Telangana Education Department
-
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
తెలంగాణ వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్), జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్)లకు వైస్ ఛాన్స్లర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. -
TS: ‘చంద్రయాన్’పై విద్యాశాఖ ఆదేశాలు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో బుధవారం పాఠశాలల టైమింగ్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. రేపు చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాల ని 6.30 గం. ల వరకు నడపవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే.. రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని.. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీ లో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని తెలిపింది. ఒకవేళ రేపు సాయంత్రం చూడని పక్షంలో తర్వాతి రోజు పాఠశాల సమయంలో విద్యార్థుల కు పాఠశాల లో చూపించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసిన విద్యాశాఖ.. చంద్రయాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 లాండింగ్ నేపథ్యంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు టీ సాట్, టీ సాట్ నిపుణ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. -
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. బడి వేళలు మార్చుతూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల వేళ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాలను మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (రేపటి) నుండి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్ర 4.45 వరకు పని చేస్తాయి. అయితే, విద్యాశాఖ తాజా నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు తెలంగాణలో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి రెడ్ అలెర్ట్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా భారీగా వర్షాపాతం నమోదైంది. (ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్) సమస్యల బడి భవనాలు.. భారీవర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గత గురు, శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం వెలువడిన వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్ర స్థాయిలో తాజా పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయి. తరగతి పైకప్పులు కురుస్తున్నాయి. వర్షపునీరుతో గదుల్లో బోధన జరిపే అవకాశం తక్కువ. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈక్రమంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు కొందరు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. (హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ) -
తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష.. !
సాక్షి, హైదరాబాద్: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్జీటీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు. దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్స్ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు. మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం నేను మహబూబాబాద్‌లో, నా భర్త సిద్దిపేటలో పనిచేస్తున్నాం. ఇద్దరు పనిచేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీటర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు. – ఎస్.మమత (ఎస్జీటీ, మహబూబాబాద్) -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
చదువు వెనుక‘బడి’!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్య నాణ్యత సూచీలో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ (పీఐజీ)’ నివేదిక తేల్చింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని పేర్కొంది. మనకన్నా వెనుక ఈశాన్య రాష్ట్రాలే.. పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు పొందడం గమనార్హం. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్ (741), నాగాలాండ్ (728), ఉత్తరాఖండ్ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి. బోధన, పర్యవేక్షణ రెండూ కొరతే! రాష్ట్రంలో పీఐజీ తగ్గడానికి మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో (గురుకుల, రెసిడెన్షియల్ కాలేజీలు కలిపి) 69,15,241 మంది చదువుతున్నారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో 33,03,699, ఎయిడెడ్ 90,601, ప్రైవేటు సంస్థల్లో 35,14,380 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22గా ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నడిపించే పరిస్థితి ఉంది. 8,630 మంది భాషా పండితులు, పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ కాలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,207 పీఎస్ హెచ్ఎం పోస్టులుండగా.. 2,386 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతావి 1,821 ఖాళీలున్నాయి. కొత్తగా 5,793 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఇక పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన డీఈవోలు, ఎంఈవోలు పూర్తిస్థాయిలో లేరు. ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. దీంతో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు ఒక్కో హెచ్ఎంకు ఆరేడు మండలాలు అప్పగించారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా బోధన, పర్యవేక్షణకు ఇబ్బంది కలుగుతోంది. మౌలిక వసతుల కరువుతో.. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంకా వేగం పుంజుకోలేదని.. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో సమస్యలు కనిపిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 38వేల బడుల్లో శౌచాలయాలు ఉన్నా, వాటిలో 10వేల వరకు పనికిరాని స్థితిలో ఉన్నాయి. బాలికలు ఎక్కువగా ఉండే 5,700 స్కూళ్లలోనూ శౌచాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాలికల గైర్హాజరు పెరగడానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 20వేల స్కూళ్లలో విద్యార్థులకు లైబ్రరీ అనేదే తెలియదు. లైబ్రరీ ఉన్నా అందులో పుస్తకాలు శూన్యం. 15వేల బడుల్లో ఆటస్థలాలు లేవు. దీనివల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం నష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40,437 స్కూళ్లకు విద్యుత్ సౌకర్యమున్నా.. 38,920 స్కూల్స్‌లోనే సరిగా సరఫరా జరుగుతోంది. డిజిటల్ విద్య వైపు దేశం అడుగులేస్తున్నా.. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని స్కూళ్లు 20వేలకుపైగా ఉన్నాయి. ఇవన్నీ విద్య ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని పీఐజీ నివేదిక పేర్కొంది. కేంద్రం తీసుకున్న డేటా పాతది పీజీఐ నివేదికను పరిశీలించాం. వాళ్లు తీసుకున్న డేటా పాతది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మౌలిక వసతుల మెరుగుకు మన ఊరు–మన బడి ప్రారంభించాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తున్నాం. బోధనా ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాం. వచ్చే ఏడాది మనం మంచి ర్యాంకు సాధిస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి వచ్చే ఏడాది గ్రేడ్–1లో ఉంటాం ఈ నివేదిక మొత్తం కోవిడ్ కాలంలో జరిగిన పరిశీలనే. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో పాయింట్స్ తగ్గినా మనం గ్రేడ్–2లోనే ఉన్నాం. కోవిడ్ సమయంలో స్కూల్స్ తెరవలేదు. అందుకే బయోమెట్రిక్ హాజరు వాడలేదు. దాన్ని కొలమానంగా తీసుకోలేం. అదీగాక కోవిడ్ వల్ల రాష్ట్రంలో విద్యా వలంటీర్లను కూడా నియమించలేదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది పీఐజీలో మనం గ్రేడ్–1లో ఉండటం ఖాయం. – దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ టీచర్ల కొరత తీర్చితే నాణ్యత పెరుగుతుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే ఉపాధ్యాయ కొరత ఎలా తీరుస్తారు? ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ముందు దీన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తే పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారదర్శకత పెంచాలి ప్రైవేటు స్కూళ్లకు అనుమతి ఇచ్చే క్రమంలో ఆన్లైన్ విధానం ఉండాలి. ఈ తరహా పారదర్శకత అవసరం. డిజిటలైజేషన్ చేపట్టాలి. సకాలంలో నిధులు ఇవ్వాలి. అప్పుడే విద్యాశాఖలో నాణ్యత పెరుగుతుంది. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్, హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
టార్గెట్ రిజల్ట్స్.. 100 శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఫలితాల సాధన దిశగా జిల్లా అధికారులకు టార్గెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఫలితాలు తక్కువగా ఉండే బడుల వివరాలను సేకరిస్తోంది. ఆయా స్కూళ్లలో ఫలితాలు తక్కువగా ఉండటానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదికలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు సరిగా జరగలేదు. 2021లో పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. 2020లోనూ పరీక్షలు రాసినవారి వరకు ఉత్తీర్ణులుగా ప్రకటించారు. కరోనా కాలంలో బోధన జరిగా జరగకపోవడమే దీనికి కారణం. అయితే ఈ ఏడాది సకాలంలో బడులు తెరిచారు. సిలబస్ కూడా సకాలంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతర్గత పరీక్షలన్నీ నిర్వహించడం వల్ల వార్షిక ఫలితాలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారనే అభిప్రాయంతో విద్యాశాఖ ఉంది. సన్నద్ధతకు ప్రత్యేక చర్యలు ఈసారి పదో తరగతిలో ఉన్న విద్యార్థులంతా కరోనా కాలంలో 8, 9 తరగతులు చదివినవారే. ఆ రెండేళ్లు విద్యా సంస్థలు సరిగా తెరవక, బోధన జరగక అభ్యసన నష్టాలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దానిని సరిచేయడానికే బ్రిడ్జి కోర్సులు నిర్వహించింది. అంతకు ముందు విద్యార్థులు చదివిన తరగతుల్లో వెనుకబడిన పాఠాలను మళ్లీ బోధించారు. కానీ దీని నుంచి ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ అంతర్గత సర్వేలోనూ ఇది వెల్లడైంది. ఈ క్రమంలోనే క్లాసులో కనీసం 80 శాతం విద్యార్థులకు పాఠం అర్థమైతేనే సిలబస్‌లో ముందుకెళ్లాలని విద్యాశాఖ ఆదేశించింది. సరిగా అర్థంకాని విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు పుస్తకాలు సరిగా అందకపోవడం, ఇతర కారణాలతో బోధన సరిగా సాగలేదని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే ఐదు నెలల పాటు ప్రత్యేక బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ పేర్కొంది. అంతర్గత పరిశీలనలో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక బోధన చేపట్టాలని.. ప్రతి వారం వారి పురోగతి అంచనా వేయాలని సూచించింది. నెల రోజుల్లో వారి సామ ర్థ్యాన్ని గుర్తించి, అప్పటికీ పురోగతి లేకపోతే మరో సారి ప్రత్యేక బోధన చేపట్టాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా బడుల్లో టెన్త్ ఫలితాలు గతం కన్నా తగ్గే అవకాశం ఉందని.. జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. సబ్జెక్టు టీచర్లు లేకుండా ఎలా? టెన్త్ ఫలితాల సాధనకు టార్గెట్లు పెడుతున్న అధికారులు.. క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికీ 10వేల బడుల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్ కొరత ఉందని, హైస్కూల్ టీచర్లను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. అభ్యసన నష్టాలను ఈ ఐదు నెలల్లో ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖలో దాదాపు 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని.. ఈ ఏడాది విద్యా వలంటీర్లను కూడా నియమించలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఎంఈవోలు, డీఈవోల పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. హైస్కూల్ హెచ్ఎంలకు ఎంఈవోగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, బోధనపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి టీచర్ల కొరత పరిష్కరించకుండా, ఫలితాల కోసం టార్గెట్లు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యశాఖలో ఏళ్ల తరబడి పర్యవేక్షక అధికారుల కొరత పీడిస్తోంది. 