Ramayampet
-
నాలుగేళ్లుగా వీడని బాలుడి అదృశ్యం మిస్టరీ?
సాక్షి, మెదక్: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద నాలుగేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కుమారుడి కోసం తండ్రి తల్లడిల్లుతున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతడి రెండేళ్ల కుమారుడు అఖిల్ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఏపని చేసుకోలేక విధిలేని పరిస్థితుల్లో కపూర్య భిక్షాటన ఎంచుకున్నాడు. కొడుకు, భర్తను వదిలి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భిక్షాటనచేస్తూ తన కుమారుడితోపాటు రామాయంపేట వచ్చి కపూర్య కొద్దిరోజులపాటు ఇక్కడే గడిపాడు. అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య అక్కడ రైళ్లలో భిక్షాటనచేస్తూ రాత్రి స్టేషన్ ఆవరణలో నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి కుమారుడు అఖిల్‌ను అపహరించుకపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే కుమారుడు కనిపించకపోవడంతో రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాకబు చేసినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్నవారు బాలుడిని అపహరించుకపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కాగా మహారాష్ట్ర, ఇతర దూరప్రాంతాల వారు రైలులో ప్రయాణిస్తున్నవారే బాలుడిని అపహరించుకపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
తల్లీకొడుకును బలిగొన్న ప్రేమ
సాక్షి, మెదక్: ఓ యువకుడి ప్రేమ వ్యవహారం ఇద్దరిని బలిగొంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది యువకుడు మూడు రోజల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి శుక్రవారం తెల్లవారు జామున చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్ (21) నార్సింగికి చెందిన బాలికను ప్రేమించి రెండు నెలలక్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 14వ తేదీన ఆ అమ్మాయి మేజర్‌కాగా, తన ఇంటికి రావాలని శివకుమార్ పలుమార్లు ఫోన్‌చేసినా ఆమె స్పందించలేదు. దీనితో మనస్తాపానికి గురైన శివకుమార్ మూడు రోజలక్రితం పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లడిల్లిన తల్లి వరలక్ష్మి (42) మూడు రోజులుగా నిద్రాహారాలు మాని విలపించసాగింది. అందరూ నిద్రించిన తరువాత శుక్రవారం తెల్లవారుజామున పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. భార్య, కుమారుడి మరణంతో భర్త లక్ష్మణ్ మాత్రమే మిగిలాడు. ఎస్ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చితి పేర్చి.. నిప్పంటించి
రామాయంపేట, నిజాంపేట (మెదక్): చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధునిపై అయినవారే హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చల్మెడ గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ సోదరి భూదేవికి ముగ్గురు కుమారులున్నారు. కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుదర్శన్ తమపై చేతబడి చేస్తున్నాడని కొన్నేళ్లుగా భూదేవి కుటుంబ సభ్యులు అనుమానిస్తూ, అతనిపై కక్ష పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం భూదేవి పెద్ద కోడలు అనారోగ్యానికి గురైంది. సుదర్శన్ చేతబడి చేశాడని అనుమానించారు. రెండు కుటుంబాల మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. శనివారం ఉదయం భూదేవి ఆమె ముగ్గురు కొడుకులు, మరికొందరు సుదర్శన్ ఇంటికి వచ్చి దొరికిన వారిని దొరికినట్లే కొట్టారు. సుదర్శన్‌ను బయటకు లాక్కొచ్చి అతడి ఇంటి ముందే కర్రలతో చితిపేర్చి పెట్రోల్ పోసి నిప్పటించారు. అదే సమయంలో ఓ కేసు విచారణ నిమిత్తం నిజాంపేట వచ్చిన పోలీసులు మంటలను ఆర్పి సుదర్శన్‌ను రక్షించారు. గాయపడిన సుదర్శన్‌ను 108 అంబులెన్సులో రామా యంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ మేజిస్ట్రేట్ బాధితుని వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులు ఒక్కరు కూడా హత్యాయత్నాన్ని అడ్డుకోలేదని బాధితులు వాపోయారు. -
మరుగుదొడ్డే ఆమెకు ఆవాసం ..‘ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి’
