Subsidy loans
-
దా‘రుణ’ మోసం
కర్నూలు, డోన్: ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బ్యాంకుల్లో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఘనులు రోజుకోకకరు బయట పడుతూనే ఉన్నారు. మండలంలోని యాపదిన్నె మజారా మల్యాల గ్రామంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. మల్యాల గ్రామానికి చెందిన కుందర్తి సంజీవులుకు సబ్సిడీ రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.లక్ష రుణం తీసుకొని తలా రూ.50 వేలు తీసుకుందామని, నువ్వు తీసుకున్న రుణం సబ్సిడీ కింద పోగా, మిగతాది తానే చెల్లిస్తానని చనుగొండ్ల వ్యక్తి నమ్మించాడు. 815/1 సర్వే నంబర్లో సెంటు భూమి లేకపోయినా సంజీవులుకు 13 ఎకరాలు పొలం ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సృష్టించాడు. వాటిని పత్తికొండ కేడీసీసీ బ్యాంక్‌లో పెట్టి 2018 ఫిబ్రవరి 21న రూ.9,75,000 రుణం తీసుకున్నాడు. సంజీవుడిని మాత్రం రూ.50 వేలు చేతిలో పెట్టి మిగతాది స్వాహా చేశాడు. డొంక కదిలింది ఇలా.. సర్వీస్ ఏరియా కాకపోయినా సంజీవునికి ఉదారంగా రుణం ఇచ్చిన పత్తికొండ కేడీసీసీ బ్యాంక్ అధికారులు వాయిదాలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది మే 19న నోటీసులు జారీ చేశారు. దీంతో సంజీవుడు లబోదిబో మంటున్నాడు. తనకు ఇచ్చింది కేవలం రూ.50వేలు మాత్రమేనని మిగిలిన రూ.9,25,000 చనుగొండ్లకు చెందిన ఓ వ్యక్తి స్వాహా చేశాడని సంజీవుడు ఆరోపిస్తున్నాడు. ఆన్లైన్లో మాయం రుణం ఇచ్చే సందర్భంలో ఆన్లైన్లో కన్పించిన పొలం వివరాలు ప్రస్తుతం మాయం కావడంతో బ్యాంక్ అధికారులు నివ్వెరపోతున్నారు. సెంటు స్థలం లేని వ్యక్తి నుంచి రుణం ఎలా కట్టించుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడిపోయారు. ఎందరో బలి పశువులు.. సంజీవుడు లాంటి వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ, బ్యాంక్ అధికారులకు మామూళ్లు ఎరచూపి లక్షలాది రూపాయలను రుణాల కింద దిగమింగుతున్న పెద్దల భరతం పట్టేందుకు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై అలసత్వం వహిస్తే సంజీవుడు లాంటి మరెందరో బలిపశువులు కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. -
సబ్సిడీ రుణాలకు 20 లక్షలకు పైగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాల కోసం ఈ ఏడాది మొత్తం 20,67,509 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 10వ తేదీ ఆదివారంతో ముగిసింది. మొత్తం 1,94,582 మందికి రుణాలివ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారుకు 20లక్షలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ మొత్తం దరఖాస్తులు ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) ద్వారా 20 కార్పొరేషన్లకు దరఖాస్తులు అందాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఎంబీసీ, క్రిస్టియన్ మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగుల కార్పొరేషన్‌తో పాటు మరికొన్ని ఉన్నాయి. ప్రధానంగా బీసీ కార్పొరేషన్‌కు 6,93,914 దరఖాస్తులు, ఎస్సీ కార్పొరేషన్‌కు 3,07,473, కాపు కార్పొరేషన్‌కు 2,08,007, మైనార్టీ కార్పొరేషన్‌కు 2,56,922 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మండల స్థాయిలో ఎంపీడీఓలతో ప్రభుత్వం నియమించిన కమిటీలు.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మునిసిపల్ కమిషనర్లతో నియమించిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3,405.79 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలివ్వనుంది. ఇందులో సబ్సిడీ కింద రూ.1,678.50 కోట్లు ఇవ్వనుంది. -
రుణాలు రాక.. కష్టాలు తీరక
సాక్షి, కంభం (ప్రకాశం): ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం అర్హులకు అందలేదు. ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలదే పెత్తనం, రుణాలైనా, రేషన్‌కార్డులైన, పించన్‌లైనా ఇలా ఏది చూసుకున్నా పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితమైపోతున్నాయని అర్హులకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక మైనారిటీ కార్పోరేషన్ ద్వారా ముస్లింల సబ్సిడీ రుణాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనమే సాగింది వారు చెప్పిన వారిపేర్లనే అధికారులు ప్రతిపాదించారు. పోనీ వాళ్లకైనా రుణాలు ఇచ్చారా అంటే అదికూడాలేదు. 2018–19కి గానూ జిల్లాలో 11812 మంది మైనారిటీలు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా ఒక్కరికి కూడా నేటికి ఒక్కరుపాయి రుణం అందలేదు. దీంతో టిడిపి కార్యకర్తలు సైతం ప్రభుత్వం తీరుతో విస్తుపోయి సబ్సిడీ రుణాలపైన ఆశలు వదులుకున్నట్లు కన్పిస్తుంది. అర్హులకు అందని రుణాలు సబ్సిడీ రుణాలు ఒక్కరి ఖాతాలో కూడా జమ కాలేదు. ఒంగోలు మైనారిటీ కార్యాలయానికి వెళ్లి ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లు కూడా అందజేసామని రుణాలకు ఎంపికైన అభ్యర్థులు తెలిపారు. త్వరలో బ్యాంకుల్లో లోన్ల డబ్బులు పడతాయని అధికారులు చెప్పినా నేటికి ఒక్కరుపాయి కూడా ఎవరికి అందలేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు కూడా వచ్చేయడంతో తమకు ఇక రుణాలు వస్తాయో లేదో అన్న అనుమానం కలుగుతుందని వాపోతున్నారు. కొందరు టీడీపీ నాయకులు రుణాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మండలం మంజూరైన యూనిట్లు వచ్చిన రఖాస్తులు కంభం 69 554 బేస్తవారిపేట 34 144 గిద్దలూరు 37 237 రాచర్ల 36 265 కొమరోలు 53 267 అర్థవీడు 59 144 జన్మభూమి కమిటీలతో నష్టపోయా.. ఇప్పటికీ నాలుగుసార్లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో నాకు ఒక్కసారి కూడా రుణం మంజూరు కాలేదు. అధికారులు సైతం వారి మాటలే వినడంతో నాకు రుణం మంజూరు కాలేదు. –మహబూబ్ వలి, కందులాపురం ప్రతి ఏడాది దరఖాస్తు చేస్తున్నాను.. రుణం కోసం ప్రతి ఏడాది దరఖాస్తు చేసి కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తున్నాను. ఇప్పటికి ఒక్కసారి కూడా మంజూరు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగక పోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతుంది. - షేక్.మస్తాన్‌వలి రుణం వస్తే వ్యాపారం చేసుకుందామనుకున్నాను.. మైనారిటీ రుణం వస్తే చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చులే అనుకున్నాను. లోను మంజూరైందో లేదో కూడా తెలియడం లేదు. దీంతో కష్టంగా ఉన్న బేల్దారు పనికి పోతున్నాను. –నాయబ్ రసూల్, కంభం లబ్ధిదారుల జాబితా అప్లోడ్ చేశాం.. అర్హులను ఎంపిక చేసి ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ చేశాం. మైనారిటీ కార్పొరేషన్ రేషన్ నుంచి మంజూరు కావాల్సి ఉంది. ఇతర కార్పొరేన్లకు సంబంధించి కూడా ఎవరికి రుణాలు మంజూరు కాలేదు. దీనిపై అధికారులతో సమీక్షిస్తాం. –ప్రసూనాదేవి, ఎంపీడీఓ -
పచ్చ మోసం
