rayalaseema projects
-
నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
తిరుపతి ఎడ్యుకేషన్: రాయలసీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కోరారు. తిరుపతికి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని సోమవారం ఆయన కలిశారు. సీమ నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని సహజ న్యాయ సూత్రాలకు లోబడి విశాఖలో కాకుండా రాయలసీమలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం పూడిక వల్ల 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. వరదల సమయంలో నీటిని సరఫరా చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు తీగల వంతెన స్థానంలో సిద్ధేశ్వరం అలుగు చేపట్టేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలని కోరారు. పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు వంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కుందూ నదిపై ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళతానని సజ్జల హామీ ఇచ్చారు. -
ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం అవసరం లేదు: ఎన్జీటీ తీర్పు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్‌కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ -
ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా!
పెనుకొండ: రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతలకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ నిలదీశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్’ పేరిట హిందూపురంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతే ఈ ప్రాంత ప్రాజెక్టులపై వారికి శ్రద్ధ పుట్టుకొచ్చిందని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టులను పూర్తిగా అశ్రద్ధ చేశారన్నారు. చంద్రబాబు హంద్రీ–నీవాను తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారని, కానీ వైఎస్సార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ కల్పతరువుగా మార్చారని వివరించారు. 1995 నుంచి 2004 వరకు హంద్రీ–నీవాపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.9 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ కష్టాలు తెలిసిన వ్యక్తిగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.6,500 కోట్లతో హంద్రీ–నీవాకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన అరకొర పనులను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదని, పైగా 200 శాతం అధికంగా అంచనాలు పెంచుకుని బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా టీడీపీ నేతలు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథిలకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టొద్దు రాయలసీమకు సాగునీటిని అధికంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. నీళ్లన్నీ సీమకే తీసుకెళ్తున్నారంటూ ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో మాట్లాడించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంత రైతుల పట్ల వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ద్వంద్వ వైఖరి మానుకునేలా చంద్రబాబును నిలదీయాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరిన్ని కృష్ణా జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేశామని తెలిపారు. గండికోట రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను, కుట్రపూరిత సదస్సులను మానుకుని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. -
అక్కడ పనులు జరగడం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పేర్కొంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు సంబంధించిన పనులు మాత్రమే ఇప్పటి వరకు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి నివేదిక అందించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణ చర్యలకు పాల్పడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 6న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అందించిన నివేదికను ధర్మాసనం రికార్డులోకి తీసుకుంది. కృష్ణా బోర్డు, కేంద్రం నివేదికల్లో ఛాయాచిత్రాలు చూస్తుంటే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యాక ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించారు. ధర్మాసనం అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వీడియో ఆధారాలు అందజేస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచంద్రరావు తెలిపారు. ఆధారాలు ఏవైనా ఉంటే తమకు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల వద్ద ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డిలు ధర్మాసనానికి పునరుద్ఘాటించారు. ఉల్లంఘనలు జరిగాయని చర్యలు తీసుకొనే అధికార పరిధి ఎన్జీటీకి ఉందా.. అనే అంశంపై వాదనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పనులు నిలిపి వేశామని అండర్ టేకింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. పర్యావరణ శాఖ నివేదిక ఇలా.. ► 2021 ఆగస్టులో కృష్ణా బోర్డు ఎన్జీటీకి నివేదిక సమర్పించిన విషయం గమనించాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డౌన్ స్ట్రీమ్ కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ధ్యేయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ► ఈ ప్రాజెక్టు కోసం గాలేరు నగరి– సుజల స్రవంతి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల నిమిత్తం ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలంటూ ప్రాజెక్టు యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. రివర్ వ్యాలీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ దీన్ని అంచనా వేస్తోంది. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్లుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి గుర్తులు లేవు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన నిర్మాణ సామగ్రి మాత్రమే ఉంది. ఎన్జీటీ అనుమతించిన డీపీఆర్‌కు సంబంధించిన పనులు మాత్రమే చేపడుతున్నట్లు ప్రాజెక్టు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే ఛాయా చిత్రాలు పొందు పరుస్తున్నాం. -
మరో అధికారిని నియమించగానే ‘సీమ’ ఎత్తిపోతల పరిశీలన
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ దేవేందర్‌రావు స్థానంలో అదే స్థాయి కలిగిన మరో అధికారిని నియమించాక కమిటీని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీ లించి నివేదిక ఇస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్(చెన్నై)కు కృష్ణా బోర్డు తెలిపింది. ఎత్తిపోతలపై తుది నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం ఎన్జీటీకి మధ్యంతర నివేదిక అందజేశారు. మధ్యంతర నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ► రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టనున్న ప్రదేశాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మార్చి 4న ఎన్జీటీ ఆదేశాలు జా రీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ని ర్ణయించాం. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాలని కోరగా కృష్ణా–గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్(కేజీబీవో)లో సీఈగా ఉన్న పి.దేవేం దర్‌రావును నియమించింది. ఆయనతోపాటు కృష్ణా బోర్డు అధి కారులతో సీమ ఎత్తిపోతల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశాం. ► జూలై 23న ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న పర్యటించాలని భావించాం. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.దేవేందర్‌రావును కమిటీలో నియమించడంపై ఈనెల 3న ఎన్జీటీ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఈనెల 4న ఎన్జీటీ స్పందిస్తూ రెండు రాష్ట్రాలతో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ► ఈ పరిణామాల నేపథ్యంలో మరో అధికారిని సీడబ్ల్యూసీ నియమించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇస్తాం. -
తనిఖీ కమిటీలో తెలంగాణ అధికారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేయనున్న బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన అభ్యంతరాలపై జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. తనిఖీ బృందంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి నియమితులైన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో ఏపీ అభ్యంతరం చెబుతోందని, స్వయంగా తామే తనిఖీలు చేపడతామని కృష్ణా బోర్డు ధర్మాసనానికి తెలిపింది. ఆయన తెలంగాణకు చెందిన వారైనప్పటికీ యూపీఎస్సీ నుంచి సర్వీసుకు ఎంపికయ్యారని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి కాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచంద్రరావు, పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ధర్మాసనంలోని నిపుణుడు సత్యగోపాల్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని తాము కూడా ఆరోపించగలమని రాంచంద్రరావు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అంశాలు వచ్చినపుడు.. ఉయ్ ఆర్ లైక్ బ్రదర్స్, న్యాయపరమైన కేసులు విచారించను అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారని జస్టిస్ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఇతర సభ్యులెవరూ లేకుండానే కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటోంది కాబట్టి చేయనిద్దాం.. అని సూచించారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లేకుండా కృష్ణా బోర్డు తనిఖీలు చేస్తానంటే అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం పనులు చేపడుతున్నారా? పిటిషనర్, తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నారా? అనే అంశాలను తనిఖీ చేసి తెలియచేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు మూడు వారాలు సమయం కావాలని కృష్ణా బోర్డు కోరగా, అంత సమయం ఇవ్వబోమని, ఈ నెల 9లోగా అందించాలంటూ తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. -