సాక్షి, మెదక్: అందరూ ఉన్న అనాథ. కుమారులు పట్టించుకోకపోవడంతో ఆసరా కరువై వృద్ధురాలు భిక్షాటనచేస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా చిన్న కుమారుడితో కలిసి రోడ్డు భవనాలశాఖకు చెందిన గెస్ట్‌హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటోంది. తల్లీకుమారుల దయనీయస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట పట్టణానికి చెందిన జెట్టి రామలక్ష్మి భర్త భాస్కర్ గతంలోనే మృతిచెందాడు. దీంతో ఆమె కష్టపడి కూలీపనులు చేసి ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. పెద్ద కుమారుడు తన భార్యాపిల్లలతో పక్క గ్రామంలోని అత్తగారింటిలో స్థిరపడ్డాడు. బీసీ కాలనీలో ఉంటున్న రెండో కొడుకు కూలీపనులు చేసుకుంటూ తన బార్యా పిల్లను పోషించుకుంటున్నాడు. మూర్చవ్యాధితో తరచూ అనారోగ్యానికి గురవుతున్న మూడో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి తల్లి రామలక్ష్మి బీసీ కాలనీలోని అద్దె ఇంటిలో నివాసం ఉండేది. అనారోగ్యంతో శ్రీనివాస్ సరిగా పనులు చేసుకోకపోవడంతో అతడి భార్య ఇద్దరు కూతుర్లను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో అద్దె ఇల్లు యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో రామలక్ష్మి తన కుమారుడితో పట్టణంలోని మెదక్ రోడ్డులో శిథిలమైన రోడ్డు భవనాల శాఖకు చెందినన గెస్ట్‌హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటుంది. కూలీ పనులు చేయాలన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో తల్లీకొడుకులు కొన్నాళ్లూ అర్థాకలితో గడిపారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రామలక్ష్మి భిక్షటన చేపట్టింది. తనకు వస్తున్న పించన్ డబ్బుతోపాటు భిక్షాటన ద్వారా వచ్చింది తింటూ తల్లీకొడుకులు కాలం గడపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు మందులకోసం ప్రతినెలా రూ.1500 ఖర్చవుతోందని వృద్ధురాలు వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గత నెలనుంచి మందులు కూడా వేసుకోవడంలేదని కంటతడి పెట్టింది. రెండు పడకల ఇళ్లు మంజూరు చేయాలి దయనీయ పరిస్థితిలో అర్థాకలితో అలమటిస్తున్న తల్లీకొడుకులు మూడు నెలలుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ప్రతిరోజూ పట్టణంలో భిక్షాటన చేస్తున్న రామలక్ష్మిని చూస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఎవరూ ఆసరా ఇవ్వకపోడంతో భిక్షాటన ఎంచుకుంది. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుచేయాల్సిన అవసరం ఉంది. ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి కొంతకాలంగా నేను, చిన్నకుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. అద్దె ఇంటిలో ఉండేవాళ్లం. ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో విధిలేక మరుగుదొడ్డిలో ఉంటున్నాం. పూటగడిచే మార్గంలేక సిగ్గువిడిచి భిక్షాటన చేస్తున్నా. పించన్ డబ్బులు, భిక్షాటన ద్వారా వస్తున్న డబ్బులు మందులకు కూడా సరిపోవడంలేదు. ప్రభుత్వపరంగా ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి. – జెట్టి రామలక్ష్మి, వృద్ధురాలు -
రామాయంపేటలో బంద్ ప్రశాంతం
రామాయంపేట (మెదక్)/సాక్షి, కామారెడ్డి: గంగం పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయనందుకు నిరసనగా మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రెండు పార్టీల కార్యకర్తలు పట్టణంలో వేర్వేరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. హోం శాఖ ఏం చేస్తోంది?: జగ్గారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని.. డీజీపీ, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడితే డీజీపీ, హోం శాఖ మంత్రి స్పందించరా’ అని ప్రశ్నించారు. కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయకపోతే బుధవారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇవి ప్రభుత్వ హత్యలే: ఈటల తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో కలిసి రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. సుదీర్ఘమైన అనుభవమున్న డీజీపీ ఐపీసీకి లోబడి పనిచేయట్లేదని, అయన సీఎం దగ్గర గులాంగిరి చేస్తున్నట్టు ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. దహన సంస్కారాలకు వచ్చిన వాళ్లను బెదిరిస్తున్నారు: కుటుంబీకులు అధికార పార్టీకి చెందిన నేతలను కేసు నుంచి తప్పించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సంతోష్, పద్మ కుటుంబీకులు ఆరోపించారు. అందుకే పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. కారకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. పద్మ భర్త అంజయ్య, కుమారులు శ్రీధర్, శ్రీనివాస్, కూతురు పావని, అల్లుడు తాటికొండ సతీశ్‌కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘నేతల భయంతో మా సామాజిక వర్గానికి