sydney test
-
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్‌కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్‌ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
రవిశాస్త్రి వ్యాఖ్యలు కలచివేశాయి.. బస్సు కిందకు తోసేసినట్లు అనిపించింది..!
Ravichandran Ashwin: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఆసీస్ పర్యటన సందర్భంగా రవిశాస్త్రి.. సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. పరోక్షంగా తనను కించపరిచే వ్యాఖ్యలు చేశాడని అన్నాడు. రవిశాస్త్రి చేసిన ఆ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, కదిలే బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని వాపోయాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. అశ్విన్ తన మనసులోని బాధను వెల్లగక్కాడు. వివరాల్లోకి వెళితే.. 2018 ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్(నాలుగో టెస్ట్)లో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో కుల్దీప్ భారత నంబర్‌వన్ స్పిన్నర్ అని కొనియాడాడు. రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలే తనను తీవ్రంగా బాధించాయని, బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, తాను బాధపడింది కుల్దీప్ను పొగిడినందుకు కాదని, ఆసీస్ గడ్డపై తనకు ఐదు వికెట్లు దక్కనందుకేనని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన పట్ల మనస్పూర్తిగా సంతోషించానని.. అయితే టీమిండియా గెలుపులో తన పాత్ర లేకపోవడం బాధించిందని, అందుకు తాను జట్టు గెలుపు సంబరాల్లో కూడా పాల్గొనకూడదని అనుకున్నట్లు వివరించాడు. ఆ సందర్భంలో తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన కూడా చేసినట్లు అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది.. -
ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు నిజమే
సాక్షి. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు జాతి వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని టీమిండియా మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించామని.. నిబంధనల ప్రకారం నిందితులను మైదానంలోకి అడుగుపెట్టకుండా దీర్ఘకాల నిషేధం విధిస్తామని సీఏ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పుజారా, విహారి, అశ్విన్, పంత్‌లు గాయాల బారిన పడినప్పటికీ సమయోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమయ్యారు. ఇక ఆఖరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి చెలరేగి ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
‘దురదృష్టవశాత్తూ పంత్ అవుట్ అయ్యాడు’
న్యూఢిల్లీ: ‘‘నిజానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్యాడ్స్ కూడా కట్టుకున్నాను. ఇంజక్షన్ తీసుకున్నాను. కనీసం 10- 15 ఓవర్లపాటు క్రీజులో ఉండాలని మానసికంగా సిద్ధమైపోయాను. ఎలాంటి షాట్లు ఆడాలి, ఫాస్ట్ బౌలర్స్‌ను ఎలా ఎదుర్కోవాలి. క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలి అనే ఆలోచనలతోనే నా మెదడు నిండిపోయింది. నిజానికి గాయం కారణంగా అన్ని షాట్లు ఆడలేం కదా! అయితే పుజారా, పంత్ మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ పంత్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. మేం మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది’’ అంటూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.(చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా జడేజా గాయపడిన విషయం తెలిసిందే. అతడి బొటనవేలు విరిగి పోవడంతో సర్జరీ చేసిన వైద్యులు సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ పట్టు బిగించడంతో ఎలాగైనా జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో గాయంతోనైనా సరే ఆడేందుకు సిద్ధమయ్యానని జడేజా చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన అతడు..‘‘బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. కానీ నేను ఆ విషయాన్ని గ్రహించనే లేదు. టెయిలెండర్స్‌తో కలిసి ఎలా పరుగులు రాబట్టాలా అన్న అంశం మీదే నా దృష్టి ఉంది. నిజానికి నా వేలు విరిగిపోయింది. మైదానం వీడి స్కానింగ్ చేయించుకున్న తర్వాతే ఈ విషయం తెలిసింది. అయినా సరే తప్పనిసరి అయితే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే, అశ్విన్, విహారి(ఇద్దరూ కలిసి 256 బంతులు ఎదుర్కొన్నారు) మ్యాచ్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పట్టుదలగా నిలబడ్డారు. టెస్టు క్రికెట్లో ప్రతిసారీ పరుగులు రాబట్టడమే ముఖ్యం కాదు. పరిస్థితికి తగ్గట్లు మారుతూ ఉండాలి. మొత్తానికి సమిష్టి కృషితో మేం మ్యాచ్‌ను కాపాడుకోగలిగాం’’ అని జడేజా సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సిడ్నీ టెస్టును రహానే సేన డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకున్న టీమిండియా, బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, ఆసీస్‌కు మంచి రికార్డు ఉన్న గబ్బా మైదానంలో వారిని మట్టికరిపించి, అద్భుతమైన ఛేజింగ్‌తో చారిత్రక గెలుపును సొంతం చేసుకుని 2-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా జడేజా దూరమైన సంగతి తెలిసిందే. -