తెలంగాణకు ఎన్జీటీ చురక..ఉల్లంఘనల కేసులు మీపైనా ఉన్నాయ్
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులు చేపడుతోందంటూ పలు పిటిషన్లు ఉన్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నారంటూ గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలు చేస్తోందని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు చెప్పబోతుండగా... ధర్మాసనం జోక్యం చేసుకుని మీపైనా ఉల్లంఘన కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయా లేదా అనేది స్వయంగా వెళ్లి తనిఖీ చేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ శాఖ కూడా తనిఖీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ కోరగా, అసలు ఏ పనులు సాగుతున్నాయనేది కృష్ణాబోర్డు తేల్చిన తర్వాత నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది. -
'సీమ' ఎత్తిపోతలే శరణ్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ)కి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఎకో సెన్సిటివ్ జోన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నేతృత్వంలో 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ మేరకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నైలకు.. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ప్రాజెక్టుల ద్వారా 44 వేల క్యూసెక్కులే తీసుకెళ్లవచ్చునని, 854 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే అత్యవసరాలకు 6 వేల క్యూసెక్కులు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదని, దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు. ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువన కాలువలోకి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామన్నారు. దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది అత్యావశ్యకమని వివరించారు. ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు. పాత ప్రాజెక్టులైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్లకు ఇంతకుముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని, వాటి ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధికారుల ఇచ్చిన వివరణ, తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు ఇవేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ, పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది. -
‘రాయలసీమ ఎత్తిపోతల’ పరిశీలనకు కృష్ణా బోర్డు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పరిశీలనకు కృష్ణా బోర్డు సిద్ధమవుతోంది. ఓ పక్క జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అందిన ఆదేశాలు, మరోపక్క కేంద్ర జల శక్తి శాఖ నుంచి పెరిగిన ఒత్తిడి. వీటికితోడు తెలంగాణ రాసిన లేఖ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసుకుంటోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో పాటే గతంలో ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం సైతం దీనిపై త్వరగా తేల్చి తమకు నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ బోర్డుకు సూచించింది. దీంతో కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సోమవారం సభ్యులతో భేటీ అయ్యారు. బోర్డు సభ్యులు హరికేశ్ మీనా, లుతాంగ్, సభ్య కార్యదర్శి దేవేందర్ తదితరులతో ఆయన పర్యటన విషయమై చర్చించారు. అయితే ఇప్పటికే పర్యటనకు సంబంధించి ఓ నోడల్ అధికారిని నియమించాలని ఏపీని కోరిన విషయాన్ని సభ్యులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. గతంలో పర్యటన చేస్తామని చెప్పిన సమయంలో ముందుగా తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాలంటూ ఏపీ లేఖ రాసిందని, అయితే నోడల్ అధికారి నియామకంపై మాత్రం ఇంతవరకు స్పందించలేదని వెల్లడించారు. మంగళవారం ఉదయం వరకు వేచిచూసి సాయంత్రానికి రాయలసీమ ప్రాజెక్టు పర్యటన షెడ్యూల్ ఖరారు చేయాలని, అవసరం అయితే కేంద్రానికి సమాచారం అందించి భద్రత కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి వారం, పది రోజుల్లో వాస్తవాలను కేంద్రానికి నివేదించాలని సభ్యులు దృఢ సంకల్పంతో ఉన్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
‘రాయలసీమ’ను నిలిపివేస్తే చర్చలకు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసి, సంబంధిత జీఓను ఉపసంహరించుకునే పక్షంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. కృష్ణా జల వివాదం అంశాన్ని కేవలం నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్‌కే పరిమితం చేయకుండా ప్రజల్లోకి కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డితో కలసి శుక్రవారం ఆయన టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలుపుదలకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించొద్దని అన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయాలపై పోరాడటంలో సీఎం కేసీఆర్‌కు మించిన వారెవరున్నారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంత పాడుతున్నాయని, గతంలో ఏపీకి అక్రమంగా నీటి తరలింపునకు హారతులు పట్టిన వారు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ద్రోహం చేసినా రాష్ట్ర నీటి వాటాల కోసం పోరాటం చేస్తామని, కాంగ్రెస్ నేతలు బానిస బతుకులు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీకి తెలంగాణ సోయి లేదని మండిపడ్డారు. ‘రాయలసీమ’తో ఐదు జిల్లాలకు నష్టం రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణలో ఐదు జిల్లాలు నష్టపోతాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ పలు దఫాలు కేంద్రానికి లేఖ రాశారని, కేసీఆర్ చిత్తశుద్ధిపై కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం సాక్షి, న్యూఢిల్లీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై తాము మాట్లాడుతుంటే, కొందరు ఏపీ నాయకులు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సయోధ్యతో ఉందామనుకుంటే.. కొందరు ఏపీ నేతలు నోట్లో చక్కెర, కడుపులో కత్తెరవంటి వైఖరితో వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. అంతేగాక వైఎస్సార్ తెలంగాణ ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని, అందుకే పోతిరెడ్డిపాడు వ్యవహారంలో మంత్రి పదవులను సైతం టీఆర్ఎస్ వదులుకుందని చెప్పారు. తమ పోరాటం తెలంగాణ ద్రోహులపైనే కాని, ఆంధ్ర ప్రజలపై కాదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎంతో ఎలాంటి వివాదాలకు పోకుండా సఖ్యతతో మెలిగే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణకు ఏం చేశారు... వైఎస్సార్ హయాంలో తెలంగాణ నీళ్లను దోచుకుపోతుంటే తమ కడుపు మండిందని మంత్రి అన్నారు. తెలంగాణ అని నినదించిన వాళ్లను నక్సలైట్ అనే ముద్ర వేసి చంపారని ఆరోపించారు. ఏపీ సీఎంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణకు వైఎస్సార్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ఏ కుల వృత్తులను ఎదగనీయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తిరిగిన ఉద్యోగులను ఏసీబీ కేసుల్లో జైళ్లకు పంపారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు తమకు శత్రువులు కాదని, అన్నదమ్ములుగా చూసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నీళ్లు తోడుకుపోతే, హైదరాబాద్‌కు నీళ్లు ఎట్లా, ఏం నీళ్లు తాగాలని ఏపీ సీఎంను నిలదీయాలని వారికి సూచించారు. ఈ కొత్త పంచాయితీతో ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేట్లు ఉన్నాయని మాట్లాడాలని అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో మాట ఇచ్చినట్లు అక్రమ ప్రాజెక్ట్‌లు ఆపేయాలని, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు అడగాలన్నారు. -
పరిశీలన రద్దు చేసుకోండి
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరో మారు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు పరిష్కరించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులను తనిఖీ చేయకుండా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలిస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని, వర్కింగ్ మాన్యువల్ నోటిఫై కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రాజెక్టు పరిశీలన బృందంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన తటస్థులు ఉండాలని, ప్రస్తుత సభ్యులపై మాకు కొన్ని అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టుల పరిశీలన కంటే ట్రిబ్యునళ్ల తీర్పులు, విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను పరిశీలించాలన్న విషయాన్ని ముందుగా కృష్ణా బోర్డులో చర్చించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా కరోనా... తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోన్న విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. శనివారం ఏపీలో 7,000కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 5,000 కేసులు నమోదయ్యాయని, కొత్త కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. సీమ ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కరోనా బారిన పడ్డారని, ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పరిశీలన సూచించదగ్గ నిర్ణయం కాదన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించే వరకు పర్యటన రద్దు చేసుకోవాలని లేఖలో శ్యామలరావు కోరారు. -
అక్కడో న్యాయం.. ఇక్కడో న్యాయమా?