చెందిన సభ్యులు కూడా పరామర్శకు రావడానికి జంకుతున్నారు. దహన సంస్కారం రోజు వచ్చిన వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు కొందరు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు. తమను పరామర్శించేందుకు లోకల్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా రాలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. చైర్మన్లు ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన చేయాలని అన్నారు. అదుపులో ఆరుగురు తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన నేతలు నిందితులు కావడంతో పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మంగళవారం రామాయంపేట బంద్ పాటించడం, విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వ పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. వెంటనే నిందితులు లొంగిపోయేలా ఆదేశాలివ్వడంతో వారు సరెండర్ అయినట్టు తెలుస్తోంది. నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా మీడియా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆరుగురిని వేరే ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం రిమాండ్‌కు పంపుతామని డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు. -
దోషులకు శిక్షపడేలా చూస్తాం
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డిలో తల్లీ కుమారులు గంగం పద్మ, గంగం సంతోష్‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు శిక్షపడేలా చూస్తామని బాధిత కుటుంబానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ నిచ్చారు. రామాయంపేటకు చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం ఆయన ఫోన్ చేసి పరా మర్శించారు. సంతోష్ తండ్రి అంజయ్య, సోదరు డు శ్రీధర్‌లతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఫోన్లో మాట్లాడించారని, ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని రేవంత్‌రెడ్డి వారికి చెప్పినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇంకా చాలా మంది తమలాంటి బాధితులున్నారని సంతోష్ కుటుంబసభ్యులు రేవంత్‌కు వివరించారని చెప్పాయి. -
రామాయంపేటలో 13 సెం.మీ. వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: గత 24 గంటల్లో మెదక్ జిల్లా రామాయంపేటలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా దోమకొండ, మెదక్ జిల్లా మెదక్‌లలో 5 సెం.మీ. చొప్పున, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో, కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట, మాచారెడ్డిలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. -
మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్ అరెస్టు
సాక్షి, మెదక్: మహిళను హత్య చేసి.. తగలబెట్టిన ఓ సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలంలో కొద్దిరోజుల క్రితం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సైకో కిల్లర్ నీరటి అరుణ్‌ను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్ తిరుమలగిరి, ఆర్మూర్ ప్రాంతాల్లో పలు హత్య కేసులు ఉన్నాయి. నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌పై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. -
ఆగని చిరుత దాడులు
రామాయంపేట(మెదక్): చిరుతల దాడుల పరంపర కొనసాగుతుంది. గత పదిహేను రోజులుగా ప్రతిరోజూ మండలంలోని ఏదో చోట చిరుత దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఆయా గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి చిరుతలు మండలంలోని అక్కన్నపేటలో రెండు, లక్ష్మాపూర్ పరిధిలో ఒక దూడను హతమార్చాయి. అక్కన్నపేటకు చెందిన వెల్ముల లక్ష్మి తన పశువులను అటవీప్రాంతానికి సమీపంలో పంటచేలవద్ద కట్టివేయగా, అర్థరాత్రి చిరుత దాడిచేసి రెండు దూడలను హతమార్చింది. ఉదయం లక్ష్మి తన పంటచేలవద్దకు వెళ్లి చూడగా, ఒక దూడ చనిపోయి ఉండగ, మరో దూడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపటి తరువాత మృతిచెందింది. మరో సంఘటనలో లక్ష్మాపూర్ గ్రామశివారులో చింత పోచయ్యకు చెందిన దూడను చిరుత ఎత్తుకెళ్లి హతమార్చింది. దీనితో రైతులు రాత్రి వేళలో పంట చేలవద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుతలను బంధించి తమను రక్షించాలని వారు అటవీశాఖ అ«ధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ శాఖ అధికారులు సంఘటనా స్థలిని సందర్శించారు. -
అదిగో చిరుత..!