రైతులకు మేం చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం చేసేదొకటి చెప్పేదొకటని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పథక సబ్సిడీలు పెంచామని పైకి చెబుతున్నా అది రైతు దరి చేరిందెక్కడని ప్రశ్నిస్తున్నాయి. ఉద్యాన రైతులకు విరివిగా పథకాలు వినియోగించుకోవడానికి అవకాశాలు కల్పించామని మంత్రి ఊదరగొడుతుంటారు. కానీ చేతల్లో మాత్రం చూపించకపోవడం గమనార్హం. కడప అగ్రికల్చర్ : ఉద్యాన రైతులు ఏడాది కాలంగా పండ్లతోటల సాగు, పాత తోటల పునరుద్ధరణ, యాంత్రీకరణ పథకం, పంట రక్షణ చర్యలు ఊతకర్రలతో పంటలసాగు ఇలా పలు పథకాలను వినియోగించుకున్నారు. కానీ ఏడాది కావస్తున్నా ఆయా పథకాలకు సబ్సిడీ రుణం విడుదల కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ వాటా చెల్లించాలని దరఖాస్తులు పంపే సమయంలో చెప్పారని, పథకం మంజూరయ్యాక మీ ఖాతాల్లో సబ్సిడీ రుణం పడుతుందన్నారు. ఇంత వరకు తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా పడలేదని ఆయా తోటల రైతులు చెబుతున్నారు. ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వంలోనూ లేదని నిప్పులు చెరుగుతున్నారు. అసలే కరువు పరిస్థితుల్లో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం ఇట్లా చేయొచ్చునా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యాన శాఖలో అమలవుతున్న పథకాలు.. జిల్లాలో 2018–19 సంవత్సరానికి ఉద్యాన తోటల సాగుకు మొక్కల పెంపకం, వాటి పరికరాలు, నూతన పండ్లతోటల సాగు, మొదటి, రెండో, మూడో సంవత్సరాల్లో సాగు చేసిన తోటల నిర్వహణ, ముదురు, పాత తోటలనుసాగులోకి తీసుకువచ్చే పునరుద్ధరణ పథకం, కొమ్మల కత్తరింపు, మల్చింగ్, సస్యరక్షణ, ప్యాక్ హౌస్‌లు, కోత అనంతరం చేపట్టాల్సిన పద్ధతులు, శీతలీకరణ గిడ్డంగులు, ఉద్యాన యాంత్రీకరణ పనిముట్లు, పండ్లతోటలకు రక్షక కవచాలు, నీటి ఎద్దడి నుంచి కాపాడే జీబా వంటి 21 రకాల స్కీములు సమీకృత ఉద్యాన అభివృద్ధి పధకం, రాష్ట్రీయ కృషి వికాష్ యోజన, రాష్ట్ర ప్రణాళిక కింద పధకాలు అమలవుతున్నాయి. రైతులకు రావాల్సిన బకాయి రూ.14.71 కోట్లు.. జిల్లాలో ఆయా పథకాల కింద రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, మైదుకూరు, బద్వేలు, కడప, రాజంపేట, రైల్వేకోడూరు ఉద్యా న డివిజన్లలోని 41 మండలాల్లో ఉద్యాన తోటలు 1.80 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కొన్ని కొత్త తోటలు కాగా, మిగిలినవి పాతవి, కూరగాయ తోటలు ఉన్నాయి. వీటి సాగు కోసం రైతులు సమీకృత ఉద్యాన అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాష్ యోజన, రాష్ట్ర ప్రణాళిక పథకాల కింద దరఖాస్తు చేసుకుని తోటలను సాగు చేసుకున్నారు. కొందరు బ్యాంకుల్లో, ప్రైవేటుగా వడ్డీలకు రుణాలు తెచ్చుకుని పండ్ల, కూరగాయల తోటల ను సాగు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణం ఇంత వరకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మా డబ్బులు రావేమోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులంటే ప్రభత్వానికి చిన్నచూపు మామిడి పాత తోటలు పునరుద్ధరించుకోమని చెప్పారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు అనుమతిచ్చారు. ఆ ప్రకారం తాను పాత తోటలను కొమ్మలను కత్తిరించుకుని మళ్లీ సాగులోకి తెచ్చుకున్నాను. ఎరువులు, పురుగు మందులకు సొమ్ములు చెల్లిస్తామన్నారు. దీని కోసం బ్యాంకులో అప్పుగా రుణం తీసుకున్నాం. అప్పు తీర్చుద్దామంటే ప్రభుత్వం సబ్సిడీ మొత్తం విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు తగదు. –పచ్చిపాల రంగారెడ్డి, మామిడి రైతు, దిగువబత్తినవాండ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం ప్రభుత్వానికి నివేదికలు పంపాం... జిల్లాలో రావాల్సిన ఉద్యాన పంటల సబ్సిడీ రుణం విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాం. కొంత కాలంగా ఈ సమస్య ఉంది. అయినా ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రైతుల ఖాతాలకు వెళతాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఉద్యాన శాఖ -
శిక్షణతోనే సరి.. రాయితీలు మరి!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి గాడి తప్పింది. నిరుద్యోగ యువతను ఉద్యోగావకాశాలకు ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి రంగంవైపు ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ల లక్ష్యం అటకెక్కింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించిన ఆశావహులందరికీ రాయితీలిచ్చి సహకరిస్తామంటూ వార్షిక సంవత్సరం ప్రారంభంలో భారీ ప్రణాళికలు తయారు చేసిన వివిధ కార్పొరేషన్లు ప్రస్తుతం ముఖం చాటేశాయి. రాయితీలపై నోరుమెదపకుండా శిక్షణ కార్యక్రమాలతో సరిపెడుతున్నా యి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న వారికి చెయ్యిచ్చాయి. మరో నెలన్నరలో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. కనీసం దరఖాస్తుల పరిశీలన సైతం చేయకపోవడంతో అర్జీదారులు డీలా పడ్డారు. 10.25 లక్షల మంది ఎదురుచూపులు.. భారీ వార్షిక ప్రణాళికలు రూపొందించిన ఫైనాన్స్ కార్పొరేషన్లు గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10.25 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరం చివర్లో 7,59,788 మంది దరఖాస్తు చేసుకోగా... 2018–19 వార్షికం ప్రారంభంలో 2,65,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలిం చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈక్రమంలో ముందు గా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధారిస్తే... ఆమేరకు పరిశీలన చేపట్టి అర్హులను గుర్తిస్తారు. కానీ ఇప్పటివరకు జిల్లాల వారీ లక్ష్యాలను ఆయా ఫైనా న్స్ కార్పొరేషన్లు నిర్ధారించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫైనాన్స్ కార్పొరేషన్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించకపోవడమే. సాధారణంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే వాటికి ఆమోదం రావాల్సి ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సమర్పించిన 2018–19 వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపికను సైతం నిర్వహిం చలేదు. 2018–19 వార్షిక ప్రణాళికలకు ఆమోదం రాకపోవడం, గత దరఖాస్తులకు మోక్షం కలగని కారణంగా ఈ ఏడాది ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్లు కనీసం దరఖాస్తులు సైతం స్వీకరిం చలేదు. ప్రస్తుతం కార్పొరేషన్ల వద్ద ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలంటే రూ.18,062.41 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల నిధితో 17వేల మంది లబ్ధిదారులకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. వీరంతా రూ.50 వేలలోపు యూనిట్లు పెట్టుకున్నవారే. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో ఇవికూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘ముందస్తు’తో ఆవిరైన ఆశలు.. 2017–18 వార్షికంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ తరువాతి ఏడాదిపైనే కార్పొరేషన్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈక్రమంలో 2018–19 వార్షిక ప్రణాళికలను భారీగా తయారు చేసిన అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఎన్నికల సీజన్ కావడంతో తప్పకుండా నిధులు వస్తాయని అన్నివర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ రెండో త్రైమాసికంలోనే ప్రభుత్వం ముందస్తుకు సిద్ధం కావడంతో నిరుద్యోగ యువతకు భంగపాటు తప్పలేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మరో రెండు నెలలపాటు కాలయాపన జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఈసారి స్వయం ఉపాధికి రాయితీ రుణాలు కష్టమేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పేదలకు సబ్సిడీ రుణాలిస్తాం