సాక్షి, అమరావతి: అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టుల పనులను ఆపాల్సింది పోయి, వాటా నీటిని వాడుకుని పాత ఆయకట్టును స్థిరీకరించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించడానికి ఏర్పాట్లు చేయాలని కృష్ణా బోర్డు పదే పదే కోరడంలో ఆంతర్యమేమిటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుకు ఆ ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పంపి.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. కానీ.. తెలంగాణ సర్కార్ 2015లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీలను తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, 30 టీఎంసీలను తరలించేలా డిండి, సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలు తరలించడంతో పాటు తుమ్మిళ్ల, భక్తరామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 22 నుంచి 25.4, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచే పనులను అనుమతి లేకుండా చేపట్టింది. మొత్తంగా8.93 టీఎంసీలను అనుమతి లేకుండానే తరలించడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోందని.. వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని.. వాటిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇది ఏకపక్ష నిర్ణయమే.. అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలిపి వేయాలని గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ పనులు యథేచ్ఛగా చేస్తుండటంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తోంది. వాటిపై బోర్డు చైర్మన్ ఎ.పరమేశం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వాటా నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, చెన్నై తాగు నీటి అవసరాలు, రాయలసీమ సాగు నీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను మాత్రం ఈ నెల 19న పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని బోర్డు చైర్మన్ ప్రతిపాదించారు. దీనిపై బుధవారం ఈఎన్సీ నారాయణ రెడ్డి స్పందించారు. బోర్డు పరిధిని కేంద్రం ఇప్పటిదాకా ఖరారు చేయలేదని, ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలను ఎలా పరిశీలిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను తనిఖీ చేయకుండా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని కోరడం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని.. ఆ వైఖరిని విడనాడాలని హితవు పలికారు. -
‘రాయలసీమ’ సర్వే పనులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించడానికే పనులు చేస్తున్నామని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణపత్రంతో ఏకీభవించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ సర్కారు పనులు చేస్తోందంటూ శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రామకృష్ణన్, సైబల్‌దాస్ గుప్తాలతోకూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్‌ను రూపొందించడానికి సర్వే, పరిశోధనలు మాత్రమే చేస్తున్నామని ఏపీ సీఎస్ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో మార్పులపై అధ్యయనం మాత్రమే చేస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్రం నుంచి పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. గతేడాది ఫిర్యాదు చేసినా కేఆర్ఎంబీ(కృష్ణా బోర్డు) చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. ప్రాజెక్టు పనుల వివాదాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని కేఆర్ఎంబీ ట్రిబ్యునల్‌ను కోరింది. వాదనల అనంతరం... ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పరిసరాల్లో చేస్తున్న పనులన్నీ సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించడానికి చేస్తున్నవేనని ఏపీ సీఎస్ దాఖలు చేసిన ప్రమాణ పత్రాన్ని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతున్నట్లు కేఆర్ఎంబీ నిర్ణయిస్తే.. అప్పుడు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు సూచించింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల సర్వే, పరిశోధన, డీపీఆర్ రూపకల్పన పనులకు మార్గం సుగమమైంది. -
‘రాయలసీమ ఎత్తిపోతల’ కొత్త ప్రాజెక్టు కాదు
సాక్షి, అమరావతి: పాత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు మెరుగ్గా నీటిని సరఫరా చేయడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని.. ఇది ఏ విధంగానూ కొత్త ప్రాజెక్టు కాదని.. కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం ఈ ఎత్తిపోతలకు అనుమతిచ్చి, అపెక్స్ కౌన్సిల్‌కు పంపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో.. డీపీఐ (సమగ్ర ప్రాజెక్టు సమాచారం)ని పరిశీలిస్తామని.. వారం తర్వాత మరోసారి సమావేశమవుదామని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అంగీకరించారు. కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం సెలవులో ఉన్నారని.. మళ్లీ సోమవారం సమావేశమవ్వాలని నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూచన మేరకు సోమవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయానికి ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, కర్నూల్ జిల్లా ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి వెళ్లారు. బోర్డు చైర్మన్ పరమేశం సెలవులో ఉండటంతో సభ్య కార్యదర్శి రాయ్‌పురే, డైరెక్టర్ హెచ్‌కే మీనాలతో వారు భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతివ్వాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టుగా తెలంగాణ సర్కార్ చెబుతోందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్, విభజన చట్టం ద్వారా ఎస్సార్బీసీ, తెలుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 881 అడుగుల కంటే ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చునని.. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులకు మించి ఉండదని వారు వివరించారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటే పీహెచ్ఆర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి ఏడు వేలు, 841 అడుగుల నీటిమట్టం ఉంటే రెండు వేల క్యూసెక్కులు మాత్రమే చేరుతాయని.. అదే 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా కాలువలోకి చేరదన్నారు. ఇతర ప్రాజెక్టుల ఆయకట్టుకు విఘాతం కలగదు రాయలసీమ ఎత్తిపోతలవల్ల తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ఫిర్యాదు చేసిందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే ప్రస్తావించగా.. వాటిని ఈఎన్సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం కల్వకుర్తి ఎత్తిపోతలకు మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన ప్రాజెక్టులకు అనుమతిలేదని గుర్తుచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంవల్ల ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు విఘతం కలగదన్నారు. దీంతో డీపీఐని సమగ్రంగా పరిశీలిస్తామని.. సోమవారం మరోసారి సమావేశమవుదామని రాయ్‌పురే చేసిన సూచనకు ఈఎన్సీ అంగీకరించారు. కేంద్ర కార్యాలయాలన్నీ విశాఖలోనే కేంద్ర ప్రభుత్వరంగ కార్యాలయాలన్నీ విశాఖలోనే ఉన్నాయని.. కృష్ణా బోర్డు కార్యాలయాన్నీ అక్కడే ఏర్పాటుచేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. కృష్ణా బోర్డు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఏపీలోనే ఉండాలన్నారు. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఇక చట్ట ప్రకారం అన్ని అనుమతులతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడతామని ఈఎన్సీ స్పష్టం చేశారు. ఏటా నీటి మట్టం 800 అడుగులకు తగ్గుతోంది.. మరోవైపు.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం నుంచే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా రోజుకు ఏడు టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏటా నీటిని తరలిస్తోందని.. దీనివల్ల నీటి మట్టం 800 అడుగులకు తగ్గిపోతోందని ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. కానీ, కేటాయింపులున్నా సరే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు ఏపీలో నీళ్లందించలేని దుస్థితి నెలకొందని.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఆయన వివరించారు. ఈ పరిస్థితి దృష్ట్యా శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా ‘రాయలసీమ’ పథకాన్ని చేపట్టామన్నారు. పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలో 5 కి.మీ వద్ద కృష్ణా బోర్డు టెలీమీటర్లు ఏర్పాటుచేసిందని.. వీటి ద్వారా ఎత్తిపోతల ద్వారా తరలించే ప్రతి నీటి బొట్టునూ లెక్కించవచ్చన్నారు. -
కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్
సాక్షి, అమరావతి: అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) పంపారు. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ సీడబ్ల్యూసీ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ (పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్) ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని మరింత మెరుగ్గా సరఫరా చేసేందుకే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటా నీటిని వాడుకోక ముందే.. ► విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఇదే తరహాలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించేలా పనులు చేపట్టింది. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టింది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోంది. మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతోంది. 841 అడుగుల్లో చుక్క నీరు రాదు – శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కానీ గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులు కూడా ఉండే అవకాశం లేదు. – శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు పీహెచ్ఆర్ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయి. 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా రాదు. – తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. – ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రిబ్యునల్ కేటాయింపు ద్వారా హక్కుగా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. డీపీఆర్‌ను అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు – కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. – ఈ భేటీలో తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టిపారేస్తూ.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి, రాయలసీమ, చెన్నైకి తాగునీటి ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని సీఎం వైఎస్ జగన్ బలంగా వాదనలు వినిపించారు. కొత్తగా నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. – ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గజేంద్రసింగ్ షెకావత్ కోరారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను గత నెల 16న రాష్ట్ర జల వనరుల శాఖ సీడబ్ల్యూసీకి సమర్పించింది. – రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ దృష్ట్యా దీనిపై అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు వారం రోజుల్లో డీపీఆర్‌ను ఆమోదిస్తూ నివేదిక ఇస్తుందని, అనంతరం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత విభజన చట్టంలో నిబంధనల మేరకు రాయలసీమ ఎత్తిపోతలకు అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. -
రాయలసీమ ప్రాజెక్టుల ఎస్పీవీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ)కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 116293)పై ఆమోదముద్ర వేసింది. దీంతో సంస్థ మొదటి బోర్డు సమావేశాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బ్యాంకులో ఆ సంస్థ పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తొలి విడతగా రూ.ఐదు కోట్లను అందులో జమ చేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ, జాతీయ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి.. తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి, వాటికి బడ్జెట్ ద్వారా కేటాయించే నిధులను జత చేసి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలకు ఆర్ధిక సంస్థలు రెడీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో 30 శాతాన్ని అంటే రూ.11,994 కోట్లను ప్రభుత్వం తన వాటాగా సమకూర్చుతుంది. మిగిలిన 70 శాతం అంటే రూ.27,986 కోట్లను జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు. ఆ మేరకు సంప్రదింపుల నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వరద జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక కింద రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు ప్యాకేజీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ ఏర్పాటయ్యింది. -
భూసేకరణ అవసరం లేకుండా..