‘స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్‌లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. ‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్లోంచి లేవడం, శభాష్ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్ చెప్పాడు. అశ్విన్ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను స్పిన్‌ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్‌ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్. అయితే ఒక దశలో సింగిల్ కారణంగా లెక్క మారిపోయింది. కమిన్స్ బౌలింగ్‌లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్ ఠాకూర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్ కోచ్ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి. నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్ స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్ వివరించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్బోర్న్ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్ వెల్లడించాడు. 36కు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్‌ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్ బౌలర్లు ఒకే లైన్లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. జూలైలోనే వ్యూహరచన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్‌సైడ్ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్‌కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. సిరీస్‌లో లెగ్ సైడ్ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్‌షేన్ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్‌షేన్ ఎక్కువగా కట్, పుల్ షాట్లతో పాటు ఆఫ్ సైడ్ పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్. అయితే న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ కొద్ది రోజుల ముందు లెగ్ సైడ్ బౌలింగ్ చేసి స్మిత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. -
మంత్రి కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆటగాడు హనుమ విహారి సోమవారం తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అశ్విన్‌తో కలిసి హనుమ విహారి కడదాకా నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లు వరుస బౌన్సర్లతో బెంబెలెత్తించిన.. ఈ ఇద్దరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి జట్టును ఓటమినుంచి గట్టెక్కించారు. హనుమ విహారి ప్రదర్శనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విహారి కేటీఆర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ కేటీఆర్‌కు వివరించాడు. కేటీఆర్‌ను కలవడం, క్రికెట్ గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. అనంతరం కేటీఆర్‌తో దిగిన ఫొటోలను విహారి ట్విటర్లో షేర్ చేశాడు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మన్ @Hanumavihari మంత్రి @KTRTRS ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. pic.twitter.com/Lz96cnEWVw — KTR News (@KTR_News) January 18, 2021 -
సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్!
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రసవత్తర టెస్టు సిరీస్ సమరంలో జాతివివక్ష వ్యాఖ్యలు కలవరం పుట్టించాయి. ఇప్పటికే పూర్తయిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు, టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించి సమంగా నిలిచాయి. ఈసమయంలో సిడ్నీ జరిగిన మూడో టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఆకతాయిలు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేయడంతో టీమిండియా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు కూడా అలాంటి సీనే రిపీట్ అయింది. ఈసారి బుమ్రాను జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆసీస్ మూకలు ఇబ్బందులు పెట్టడంతో మరోసారి టీమిండియా ఫిర్యాదు చేయక తప్పలేదు. ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై సిరాజ్‌కు, బుమ్రాకు, టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన వెల్లడించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై విచారిస్తున్నానని అన్నాడు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. భారత ఆటగాళ్లపై ఆకతాయిల వైఖరి తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు. నిందితులపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశాడు. మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ కావని ఆశిస్తున్నట్టు వార్నర్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. (చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా') గబ్బా స్టేడియంలో జరిగే ఫైనల్ టెస్టుకు రెడీ అవుతున్నామని పేర్కొన్నాడు. అలాగే, సిడ్నీ టెస్టులో గొప్పగా రాణించి మ్యాచ్‌ను నిలుపుకున్న భారత ఆటగాళ్ల పోరాట పటిమను వార్నర్ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని కొనియాడాడు. కాగా, జాతి వివక్ష వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా సంజాయిషీ ఇచ్చుకుంది. మరోసారి అలా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆ ఆకతాయిలను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఐసీసీ కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
సహచరునిపై అశ్విన్ ప్రశంసల వర్షం