సాక్షి, అమరావతి: సబ్సిడీ రుణాలు ఇవ్వడం ద్వారా పేదలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మెగా రుణమేళాను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన లబ్ధిదారుల సభలో మాట్లాడారు. వచ్చే రుణమేళాలో ఈబీసీలకు కూడా మేలు చేస్తామన్నారు. బీసీలకు ఆధునిక పనిముట్లు ఇవ్వడం ద్వారా వృత్తుల్లో మరింత రాణించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఎస్టీల్లో చైతన్యం లేదని, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజన యువకుడు శ్రావణ్‌కుమార్‌కు గిరిజన మంత్రితో పాటు కుటుంబ సంక్షేమ శాఖను కేటాయించిన ఘతన టీడీపీదేనన్నారు. అబ్దుల్ కలామ్‌ను దేశాధ్యక్షుడిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. డప్పు కళాకారులు, చెప్పులు కుట్టుకునే వారికి కొత్తగా పింఛన్ ఇస్తున్నట్లు చెప్పారు. పలు పథకాల ద్వారా పేదరిక నిర్మూలన, పోషకాహారలోపాన్ని పోగొట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్పొరేషన్ల వారీగా నాలుగు నెలల్లో పంపిణీ చేయబోయే లబ్ధిదారులు, నిధుల వివరాలు వివరించారు. మొత్తంగా మొదటి విడత రెండు లక్షల యూనిట్లు, రూ. 1697.5కోట్ల నిధులతో పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సానుకూల ప్రభుత్వం దేశంలో రావాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. సభ ప్రారంభానికి ముందు జ్యోతి వెలిగించి పేదరికంపై గెలుపు లోగోను ఆవిష్కరించారు. సభానంతరం ఆదరణ వస్తువులు, కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుతో పాటు ఇతర మంత్రులు దేవినేని ఉమా, మహమ్మద్ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం రామారావు, ఎస్సీ కార్పొరేషన్ వైఎస్ చైర్మన్ జిఎస్ఆర్కేఆర్ విజయకుమార్, విజయవాడ నూతన సబ్‌కలెక్టర్ మిషాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రుణమేళాలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నామని చెప్పడం దానికి ఓ ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లకు మాత్రమే చట్టబద్ధత ఉందని, బీసీ సబ్‌ప్లాన్ గైడ్‌లైన్స్ కూడా ఇంతవరకు తయారు కాలేదని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం అంటే బీసీలను దగా చేయడమేనని విమర్శిస్తున్నారు. -
ఇదేం దా‘రుణం’!
ఖమ్మంమయూరిసెంటర్: ఉపాధి చూసుకునేందుకు, ఆర్థిక స్వావలంబన పొందేందుకు సబ్సిడీ రుణాలిచ్చి చేయూతనిచ్చే రాజీవ్ యువశక్తి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు సంవత్సరాలుగా దీనిద్వారా ఎలాంటి రుణాలు మంజూరు చేయట్లేదు. అసలు..దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం ఏర్పాటు చేశారా? లేక కొనసాగిస్తారా? యువజనుల పరిస్థితి ఏంటి..? అనే అంశాలపై స్పష్టత కరువైంది. రుణాలు పొంది బాగుపడుదామనుకున్న అర్హులు..తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువజన సర్వీసుల శాఖ (సెట్‌కమ్) నిర్వీర్యమైంది. లోన్లు ఇచ్చి సొంత వ్యాపారం పెట్టించే, బతుకుదెరువు చూపించే రాజీవ్ యువశక్తి పథకం ద్వారా చివరిసారిగా 2014–15 లో జిల్లాలోని 296 మంది నిరుద్యోగులకు రూ.2.77 కోట్ల రుణాలను 30శాతం సబ్సిడీపై మంజూరు చేశారు. ఆ తర్వాత మూడేళ్లుగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి లోన్లు కేటాయించలేదు. యువజ న సర్వీసుల శాఖతోపాటు క్రీడల విభాగాన్ని కూడా అనుసంధానం చేసి డీవైఎస్వోగా మార్చారు. దీంతో యువత కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన శాఖ ద్వారా రుణా లు అందుతాయని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో రాజీవ్‌యువశక్తి పథకం ఉందో లేదో తెలియని అయోమయం నెలకొంది. అన్నివర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచే శాఖ నుంచి పథకాలు తీసేస్తే తమ పరిస్థితి ఏంటని యువత ప్రశ్నించుకుంటున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై చదువులు పూర్తిచేసి, ఉద్యోగాలు లేని అనేకమంది యువత సెట్క మ్ ద్వారా అందించే రుణాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ శాఖ చడీచప్పుడు లేకుండా పడిఉంది. జీఓ వచ్చినా రుణాలు రాలే.. 2016–17 ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగ యువతకు మూడు విభాగాలుగా సబ్సిడీ కోటాను పెంచింది. స్కీమ్–ఏ కింద 7వ తరగతివరకు చదివిన నిరుద్యోగులకు రూ.లక్ష వరకు లోను మంజూరు చేస్తారు. దీనికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. స్కీమ్–బీ కింద పదో తరగతి విద్యార్హతపై నిరుద్యోగులకు రూ.2లక్షల రుణం ఇచ్చి, 70శాతం సబ్సిడీని వర్తింపజేయాలి. స్కీమ్–సీ కింద డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు రూ.5లక్షల వరకు 60శాతం సబ్సిడీపై రుణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జీవో జారీ అయినా..నేటికీ మార్గదర్శకాలు రాలేదు. నిరుద్యోగులకు వెతలు తప్పట్లేదు. నిరుద్యోగుల్లో తీరని వేదన.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతను చైతన్య పరచడంతో పాటు వారిలోని కళను వెలికితీయడం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సబ్సిడీ రుణాలు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖను ఏర్పాటు చేసింది. అయితే ఏ లక్ష్యంతో దీనిని ప్రారంభించారో ఆ శాఖ నుంచి నిరుద్యోగులకు అవసరమైన సాయం మాత్రం అందట్లేదు. కేవలం యువతలోని కళలను మాత్రమే ప్రొత్సహిస్తున్న యువజన సర్వీసుల శాఖ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించలేట్లేదు. ప్రభుత్వ శాఖను క్రీడలశాఖలో విలీనం చేసి, రెండు శాఖలకు ఒకే అధికారిని నియమించింది. దీంతో నిరుద్యోగులు, యువజన సంఘాలు, కళాకారులతో కళకళలాడే యువజన సర్వీసుల శాఖ గత రెండు సంవత్సరాల నుంచి వెలవెలబోతోంది. ఈ శాఖ నుంచి తమకు సాయం అందదని నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు. -
రుణం ఇప్పించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు
కమలాపూర్(హుజూరాబాద్): సబ్సిడీ రుణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ గల్ఫ్ కార్మికుడు శుక్రవారం వాటర్ ట్యాంకు ఎక్కి గంటకు పైగా ఆందోళనకు దిగాడు. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన గందసిరి రాజ్‌కుమార్ కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లేక తిరిగి వచ్చాడు. ఇక్కడ హమాలీగా పనిచేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో కమలాపూర్ మండలం నుంచి పలువురు దరఖాస్తు చేసుకోగా మొదటి విడతగా కొందరికి మంజూరయ్యాయి. కమలాపూర్ నుంచి సుమారు 50 మంది ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు. నెల గడుస్తున్నా రుణం రాకపోవడంతో రాజ్‌కుమార్ కమలాపూర్‌లోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేపట్టాడు. పోలీసులు చేరుకుని ఎంత నచ్చజెప్పినా విన లేదు. టీఆర్ఎస్ నాయకుడు మౌటం అశోక్ కొన్ని డబ్బులు పట్టుకుని ట్యాంకు ఎక్కి ఇచ్చినప్పటికీ తనకు రూ.2లక్షలు ఇస్తే తప్పా కిందికి దిగనని భీష్మించాడు. చివరకు మాజీ సర్పంచ్ గందసిరి రవికుమార్ గంట సేపట్లో రూ.2లక్షలు తాను ఇస్తానని హామీ ఇవ్వగా అతడు కిందకు దిగాడు. -
నేడే ఆఖరు రోజు..