సాక్షి, అమరావతి: ఒక్క ఎకరా కూడా సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను రూపొందించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం (800 అడుగుల నీటి మట్టం) నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) వరకూ మూడు టీఎంసీలను తరలించే సామర్థ్యంతో భవనాశి నదిలో 17 కి.మీ.లు కాలువ తవ్వి.. అక్కడి నుంచి పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పంప్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. భవనాశి నదిలో కాలువ తవ్వడం వల్ల భూసేకరణ అవసరం ఉండదు. ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) పనులు చేసే సమయంలో పీహెచ్ఆర్ వద్ద అదనంగా 123 ఎకరాల భూమిని సర్కార్ అప్పట్లోనే సేకరించింది. ఆ భూమిలో పంప్ హౌస్, 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. దీనివల్ల భూసేకరణకు వ్యయమయ్యే రూ. 854 కోట్లు ఆదా అవుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ. 3,307.07 కోట్లకు ఎస్పీఎమ్మెల్(జేవీ) సంస్థకు సర్కార్ ఇప్పటికే అప్పగించిన విషయం విదితమే. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా.. కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ప్రాంతమైన సంగమేశ్వరం వద్ద శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉంటుంది. సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ జలాశయంలో 4.5 కి.మీ.ల పొడవున తవ్వే అప్రోచ్ కెనాల్ ద్వారా మూడు టీఎంసీలు (34,722 క్యూసెక్కులు) తరలించి.. అక్కడి నుంచి ఒక్కో పంప్ 81.93 క్యూమెక్కులు (2,893 క్యూసెక్కులు) చొప్పున 12 పంప్‌ల ద్వారా 34,722 క్యూసెక్కులను 39.60 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా పంప్ హౌస్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ముచ్చుమర్రి వద్ద నిర్మించే హౌస్ ద్వారా ఎత్తిపోసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైపులైన్ ద్వారా తరలించి.. డెలివరీ సిస్ట్రన్‌లో పోసి.. అక్కడి నుంచి 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వి.. పీహెచ్‌ఆర్‌కు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు పోయాలని తొలుత నిర్ణయించారు. అయితే జలాశయంలో బంకమట్టి పేరుకుపోయింది. దీనివల్ల అప్రోచ్ కెనాల్‌ను తవ్వడం ఇబ్బంది అవుతుంది. ముచ్చుమర్రి వద్ద పంప్ హౌస్, పైపులైన్, డెలివరీ సిస్ట్రన్ నిర్మాణం, 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వకం కోసం 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు చేపట్టినప్పుడు ముచ్చుమర్రి పరిసర గ్రామాల్లోనే భూసేకరణ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ప్రస్తుతం రైతుల చేతిలో అతి తక్కువ భూమి మాత్రమే మిగిలింది. మిగిలిన భూమిని కూడా సేకరిస్తే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. భవనాశి నదిలో అప్రోచ్ కెనాల్, పీహెచ్ఆర్ వద్ద జలవనరుల శాఖ అధీనంలో ఉన్న 123 ఎకరాల్లో పంప్ హౌస్ నిర్మాణంతో ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదని, ఆ వ్యయం ఆదా అవుతుందని నివేదించారు. ఉభయతారకంగా ఉన్న ఈ ప్రతిపాదనపై సర్కార్ ఆమోదముద్ర వేసింది. శరవేగంగా పూర్తి చేస్తాం..: సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ బురద పేరుకుపోయి.. ఆ ప్రాంతమంతా ఊబిలా మారింది. అప్రోచ్ కెనాల్‌ను 800 అడుగుల మట్టంలో తవ్వడం వ్యయప్రయాసలతో కూడుకుంది. ముచ్చుమర్రి నుంచి పీహెచ్ఆర్ వరకూ 22 కి.మీ.ల కెనాల్ తవ్వాలంటే 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించాం. ఈ అలైన్మెంట్ ప్రకారం గడువులోగానే పనులు పూర్తి చేస్తాం. భవనాశి నది మార్గంలోనే..: మురళీనాథ్‌రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్. నల్లమల అడువుల్లో జన్మించే భవనాశి నది పీహెచ్‌ఆర్‌కు దిగువన సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నది ప్రవాహం వల్ల సంగమేశ్వరం నుంచి పీహెచ్ఆర్ వరకూ బురద పేరుకోలేదు. ఈ నదిలో పీహెచ్ఆర్ వరకూ 17 కి.మీ.ల పొడవున అప్రోచ్ కెనాల్ తవ్వడం ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తరలించవచ్చు. పీహెచ్ఆర్ వద్ద అందుబాటులో ఉన్న 123 ఎకరాల్లో పంప్ హౌస్, సబ్ స్టేషన్‌ను నిర్మించి పనులు పూర్తి చేస్తాం. -
వాటా నీటినే వాడుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను మెరుగు పరచడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సీఎంలతో మంగళవారం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా గురించి స్పష్టంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ► రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక శాతం ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఈ జిల్లాలు తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డాయి. ► దేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. అనంతపురం జిల్లా డీడీపీ (ఎడారి నివారణ పథకం) పరిధిలో, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు డీపీఏపీ (కరవు ప్రాంత అభివృద్ధి పథకం) పరిధిలో ఉండటాన్ని బట్టి చూస్తే ఆ జిల్లాలు ఎంతగా వెనుకబడ్డాయో.. నీళ్లు లేక ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో విశదం చేసుకోవచ్చు. ► వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడం, సమగ్రాభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో స్థైర్యం నింపాల్సిన నైతిక బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదే అన్న అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి, తెలంగాణ సీఎంలకు వినయపూర్వకంగా గుర్తు చేస్తున్నా. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి వేరు ► తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఈ కోవలోకే వచ్చినా, ఆ జిల్లాల్లో 30 శాతం కంటే ఎక్కువ భూమికి సాగునీరు అందుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు 142 టీఎంసీలు, నల్గొండ జిల్లాకు 104 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ మూడు జిల్లాలు డీపీఏపీ పరిధి నుంచి బయటపడి.. సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నాయి. ► కానీ ఇదే రాయలసీమ, ప్రకాశం జిల్లాలు నిత్యం కరవుతో తల్లడిల్లుతున్నాయి. ఒక్కో జిల్లాకు కనీసం 50 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేదు. సాధారణంగా ఒక జిల్లా స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం వంద టీఎంసీలు అవసరమన్నది అందరికీ తెలిసిందే. ► ఈ లెక్కన శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మొత్తం ఆరు జిల్లాలు అభివృద్ధి సాధించాలంటే 600 టీఎంసీలు అవసరం. ఇదే అంశంపై 2019 జూన్ 28న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఒక జిల్లా అభివృద్ధి సాధించాలంటే వంద టీఎంసీలు అవసరమని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేకించి రాయలసీమ ప్రజలకు కూడా వర్తిస్తుంది. వాటా నీటినే వినియోగించుకోలేకపోతున్నాం ► వాస్తవం ఏమిటంటే.. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్ఆర్) ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే వస్తాయి. 881 నుంచి 885 అడుగుల మధ్య నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయి. కానీ.. గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే శ్రీశైలంలో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ► చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, కేసీ కెనాల్ సప్లిమెంటేషన్‌కు పది టీఎంసీలు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని గాలేరు–నగరికి 38 టీఎంసీలు, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీ–నీవాకు 40 టీఎంసీలు.. వాటితోపాటు సీబీఆర్‌కు పది, పైడిపాళెంకు ఆరు, మైలవరానికి ఏడు, సర్వారాయసాగర్‌కు మూడు, గోరకల్లుకు 12.4, అవుకుకు 4.14, సోమశిలకు 78, కండలేరుకు 68 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులు దశాబ్దాలుగా శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. ► 1983లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై తాగునీటికి కేటాయించిన 15 టీఎంసీల్లో ఎనిమిది టీఎంసీలను జూలై నుంచి అక్టోబర్ మధ్య, నాలుగు టీఎంసీలను జనవరి నుంచి ఏప్రిల్ «మధ్య సరఫరా చేయాలి. కానీ.. జనవరి నాటికి శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల పీహెచ్ఆర్ ద్వారా చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కావడం లేదు. ► విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, రోజూ 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తీసుకెళ్లేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ కొత్తగా చేపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచింది. ప్రాజెక్టులో 796 అడుగుల నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా తరలించే సామర్థ్యం ఉంది. ► ఆంధ్రప్రదేశ్‌లో 2.45 కోట్ల జనాభాతో 98,001 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించిన ఆరు జిల్లాలు నీటి అవసరాల కోసం శ్రీశైలంపై ఆధారపడితే.. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొంత భాగం మాత్రమే శ్రీశైలంపై ఆధారపడ్డాయి. వాటా జలాలను వినియోగించుకోవడానికే.. ► కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసీలను వినియోగించుకునేలా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. శ్రీశైలం నుంచి రోజుకు సాగునీటి అవసరాల కోసం మూడు టీఎంసీలు.. విద్యుదుత్పత్తి ద్వారా నాలుగు టీఎంసీలు వెరసి ఏడు టీఎంసీలను 800 అడుగుల నీటి మట్టం కంటే దిగువ నుంచే తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దీని వల్ల పీహెచ్ఆర్ ద్వారా కాలువలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు దిగువన ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల వాటా జలాలను వినియోగించుకోవడం కష్టమవుతోంది. ► వాటా జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పీహెచ్ఆర్ కింద తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించడం కోసమే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించేలా వరదను మళ్లించడానికి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ల కాలువ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ► కేటాయించిన నీటి కంటే చుక్క నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా వినియోగించుకోం. ఈ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టుకే నీళ్లందిస్తాం. నీటిని నిల్వ చేయడానికి కొత్తగా ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదు. ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటి మళ్లింపు న్యాయమే ► కేడబ్ల్యూడీటీ–1 తీర్పులో 128వ పేజీ ప్రకారం అంతర్రాష్ట్ర నది అయిన కృష్ణా నుంచి ఇతర నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)కు నీటిని మళ్లించడం న్యాయమే. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టాకు 181.2, కేసీ కెనాల్‌కు 39.9, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, తుంగభద్ర హెచ్చెల్సీకి 32.5, గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఆ తర్వాత కేడబ్ల్యూడీటీ–2 తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. ► దీన్ని బట్టి చూస్తే ఒక నది నుంచి మరొక నదికి నీటిని మళ్లించడం న్యాయమేనన్నది స్పష్టమవుతోంది. దేశంలో రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, కృష్ణా, మూలమట్ట, ఇంద్రాయణి, పెరియార్, చెలకుడి నదుల నుంచి ఇతర నదులకు నీటిని మళ్లించారు. ► కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య 1978 ఆగస్టు 4న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీటిని అందించేందుకు ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 45 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ పదే పదే కోరుతోంది. ► అదే తెలంగాణ హైదరాబాద్ తాగునీటి సరఫరా (6.43 టీఎంసీలు), ఎస్సారెస్పీ (68.48), కాళేశ్వరం (83.19), జీఎల్ఐఎస్ (24.65), సీతారామ (21.75), ఎస్సారెస్పీ వరద కాలువ (6.65), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలు, వెరసి 214 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా వాటా ఇవ్వాలి. తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం పర్యవేక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు.. నాగార్జునసాగర్ బాధ్యతను తెలంగాణకు అప్పగించారు. కానీ.. తమ భూభాగంలో ఉందనే నెపంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ తన అధీనంలో ఉంచుకుంది. అదే నాగార్జునసాగర్‌లో కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నా, తెలంగాణ తన అధీనంలోకి తీసుకుంది. ► శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో 796 అడుగుల నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని తరలించడం వల్ల నీటి మట్టం తగ్గిపోయి రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి నీళ్లందించలేని దుస్థితి. సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డు అధీనంలోకి తేవాలి. ► విభజన చట్టంలో సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2019లో హోం శాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలి. గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ► వ్యాప్కోస్ నివేదిక ప్రకారం గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1430 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై చేపట్టి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాటికి 776, తెలంగాణలో ఉన్న వాటికి 650 టీఎంసీలు అవసరం. ► కానీ.. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 225 నుంచి 450 టీఎంసీలకు, జీఎల్ఐఎస్ సామర్థ్యాన్ని 22 టీఎంసీలకు పెంచింది. తుపాకులగూడెంను వంద టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతలను వంద టీఎంసీలు, వాటర్ గ్రిడ్‌ను 23.76 టీఎంసీలు, రాజపేట(0.35), చనాకా–కొరటా(5), పింపిరాడ్–పర్సోడా(1.2), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మూడు టీఎంసీలను తరలించే పనులు కొత్తగా చేపట్టింది. వెరసి 1,355 టీఎంసీలను వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టింది. ► దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకుని.. వాటి డీపీఆర్‌లను తెప్పించుకుని పరిశీలించాలి. గోదావరి జలాలను పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. ► మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు వాటా నీటిని వినియోగించుకోకపోవడం వల్లే గోదావరి 1,400 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు తేలింది. గోదావరిలో గరిష్టంగా 1990–91లో 6,472 టీఎంసీలు.. 2009–10లో కనిష్టంగా 1,025 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉంటాయి. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంటంది. ఈ నీటిని కొత్త ప్రాజెక్టులకు కేటాయించాలి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు సహకరించాలి ► తెలంగాణ నిర్వహిస్తోన్న నాగార్జునసాగర్, కాలువలకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం తెచ్చి ఆ«ధునికీకరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తోన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో రికార్డు స్థాయిలో 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీని వల్ల ప్రాజెక్టు దెబ్బతింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్ట్ కమిటీ తనిఖీ చేసి.. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి రూ.900 కోట్లు అవసరమని తేల్చింది. ► ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది భారమవుతుంది. కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వాటాలు వేసుకుని ఆ నిధులను సమకూర్చి.. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి సహకరించాలి. ► జల వనరులను జాతీయ సంపదగా గుర్తించాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నీటిని సమంగా సరఫరా చేసేలా చూడాలి. నదికి వరద వచ్చినప్పుడు.. ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్షించి.. వరదను దిగువకు విడుదల చేసేలా చూసి.. పరీవాహక ప్రాంతంలో ఉన్న అందరికీ వాటా మేరకు జలాలు దక్కేలా చూడాలి’ అని సీఎం జగన్ వివరించారు. అనంతరం ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ అందజేశారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. 2016 సెప్టెంబరు 9న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా తమకు కేటాయించిన వాటా నీటిని వినియోగించుకోవడానికి పరిమితమవుతామని.. అదనంగా నీటిని వినియోగించుకోబోమని తెలంగాణ పేర్కొంది. ఇప్పుడు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసి.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించడాన్ని తెలంగాణ ఎలా సమర్థించుకుంటుంది? -