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారి, మ్యాచ్‌ను వారికి దక్కకుండా చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారిని సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్‌ను డ్రాగా ముగించే క్రమంలో విహారి సాధించిన అజేయమైన 23 పరుగులు శతకంతో సమానమని, తాను చూసిన మేటి ఇన్నింగ్స్‌ల్లో ఇది కూడా ఒకటి అని అశ్విన్ పేర్కొన్నాడు. గాయంతో బాధపడుతూనే ఆటను కొనసాగించిన విహారి.. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్‌ను చేజారకుండా వీరోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడని ప్రశంసించాడు. అతని ప్రదర్శన యావత్ భారతావనిని గర్వపడేలా చేసిందని కొనియాడాడు. విహరి ఇన్నింగ్స్ టీమిండియా మాజీ ఆటగాడు 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ప్రదర్శనను గుర్తుచేసిందని పేర్కొన్నాడు. అతను ప్రదర్శించిన పోరాట పటిమ సహచర సభ్యుల్లో ఎంతో స్పూర్తిని నింపిందని, ఆఖరి టెస్టులో విజయం సాధించడానికి ఇది తమకు తోడ్పడుతుందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు. ఇక పుజారా 205 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 77 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో తన వంతు సహకారాన్ని అందించాడు. విహారికి జతగా అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు సాధించి సమయోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. వీరిద్దరూ కలిసి 257 బంతులను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. తొలి ఇన్సింగ్స్‌లో 338 పరుగులు చేసి భారత్‌ను 238 పరుగులకు కట్టడి చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్సింగ్స్‌లో మరింత మెరుగ్గా ఆడిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్సింగ్స్‌ను 312 పరుగుల వద్ద ఆసీస్ డిక్లేర్ చేసింది. 407 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. -
భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ: ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. శనివారమే (మూడో రోజు ఆటలో) ఇది భారత ఆటగాళ్లను తాకింది. ఆదివారమైతే శ్రుతి మించింది. దీంతో టీమిండియా ఫిర్యాదు చేసింది. అంపైర్లు వెంటనే స్పందించారు. తర్వాత ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా సమస్యపై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అయితే ‘వివక్ష’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను నివేదిక కోరింది. భారత ఆటగాళ్లు దీనిపై ఉక్కుపిడికిలి బిగించాల్సిందేనన్నారు. అసలేం జరిగింది? బుమ్రా, సిరాజ్‌లపై శనివారం ఆసీస్ ఆకతాయి ప్రేక్షకులు జాత్యహంకార మాటలతో హేళన చేశారు. ఆదివారం వీరిచేష్టలు మరింత శ్రుతిమించాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న మూకలు అసలే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ‘బ్రౌన్ డాగ్’, ‘బిగ్ మంకీ’ అంటూ దూషించారు. దీనిని గమనించిన ఆటగాళ్లంతా సిరాజ్‌ను అనునయించారు. 86వ ఓవర్ ముగిశాక భారత ఆటగాళ్లంతా ఓ చోట చేరుకున్నారు. ఏం చేశారు? ఐసీసీ సీరియస్ క్రికెట్లో జాతి వివక్షను ఉపేక్షించబోమని ఐసీసీ తెలిపింది. సిడ్నీ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉదంతంపై సీఏ వివరణ కోరామని, నివేదిక వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. సీఏ క్షమాపణ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చింది. భారత ఆటగాళ్లను, క్రికెట్ బోర్డును క్షమాపణ కోరింది. ‘ఇంతటితో దీన్ని విడిచిపెట్టం. ఆకతాయిలను ఇప్పటికే గుర్తించాం. సీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వారిని మైదానాల్లోకి అనుమతించకుండా నిషేధిస్తాం. చట్టపరమైన చర్యల కోసం న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు అప్పగిస్తాం’ అని సీఏ ఉన్నతాధికారి సీన్ కారల్ అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ‘మన సమాజంలో, క్రీడల్లో జాత్యహంకారానికి చోటులేదు. ఇప్పటికే సీఏతో సంప్రదించాం. దోషులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరాం’ అని ట్వీట్ చేశారు. నాకు ఇది నాలుగో ఆసీస్ పర్యటన. గతంలో ప్రత్యేకించి సిడ్నీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేనూ బాధితుణ్నే. బౌండరీలైన్ వద్ద ఉండే క్రికెటర్లకు ఇలాంటి దూషణలు పరిపాటి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉక్కుపిడికిలి బిగించాల్సిందే. – భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జాత్యహంకారాన్ని సహించేది లేదు. మైదానాల్లో ఇలాంటి రౌడీ మూకల ప్రవర్తన ఆటగాళ్లను బాధిస్తోంది. నేను 2011–12లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్
సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ముందు 407 పరుగులు భారీ లక్ష్యం ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. పుజారా 9, కెప్టెన్ రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 309 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన పని ఇప్పుడు నవ్వు తెప్పిస్తుంది. ఆసీస్ 259 పరుగుల ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్మిత్ 51 పరుగులు, కామెరాన్ గ్రీన్ 10 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించే పనిలో ఉన్నాడు. అయితే టీమిండియా జడేజా గైర్హాజరీలో నలుగురు బౌలర్లతో మాత్రమై బౌలింగ్ చేయాల్సి వచ్చింది. జట్టుకు కీలక బౌలర్‌గా వికెట్ తీయాల్సిన ఒత్తిడి బుమ్రాపై మరింత ఎక్కువైంది. మరో సీనియర్ అశ్విన్ ఒకవైపు బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం పడడం లేదు.(చదవండి: టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు) దీంతో బుమ్రాకు చిర్రెత్తికొచ్చిందేమో తనలో ఎప్పుడు చూడని ఒక కోణాన్ని చూపించాడు. బంతి వేయడానికి బౌలింగ్ ఎండ్‌వైపు సాగుతున్న బుమ్రా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్మిత్‌ను చూస్తూ బెయిల్స్‌ను బంతితో కిందకు విసురుకుంటూ వెళ్లిపోయాడు. స్మిత్ ఇంక ఎంతసేపు ఆడుతావు.. తొందరగా ఔట్ అవ్వు అన్నట్లుగా బుమ్రా సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే బుమ్రా చర్యతో ఫీల్డ్ అంపైర్ పాల్ రిఫీల్ షాక్ తిన్నాడు. బుమ్రా బెయిల్స్ పడేయగానే.. అతను ఎందుకిలా చేశాడు అనే కోణంలో రిఫీల్ చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే నిలుచుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. బుమ్రా చేసిన పనికి అంపైర్ ఇచ్చిన స్టిల్ నవ్వు తెప్పిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది') Look at Paul Reiffel's reaction after Bumrah knocks the bails over 😂 #AUSvIND pic.twitter.com/294ChqKBB0 — 7Cricket (@7Cricket) January 10, 2021 -