ఖమ్మం మయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు చెందిన నిరుద్యోగులు సబ్సిడీ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనుంది. నిరుద్యోగులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు.. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం అందించే రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతుండగా.. కొత్త రుణాల కోసం దరఖాస్తుదారుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం రుణ ప్రణాళికను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గత నెల 19 నుంచి దరఖాస్తు చేసుకునేలా ఆన్లైన్ సైట్‌ను ప్రభుత్వం ఓపెన్ చేసింది. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పలు కారణాల వల్ల జిల్లా అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కొంత వెనుకబడ్డారు. ఈనెల 7వ తేదీతోనే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించిన ప్రభుత్వం గడువు తేదీని ఈనెల 10వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు కొంత ఊరట చెందారు. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు తేదీ పెంచాలని కోరుతున్నారు. గడువు తేదీ ముగిస్తే సవరణలకు కూడా అవకాశం కోల్పోతామని, తాము పొందాలనుకున్న యూనిట్‌ను పొందలేమని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు 4,065 యూనిట్లు.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పలు కేటగిరీల్లో సబ్సిడీ రుణాలను అందిస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించిన రుణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలను అందించడంతోపాటు పలు రుణాలకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేసింది. జిల్లాకు మొత్తం 4,065 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 670 యూనిట్లు, సీఎం ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకానికి 93, ఆదాయ అభివృద్ధి పథకానికి 232, సంఘాలకు 7, బ్యాంక్‌తో సంబంధం లేకుండా భూ పంపిణీ పథకానికి 110, మైనర్ ఇరిగేషన్ కింద 664, ఎనెర్జిషన్ పథకం కింద 353, ఈఎస్ఎస్ పథకం కింద 775, ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 925, ఇతర పథకాల కింద 236 యూనిట్లను జిల్లాకు కేటాయించారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా ఎస్సీల ఆర్థిక బలోపేతం కోసం అందించే రుణాల యూనిట్ల సంఖ్యను మాత్రం తగ్గించింది. 2018–19 సంవత్సరానికి మొత్తం 670 యూనిట్లను జిల్లా లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పురుషులకు 447 యూనిట్లు, మహిళలకు 223, వికలాంగులకు 34 యూనిట్లను కేటాయించింది. ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా అందించే రూ.లక్ష యూనిట్లు 318, రూ.2లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత ఏడాది జిల్లాకు 1,382 యూనిట్లను జిల్లా లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 20,449 దరఖాస్తులు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు 20,449 మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా అందుకునే రుణాలకు వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రుణాలకు దరఖాస్తు చేసుకొని రుణం పొందని దరఖాస్తులు సైతం ఈ ఏడాది అందించే రుణాలకు రెన్యూవల్ అయ్యాయి. దీంతో కొత్తగా, రెన్యూవల్ అయిన దరఖాస్తులు ఇప్పటివరకు 20,449 ఉన్నాయి. ఇంకా ఒక రోజు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్లైన్లో పలు కారణాలతో దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల తర్వాతే ఎంపికలు.. అసెంబ్లీ రద్దుతో త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే సబ్సిడీ రుణాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి. అభ్యర్థులు గడువు తేదీని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం గడువు తేదీ పెంచితే జిల్లాలో ఇంకా దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న వారిలో ఒక్కరికి మాత్రమే రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. – వై.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
చిక్కుల్లో నేత
అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన అద్భుత కళానైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల బతుకులు నానాటికి దుర్భరంగా మారుతున్నాయి. మగ్గంపై రేయింబవళ్లు కష్టపడినా మూడు పూటలా నోట్లోకి ఐదు వేళ్లు పోవడంలేదు. వీరి కష్టానికి ఖరీదు దక్కడంలేదు. అపర బ్రహ్మలుగా కీర్తించబడుతున్న చేనేతలకు చేయూత ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. వెంకటగిరి (నెల్లూరు): చేనేతల కష్టానికి ఖరీదు అందడంలేదు. చేనేత పరిశ్రమలో ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మాస్టర్ వీవర్లు కార్మికులను దోచుకుంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల్లో దయనీయస్థితి ఏర్పడింది. కొందరు చేనేత వృత్తిపై జీవించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో మగ్గం అటకెక్కింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వెంకటగిరి, చెన్నూరు, ఇందుకూరుపేట, మడమనూరు, దంపూరు, వావిళ్ల, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు, నేదురుమల్లి, కసుమూరు, పాలిచర్లపాడు ప్రాంతాల్లో చేనేత కార్మికులు నివసిస్తున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు మగ్గంలో నలిగిపోతున్నారు. విదేశాల్లో చేనేత వస్త్రాలకు ఆదరణ అభివృద్ధి చెందిన దేశాల్లో చేనేత వస్త్రాలు ధరిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందంతో పాటు దర్పణానికి ప్రతీ కలుగా చేనేత వస్త్రాలు నిలుస్తున్నాయి. చేనేత వస్త్రాలు ఆరో గ్యానికి ఎంతో ఉపయుక్తం కావడంతో ఈ వస్త్రాలకు విదేశాల్లో సైతం డిమాండ్ పెరుగుతుంది. చేనేత వస్త్రాలకు గిరాకీ ఉన్నా చేనేత కళాకారు ల బతుకులు మాత్రం దిగజారిపోతున్నాయి. నేతల బతుకులను రక్షించాల్సిన చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. స్వాతంత్య్రం కోసం ఉద్యమ స్ఫూర్తి ని రగిలించిన ఘనత చేనేత రంగానిదే. ఉద్యమసారథి మహాత్మాగాంధీ విదేశీ వస్త్రాల బహిష్కరణకు పిలుపునిచ్చిన ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్త్రాలపై పేటెంట్ హక్కును పొందిన ఘనత చేనేత కళాకారులదీ. కాగా వెంకటగిరి చీరలకు 2009లో జీఐ (జియాలాజికల్ ఐడెంటిఫికేషన్) గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపుతో తమ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి బతుకులు గాడిన పడుతాయనుకున్న నేత కళాకారులకు తొమ్మిదేళ్లుగా ప్రత్యేకంగా ఒరింగిదేమీ లేదు. పరిశ్రమను బతికిస్తున్న సృజనాత్మకత సృజనాత్మకశక్తిని ఉపయోగించి ఎన్నో కొత్త డిజైన్లను సృష్టించడంలో వెంకటగిరి చేనేత కళాకారులు సిద్ధహస్తులు. ఇక్కడి కార్మికుల సృజనాత్మకతో రూపుదిద్దుకున్నదే జాందానీ వర్క్ చీరలు. వెంకటగిరి చీరలకు జింధానీ వర్క్‌తో అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉంది. చీర డిజైన్ నేయడంలో జాందానీ వర్క్ ఉంటే ఇరువైపులా ఒకే రకంగా డిజైన్ కనిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకతతో చీరలు నేయడం దేశంలో ఎక్కడా కనిపించదు. బంగ్లాదేశ్‌లో జాందానీ వర్క్‌తో చీరలు నేస్తారు. ఆ విధానంలో నైపుణ్యతను పెంచుకుని ఇక్కడి కార్మికులు ప్రత్యేకతను చాటుతున్నారు. జాంధానీ వర్క్‌తో మగ్గాల మీదనే నేయడం వలన ప్రత్యేకత ఉంది. జాతీయ అవార్డులు.. మారని బతుకులు రాష్ట్రపతి, ప్రధానిమంత్రి నుంచి జాతీయ అవార్డులు అందుకున్నా.. చేనేతల తలరాతలు మారడం లేదు. 