మా నీళ్లు.. మా హక్కు
సాక్షి, అమరావతి: ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన.. రాత్రి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో అపెక్స్ కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ వివరాలు.. ► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ ద్వారా రోజూ 2.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. అదే నీటి మట్టం నుంచి నీటిని తరలించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపడితే తప్పేంటని ప్రశ్నించాలని నిశ్చయించారు. ► అలాగే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 796 అడుగుల నుంచే రోజూ నాలుగు టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. ఈ సీజన్ ఆరంభంలో సాగర్‌లో నీటి నిల్వలున్నా.. కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించి తెలంగాణ నీటిని తరలిస్తోందని.. దీనివల్లే నీటిమట్టం తగ్గిపోతోందన్న అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలోకి ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయని.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 20 రోజులు కూడా ఉండదనే వాస్తవాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు వివరించనున్నారు. ► నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయని.. అదే 841 అడుగులకు చేరితే కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా నీటిని తరలించలేమని వివరించనున్నారు. ► దీనివల్ల తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టులో సాగునీరు, తాగునీటికి ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పనున్నారు. ► దీనికి పరిష్కారంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం మినహా మరొక మార్గంలేదని స్పష్టం చేయనున్నారు. ► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వాటాకు మించి ఒక్క చుక్కను కూడా అదనంగా తరలించబోమని.. పాత ఆయకట్టుకే నీళ్లందిస్తామని.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టంచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► కృష్ణా బోర్డు ఏర్పాటై ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ దాని పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించకపోవడంపై అపెక్స్ కౌన్సిల్‌ను ప్రశ్నించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతలను ఏపీకి అప్పగించారని.. కానీ, ఎడమ గట్టు కేంద్రాన్ని తెలంగాణ అధీనంలో ఉంచారని.. అదే సాగర్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించారని.. కానీ, ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తెలంగాణ అధీనంలో ఉంచడంపైనా ప్రశ్నించనున్నారు. ► తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి.. శ్రీశైలం, సాగర్లను బోర్డు పరిధిలోకి తేవాలని డిమాండ్ చేయనున్నారు. అలాకాని పక్షంలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంతోపాటు ప్రాజెక్టును పూర్తిస్థాయలో ఏపీ అధీనంలోకి తేవాలని.. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీ పరిధిలోకి తీసుకొచ్చేలా కోరాలని నిర్ణయించారు. న్యాయబద్ధంగానే నీటిని పంపిణీ చేయాలి ► కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు వెలువడే వరకూ 2015లో జూన్ 18, 19న కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ప్రతిపాదించనున్నారు. ► బేసిన్లో జూన్ 2, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను పంపిణీ చేయాలని అపెక్స్ కౌన్సిల్‌ను కోరనున్నారు. ► గోదావరి బోర్డు పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించాలని కోరనున్నారు. -
సీమ ఎత్తిపోతల.. మా వాటా వాడుకోడానికే
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలంటే శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం మినహా ఏపీకి వేరే దారి లేదు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా నీటిని వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న షెకావత్ రాసిన లేఖకు వైఎస్ జగన్ ప్రత్యుత్తరమిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు కొత్తవి కావని తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ(కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్)1 చేసిన కేటాయింపులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ప్రకారం మా వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్తగా కాలువలు తవ్వడం, నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలుగానీ, అదనపు ఆయకట్టుగానీ చేర్చడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టును స్థిరీకరించడం కోసమే దీన్ని చేపట్టామన్నారు. ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లందించడానికే చేపట్టారని నిర్ధారించాయని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కానే కాదన్నారు. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను ఆపేలా నియంత్రించకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి అవకాశం కల్పించాలని వి/æ్ఞప్తి చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాశారు . సీఎం జగన్ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ఈనెల 4న మీకు లేఖ పంపాం.. ► అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలనిచైర్మన్ నిర్ణయించినట్లు అజెండాను పంపుతూ జూలై 28న Æరాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ సమాశానికి నేను హాజరవుతానని తెలియచేస్తూ అజెండా అంశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. ఆ మేరకు ఈ నెల 4న కేంద్ర జల్ శక్తి శాఖకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అయితే ఈనెల 7న మీరు రాసిన లేఖలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొనడంలో వాస్తవం లేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం నుంచి రోజుకు ఎనిమిది టీఎంసీలు తరలించేవి కొత్త ప్రాజెక్టులని మీరు రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులు కొత్తవి కావు. కేడబ్ల్యూడీటీ1 కేటాయింపులు, 2015లో ఇరు రాష్ట్రాలకు చేసిన పంపకాల ప్రకారం వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవటానికే వీటిని చేపట్టాం. అనుమతులు లేకుండానే పలు ప్రాజెక్టులు.. ► విభజన చట్టం సెక్షన్ 85(8)డీ ప్రకారం ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు, విభజన నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపదని కృష్ణా, గోదావరి బోర్డులు నిర్థారించాక, సాంకేతిక అనుమతి తీసుకున్న తరువాతే కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. ► కానీ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. ఈ పథకాల కింద కొత్తగా కాలువలు తవ్వుతోంది. నీటి నిల్వ సామర్థ్యం ఉండే రిజర్వాయర్లు నిర్మిస్తోంది. కొత్త ఆయకట్టును సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు సెప్టెంబరు 21, 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. తీర్పు నోటిఫై కాకున్నా పనులు.. ► కేడబ్ల్యూడీటీ2లో కేటాయించిన నీటిని వాడుకోవడానికే పాలమూరురంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టామంటూ తెలంగాణ సర్కార్ సమర్థించుకుని పనులను కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కేడబ్ల్యూడీటీ 2 తీర్పు నోటిఫై కాకున్నా పనులు కొనసాగిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మరో సారి అపెక్స్ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయించినా ఆ ప్రాజెక్టుల పనులను నిలిపేయాలని కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశాన్ని నిర్వహించాలని.. తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదాన్ని పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఇప్పటిదాకా నిర్వహించలేదు. ► శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం చేరడానికి ముందే జూరాల ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కారు నీటిని తరలిస్తోంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించుకుంటోంది. ► శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను తలించడానికి తెలంగాణసర్కార్ కొత్తగా నాలుగు ప్రాజెక్టులను చేపట్టింది. 