ఆసీస్‌పై రోహిత్ సెంచరీ సిక్సర్ల రికార్డు
సిడ్నీ: రోహిత్ శర్మ అంటేనే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్ టూర్‌కి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్ వచ్చీ రావడంతోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లు కలిపి 100 సిక్సర్లు కొట్టిన ఏకైక టీమిండియా ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నాథన్ లయన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ ద్వారా ఈ ఘనత సాధించాడు. రోహిత్ ఆసీస్‌పై కొట్టిన వంద సిక్సర్లలో 63 సిక్స్‌లు వన్డేల్లోనే రావడం విశేషం.తాజాగా మూడో టెస్టులో కొట్టిన సిక్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరింది. ఇప్పటి వరకూ చూసుకుంటే టీమిండియాలో ఏ క్రికెటర్‌కూ ఆసీస్‌పై ఇన్ని సిక్సర్లు బాదిన ఘనత లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ కంటే ముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (534 సిక్సర్లు) కాగా.. మరొకరు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది (476 సిక్సర్లు). ఒక ప్రత్యర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయర్ రోహిత్. ఇంతకుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి గేల్ 140 సిక్సర్లు కొట్టాడు. రోహిత్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగళూరులో జరిగిన వన్డేలో 209 పరుగులు చేయగా.. అందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండటం విశేషం. ఆసీస్ పేరు చెబితేనే పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయే హిట్‌మ్యాన్ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 8 సెంచరీలు బాదాడు.(చదవండి: నా ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే) International six No.424 for Rohit Sharma! Live #AUSvIND: https://t.co/xdDaedY10F pic.twitter.com/nypB41kYvB — cricket.com.au (@cricketcomau) January 8, 2021 -
ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్‌పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్‌గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
జడ్డూ లేట్ చేసి ఉంటే కథ వేరే ఉండేది
సిడ్నీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే మెరుపు ఫీల్డింగ్‌కు చిరునామా. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ను రనౌట్ చేసిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. స్మిత్‌ను రనౌట్ చేయడం ద్వారా జడేజా తన ఫీల్డింగ్ విలువేంటో మరోసారి చూపించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కడదాకా నిలిచి టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన స్మిత్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు.(చదవండి: సెంచరీలు సమం చేసి.. పరుగుల్లో దాటేశాడు!) అతని ఒక్క వికెట్ పడితే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లే. ఈ దశలో 131 పరుగులు చేసిన స్మిత్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ స్వ్కేర్‌లో షాట్ ఆడాడు. రెండో పరుగు తీసి స్ట్రైకింగ్ తీసుకుందామని యత్నించే క్రమంలో స్మిత్ రనౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే స్మిత్‌ను జడేజా రనౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్ నుంచి బంతిని అందుకున్న జడేజా బుల్లెట్ వేగంతో స్టైకింగ్ ఎండ్‌వైపు బంతిని విసరగా అది నేరుగా వికెట్లను గిరాటేసింది. ఒకవేళ జడేజా ఈ రనౌట్ చేయకుంటే స్మిత్ డబుల్ సెంచరీ కూడా చేసేవాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా స్మిత్ సెంచరీతో ఆసీస్ తొలిసారి టెస్టు సిరీస్‌లో 300 మార్కును అధిగమించింది. మరోవైపు సిడ్నీ టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన జడేజా విదేశీ గడ్డపై మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇంతకముందు దక్షిణాఫ్రికాపై జోహెన్నెస్ బర్గ్‌లో 138 పరుగులకే 6 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. కొలంబొ వేదికగా 152 పరుగులకే 5 వికెట్లు తీసిన జడేజా విదేశీ గడ్డపై రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి పుజారా(9 బ్యాటింగ్), రహానే(5 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) , శుబ్‌మన్ గిల్(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్ చేజార్చుకుంది. Smith run out by sir jadeja...@ItsYashswiniR @secret_parii @Shersinghzn @RishabhPant17 @RickyPonting @sachin_rt @ShreyasIyer15 @yuzi_chahal @Sir_Jaddu pic.twitter.com/ElFIT6MV6j — Naveen (@Naveen99688812) January 8, 2021 -
ఈ మ్యాచ్‌లో నా ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే..