1950లో వెంకటగిరి పట్టణానికి చెందిన బోగా వెంకటసుబ్బయ్య తొలిసారిగా జాతీయ చేనేత పురష్కారం అందుకున్నారు. ఆ తర్వాత గునకుల వెంకటేశు, బత్తిన సుబ్బరాయులు ఈ అవార్డులను అందుకున్నారు. 1987లో దొంతు సంజీవి, 1989లో డక్కిలి మండలం మార్లగుంటకు చెందిన కలవలపూడి వీరా స్వామి, 1996లో కూనా మల్లికార్జున్, 1999లో భో గా రాములు, 2000లో సజ్జావీరయ్య, 2005లో గౌరాబత్తిన రమణయ్య, పట్నం మునిరాజా జాతీ య (రాష్ట్రపతి) అవార్డులు పొందారు. 2014లో వెంకటగిరి పట్టణం బొప్పాపురానికి చెందిన లక్కా శ్రీనివాసులు వెంకటగిరి చీరలో గోవర్ధనుడైన రాధాకృష్ణులను నేసి జాతీయ (రాష్ట్రపతి) అవార్డుకు ఎంపికయ్యారు. 2015లో పట్నం చీరాలరెడ్డి జాతీయ అవార్డు అందుకున్నాడు. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది వెంకటగిరి పట్టణం కట్టెలవీధికి చెందిన పట్నం మునిబాబు జాతీయ అవార్డుకు ఎంపికయి మంగళవారం జమ్మూలో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఎంతో మంది ఇక్కడి చేనేత కళాకారుడు జీవిత చరమాంకంలో కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కళాకారులును ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూ త ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేనేతల డిమాండ్లు ఇవీ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు వంటి వాటి ద్వారా చేయూత అందించాలి. నేత కార్మికులకు స్టాండ్ మగ్గాలు అందించాలి. నేత పనులకు అవసరం అయిన నూలు, జరీ, వంటి ముడిసరుకులు సబ్సిడీపై అందించేందుకు చేనేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డిపోలు ఏర్పాటు చేయాలి. చేనేత ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి. చేనేతను జౌళి శాఖ నుంచి వేరు చేసి బడ్జెట్ నిధుల కేటాయింపులు నేరుగా చేనేతల సంక్షేమానికి వినియోగపడేలా చర్యలు తీసుకోవాలి. చేనేతలకు పింఛన్, పక్కాఇల్లు, ఆరోగ్యబీమా వంటి పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రభుత్వం ప్రోత్సహించకుంటే కనుమరుగే చేనేత రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుంటే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిల్క్‌సబ్సిడీ రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఇస్తున్న రూ.600 సబ్సిడీని సైతం నిలిపివేసింది. వడ్డీ లేకుండా చేనేతలకు రుణాలు అందించాలి. – కూనా మల్లికార్జున్, రాష్ట్రపతి అవార్డుగ్రహీత, వెంకటగిరి -
సబ్సిడీ.. దుర్వినియోగం..!
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా హెవీ లైసెన్స్ కలిగిన వారికి వాహనాలను రాయితీపై పంపిణీ చేస్తోంది. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీ మహిళాలకు 45 శాతంపై, పురుషులకు 35 శాతంపై సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేరుపై సబ్సిడీ రుణాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొంత మంది ఎస్సీ, ఎస్టీలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. శాఖల వారీగా.. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రుణాలను పొంది వారు ఉపాధి పొందుతునే ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. కాగా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 96 యూనిట్లను మంజూరు చేశారు. రూ.2,00,09,000 సబ్సిడీ కింద అందజేశారు. ఇందులో ఆటో ట్రాలీలు 22 మందికి, ట్యాక్సి కార్ 17 మందికి, గల్పర్ మిషన్ 2, ప్యాసింజర్ ఆటోలు 44మందికి, పికప్ వ్యాన్ 5 మందికి, టాటా ఏస్ 2, ట్రాక్టర్, ట్రాలీ 4గురికి అందజేశారు. 2016–17 సంవత్సరంలో 25 మంది లబ్ధిదారులకు రూ.66లక్షల సబ్సిడీతో రుణాలు అందించారు. వీటిలో ట్రాక్టర్ ట్రాలీ 2, టాటా ఏస్ 1, పికప్ వ్యాన్ 1, డీజిల్ ఆటోలు 3, ట్యాక్సి కార్ 7, ఆటో ట్రాలీ 11 మంది లబ్ధిదారులకు అందజేశారు. 2017–18 సంవత్సరంలో 21 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్, ప్యాసింజర్ ఆటోలు, ఆటో ట్రాలీలు, ఆటో పికప్ వ్యాన్లను మంజూరు చేయగా, వీరికి రూ 45.54లక్షల సబ్సిడీని అందజేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో సీసీడీపీ పథకం ద్వారా ఐసీడీఎస్‌లో 34 మంది పీటీజీ తెగలకు రూ.50లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీపై ఆటోలను అందించారు. వీరు నెలల వాయిదా పద్ధతిలో తీసుకున్న రుణాన్ని బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. 2016–17ఆర్థిక సంవత్సరంలో 124 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 6లక్షల 27వేల వ్యయంతో ప్యాసింజర్ ఆటోలను అందించారు. రెండు ప్యాసింజర్ మోటార్ క్యాబ్‌లను అందజేశారు. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా.. స్వయం ఉపాధి రుణాల పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 శాతం సబ్సిడీపై, పురుషులకు 35 శాతం సబ్సిడీపై రుణాలను అందజేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో 2014 సంవత్సరం నుంచి 2017 వరకు 28 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.80,91,069 సబ్సిడీ మంజూరు చేశారు. 11 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.28,55,221 సబ్సిడీని మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీ ప్రైడ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 42 మంది లబ్ధిదారులకు, 40 మంది ఎస్టీలకు రుణాలను మంజూరు చేశారు. ఇదిలా ఉండగా పరిశ్రమ శాఖలో కొంతమంది ఎస్సీ, ఎస్టీలపై భారీగా సబ్సిడీ రుణాలను పొంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రూ.10లక్షలలోపు రుణం తీసుకుంటే జిల్లా కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. రూ.10లక్షలకు పైగా రుణం తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సబ్సిడీ నగదు సకాలంలో మంజూరు కాకపోవడం, మంజూరైన ఖాతాలో జమ కాకపోవడంతో లబ్ధిదారులు వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే సబ్సిడీని వడ్డీ కిందకే కట్టావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో చెల్లిస్తే పేదలను ఆదుకున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు. పెండింగ్‌లో దరఖాస్తులు జిల్లాలోని నిరుద్యోగులు వివిధ పథకాలకు పరిశ్రమల శాఖలో 1 ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు 224 మంది టీ ఫ్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మరో 24 మంది లబ్ధిదారులకు రూ.63,60,980 సబ్సిడీ మంజూరు కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
టీడీపీ దా‘రుణాలు’..!
