిర్వహించారు. యాదాద్రి ప్లాంట్‌తో పర్యావరణం, మానవులు, జంతువులకు ఎలాంటి హానీ ఉండదని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర అనుమతులతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుతో 10 వేల మందికి ప్రత్యక్ష, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్ర అవసరాల కోసం వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానిస్తే 500 మెగావాట్లకే స్పందన లభించిందని, యూనిట్‌కు రూ.5 నుంచి రూ.10.50 ధరతో విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. యాదాద్రి ప్లాంటు నిర్మిస్తే యూనిట్ ధర రూ.4.87తో విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును రూ.29,965 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా ఇప్పటి వరకు రూ.2,800 కోట్లతో పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.లక్ష కోట్లకు పెరుగుతుందని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, పెరిగితే స్వల్పంగా 10 శాతం వరకు పెరగొచ్చని చెప్పారు. నెలాఖరులోగా కేటీపీఎస్ విద్యుదుత్పత్తి పాల్వంచలో తలపెట్టిన 800 మెగావాట్ల కొత్త గూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీఎస్) నిర్మాణం 41 నెలల రికార్డు సమయంలో పూర్తి కానుందని చెప్పారు. ఇదే నెలలో ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించారు. మణుగూరులో నిర్మి స్తున్న 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తొలి రెండు యూనిట్లను వచ్చే ఏడాది మార్చిలోగా, మిగిలిన రెండు యూనిట్లను మరో రెండు మూడు నెలల విరామం తర్వాత విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో రెండో స్థానం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగి 10,818 మెగావాట్లకు చేరుకుందని, డిమాండ్ 11,500 మెగావాట్లకు పెరిగినా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌తో పాటు సాగు ఆయకట్టు సైతం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలో దక్షిణాదిన తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాల నుంచి 2,560 మెగావాట్లకు బదులు 1,400–1,600 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లకు బదులు 350 మెగావాట్ల సరఫరా మాత్రమే జరుగుతోందని, 540 మెగావాట్లు సరఫరా చేసే ఓ ప్లాంట్ నుంచి ఉత్పత్తి సైతం ఆగిపోవడంతో మొత్తం 2300 మెగావాట్ల లోటు ఏర్పడిందని ప్రభాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, వెంకటరాజం, బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముఖోపాధ్యాయ, బాల సుబ్రమణ్యం, తపాస్ మౌజుందార్, షకీల్ మోనాచీ తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్ స్టార్ కంపెనీ కాలుష్య సమస్యగా ఉంది అన్న
-
పులికాట్‌ను మింగేస్తున్న కాలుష్య భూతం
ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడి.. అందాల తీరంగా ఉన్న పులికాట్.. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో సహజత్వానికి దూరమవుతోంది. జీవవైవిధ్యాన్ని కోల్పోతోంది. మత్స్య సంపద తగ్గిపోతోంది. సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటం వల్ల మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతుంది. వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో సెలైనిటీ శాతం 65 శాతం దాటిపోతోంది. ఇది మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉత్పత్తి ఐదువేల టన్నుల నుంచి రెండువేల టన్నులకు పడిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని మత్స్యకారులు జీవన పోరాటం చేస్తున్నారు. సూళ్లూరుపేట (నెల్లూరు) : ఆంధ్రా – తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సు తీరప్రాంతంలోని మత్స్యకారులు నిత్యం జీవన పోరాటం చేస్తున్నారు. ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 20 వేలకు మందికి పైగా మత్స్యకారులు చేపలవేటే ప్రధానవత్తిగా జీవనం సాగిస్తున్నారు. అంటే దాదాపుగా 20 వేల మందికిపైగా సరస్సు అన్నం పెడుతోంది. 