796 అడుగుల నుంచే ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 42 వేల క్యూసెక్కులను తరలించే అవకాశం తెలంగాణకు ఉంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి దిగువకు తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. దీని వల్ల కేడబ్ల్యూడీటీ1 చట్టబద్ధంగా ఏపీకి ఇచ్చిన వాటా నీటిని కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు.. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు. శ్రీశైలం నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరునగరి ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి చేసిన ఏర్పాటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించే వీలుంది. కానీ.. ప్రాజెక్టులో ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది నుంచి 15 రోజులు కూడా ఉండటం లేదు. నీటి మట్టం 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కేవలం ఏడు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే.. నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ పనులు.. ► శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించడానికి తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు మే 14న మేం లేఖ రాశాం. ఆ ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని మే 30న తెలంగాణ సర్కార్నుబోర్డు ఆదేశించినా Ðవాటిని కొనసాగిస్తోంది. ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటామని.. అంతకు మించి వాడుకోబోమని తెలంగాణ సర్కార్ ఎక్కడా చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 854 అడుగులకుపైనే నీటిని తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెప్పడం ఎంతవరకూ న్యాయం? గోదావరి బేసిన్లో కూడా.. ► గోదావరి బేసిన్లో కూడా తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని గోదావరి బోర్డు సమావేశంలో చర్చించాం. మా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.. ► రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నియంత్రిస్తున్నట్లుగా తెలంగాణకు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కానేకాదని ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం నివేదిక తమ అభిప్రాయాలు చెప్పాయి. గత నెల 29న ఈ పథకానికి అనుమతి ఇస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతి పత్రాలను మీకు పంపుతున్నాం. -
పర్యావరణ అనుమతి అక్కర్లేదు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల పనులు పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని తేల్చిచెబుతూ జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) దక్షిణ ప్రాంత బెంచ్ (చెన్నై)కు బుధవారం నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ కేంద్రం నివేదిక ఇవ్వడం గమనార్హం. రాయలసీమ ఎత్తిపోతలపై ఆగస్టు 11న ఎన్జీటీ నిర్వహించే తుది విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ► కృష్ణా నదీ జలాల్లో తన వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. ► పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ► ఈ పిటిషన్‌పై మే 20న విచారించిన ఎన్జీటీ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలంటూ స్టే ఇచ్చింది. ► తన వాటా జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పనులు చేపట్టామని.. వీటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పథకం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నివేదించింది. ► ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 13న విచారించిన ఎన్జీటీ.. ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. -
‘సీమ’ ఎత్తిపోతల టెండర్‌కు జ్యుడిషియల్ ప్రివ్యూ ఓకే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు శనివారం ఆమోదించారు. ఇదే ప్రతిపాదనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీలను తరలించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్‌పీ)పై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టులో పంటలను రక్షించడానికి.. తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు మే 5న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను అంతర్గత అంచనా విలువగా నిర్ణయించి.. ఈపీసీ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో టెండర్ నిర్వహించడానికి ఈనెల 16న జ్యుడిషియల్ ప్రివ్యూకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిని వారం రోజులు వెబ్సైట్లో ఉంచిన జ్యుడిషియల్ ప్రివ్యూ వివిధ వర్గాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రతిపాదనల్లో మార్పులు చేసి ఆమోదించింది. ఇదే ప్రతిపాదనల ఆధారంగా టెండర్ నోటిఫికేషన్ జారీకి అధికారులు సిద్ధమయ్యారు. -
‘సీమ’ ఎత్తిపోతల టెండర్లకు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన కృష్ణా జలాల్లో వాటాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల (ఆర్‌ఎస్సైఎల్) పథకం టెండర్ ప్రతిపాదనలకు జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోద ప్రక్రియ శుక్రవారం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈ పనులకు సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులకు రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో మే 5న రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వగా రూ.3,278.18 కోట్లతో ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో 30 నెలల్లో పనులు పూర్తి చేయాలనే గడువుతో టెండర్లకు సిద్ధమైంది. కాగితాల్లో కేటాయింపులున్నా నీళ్లేవి? ► శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్‌పీ) నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 114 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉండగా 2018–19, 2019–20ల్లో మినహా ఏనాడూ కేటాయింపుల మేరకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ► శ్రీశైలంలో 854 అడుగుల కంటే నీటిమట్టం తగ్గితే పీహెచ్‌పీ ద్వారా నీళ్లందవు. దీంతో కృష్ణా బోర్డు నీటి కేటాయింపులున్నా సరే వినియోగించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ► శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల (243 మీటర్లు) నుంచి రోజుకు మూడు టీఎంసీల (34,722 క్యూసెక్కులు) చొప్పున ఎత్తిపోసి పీహెచ్‌పీకి దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు తరలించి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందించడం ద్వారా సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల ఇదీ.. ► శ్రీశైలం జలాశయం జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద ఉప నది అయిన తుంగభద్ర కృష్ణా నదిలో కలుస్తుంది. సంగమేశ్వరం వద్ద శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉంటుంది. ► సంగమేశ్వరం నుంచి ఒక్కో పంప్ 81.93 క్యూమెక్కులు (2,893.5 క్యూసెక్కులు) చొప్పున 12 పంప్‌ల ద్వారా 34,722 క్యూసెక్కులను 39.60 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా పంప్ హౌస్‌ను నిర్మిస్తారు. అక్కడి నుంచి ముచ్చుమర్రి వరకు జలాశయంలో 4.5 కి.మీ. పొడవున అప్రోచ్ కెనాల్ తవ్వుతారు. ► సంగమేశ్వరం పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైపు లైన్(ప్రెజర్ మైన్) ద్వారా తరలించి డెలివరీ సిస్ట్రన్‌లో పోస్తారు. అక్కడి నుంచి 22 కి.మీ. పొడవున కాలువ తవ్వి పీహెచ్‌పీకి దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు తరలిస్తారు. ► ఈ నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేట్ కాంప్లెక్స్ వద్దకు తరలించి ఎడమ వైపు కాలువ ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టుకు, మధ్యలో కాలువ ద్వారా కేసీ కెనాల్‌కు.. కుడి వైపు కాలువ ద్వారా ఎస్సార్బీసీ, గాలేరు–నగరికి సరఫరా చేస్తారు. ► నీటిని ఎత్తిపోయడానికి ఒక పంప్‌నకు 33.04 మెగావాట్ల విద్యుత్ అవసరం. 12 పంప్‌లకు 396.48 మెగావాట్ల విద్యుత్ కావాలి. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్తు వినియోగించి ఒక కేంద్రం నుంచి ఇంత భారీగా నీటిని ఎత్తిపోయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ► సంగమేశ్వరం పంప్ హౌస్, పైపు లైన్, డెలివరీ సిస్ట్రన్, 22 కి.