ఒంగోలు టౌన్: అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. సమ న్యాయం విడిచి అన్నీ తమవారికే కట్టబెట్టేందుకు నిస్సుగ్గుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఒంగోలు నగర పరి«ధిలో సామాజిక భద్రత పింఛన్లలో అధికార పార్టీ ముద్ర కనిపించగా, తాజాగా సబ్సిడీ రుణాల్లో కూడా అదే మార్కు కోసం తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూలో ఫోర్‌మెన్ కమిటీ పేరుతో అధికార పార్టీకి చెందిన నలుగురిని అక్కడ కూర్చోబెట్టి వారి కనుసన్నల్లో ఇంటర్వ్యూలు జరిగే విధంగా చూడటంపై అనేక విమర్శలకు తావిచ్చింది. సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూల కోసం వచ్చిన దరఖాస్తుదారుల వివరాలను డివిజన్ల వారీగా తెలుగు తమ్ముళ్లు సేకరించారు. ఆ రుణాలు ఎవరికి ఇవ్వాలనే విషయమై జల్లెడ పడుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఆశీస్సులులేని అనేకమంది సబ్సిడీ రుణాలు తమదాకా ఏమి వస్తాయంటూ ఉసూరుమంటున్నారు. యూనిట్లు 1052.. దరఖాస్తులు 10708 ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఎంబీసీ, మైనార్టీ, క్రిష్టియన్ మైనార్టీ, కాపు, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 1052 యూనిట్లకు గాను 10708 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీలకు 335 యూనిట్లు కేటాయించగా, ఆన్లైన్లో 2552 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూకు 1038 మంది హాజరయ్యారు. ఎస్టీలకు నిర్దిష్టంగా యూనిట్లు కేటాయించకపోవడంతో 315 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 136 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. బీసీలకు 221 యూనిట్లు కేటాయించగా, ఆన్లైన్లో 3139 మంది దరఖాస్తు చేసుకోగా, 1586 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఎంబీసీలకు 10 యూనిట్లు కేటాయించగా, 182 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 53 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈబీసీలకు 38 యూనిట్లు కేటాయించగా, ఆన్లైన్లో 417 మంది దరఖాస్తు చేసుకోగా, 206 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాపులకు 292 యూనిట్లు కేటాయించగా, 1743 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. 754 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మైనార్టీలకు 105 యూనిట్లు కేటాయించగా, 1812 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 673 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. క్రిష్టియన్ మైనార్టీలకు 7 యూనిట్లు కేటాయించగా, 23 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 8 మంది హాజరయ్యారు. వైశ్యులకు 55 యూనిట్లు కేటాయించగా, 496 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 307 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఒక్కో యూనిట్‌కు సగటున 100 మంది గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర పాలక సంస్థ పరిధిలో వివిధ రకాల యూనిట్లకు సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే పెద్ద సంఖ్యలో సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు సగటున 100మంది దరఖాస్తు చేసుకున్నట్లయింది. దీంతో సామాన్యులు యూనిట్లు పొందాలంటే తల్లకిందులుగా తపస్సు చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డివిజన్ల వారీగా తెలుగు తమ్ముళ్లను కలుసుకొని యూనిట్లు వచ్చేలా చూడాలని అనేకమంది దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా ఇదే అదనుగా భావించి డివిజన్ల వారీగా ఎంతమంది సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, వారిలో తమ పార్టీకి చెందినవారు ఎంతమంది ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీకి చెందనివారు (న్యూట్రల్) ఎంతమంది ఉన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. యూనిట్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలోనే ఫోర్‌మెన్ కమిటీ దరఖాస్తుదారులను స్క్రీనింగ్ చేసింది. పర్సంటేజీల పర్వం సబ్సిడీ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వాటిని మంజూరు చేయించే బాధ్యత తాము చూసుకుంటామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యూనిట్లు మంజూరైన వెంటనే ప్రభుత్వం ఉచితంగా సబ్సిడీ ఇస్తోందని, అందులో తమ వాటా ఇంత అంటూ ముందుగానే బేరాలు కుదుర్చుకుంటున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. యూనిట్లు రావాలంటే నానాయాగీ పడాలని, ఆ మాత్రం ఇచ్చుకోలేరా అంటూ తెలుగు తమ్ముళ్లు దరఖాస్తుదారులను ప్రశ్నిస్తున్నారు. దాంతో కొంతమంది పర్సంటేజీలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ 20 శాతం సబ్సిడీతో రుణాలు జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 20 గొర్రెలు, పొట్టేలుకు రూ.లక్ష , 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లకు రూ.5లక్షలు, వంద గొర్రెలు, 25 పొట్టేళ్లకు రూ.50లక్షలు వంతున బ్యాంకులతో సంబంధం లేకుండా జిల్లా యూనియన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ లీగల్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ నర్రా వెంకటరమణమాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్తిబాబు, డాక్టర్ నీలం శారద, బమ్మిడి అప్పలనాయుడు, జి.నరసింహమూర్తి పాల్గొన్నారు. -
బీసీలకు వెంటనే సబ్సిడీ రుణాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని 16 బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. మంగళవారం బీసీ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సబ్సిడీ రుణాలివ్వలేదని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు రూ.5వేల కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ.210 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి రుణాలిస్తామని మంత్రి పేర్కొనడం అన్యాయమన్నారు. ఇలా చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతూ లంచాలివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని, బీసీ రుణాలు కూడా అలాగే ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం దరఖాస్తు చేసుకున్న 5 లక్షల మందికి రుణాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అర్హులైన బీసీలందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, భిక్షపతి, మల్లేశ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సబ్సిడీ రుణాలు
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో అర్హులైన వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందని కార్పొరేషన్ ఈడీ ముత్యాల పులిరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2016–17 ఆర్థిక సంవత్సారంలో జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 771 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.9.4కోట్ల సబ్సిడీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో 635 యూనిట్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వీటిల్లో 619 యూనిట్లకు రూ.5.87కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఆరు మండలాల్లో రుణాల మేళా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరి నాటికి అన్ని మండలాల్లో పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 2,323 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.26.47కోట్లు బబ్సిడీని కేటాయించినట్లు తెలిపారు. దీనికి తోడు అదనంగా మరో మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన సబ్సిడీ రూ. 26.05కోట్లను ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రుణాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 95 రకాల యూనిట్లు ఉండగా.. లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకురేందుకు మరిన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా కుల సంఘాల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఈ 95 రకాల యూనిట్లలో అవసరంలేని వాటిని రద్దు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఓంటేరు దేవరాజ్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