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది. గతంలో సుమారు 3 వేల నుంచి 5 వేల టన్నులు చేపలు, రొయ్యలు, పీతలు పట్టేవారు. ప్రస్తుతం రెండు వేల టన్నులు మత్స్యసంపద మాత్రమే దొరుకుతున్నట్లు జాలర్లు లెక్కలు చెబుతున్నాయి. సరస్సు జీవవైవిధ్యాన్ని కోల్పోయి కాలుష్యకోరల్లో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోతుండటంతో మత్స్యసంపద కూడా నానాటికి తగ్గిపోతూ వస్తోంది. వర్షాలు బాగా కురిసినప్పుడు నదులు, కాలువల నుంచి వచ్చే మంచినీరు, సముద్ర ముఖద్వారాల నుంచి వచ్చే ఉప్పునీరు కలవడంతో ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి చెందుతోంది. ఆ సమయంలో పులికాట్ సరస్సులో 45 శాతం సెలైనిటీ (ఉప్పుశాతం) ఉండటంతో మత్స్యసంపద పెరగడానికి దోహదపడుతోంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో వర్షాభావంతో మంచినీళ్లు సరస్సుకు చేరడంలేదు. కేవలం ఉప్పునీళ్లు మాత్రం ఉండటంతో సెలైనిటీ 65 శాతం పైగా దాటి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో మత్స్య సంపద వృద్ధి చెందడం లేదని జాలర్లు అంటున్నారు. తరచూ వివాదాలే.. సరస్సులో నీరు తగ్గినప్పుడల్లా సరిహద్దు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ç1983 సంవత్సరం నుంచి వివాదాలున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్తరంవైపు సరస్సు పూర్తిగా ఎడారిలా మారింది. దీంతో మన రాష్ట్రానికి చెందిన జాలర్లు ఇక్కడ మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణం వైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో మత్స్య సంపద దొరుకుతుండటంతో అక్కడికి వెళుతున్నారు. అయితే ఈ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాంగోడు కుప్పం, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలలు ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులు చూపించమని 1989 నుంచి మత్స్యశాఖ అధికారులు, అందుకు సంబంధించిన మంత్రుల వద్దకు తిరుగుతున్నా ఫలితం లేదు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన జాలర్లు సరిహద్దు వివాదాలతో కుమ్ములాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 1989లో రెండు రాష్ట్రాల మధ్య జాలర్లకు భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. అటు తర్వాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రం ఎంత ఉంది?, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? అనే అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా చెల్లించారు. 1994లో సర్వే చేయాలని మన రాష్ట్ర అధికారులు సిద్ధమవగా తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో ఆగిపోయింది. తర్వాత ఈ వివాదం తరచుగా కొనసాగుతూనే ఉన్నా 2007లో రెండు రాష్ట్రాల మత్స్య శాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాలు కార్యరూపంలోకి రాకపోవడంతో వివాదం ఇంకా ఉంది. పూడికతీత పనులు గాలికి.. తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారాన్ని ప్రతిఏటా ఇసుకమేటలు తొలగించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల దక్షిణ భాగం సరస్సు ఎప్పుడూ జలకళతో ఉంటుంది. వాకాడు మండలం రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలు మూసుకుపోవడంతో వేసవి కాలంలో ఉత్తరవైపు సరస్సు ఎడారిలా మారింది. తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలకు పూడిక తీయించాలని ఆందోళనలు చేశారు. దీనిపై 2007లో కేంద్ర డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఓషన్ టెక్నాలజీ అధికారులు, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు వచ్చి ముఖద్వారాలను పరిశీలించారు. 