సిడ్నీ : ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే ఉంటుందని స్మిత్ తెలిపాడు. మూడో టెస్టులో భాగంగా తొలిరోజు ఆట ముగిసిన అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా స్మిత్ మీడియాతో మాట్లాడాడు. మొదటి రెండు టెస్టుల్లో నా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కానీ మూడో టెస్టు మ్యాచ్‌కు వచ్చేసరికి నా బ్యాటింగ్‌లో కొంత మార్పు కనిపించింది. మొదటిరోజు ఆటలో చివరి సెషన్ వరకు నిలిచి లబుషేన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతృప్తినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో అశ్విన్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అశ్విన్‌ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డా పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక బౌండరీలతో పరుగుల రాబట్టడంలో సక్సెస్ అయ్యాను. ఇదే టెంపోనూ రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే రెండు సెషన్లు కలుపుకొని మేమే పైచేయి సాధించామని పేర్కొన్నాడు. (చదవండి: ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు) కాగా వన్డే సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్ మొదటి రెండు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి 10 పరుగులు చేసిన స్మిత్ రెండుసార్లు అశ్విన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం విశేషం.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్లో ఆసీస్ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్ మొత్తం తూడిచిపెట్టుకుపోయింది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') -
ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్ కంటతడి వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. కాగా సిరాజ్ కంటతడి పెట్టడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచుకున్నాడు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') 'జాతీయగీతం ఆలపించే సమయంలో మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన నన్ను ఒక క్రికెటర్‌గా చూడాలని ఎప్పుడూ అంటుంటేవాడు.. స్వతహగా మా నాన్నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో దేశం తరపున ఒక్క టెస్టు మ్యాచ్‌లో నేను ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉండేదని నాతో చాలాసార్లు అనేవాడు. ఆరోజు రానే వచ్చింది.. ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కానీ నా ఆటను చూడడానికి మా నాన్న ఈరోజు బతికిలేడు. అందుకే అదంతా గుర్తుకువచ్చి కాస్త ఎమోషనల్ అవడంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయంటూ' బాధగా చెప్పుకొచ్చాడు. (చదవండి : మహ్మద్ సిరాజ్ కంటతడి) కాగా మెల్బోర్న్ టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 5 వికెట్లు తీయడం ద్వారా ఆకట్టుకున్నాడు. అంతేగాక మెల్బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సిరాజ్ తన తొలి టెస్టునే మధురానుభూతిగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. Mohammed Siraj provided a glimpse of what it means to represent your country in international cricket ✨#AUSvINDpic.twitter.com/HpL94QH5pr — ICC (@ICC) January 7, 2021 -
'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది'
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3వ ఓవర్లోనే ఔట్అయిన సంగతి తెలిసిందే. 5 పరుగులు చేసిన వార్నర్ సిరాజ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ అవుట్ కావడంపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్‌వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.వార్నర్ ఔట్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్‌కు తెలుసు... అయినా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం కరెక్ట్ కాదు అంటూ మార్క్‌వా చెప్పుకొచ్చాడు. (చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్!) మరో మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ కూడా వార్నర్ షాట్‌పై పెదవి విరిచాడు. వార్నర్ బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లోకి బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్ ఎంపికలో వార్నర్ పొరపాటు స్పష్టంగా తెలుస్తుందంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి) అయితే మూడో టెస్టుకు ఎంపిక చేసే సమయానికి వార్నర్ 100శాతం ఫిట్‌గా లేకున్నా క్రికెట్ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వార్నర్ మూడో టెస్టులో త్వరగా ఔట్ కావడంతో మరోసారి అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ సిరాజ్ కంటతడి