మీ. పొడవున కాలువ తవ్వకం కోసం 1,200 ఎకరాల భూమి సేకరించాలని అంచనా వేశారు. సీమకిచ్చే నీళ్లకంటే సముద్రంలో కలిసేవే ఎక్కువ ► శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేస్తున్న కృష్ణా జలాల కంటే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్న జలాలే అధికం. ఈ నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పీహెచ్‌పీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ► శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల మేర ఉన్నప్పుడే పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుతం ఉన్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించవచ్చు. అయితే ఆ మేరకు శ్రీశైలం నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని ‘శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటేనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు కనీసం ఏడు వేల క్యూసెక్కులైనా నీళ్లందుతాయి. కానీ 800 అడుగుల నుంచి తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటం వల్ల జలాశయంలో నీటి మట్టం మెయింటెయిన్ చేయడం కష్టమవుతోంది. కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే నీళ్లందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మన వాటా నీటిని వినియోగించుకుని సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇది దుర్భిక్ష ప్రాంతాలకు కల్పతరువు’ – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్ -
రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో.. 30 నెలల్లో పనులను పూర్తి చేయాలనే షరతుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ పనులకు రూ.3,278.18 కోట్లను ఐబీఎం(అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజు నుంచి షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. టెండర్ షెడ్యూళ్లు దాఖలు చేసే వారు రూ. 10 కోట్లను ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)గా చెల్లించాలి. – ఆగస్టు 3 మధ్యాహ్నం మూడు గంటల వరకూ టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజున ఐదు గంటల్లోగా షెడ్యూళ్లను దాఖలు చేయాలి. – ప్రీ–బిడ్ సమావేశాన్ని ఈనెల 27న నిర్వహిస్తారు. టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్ల సందేహాలను జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. – వచ్చే నెల 4న ఉదయం 11 గంటలకు సాంకేతిక బిడ్‌ను, 7న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. – ఆర్థిక బిడ్‌లో తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. 10న ఉదయం 11 గంటల నుంచి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన (ఎల్–1) కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి.. వీటిని ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ)కి పంపుతారు. వాటిని ఎస్‌ఎల్‌టీసీ పరిశీలించి ఆమోదించాక కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. -
దుర్భిక్ష సీమకు జల రక్ష!
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే వరద జలాలను ఒడిసి పట్టి కరువు పీడిత రాయలసీమలో నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసేందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువున ఎస్సార్బీసీ కాలువ సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీలను ఎస్సార్బీసీలోకి ఎత్తిపోసే పథకాలను చేపట్టామనే అంశాన్ని తెలంగాణ సర్కారుకు, అక్కడి ప్రతిపక్ష నేతలకు, రిటైర్డ్ ఇంజనీర్లకు వివరించాలని నవ్యాంధ్రప్రదేశ్ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అవాస్తవాలను వల్లె వేస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య శత్రుత్వాన్ని రగిల్చేందుకు కొందరు పన్నుతున్న పన్నాగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. (మన వాటా నీటి కోసమే.. రాయలసీమ ఎత్తిపోతల) సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ కరువును కడతేర్చడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్థ్యాన్ని పెంచుతోందని, కృష్ణా జలాల వినియోగంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డుకు కట్టుబడి ఉంటామనే అంశాన్ని తెలంగాణకు స్పష్టం చేయాలని కోరింది. దేశ ఆహార అవసరాలను తీర్చాలనే ధ్యేయంతో తెలంగాణ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిందని ప్రశంసించింది. రాయలసీమ దాహార్తి తీర్చడానికి, కనీసం నాలుగేళ్లకు ఒక్కసారైనా పంటలకు నీళ్లందించి పేదరికాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలువల సామర్థ్యం పెంపునకు తెలంగాణ సర్కార్ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నవ్యాంధ్రప్రదేశ్ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. వరుసగా కరువు కాటకాలు.. ► రాయలసీమ భౌగోళిక విస్తీర్ణం 67,710 చదరపు కి.మీ. కాగా 5,125 గ్రామాల్లో 1.64 కోట్ల మంది నివసిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉండటం, వరుస కరువుల వల్ల సీమ ప్రజలు గుక్కెడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ► 1960 నుంచి వరద ప్రవాహాలను పరిశీలిస్తే నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే కృష్ణా నదికి వరద వస్తుంది. విభజన తర్వాత కృష్ణా నదికి రెండు సార్లు వరద వచ్చింది. ► కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే వరదను ఒడిసి పట్టి రాయలసీమలో జలాశయాలను నింపడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పోతిరెడ్డిపాడు కాలువల విస్తరణ, సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పిల్ వే సామర్థ్యం పెంచాలని సీడబ్ల్యూసీ సూచించింది.. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం స్పిల్‌వే ప్లంజ్ పూల్ దెబ్బతింది. భారీ వరదను తట్టుకునేలా శ్రీశైలం స్పిల్ వే సామర్థ్యాన్ని పెంచాలని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) బృందం సూచించింది. ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల శ్రీశైలం స్పిల్‌వేపై వరద ఉధృతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నాగార్జునసాగర్ దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రామాలు, విజయవాడ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి దోహదపడుతుంది. వరద వినియోగం కోసం తెలంగాణలో పలు ప్రాజెక్టులు ► బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు), ఎస్సెల్బీసీ (30 టీఎంసీలు)లపై ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించలేదు. ► అయినా సరే విభజన తర్వాత మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (90 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (30 టీఎంసీలు), మిషన్ భగీరథ (19.59 టీఎంసీలు), పాలేరు రిజర్వాయర్ నుంచి భక్తరామదాస ఎత్తిపోతల (5.50 టీఎంసీలు), సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (15 టీఎంసీలు), ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు (పది టీఎంసీలు), నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (3.40 టీఎంసీల) చేపట్టడం ద్వారా అదనంగా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి పనులు చేపట్టింది. అంటే.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరద జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ సర్కార్ పలు ప్రాజెక్టులు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నారు.. ► బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తెలుగుగంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగులు జలాల ఆధారంగా చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టుల పట్ల ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించలేదు. మిగుల జలాలను తరలించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కార్ పలు ప్రాజెక్టులు చేపట్టిన తరహాలోనే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసి పేదరికాన్ని నిర్మూలించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల విస్తరణ పనులను చేపట్టింది. నికర జలాల కేటాయింపు ఉన్న ఎస్సార్బీసీ (19 టీఎంసీలు), తెలుగుగంగ (25 టీఎంసీలు) ఆయకట్టుకు సక్రమంగా నీటిని సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుంది. ► ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015 జూన్ 19న కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఐదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. ట్రిబ్యునల్ అవార్డుకు కట్టుబడి పరస్పర సహకారం, స్నేహపూర్వక వాతావరణంలో కృష్ణా జలాలను వినియోగించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.