2007లో మెరైన్ ప్రదేశాల యాజమాన్య సంస్థ దీనిపై బేస్‌లైన్ సర్వే చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లతో అంచనాలు వేసి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. అయితే దీనికి సుమారు రూ.10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఇందులో మొదట విడుతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేనెలలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీని తర్వాత దుగ్గరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక మాట కొండెక్కేసింది. పరిశ్రమల కాలుష్యంతోనే.. తమిళనాడు పరిధిలో ఎళ్లావూరు, గుమ్మిడిపూండి, తడమండలం ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు పెరిగిపోయి ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఈ కంపెనీల నుంచి వ్యర్ధాలుగా వచ్చే నీళ్లు, కాలుష్యం సరస్సుకు వదిలేయడంతో సహజత్వాన్ని కోల్పోతూ వస్తోంది. అదే వి«ధంగా ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పన్నంగాడు సమీపంలో అధికంగా రొయ్యల సాగు చేస్తున్నారు. తీరప్రాంతానికి సుమారు 5 కిలోమీటర్లు మేర రొయ్యలసాగు చేయకూడదనే నిబంధన ఉన్నా వాటిని తమిళనాడుకు చెందిన వారు పట్టించుకోకుండా రొయ్యలు సాగు చేస్తున్నారు. మడఅడవులు అంతరించిపోవడంతో సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయిందని జాలర్లు చెబుతున్నారు. అదే విధంగా శ్రీహరికోట దీవిలో రాకెట్ కేంద్రం ఏర్పాటుతో సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు పులికాట్ సరస్సును రెండుగా చీల్చి రోడ్లు వేయడంతో దీని సహజత్వం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత ప్రజావసరాల నిమిత్తం పేరుతో దొరవారిసత్రం మండలం వేలికాడు, కారికాడుకు రోడ్డు, తడమండలం వేనాడు, సూళ్లూరుపేట మండలం పేర్నాడు, చిట్టమూరు మండలంలో కూడా పలు దీవులకు సరస్సులోనే రోడ్లు వేయడంతో ఉత్తరం వైపు సరస్సు ఐదు చీలికలుగా మారింది. దీంతో ఉత్తరం వైపు భాగమంతా ఎడారిని తలపించే విధంగా ఎండిపోతోంది. దక్షిణం వైపు సరస్సు మాత్రం ఇప్పటికి నీళ్లు తగ్గినా నిండుగా కనిపిస్తుంది. దీంతో జాలర్లకు చేతి నిండా పనిలేకుండా పోయింది. చేపల వేటకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా వారు ప్రత్యామ్నాయ ఉపాధివైపు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రా జాలర్లుకు భృతి అందించాలి పక్కపక్కనే ఉన్న తమిళనాడు పరిధిలో పులికాట్ జాలర్లకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వేటలేని సమయంలో జీవనభృతి కోసం రూ.4 వేలు నగదుతో పాటు నిత్యావసరాలు కూడా అందుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రా జాలర్లుగా ఉన్న మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. గతేడాది నుంచి కరువు పరిస్థితుల నేపథ్యంలో వేటలేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో పస్తులతో కాలయాపన చేస్తున్నారు. : స్వామి, కాశింకాడుకుప్పం మహిళల సంపాదనతో.. ప్రస్తుతం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోవడంతో మూడురోజుల పాటు వేటసాగించినా పూటగడవడం లేదు. రొయ్యలు, పీతలు కోసం ఎన్నిరోజులు వలలువేసినా దొరకడం లేదు. దీంతో మా ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చిచేపలు, చెన్నై నుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట – పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా సరస్సులో సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. -కేసీ రమేష్, భీములవారిపాళెం కొత్తకుప్పం -
తాజ్‌మహల్‌ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్‌మహల్‌ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్‌మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్‌ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్‌మహల్‌ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్‌పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్ జిల్లా అధికారులు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు సీల్ వేశారు. 22 ఏళ్లుగా ఆందోళన వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. -
ఢిల్లీలో సరి–బేసి వాయిదా