బీసీ యువతకు రాయితీ రుణాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాల్లోని నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. 2017–18లో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లు ఎలాంటి రాయితీ పథకాలు అమలు చేయలేదు. మరో రెండున్నర నెలల్లో ఏడాది ముగియనుండటంతోపాటు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కేటాయించిన రూ.2 వేల కోట్ల బడ్జెట్ వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ ప్రకారం పథకాల అమలులో భాగంగా అర్హుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. మండలం యూనిట్‌గా పథకాల అమలు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు.. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే యువతకు రాయితీతో కూడిన రుణ సహకారం అందిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణం తీసుకున్న లబ్ధిదారులకు గరిష్టంగా రూ.80 వేల రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీలిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియంతా మండల స్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. ప్రతీ గ్రామంలో లబ్ధిదారులుండాలనే ఉద్దేశంతో గ్రామల వారీగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని వడపోసి మండల స్థాయిలో జాబితా తయారు చేస్తారు. తర్వాత జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జిల్లా జాబితా రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిస్తారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. భారీ బడ్జెట్.. 2017–18లో బీసీలకు రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించింది. మిగతా ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ పరిధిలో మరో రూ.500 కోట్ల మేర ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎంపిక జాబితా రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపిక చేపడితే కేటాయించిన బడ్జెట్‌ను తర్వాత విడుదల చేసినా కోటాలో నష్టం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. -
బ్యాంకులపై నమ్మకం పోతోంది!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాల కింద 20 శాతం రుణాలను సైతం బ్యాంకులు జారీ చేయడం లేదు. ఆస్తులను తనఖా పెట్టే స్థోమత లేక ఆయా వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఈ వైఖరితో బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లినందునే రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాల ప్రజలకు 80–90 శాతం సబ్సిడీతో రుణాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.’’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా లబ్ధిదారులకు బ్యాం కులు ఇచ్చే 20 శాతం మార్జిన్ మనీలోనూ 10 శాతాన్ని తిరిగి డిపాజిట్ చేయాలని కోరుతున్నాయని, అది ఏ మాత్రం మంచిది కాద ని.. వ్యాపారం కాకుండా మానవతా దృక్పథం తో వ్యవహరించాలని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. రైతులు, బ్యాంకుల మధ్య సంబంధా లు తెగిపోవద్దని.. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి భారీ వడ్డీలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. కొందరికి మాత్రమే మేలు చేసే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ పేదరికానికి దారితీస్తుందని.. ఆర్థిక అంతరాలను తొలగించేందుకు బ్యాంకులు ఉదారంగా రుణాలు అందించాలని కోరారు. భవిష్యత్తులో రుణాలవసరముండదు ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులు వస్తే రైతులకు టర్మ్ రుణాల అవసరం ఉండదని.. పంట రుణాలు ఇస్తే సరిపోతుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు వస్తే రైతులు బోర్లు, బావులు, పైపుల కోసం టర్మ్ రుణాలు తీసుకోరని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులు సైతం మారాల్సిన అవసరముందని.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల ఏర్పాటు కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల అమలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. అయితే సొంత పన్నుల రాబడి విషయంలో 21.9 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశం లోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. వడ్డీ వసూలు చేయొద్దు: పోచారం ప్రస్తుత రబీలో రైతులకు పంట రుణాలు, టర్మ్ రుణాలు, వ్యవసాయ ఆధారిత అవసరాల రుణాల జారీలో కొన్ని బ్యాంకులు చాలా వెనుకబడి ఉన్నాయని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణపరంగా ఈ ఏడాది వ్యవసాయానికి చాలా అనుకూలమని, రబీలో రైతులకు విరివిగా పంటరుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని ఇప్పటికే ఎస్ఎల్బీసీలో నిర్ణయం తీసుకున్నా కొన్ని బ్యాంకు శాఖలు రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాయని పేర్కొ న్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని.. రూ.50 కోట్లో రూ.100 కోట్లో ఉండే వడ్డీ బకాయిల మొత్తాన్ని సైతం చెల్లించగలుగుతామని చెప్పా రు. సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు పార్థసారథి, సందీప్ సుల్తానియా, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఆర్.సు బ్రమణ్యం, ఎస్బీఐ సీజీఎం ప్రమోద్ పారిక్, నాబార్డు సీజీఎం రాధాకృష్ణ పాల్గొన్నారు. -
రూ.1,100కోట్ల రాయితీ రుణాలు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు నెల్లూరు రూరల్ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 99,464 మందికి రూ.1,100 కోట్ల రాయితీ రుణాలను అందిస్తున్నట్లు చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మినిబైపాస్ రోడ్డులోని టీడీపీ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం నిర్వహించి, వారిని టీడీపీలో చేర్చేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళితులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షమంది యువకుల స్కిల్స్ డెవలప్మెంట్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా పరిశీలకుడు నరసింహయాదవ్, విజయ డైయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, స్వర్ణా వెంకయ్య పాల్గొన్నారు. -
సబ్సిడీ రుణాలు విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ అర్బన్ : ఎస్సీ నిరుద్యోగ సబ్సిడీ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కేవలం పైరవీకారులు, రాజకీయ పలుకబడి ఉన్న వారికే రుణాలు అందిస్తున్నారని విమర్శించారు. బ్యాంక్ మేనేజర్లు రుణాల మంజూరులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం ఎక్కడా కనిపించడం లేదన్నారు. దళితులపై దాడులు పెరిగాయని, అరికట్టకపోవడం దురదృష్టకరమన్నారు. -
కాపులకు మరో షాక్!
కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని (బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్నూలు: కాపులందరికీ రుణాలిస్తామని హామీ ఇచ్చి అనంతరం కోత పెట్టిన ప్రభుత్వం.. తాజాగా సబ్సిడీ విషయంలోనూ కొర్రీలు వేసింది. సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసే సమయంలో కాకుండా యూనిట్ స్థాపించి రెండేళ్లు నడిపిన తర్వాతే ఇవ్వాలని(బ్యాక్ ఎండ్ సబ్సిడీ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 14న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ)లకు కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) ఆర్.అమరేంద్రకుమార్ లేఖలు రాశారు. యూనిట్లు పెట్టుకునేందుకు ఇది దోహదపడుతుందని భావించే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా రుణం, సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న కాపులకు నిరాశే ఎదురుకానుంది. రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేసిన ప్రభుత్వం.. రుణాల విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ రుణాల తరహాలోనే.. మార్చి 19న ఎస్సీ కార్పొరేషన్‌కు జారీ చేసిన జీఓ నంబర్ 32ను కాపు కార్పొరేషన్‌కూ వర్తింప చేస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఇదే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 16ను సవరిస్తూ అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్లకు లేఖలు రాయడం కాపుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కాపు లబ్ధిదారులకు దీనిని వర్తింపజేయనున్నారు. దీని ప్రకారం లబ్ధిదారులకు ముందస్తుగా బ్యాంకు రుణం నగదుగా అందజేస్తే, దాని ఆధారంగా యూనిట్‌ను ప్రారంభించాలి. ఈ యూనిట్‌ను బీసీ కార్పొరేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వారు తనిఖీ చేసిన సమయంలో యూనిట్ సక్రమంగా నడుస్తుందా? లేదా? అనే విషయాలను గుర్తించి జీయో ట్యాగింగ్ ద్వారా ఉన్నతాధికారులకు ఫొటోలను పంపిస్తారు. యూనిట్ సక్రమంగా కొనసాగుతుంటే.. రెండు సంవత్సరాల తర్వాత సబ్సిడీని విడుదల చేయనున్నారు. ఈ నిబంధన వల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చేది లేదు.. తాము యూనిట్లు ప్రారంభించేది లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఊరించి.. ఉసూరుమనిపించారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1.05 లక్షల మంది కాపులకు రుణాలు అందించాలన్న లక్ష్యం ఆర్థిక సంవత్సరం ముగిసినా నేరవేరలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 3,53,479 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30,822 మంది దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేశారు. తీరా వీరిలో సగం మందికి కూడా ఇంకా సబ్సిడీ విడుదల కాలేదు. కాపు కార్పొరేషన్లో అమలు చేయనున్న బ్యాక్ అండ్ సబ్సిడీ సెగ ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన (స్పిల్ ఓవర్) రుణాలకు తగలనుంది. ఇప్పటి వరకు మంజూరైన రుణాలను మినహాయిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరయ్యే రుణాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతా నంబర్లు సమర్పించడంలో, కవరింగ్ లెటర్, ఈ పేమెంట్ సెక్షన్లో పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా ఈ విధానం అమలు కానుంది. -