రామయాయంపేట ప్రాంతంలో చిరుతలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి బారిన పడి ఇప్పటివరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 30 వరకు దూడలతోపాటు మేకలు హతమయ్యాయి. మండల పరిధిలో దాదాపు ఏదోఒక చోట ప్రతిరోజూ చిరుత దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 13 వరకు చిరుతలున్నాయి. వీటిలో రామాయంపేట మండల పరిధిలోనే ఏడుకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నా ఆ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టడం లేదు. చిరుతల బెడదతో రాత్రివేళ రైతులు పంటచేను కాపలాకు వెళ్లడానికి జంకుతున్నారు. అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, కాట్రియాల, ప్రగతిధర్మారం, పర్వతాపూర్, దంతేపల్లి పరి«ధిలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ అడవిలో చిరుతులు, ఎలుగుబంట్లు, నీల్గాయిలు, రేసు కుక్కలతోపాటు వేల సంఖ్యలో వివిధ రకాల జీవరాశులున్నాయి. ఈ అటవీప్రాంతంలో 13 వరకు చిరుతలున్నట్లు ఇటీవల నిర్వహించిన జంతుగణనలో తేల్చారు. కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్, గ్రామాలను మెదక్ అటవీశాఖ పరిధిలో చేర్చగా, మిగతా గ్రామాలు మండల అటవీ రేంజీ పరిధిలోనే ఉన్నాయి. రెండు, మూడు నెలల కాలంగా చిరుతలు దాడిలో పదుల సంఖ్యలో దూడలతోపాటు మేకలు, పశువులు హతమవుతున్నాయి. తొనిగండ్ల గ్రామంలో అత్యధికంగా ఎనిమిది దూడలతోపాటు మూడు మేకలను చిరుతలు హతమార్చాయి. రాత్రి వేళ బయటకు వెళ్లొద్దని దండోరా.. కాగా ఇటీవల చిరుతల దాడులు పెరిగిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ అడవి పందులు, దుప్పిలు పంట చేన్లను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ప్రతిరోజూ రాత్రివేళ చేన్ల కాపలాకు వెళ్తుంటారు. రెండు మూడు నెలల కాలంగా చిరుతల దాడులతో రైతులు చేన్ల కాపలాకు కూడా వెళ్లడం మానుకున్నారు. దీంతో పంట చేన్లు అడవి పందులు, దుప్పులు ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాత్రివేళల్లో పంటచేను కాపలాకు వెళ్లవద్దని ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. బోన్లకు చిక్కని చిరుతలు పశువులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్న చిరుతలను బంధించడానికిగాను అటవీశాఖ అధికారులు 15 రోజుల క్రితం ఝాన్సిలింగాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతంలో రెండు బోన్లను ఏర్పాటు చేసి కుక్కలను ఎరగా పెట్టారు. అయినా చిరుతలు మాత్రం చిక్కలేదు. వాటిని బంధించడానికిగాను మరిన్ని బోన్లు అవసరం కాగా, ఆ దిశగా ఆశాఖ అ«ధికారులు నిర్ణయించారు. చిరుతదాడిలో చనిపోయిన లేగదూడ కుక్కను ఎరగా ఏర్పాటు చేసిన బోను కాగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్దకు తాగునీటికోసం వస్తున్న చిరుతలను చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా చిరుతలను బందించి తమకు రక్షణ కల్పించాలని వారు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిరుతల దాడిలో మృతిచెందిన అన్ని పశువులు, మేకలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. జీవాలను అడవికి తీసుకెళ్తలేం.. అడవిల పులి తిరుగుతుందనే భయంతో జీవాలను మేతకు అడవిలోకి తీసుకెళ్తలేం. ఇప్పటికే చాలా జీవాలను పులులు చంపినయి. మేతకోసం జీవాలను మన్నెం తరలించినం. ఇక్కడ ఉంచితే ఏం లాభం లేదు. 15 రోజుల కిందట అడవిలో మేతకు వెళ్లిన మందలోనుంచి ఒక మేకను పులి ఎత్తుకపోతుండగా, కాపరి పులిని వెంబడిస్తూ కిందపడి గాయాలపాలయ్యాడు. – భీరయ్య, మేకల కాపరి,తొనిగండ్ల బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్న చిరుతలను బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు రామాయంపేట పరిధిలో రెండు బోన్లను ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. మరిన్ని బోన్లను ఏర్పాటు చేస్తాం. బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయడానికి కృషి చేస్తున్నాం. ఈమేరకు కొందరికి నష్టపరిహారం ఇప్పడికే అందించాం. రాత్రి వేళల్లో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. – పద్మాజారాణి, జిల్లా అటవీ అధికారి -
నువ్వేం రాణిస్తావన్నారు..?
తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఆమెది ప్రత్యేక స్థానం. తెలంగాణ సాధనలో పురుషులతో సమానంగా ఉద్యమించిన సాహసి. రాజకీయ నేపథ్యం లేకున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్న నాయకురాలు ఆమె. అసెంబ్లీని సజావుగా నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఉపసభాపతి.. ఆమె.. మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి. మహిళగా ఆమె రాజకీయ ప్రస్థానం భావితరాల మహిళలకు స్ఫూర్తిదాయకం. మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయరంగ ప్రవేశం తదితర అంశాలను తెలియజేస్తూనే మహిళా సాధికారత సాధన, స్త్రీ పురుష అసమానతలు, గృహహింస, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తదితర అంశాలపై సాక్షి తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి ప్రజాప్రతినిధులు ఉసన్యాసాలు ఇవ్వడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయినా మహిళ సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు సంబంధించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. మహిళా హక్కుల సాధనలో అమెరికా, యూరప్‌లాంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. మహిళా హక్కుల సాధనలో ఆదేశాల సరసన మనమూ నిలబడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు, మగ పిల్లల మధ్య తల్లిదండ్రులు అసమానతలను చూపించటం నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి. వారి మనోభావాలను గౌరవించాలి. మగ పిల్లలతో సమానంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణం, అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లలు ఎదగటంలో తల్లిదండ్రులతే కీలకపాత్ర. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రగులు గుర్తెరగాలని నా మనవి. అసమానతలు, వివక్షకు గురయ్యే మహిళలు దైర్యంగా ఎదుర్కొని తిప్పకొట్టాల్సిన అవసరం ఉంది. మహిళలు రాజకీయాల్లో రావాలి.. ఆకాశంలో సగ భాగమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోంది. అలాగే రాజకీయరంగంలోనూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజకీయ రంగం అంటరానిదేమి కాదు. చదువుకున్న యువతులు, సామాజిక స్ప్రహా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మహిళలు తమంతట తాము రాజకీయాల్లోకి వచ్చే సానుకూల పరిస్థితులు దేశంలో లేవు. ఈ పరిస్థితి మారాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మహిళలు రాజకీయాల్లోకి రావడం ఆరంభమైంది. ప్రస్తుతం తెలంగాణలోని మహిళా శాసనసభ్యులు తమ నియోజకవర్గ అభివృద్ధికి పాలుపడుతూనే మహిళా సమస్యలపైనా స్పందిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా శాసనసభ్యులు తమవంతు పాత్ర పోషించటం ముదావాహం. ధైర్యం ముందుకు సాగాను మహిళవు నువ్వు రాజకీయాల్లో ఏం రాణిస్తావని మొదట కొంత మంది నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నా భర్త దేవేందర్‌రెడ్డి, మా అమ్మ నన్ను రాజకీయాల్లో ప్రవేశించేలా ప్రోత్సహించారు. రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేను ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. అయినా ఎక్కడా వెరవలేదు. ధైర్యం ముందుకు సాగాను. ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాను. నా పోరాటస్ఫూర్తి నచ్చి ప్రజలను మూడు పర్యాయాలు నన్ను శాసనసభకు పంపారు. ప్రత్యేక మహిళా పోలీస్టేషన్లతో.. మహిళలను గౌరవించాలన్న ఆలోచనను కన్నతల్లి మగపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ‘షీ టీమ్స్’ ఏర్పాటుతో మహిళలపై వేధింపులు, దాడులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్టేషన్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటం సంతోషదాయకం. ప్రతీ ఆడపల్లిను తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం మానుకోవాలి. మహిళలు ఆత్మన్యూనతను వీడి పురుషులతో సమానంగా పోటీ పడాలి. విద్య, ఆర్థిక స్వావలంభనతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ప్రతి ఆడపల్లి ఉన్నత చదువులు చదవాలి. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ధైర్యం నూరిపోయాలి. తెలంగాణ సాధనలోనూ కీలకపాత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మా దేవేందర్ రెడ్డి(ఫైల్ ఫోటో) తెలంగాణ సాధనలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా ఉద్యోగినులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మానసంపదను కాపాడుకోవాలన్న తలంపుతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. బాలింత, బిడ్డ సంక్షేమం కోసం రూ.13వేలు అందజేస్తోంది. ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తోంది. ఆడపిల్లల చదువులకోసం కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నడపుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని, నీటి కష్టాలను తీర్చేందుకు మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉపసభాపతిగా అసెంబ్లీలో నిష్ఫక్షపాతంగా వ్యవహరిస్తాను. మహిళా సభ్యులు మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇస్తాను. -
బాలికపై ఏడాదిగా అత్యాచారం
రామాయంపేట(మెదక్): బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న మండలంలోని కాట్రియాలకు చెందిన సంతోష్‌రెడ్డి అనే యువకునిపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..సంతోష్‌రెడ్డి మండలంలోని లక్ష్మాపూర్‌లో డిష్ నడిపిస్తాడు. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి మోసగించి ఏడాదిగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తన తల్లికి తెలపడంతో, ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ చిన్నారిని ఆదుకొండి
రామాయంపేట (మెదక్ ): మాటలు రాని ఈ చిన్నారిని ఆదుకోవాలని మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ఆమె తాత నందు వెంకట్రాంరెడ్డి అధికారులకు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే... గ్రామానికి చెందిన రాజు, భాగ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే. వీరిలో పెద్ద పాప విజ్ఞేత (9) పుట్టినప్పటి నుంచి మూగ. దీనితో ఆమె తల్లిదండ్రులు తమ కూతురును ఎన్నో ఆసుపత్రుల్లో చూపించినా ఫలితంలేదు. రాజు కూలీ పనులు చే స్తూ తన కుటుంబంతోపాటు వృద్దులైన తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. కాగా విజ్ఞేతకు పింఛన్ సైతం రావడంలేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు. కాగా జిల్లా కలెక్టర్ శనివారం గ్రామానికి రాగా ఆమె తాత, నానమ్మ తమ మనుమరాలిని కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. తమ మనుమరాలికి వికలాంగుల కోటాలో పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వారు కలెక్టర్‌ను వేడుకున్నారు. విజ్ఞేతను తీసుకొని జిల్లా కేంద్రమైన మెదక్‌లో జరిగే సదరం క్యాంపునకు హాజరై డాక్టర్ సర్టిఫికెట్ పొందితే పింఛన్ వస్తుందని కలెక్టర్ వారికి సూచించారు. -
నస్కల్లో నీటి ఎద్దడి
రామాయంపేట (నిజాంపేట): నిజాంపేట మండలం నస్కల్ పంచాయతీ పరిధిలోగల నందగోకుల్ గ్రామంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు వ్యవసాయబోరుబావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామంలో పుష్కలంగా నీరు ఉన్నా సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. రక్షిత ట్యాంక్ నీరు గ్రామంలో కొంత భాగం మాత్రమే సరఫరా అవుతుంది. గతంలో నిర్మించిన రెండు మినీ ట్యాంకులను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి. దీనికితోడు గత పదిహేను రోజులక్రితం నుంచి బోరు కూడా పనిచేయడంలేదు. ఇప్పటి వరకు ఈ బోరునీరే ఆధారమైందని, మరమ్మతు చేయించే విషయంలో శ్రద్ధతీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటికి వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నామని మహిళలు వాపోయారు. కాగా ఇతర బోర్లవద్ద నీరు మురుగు కాలువల్లోకి వృథాగా పోతోందని, ఈ వృథా నీటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనాన అధికారులు, ప్రజాప్రతినిధులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నీళ్లకు మస్తు కష్టముంది నీళ్లకు మస్తు కష్టముంది. బోరు కరాబై 15 రోజులవుతున్నా ఎవరూ పట్టించుకుంటలేదు. సర్పంచ్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేస్తలేడు. పొద్దున లేవగానే పంట చేలల్లో ఉన్న బోర్లదగ్గరినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. వెంటనే బోరును రిపేరు చేయించి నీళ్లు సరఫరా చేయాలే. - ఊడెపు బాలవ్వ, నస్కల్ ఎవరూ పట్టించుకుంటలేరు నీళ్లకు గ్రామంలో మస్తు కష్టమవుతుంది. ప్రధానంగా గ్రామం మధ్యలో ఉన్న బోరు చెడిపోవడంతో ఈసమస్య తలెత్తింది. చెడిపోయిన ఈబోరును మరమ్మతు చేయించాలని ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు. వెంటనే గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి పరిష్కరించాలి. - బురాని రమేశ్, నస్కల్ నీటి ఎద్దడి పరిష్కరిసా బోరు మోటారు కాలిపోవడంతో ఈసమస్య తలెత్తింది. వెంటనే దానిని మరమ్మతు చేరుుంచి గ్రామంలో నీటి ఎద్దడి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. తాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి. - మన్నె ప్రమీల, సర్పంచ్, నస్కల్ -
బైక్‌ను ఢీకొట్టిన లారీ: ముగ్గురి మృతి
రామాయంపేట (మెదక్) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు
రామాయంపేట (మెదక్) : ఇంటర్ పరీక్ష రాసి ఆటోలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కధనం మేరకు... మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు రామాయంపేటలోని సాయికృప, స్నేహ కళాశాలల్లో చదువుకుంటున్నారు. వారంతా మంగళవారం పరీక్ష రాసి మధ్యాహ్నం తిరిగి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రామాయంపేట శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థి ఆటో నడుపుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులను రామాయంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
లక్కీ డ్రాలో బంగారం వచ్చిందంటూ..