న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధానిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ‘సరి–బేసి’ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, ద్విచక్ర వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహిళల భద్రతపై రాజీపడబోమన్న కేజ్రీ సర్కారు.. సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ మినహాయింపులకు ఎన్జీటీ అంగీకరించిన తర్వాత ‘సరి–బేసి’ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. ‘మహిళల భద్రతపై రాజీపడబోం. పీఎం 2.5, పీఎం 10 అనే కాలుష్య స్థాయిలూ కాస్తంత తగ్గాయి. కానీ ఎన్జీటీ నిర్ణయాలను గౌరవిస్తున్నాం. అయితే, సోమవారం మళ్లీ ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ వేస్తాం’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాల తర్వాత సీఎం కేజ్రీవాల్, పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సర్వీసులు ఓకే.. కానీ! ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఐదురోజుల పాటు సరి–బేసి విధానాన్ని అమలుచేయాలని తొలుత కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రమైన స్మాగ్ (పొగమంచు+కాలుష్యం) కారణంగా పాఠశాలలకు కూడా ఆదివారం వరకు సెలవులిచ్చింది. దీంతో సోమవారం నుంచి స్కూలు బస్సులు, ఇతర వాహనాలతో మళ్లీ కాలుష్యం పెరగొచ్చని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇందులో మహిళల వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటుగా అంబులెన్సు, చెత్త తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ మినహాయింపులపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. అంబులెన్సు, చెత్త వాహనాలు, ఫైరింజన్లకు మినహాయింపును సమర్థించిన ఎన్జీటీ.. మహిళలు, ద్విచక్ర వాహనాలకు అనుమతినివ్వాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ సర్కారు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చలికాలంలో వాహనాల ద్వారానే పెద్దమొత్తంలో పీఎం2.5, పీఎం10లు మామూలు సమయం కన్నా 20–25 శాతం ఎక్కువగా వెలువడతాయని ఐఐటీ కాన్పూర్ గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టుపై ఎన్జీటీ ఆగ్రహం ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులను సరిగా నిర్వహించటం లేదని.. దీని కారణంగా ఈ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఎన్జీటీ మండిపడింది. ‘మీ బస్సులు రోడ్లపై పెద్ద శబ్దం చేస్తూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. చాలావరకు బస్సుల్లో కనీసం హ్యాంగర్లు ఉండవు. బస్సులను నిర్వహించటంలో బాధ్యతగా వ్యవహరించరెందుకు?. కొన్ని సార్లు ఖాళీగా వెళ్తున్నాయి. మరికొన్ని సార్లు రద్దీగా ఉంటున్నాయి’ అని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ మండిపడ్డారు. తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో మినీ బస్సులు నడపాలని గతంలో ఎన్జీటీ సూచించింది. వీటిని పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదకర స్థాయిలోనే కాలుష్యం దేశరాజధానిలో గాలిలో విషపదార్థాలు, కాలుష్యకారకాల స్థాయి ఇంకా ప్రమాదకరస్థితిలోనే ఉంది. వరుసగా ఐదోరోజూ అదే స్థాయిలో పొల్యూషన్ కనిపించింది. కాస్త కుదురుకుంటుందనుకున్న తరుణంలో.. శనివారం సాయంత్రం పరిస్థితుల్లో మార్పు నగరాన్ని ‘కాలుష్య అత్యవసర’ దిశగా తీసుకెళ్లింది. పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం ప్రకటించిన కాసేపటికే.. పరిస్థితి భిన్నంగా మారింది. వేగంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడటమే ఇందుకు కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు తెలిపారు. దీనివల్ల అనారోగ్య పరిస్థితులు తీవ్రమవుతాయని హెచ్చరించారు. సీపీసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వాయు నాణ్యత సూచీ 423 (మొత్తం 500) యూనిట్లుగా నమోదవగా.. పీఎం2.5 స్థాయి 422కు చేరుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో యూపీలోని ఘజియాబాద్ అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ వాయు నాణ్యత సూచీ 484 యూనిట్లుండగా.. పీఎం 2.5 స్థాయి 869 యూనిట్లకు చేరింది. సాధారణ స్థాయికన్నా ఇది 34 రెట్లు ఎక్కువ.