సిడ్నీ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురువారం కన్నీటి పర్యంతమయ్యాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా సిరాజ్ కంట తడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె సిరాజ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత్‌కి తిరిగి వెళ్లే అవకాశం లేనందన టెస్టుల్లో ఆడేందుకే సుముఖత చూపించాడు. రెండో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి గాయం కారణంగా సిరాజ్‌కు అవకాశం లభించిన సంగతి తెలిసిందే. (ఎంపీఎల్లో కోహ్లి పెట్టుబడులు) ఈ నేపథ్యంలో గురువారం టెస్టు ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపించే సందర్భంలో తండ్రిని గుర్తుచేసుకొని సిరాజ్ భావోధ్వేగానికి లోనయ్యాడు. ఇక మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. (న్యూజిలాండ్ నంబర్‌వన్) ✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
వార్నర్ ఔట్; మ్యాచ్‌కు వర్షం అంతరాయం
సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(5)ను తక్కువ స్కోరుకే మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన్ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, మళ్లీ మ్యాచ్ ఆరంభమైన తర్వాత వర్షం పడటంతో మరొకసారి నిలిచిపోయింది. 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద ఉండగా మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. షైనీ ఆరంగ్రేటం హిట్‌మన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు జట్టులో స్థానం దక్కలేదు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్ బౌలర్ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్ జట్టు క్యాప్‌ను షైనీ అందుకుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున విల్ పకోవ్‌స్కీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. Congratulations @navdeepsaini96. He realises his dream of playing Test cricket for #TeamIndia today. A proud holder of 🧢 299 and he receives it from @Jaspritbumrah93. #AUSvIND pic.twitter.com/zxa5LGJEen — BCCI (@BCCI) January 6, 2021 భారత్ (తుది జట్టు): రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, విహారి, పంత్, జడేజా, అశ్విన్, సిరాజ్, బుమ్రా, సైనీ. ఆస్ట్రేలియా (అంచనా): పైన్ (కెప్టెన్), వార్నర్, పకోవ్‌స్కీ, స్మిత్, లబ్‌షేన్, వేడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్. చదవండి: ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానంలోకి -
'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది'
మెల్బోర్న్: ఆసీస్‌తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ బుధవారం ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ట్విటర్ వేదికగా టీమిండియాకు తన సందేశాన్ని అందించాడు. ' బ్యాడ్‌లక్.. గాయంతో స్వదేశానికి తిరుగుపయనం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో టీమిండియాను వదిలి రావడం కాస్త బాధ కలిగించింది. అయినా సరే మిగిలిన రెండు టెస్టులు భారత్ బాగా ఆడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా కేఎల్ రాహుల్ శనివారం(జనవరి 2న) మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. దీంతో రాహుల్ స్వదేశానికి చేరుకున్నాడు. కాగా రాహుల్ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించిన కేఎల్ రాహుల్(మొత్తంగా 93 పరుగులు).. పొట్టి ఫార్మాట్లో(81 పరుగులు)నూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల తుది జట్టులో అతడికి స్థానం దక్కకపోయినప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') మూడో టెస్టుకు హనుమ విహారి స్థానంలో తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాహుల్ గాయపడ్డాడు. ఇప్పటికే షమీ, ఉమేశ్‌లు గాయాలతో సిరీస్‌కు దూరమవగా.. తాజాగా రాహుల్ కూడా దూరమయ్యాడు. అయితే రోహిత్ శర్మ చేరికతో టీమిండియా జట్టు బలోపేతంగా కనిపిస్తుంది. జనవరి 7 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం నేడు బీసీసీఐ తుది జట్టు ప్రకటించగా.. మయాంక్ స్థానంలో రోహిత్‌ను ఎంపిక చేయగా.. నవదీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు. -
వాళ్లన్నట్టుగానే సైనీ కే ఓటు పడింది!
న్యూఢిల్లీ: ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేని నటరాజన్‌ను సిడ్నీ టెస్టులో ఆడించడం సరైన నిర్ణయం కాదని వెటరన్ ఆటగాళ్ల అభిప్రాయం కాబోలు నవదీప్ సైనీకే బీసీసీఐ జై కొట్టింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టుకు నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. సిడ్నీ టెస్టుకు సంబంధించి తుది జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక గత మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోని మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్‌ను తీసుకుంది. కాగా, గాయపడ్డ ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్‌ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం యోచించగా.. ఇండియన్ వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వంటివారు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. నటరాజన్ బదులు నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించాలని నెహ్రా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడడంతోపాటు, సిడ్నీ ఫ్లాట్ వికెట్‌పై సైనీ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ టీమిండియాకు పనికొస్తుందని పేర్కొన్నాడు. గాయపడిన మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వచ్చారని, సైనీని నేరుగా తీసుకున్నారని గుర్తు చేశాడు. అందుకనే మూడో పేసర్‌గా తొలి ప్రాధాన్యం సైనీకే ఇవ్వాలని సూచించాడు. అతని తర్వాత స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ఉంటారని నెహ్రా తెలిపాడు. ఇక మెల్బోర్న్ టెస్టులో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్‌పై అతను ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిలా సిరాజ్ బౌలింగ్ చేశాడడని నెహ్రా కొనియాడాడు. కాగా, నెట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సేలంకు చెందిన టి.నటరాజన్ ఐపీఎల్ 2020లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి నిరూపించుకున్నాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. -
'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు'
సిడ్నీ : 2003-04 ఆసీస్ టూర్ తనకు చాలా ప్రత్యేకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలాసార్లు పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్ నాకౌట్ ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ డ్రా అవడమే కాకుండా సిరీస్ కూడా 1-1తే సమం అయింది. తాజాగా సచిన్ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. '2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే.. మ్యాచ్ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్ ఆడమ్స్ పాడిన సమ్మర్ ఆఫ్ 69 అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే... గ్రౌండ్లో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సమయం, లంచ్, టీ బ్రేక్ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు. ఆ పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్‌గా లిరిక్స్ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్‌లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ "సర్ ఆల్బమ్" పాటను వినిపించేవారు.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా) కాగా సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో సచిన్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన మొదటి మూడు టెస్టులు కలిపి 0,1,37,0,44 పరుగులు చేశాడు. ఇదే సిడ్నీ వేదికకు మరో విశేషం కూడా ఉంది. 2008లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్- హర్భజన్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయింది.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) -
ఓవైపు నాన్నకు ఆపరేషన్.. మరోవైపు బ్యాటింగ్
రాజ్‌కోట్ : గత నెలలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. తన టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచి 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అద్వితీయ ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసిక్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక చివరిదైన నాలుగో టెస్టులో పుజారా 193 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు, ఇటు పుజారా ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అవుటవ్వడంతో నిరాశచెందారు. మనందరికీ తెలియని ఇంకో విషయమేమిటంటే.. పుజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో (టెస్టు మొదటి రోజు) అతని తండ్రి అరవింద్ ఆస్పత్రిలో ఉన్నాడు. ఓవైపు తండ్రికి హార్ట్ సర్జరీ కొనసాగుతుండగానే.. పుజారా తన ఆటను కొనసాగించాడు. జట్టుకు భారీ స్కోరునందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. (పుజారా డబుల్ సెంచరీ మిస్) ‘నాన్నకు ఆపరేషన్ జరగుతుండడంతో కొంత ఆందోళన చెందాను. కానీ, ఆయనకేం పరవాలేదు. ఆపరేషన్ సక్సెస్ అవుంతుందని డాక్టర్లు భరోసా ఇచ్చారు. దాంతో కొంత ధైర్యం వచ్చింది. అప్పటికే గత మ్యాచ్‌లలో పరుగులు సాధించడం. సిడ్నీ మైదానంలో ప్రాక్టిస్ చేసి ఉండడం కలిసొచ్చింది. దాంతో ఆటపై దృష్టిపెట్టాను. దేవుడి దయవల్ల నాన్న కోలుకున్నారు’అని పుజారా తన సిడ్నీ టెస్టు అనుభవాలను పంచుకున్నారు. ‘ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు నాన్న మా ఆట చూశారు. నా ఆటచూసి హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడి డాక్టర్లు కంగ్రాట్స్ కూడా చెప్పారు. అయితే, 7 పరుగులతో డబుల్ సెంచరీ మిస్ కావడంపై.. నాన్న స్పందిస్తూ.. మరేం పరవాలేదు. డబుల్ సెంచరీ అనేది ఒక నెంబర్ మాత్రమే. జట్టుకు మంచి స్కోరు అందించావ్. బాధపడొద్దు’ అని తనకు మరింత ధైర్యం ఇచ్చారని పుజారా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పుజారా ఏకంగా 30 గంటలకు పైగా బ్యాంటింగ్ చేసి 1258 బంతులు ఎదుర్కొన్నాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 521 పరుగులు చేశాడు. ఫ్రాంచైజీల ట్రెండ్‌తో.. నోట్ల వర్షమే పరమావధిగా సాగుతున్న టీ20ల కాలంలో.. నిజంగా పుజారా ఆట వెరీ క్లాసిక్ కదా..!! -
ప్రీతి జింటా మేడమ్.. ఇలా అయితే ఎలా?