రామాయంపేట (మెదక్): 'లక్కీ డ్రాలో మీ సెల్ నెంబర్‌కు బంగారం వచ్చింది' అంటూ కాల్ చేసి ఓ యువకుడిని మోసం చేశారు ఆన్లైన్ కేటుగాళ్లు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన ఓబాజ భూపాల్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. మీ సెల్ నెంబర్‌కు లక్కీ డ్రాలో రూ. 6 వేల విలువైన బంగారం తగిలిందని చెప్పారు. కేవలం పోస్టల్ చార్జీలు రూ.640 చెల్లిస్తే సరిపోతుందని.. పార్శిల్ కవరు వచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించాలని చెప్పగా భూపాల్ అంగీకరించాడు. నాలుగైదు రోజుల అనంతరం పార్శిల్ రాగా భూపాల్ డబ్బు చెల్లించి విప్పి చూడగా అందులో 20 రూపాయల విలువ చేసే పూసల దండ మాత్రమే ఉంది. దీంతో భాదితుడు అవాక్కయ్యాడు. కాగా ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ తెలిపారు. -
'పద్మాదేవేందర్ కృషితో రామాయంపేట అభివృద్ధి'
రామాయంపేట (మెదక్ జిల్లా) : డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కృషితో రామాయంపేట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన గురువారం రామాయంపేటలోని రైతుబజార్లో రూ.50లక్షలతో అదనపు పనులకు శంకుస్థాపన గావించిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.7.80 కోట్లతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ది పనులకు రూ.4 కోట్లు, తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికిగాను రూ. కోటి మంజూరయ్యాయన్నారు. స్థానికంగా ఉన్న మల్లె చెరువును మినీ ట్యాంక్‌బండుగా మారుస్తామని, త్వరలో గెస్ట్ హౌస్ నిర్మాణానికిగాను నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రామాయంపేట మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్న కారణంగా గోదావరి జలాలు తరలిస్తామన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను అడ్డుకుంటున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మానెగల్ల రామకిష్టయ్య, పున్న వెంకటస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిల్లా నాయకుడు అందె కొండల్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, మెదక్ ఆర్డీవో మెంచు నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం: వృద్ధురాలికి గాయాలు
రామాయంపేట (మెదక్) : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం పట్టపగలు ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వృద్ధురాలు కింద పడి గాయాలపాలైంది. బాధితురాలి కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం రామేశన్పల్లి గ్రామానికి చెందిన ముచ్చెర్ల మోహన్‌రెడ్డి తన తల్లి పద్మవ్వతో కలిసి మంగళవారం బైక్‌పై రామాయంపేట మీదుగా నిజాంపేటలోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నారు. అయితే రామాయంపేట ఎల్లమ్మగుడి కమాన్ వద్ద ముఖానికి గుడ్డకట్టుకున్న ఓ యువకుడు వెనుక నుంచి బైక్‌పై వచ్చి పద్మవ్వ మెడలోని పుస్తెలతాడు లాగాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆగంతకుడు క్షణాల్లో బైక్‌పై పారిపోయాడు. పద్మవ్వను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. -
లారీ ఢీకొని బాలిక మృతి
రామాయంపేట (మెదక్) : మెదక్ జిల్లా రామాయంపేట మండలం నందిగామలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కడమంచి అనుష్క(10) పాల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. పాలు తీసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా... సిద్ధిపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అనుష్క తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అనుష్కను ఢీకొన్న తర్వాత లారీ అదే వేగంతో అదుపుతప్పి రోడ్డుపక్కనే గల విద్యుత్ స్తంభాలకు కూడా ఢీకొనడంతో అవి విరిగిపోయాయి. -
ప్రైవేటు ఆస్పత్రులకు కల్తీకల్లు బాధితులు
నిజామాబాద్ : మెదక్ జిల్లాకు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కల్తీ కల్లు బాధితులను చికిత్స నిమిత్తం రామాయంపేటలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇసన్నపల్లి గ్రామంలో వందలాది మంది కల్తీ కల్లుతో అస్వస్థతకు గురి కాగా వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి, రామాయంపేట, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇసన్నపల్లికి రామాయంపేట 5 కిలోమీటర్ల లోపు ఉండటంతో రోగులను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈమేరకు గత నాలుగు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 మంది వరకు చికిత్సలు పొందారు. సోమవారం ఐదుగురిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు వింత చేష్టలతో ప్రవర్తిస్తుండగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. -
అక్కడ పోలీసు హెచ్చరికలు మాత్రమే వినిపిస్తాయి...