స్తంబానికి కట్టేసి మోసగాడికి దేహశుద్ధి
కర్నూలు: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఓ వ్యక్తికి బాధితులు దేహశుద్ధి చేశారు. కర్నూలు పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్‌నగర్‌కు చెందిన హరినాథ్ అలియాస్ శ్రీకాంత్ ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరఫున సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలా 50 మంది నుంచి నగదు వసూలు చేశాడు. దీంతో లక్ష్మీనగర్ వాసులు ఆదివారం మధ్యాహ్నం అతడ్ని పట్టుకుని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
కాపు రుణాల మంజూరు.. పక్కా మోసం
► ప్రకటించింది రూ.2 లక్షలు.. ఇచ్చేది రూ.60 వేలు ► తీవ్ర అసంతృప్తిలో కాపు నాయకులు నెల్లూరు(సెంట్రల్): రుణాల మంజూరు విషయంలో ప్రభుత్వం కాపులను పక్కాగా మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి సర్కారు మాటలు నీటిమూటలయ్యాయి. తీరా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఒక్కొక్కరికి ఇచ్చేది రూ.60 వేలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు. ఇంత మోసమా అంటూ కాపు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లెక్క ఇలాగా.. కాపు కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు రూ.7 కోట్లు కేటాయించింది. 2462 మందికి రుణాలు ఇస్తామని ప్రకటలు గుప్పించింది. దీంతో జిల్లాలో కాపు వర్గానికి చెందిన 12,714 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తీరా కాపు కార్పొరేషన్ తరపున లబ్ధిదారులకు వచ్చే సబ్సిడీ రుణం ఎంతో తెలిసి నోరు వెళ్లబెడుతున్నారు. మొత్తం బ్యాంకు ఇచ్చే నగదు రూ. 60 వేలు సబ్సిడీ రుణం కాగా అందులో కాపు కార్పొరేషన్ ఇచ్చేది రూ.30 వేలు సబ్సిడీ మాత్రమే. అందుకు గాను జన్మభూమి కమిటీ ఆమోద ముద్ర తప్పని సరిగా పెట్టారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొం దాలంటే కనీసం జన్మభూమి కమిటీకి కొంత ముట్టచెప్పాలి. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి, కుల ధ్రువీకరణ పత్రం, రుణం ఫైనల్ చేసుకునే సరికి లబ్ధిదారునికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చువుతోందని తెలిసింది. లబ్ధిదారుని చేతికి వచ్చేది ఇక రూ.20 వేలు మాత్రమే. విసిగిపోతున్న దరఖాస్తుదారులు అటు జన్మభూమి కమిటీల పెత్తనం, మరో పక్క చాలా వరకు బ్యాంకుల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుణాలు మాబ్యాంకు నుంచి ఇస్తున్నాం.. జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని పలువురు బ్యాం క్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ రుణాలు ఇస్తుందని, తమను కమిటీ సభ్యులుగా నియమించిందని తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని కమిటీ సభ్యుల హుకుం జారీ చేస్తున్నారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు కమిటీ సభ్యుల మధ్య కోల్ట్వార్తో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. బ్యాంకు ల, కమిటీ సభ్యుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీసీ కార్పొరేషన్ ఈడీ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లా అధికారి కనీ సం రుణాల విషయంలో జోక్యం చేసుకోకుండా మౌ నంగా చూస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాపులను రుణాల పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. -
అర్హులకు రుణాలు ఇవ్వాలి
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దళితుల కు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ స బ్సిడీ రుణాలు నిరుపేద దళితులకు దక్కలేద ని, కేవలం పైరవీకారులు, అనర్హులకు మంజూ రయ్యాయని విమర్శించారు. ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక బ్యాం క్ ఏర్పాటు చేసి అర్హులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేసి దళితుల కు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. -
మైనార్టీలకు భారీ సబ్సిడీపై రుణాలు!
హైదరాబాద్‌సిటీ బ్యూరో: ఎస్టీ, ఎస్సీ, బీసీల తరహాలో మైనార్టీలకు కూడా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల రుణాలపై గరిష్ట రాయితీ (సబ్సిడీ) 80 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం రూ.ఒక లక్షకే పరిమితమైన రుణ సదుపాయాన్ని రూ.10 లక్షల వరకు పెంచింది. రూ.లక్ష రుణంపై 50 శాతం వరకు గల రాయితీ ని 80 శాతానికి పెంచింది. అదేవిధంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణంపై 70 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణంపై 60 శాతం (రూ.5 లక్షలు మించకుండా ) రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం స్వయం ఉపాధి పథకాల నిబంధనల్లో చేర్పులు మార్పులు చేస్తూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరహాలోనే మైనార్టీ కార్పొరేషన్‌కు కూడా నూతన రాయితీ విధానాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. గత కొన్నినెలలుగా ప్రభుత్వ పరిశీలన లో ఉన్న ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది. -
ఆ రాయితీల మాటేమిటి?
గత రెండేళ్లుగా జమకాని సబ్సిడీలు కొత్తగా రుణాలకోసం నోటిఫికేషన్ జారీ యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారుల్లో ఆందోళన పట్టించుకోని అధికార యంత్రాంగం శ్రీకాకుళం పాతబస్టాండ్ :జిల్లాలో బీసీ, ఎస్సీలకు ప్రభుత్వం నిర్దేశించిన రుణలక్ష్యాలు పూర్తవుతున్నా మంజూరు చేస్తున్న సబ్సిడీలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా జమకావడంలేదు. దీనికి గత రెండేళ్ల గణాంకాలే నిదర్శనం. తాజాగా రుణాలకోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకోమని నోటిఫికేషన్ జారీ చేయడంతో దాని ప్రభావం ఈ లక్ష్యాలపై పడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా ఏర్పాటు చేసుకున్న యూనిట్లకు సంబంధించి సబ్సిడీలు జమచేయనపుడు ఈ సారి కొత్తగా రుణాలకోసం నోటఫికేషన్ విడుదల చేయడం ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వెనుకబడిన తరగతులవారికి 875 యూనిట్లు కేటాయించగా అన్నింటినీ గ్రౌండ్ చేశారు. వీటికి సబ్సిడీగా రూ. 2.68 కోట్లు కేటాయించగా ఇంకా అందులో చాలా యూనిట్లకు నిధులు జమకాలేదు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో కూడా 746 యూనిట్లకు సబ్సిడీ రూ. 1.5 కోట్లు కేటాయించగా ఇందులో చాలావరకూ జమకాలేదు. ముఖ్యంగా ఏపీ వికాస్ బ్యాంకులో రుణాలు తీసుకున్నవారికి మాత్రమే సబ్సిడీలు జమకావట్లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులవారి కోసం 3138 యూనిట్లు మంజూరుకాగా అన్నింటినీ ఏర్పాటు చేశారు. వీరికి రూ. 20.9 కోట్లు రాయితీ మొత్తాలు మంజూరయ్యాయి. షెడ్యూలు కులాలవారికి 1158 యూనిట్లకు రూ. 16.41కోట్లు సబ్సిడీ విడుదలైంది. అయిదు నెలలు గడుస్తున్నా ఆ మొత్తాలు జమకాలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాల కోసం నోటిఫికేషన్ తాజాగా విడుదల చేశారు. బీసీలు 5970 యూనిట్ల ఏర్పాటుకు రూ. 16.33 కోట్లు, ఎస్సీలు 2292 యూనిట్ల ఏర్పాటుకు రూ. 30.36 సబ్సిడీ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. పాతవాటికే సబ్సిడీలు జమకానపుడు కొత్తవారికెలా జమవుతాయని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడా జన్మభూమి కమిటీలకే పెద్దరికం ఈ ఏడాది లక్ష్యాలు జన్మభూమి కమిటీల చేతిలోనికే చేరినట్టు తెలుస్తోంది. ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత వారికి అప్పగించడంవల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల అప్పుడే వీటికోసం బేరాలు కూడా సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.