ముంబై: ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్‌ను సాధించిన భారత క్రికెట్ జట్టును అభినందించే క్రమంలో బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ‘తప్పు’లో కాలేశారు. టెస్టు సిరీస్ విజయం అని అనకుండా టెస్టు మ్యాచ్ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్ట్రేలియాపై ‘టెస్ట్ మ్యాచ్’ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు. టీమిండియా విజయంలో చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు’ అని ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు ప్రీతి జింటా. అలాగే, ‘బాయ్స్ ఇన్ బ్లూ’ అని వాడడంపైనా మండిపడ్డారు. టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే బ్లూ జెర్సీ ధరిస్తారని అది కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. సగం తెలివి చాలా ప్రమాదకరం అని దుమ్మెత్తిపోశారు. నెటిజన్ల కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి తన ట్వీట్‌ను డిలీట్ చేసింది. -
చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన
-
ఇంతగా ఎప్పుడూ గర్వపడలేదు
ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లి ఆస్ట్రేలియాపై గెలుపు తర్వాత కొత్తగా కనిపించాడు. సిరీస్ విజయం ఇచ్చిన అమితానందంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సిడ్నీ టెస్టు తర్వాత భావోద్వేగభరితమైన అతను పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘నా కెరీర్లో ఇదే అతి పెద్ద ఘనత. అన్నింటికంటే అగ్రస్థానం ఇదే విజయానికి ఇస్తాను. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో నేను జూనియర్ సభ్యుడిని. అంతకుముందు వరల్డ్‌కప్ గెలవలేకపోయిన బాధ ఏమీ లేదు కాబట్టి విజయం తర్వాత కూడా కొందరు సీనియర్లలా నేను భావోద్వేగానికి గురి కాలేదు. అది మంచి విజయమే అయినా ఇక్కడ నేను చాలా భావోద్వేగానికి లోనవుతున్నాను. వరుసగా మూడోసారి పర్యటించాను కాబట్టి ఇక్కడ గెలుపు ఎంత ప్రత్యేకమో చెప్పగలను. ఈ సిరీస్ విజయం భారత జట్టును కొత్తగా చూపిస్తుంది. జట్టులో సభ్యుడిగా నేనెప్పుడూ ఇంతగా గర్వపడలేదు. ఇలాంటి టీమ్‌ను నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. నాలుగేళ్ల క్రితం ఇక్కడే తొలిసారి కెప్టెనయ్యాను. ఇప్పుడు ఇక్కడే సిరీస్ గెలవడం మధురానుభూతి. గత 12 నెలలుగా మేం పడిన కష్టానికి ఇది ప్రతిఫలం.’ ‘సాంప్రదాయ శైలిలో టెస్టు క్రికెట్ మూలాలకు కట్టుబడి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అద్భుతంగా ఆడిన పుజారాను ప్రత్యేకంగా ప్రశంసించాలి. మయాంక్ చాంపియన్‌లా ఆడాడు. బ్యాట్స్‌మెన్ అంతా తమ వంతు పాత్ర పోషించారు. నా దృష్టిలో మెల్బోర్న్లో ఓపెనర్‌గా హనుమ విహారి దాదాపు 70 బంతులు ఆడటం కూడా సెంచరీతో సమానం. మన బౌలర్లు ఇంతగా ఆటను శాసించిన తీరును గతంలో ఎప్పుడూ చూడలేదు. వారి సన్నద్ధత, ఫిట్నెస్, ఆలోచనా ధోరణి అన్నీ గొప్పగా ఉన్నాయి. వారు పిచ్‌ను చూసి మాకు అనుకూలిస్తుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే.’ ‘దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కూడా మమ్మల్ని మేం నమ్మాం. అక్కడి పరాజయాలు మేం తప్పులు దిద్దుకునేలా చేశాయి. మనం సరైన దిశలో పని చేస్తే దేవుడు కూడా సహకరిస్తాడు. ఒక టెస్టులో గెలిస్తే చాలదని, సిరీస్ నెగ్గాలని మేం భావించాం కాబట్టి ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. మేం ఏదైనా చేయగలమని ఈ జట్టు నిరూపించింది. ఈ విజయం తర్వాతి తరం టెస్టులపై ఆసక్తి కనబర్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. వేడుకలు జరుపుకునే అర్హత మాకుంది. ఇవి సుదీర్ఘంగా సాగుతాయని మాత్రం చెప్పగలను. అభిమానులు కూడా అండగా నిలిచారు. విదేశీ గడ్డపై ఆడుతున్నట్లుగా అనిపించనే లేదు.’ ►1 కెరీర్లో తొలిసారి పుజారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. ►3 దక్షిణాఫ్రికాలోనూ భారత్ గెలిస్తే... తొమ్మిది వేర్వేరు దేశాలపై వారి గడ్డపైనే టెస్టు సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన చేరుతుంది. ► 4 కోహ్లి సారథ్యంలో భారత జట్టు విదేశాల్లో నాలుగో సిరీస్ నెగ్గింది. తాజా విజయంతో సౌరవ్ గంగూలీ (4 సిరీస్‌లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. ► 5 ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్ల సంఖ్య. ఇంగ్లండ్ (13 సార్లు), వెస్టిండీస్ (4 సార్లు), దక్షిణాఫ్రికా (3 సార్లు), న్యూజిలాండ్, భారత్ (ఒక్కోసారి) ఈ ఘనత సాధించాయి.