మెదక్ : బస్టాండ్ వద్ద రహదారికి అడ్డం ఉన్న ఆటోను పక్కకు తీయండి... ఆ దుకాణం వద్ద గుంపులుగా నిలబడకండి ...అంటూ మైక్‌లో పోలీసుల హెచ్చరికలు వినిపిస్తుంటాయి. కానీ, ఆ పరిసర ప్రాంతాలలో పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించరు. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు చేపట్టిన వినూత్నయత్నమిది. సిబ్బంది కొరత, తీరిక లేని విధులు... ఈ రెండింటి నుంచి విముక్తి పొందేందుకు వారు ఈ విధానానని ప్రవేశపెట్టారు. రోడ్డుపై గొడవ జరిగినా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా వాహన పార్కింగ్ ఉన్నా.... ఎక్కడైనా జనం గుమికూడినా పోలీస్ స్టేషన్లో ఉండే మైక్‌ల ద్వారా వారు హెచ్చరికలు జారీ చేసి... శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు రామాయంపేట బస్టాండ్ లోపల, బయట సిద్దిపేట రోడ్డు వద్ద, అంబేద్కర్ విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద మైక్‌లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మానిటరింగ్ సిస్టం, ఇతర పరికరాలు పోలీస్ స్టేషన్‌లోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేశారు. దానికి ఆడియో సిస్టంను అనుసంధానం చేసి అందుబాటులోకి తెచ్చారు. కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, తగిన విధంగా సూచనలు, ఆదేశాలు ఇస్తుంటారు. సంబంధిత ప్రాంతంలో ఏదైనా ఘర్షణ జరిగిన పోలీస్ స్టేషన్లో రికార్డు అవుతుందనే భయంతో స్థానికులు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. పట్టణంలో ఇటీవల దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోవడంతో తాము ఈ చర్యలు తీసుకున్నామని ఎస్సై నాగార్జున తెలిపారు. అలాగే సంబంధిత ప్రాంతానికి తమ సిబ్బంది వెళ్లకుండా నేరుగా పోలీస్‌స్టేషన్ నుంచే పర్యవేక్షిస్తుండటంతో పని ఒత్తిడి తగ్గిందని ఆయన చెబుతున్నారు. ఈ విధానం మంచి ఫలితాలనిచ్చిందని తెలిపారు. -
56,400ల మద్యం బాటిళ్ల పట్టివేత
రామాయంపేట (మెదక్ జిల్లా) : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీని సోమవారం వేకువజామున రామాయంపేట వద్ద పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మెదక్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముజాహిద్ సిద్దిఖీ, స్థానిక ఎక్సైజ్ సీఐ సలీం తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని తిలక్‌నగర్ డిపో నుంచి 1300ల కాటన్ల (56400ల సీసాలు) మెన్షన్ హౌజ్ మద్యం బాటిళ్లను ఏపి 16 టీవై 2056 నెంబర్ గల లారీలో రామాయంపేట మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సామర్లకోట బేవరేజెస్ డిపోకు తరలిస్తున్నారు. అదే సమయంలో రూట్ వాచింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో స్థానిక మల్లెచెరువు కట్ట వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతని వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశానికిగాను ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వారు వెంటనే సదరు లారీని స్వాధీన పరచుకొని ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ లారీలో సుమారుగా రూ.25 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఇందుకుగాను టాక్స్ రూపేణా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది లక్షలను చెల్లించకుండా వెళుతున్నట్లు తేలిందన్నారు. వారి వద్ద మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పర్మిట్లు, వే బిల్లులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గఫూర్ అలీతోపాటు క్లీనర్ తోంబేను వారు అరెస్ట్ చేశారు. లారీని మెదక్‌లోని ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐలు యాదగిరి, సయ్యద్ సాదత్ తెలిపారు. -
ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది
రామాయంపేట (మెదక్) : వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలసి రామాయంపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
రామాయంపేట: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రామాయంపేటలోని జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన హోటల్‌ను ఆమె సోమవారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ సెగ్మెంట్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈమేరకు నిధుల మంజూరు కోసం సీఎంకు ప్రతిపాదనలు కూడా సమర్పించామన్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతగా మండలంలోని 15 చెరువులను తీసుకున్నామని, వీటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామన్నారు. పింఛన్ల మంజూరీలో అర్హులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అనంతరం ఆమె అయ్యప్పస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెతో పాటు మెదక్ ఆర్డీఓ నగేశ్‌ను, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డిని ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల ఏసుపాలు, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ‘సి’ గ్రేడ్ ధాన్యాన్యి కొనుగోలు చేసేలా చర్యలు చేగుంట, వెల్దుర్తి: కొనుగోలు కేంద్రాల్లో ‘సి’ గ్రేడ్ ధాన్యాన్ని కూడా సేకరించేలా చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వడియారం శివారులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు. రైతుల వద్ద ‘సి’ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1180ల మద్దతు ధరకు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. జిల్లాలో రూ.17వేల కోట్లను రైతు రుణాలను మాఫీ చేశామని, 25 శాతం డబ్బులను తిరిగి రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో రూ.900 కోట్లను రైతులకు రుణాలుగా అందించామన్నారు. రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు రూ.70 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.