30 లక్షలమంది విద్యార్థులు, లక్ష మందికిపైగా సిబ్బంది ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థలో పలు మండలాలకు ఎంఈవో, కొన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులకే ఎంఈ వో పోస్టులు తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పలువురు ఎంఈవోలను అదనపు మండలాలకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూళ్లు మొదలైన నాటి నుంచి ప్రతీ అంశాన్ని పర్యవేక్షించడం, అవసరమైన నివేదికలు తయారు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మండల, జిల్లాస్థాయి అధికారుల పాత్ర కీలకం. ఇంగ్లిష్ మీడియం బోధన మొదలైనా పర్యవేక్షక అధికారుల కొరత వల్ల ఇప్పటివరకూ క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నతాధికారులకు అందలేదని తెలుస్తోంది. 317 జీవోకు ముందు జిల్లా, జోన్లుగా రెండంచెల వ్యవస్థ ఉండేది. జీవో అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా, జోన్, మల్టీజోన్లుగా మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులన్నీ మల్టీజోన్ క్యాడర్ పోస్టులుగా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణకు మల్టీ జోన్‌స్థాయి అధికారి పోస్టులు ఉండాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్లకు పాలన వ్యవహారాలు నిర్వహించడానికి ఏడుగురు జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన పరీక్షల విభాగం, ఎస్సీఈఆర్టీ, ఓపెన్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సైట్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, పబ్లిక్ స్కూల్స్, జవహర్ బాలభవన్ వంటి విభాగాల నిర్వహణకు అధికారులుంటేనే వ్యవస్థలో లోపాలను సరిచేయవచ్చని సూచిస్తున్నారు. కేజీబీవీల్లో ఇద్దరు, మోడల్ స్కూల్స్ విభాగం, ఓపెన్ స్కూల్స్‌లో ఒకరు చొప్పున జాయింట్ డైరెక్టర్లున్నారు. మిగిలిన విభాగాల్లో ఏడీ పోస్టు కానీ, పూర్తిస్థాయిలో డీడీ పోస్టులు లేవు. ఎంఈవోలు... డీఈవోలు ఎక్కడ? ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలున్నారు. 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఇప్పుడున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ వున్నారని, కాబట్టి తమకే ఎంఈవోలు కావాలని పంచాయతీరాజ్ విభాగం టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో నేరుగా నియమించిన ఉపాధ్యాయులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులు దక్కించుకునే అర్హత తమకే ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్ఎంల పదోన్నతి ప్రతి ఏటా వాయిదా పడుతూ వస్తోంది. పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో కొంతమంది ఎంఈవోలకు 6 నుంచి 8 మండలాలు ఎంఈవో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దెబ్బతినే వీలుందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
విద్యా వలంటీర్లతో నెట్టుకొద్దాం! 12 వేల మందిని తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ విద్యా వలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారిని సబ్జెక్టుల అవసరాన్ని బట్టి నియమించే అవకాశముందని తెలుస్తోంది. రెండేళ్లుగా కరోనా వెంటాడటంతో స్కూళ్లు సరిగా నడవలేదు. దీంతో విద్యా వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదు. గత సంవత్సరం పాఠశాలలు తెరిచినా, వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జీపీఏ తగ్గడం వల్లే.. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల జీపీఏ తగ్గింది. దీనిపై ఇటీవల అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత విపరీతంగా ఉంది. కొన్ని స్కూళ్లలో ఉన్న వాళ్లే మిగతా సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపాయి. దీనికి తోడు కరోనా కారణంగా అభ్యసన నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. ఈ దృష్ట్యా ఉపాధ్యాయుల కొరత ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే వీలుంది. ఈ ఏడాది ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడుతుందని భావించారు. కానీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికంగా విద్యా వలంటీర్లలతో ఈ ఏడాది నెట్టుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 2019లో 16 వేల మంది వలంటీర్లను తీసుకున్నా, ఆ తర్వాత ఈ సంఖ్య 12 వేలకు తగ్గింది. ఇప్పుడు కూడా ఇంతే మొత్తంలో వలంటీర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
సర్కారీ స్కూళ్లలో ఇక ప్రతి బుధవారం బోధన ‘మామూలు’గా ఉండదు!
సాక్షి, భువనగిరి : సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రతి బుధవారం పాఠశాలల్లో ‘బోధన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండలం జమీలాపేట ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 22న బోధన కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడంతో పాటు పఠనంలో దోషాలు నివారించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. బుధవారం బోధనలో ఇలా.. బుధవారం బోధనలో భాగంగా ఆ రోజు పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులను తరగతి గదిలో బిగ్గరగా చదివించడం, అక్షర దోషాలు లేకుండా రాయించడం, భాష దోషాలు లేకుండా, గణితంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. కిచెన్‌గార్డెన్‌లో భాగంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో కూరగాయ మొక్కలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారు. చదవండి👉🏻Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం పర్యవేక్షణ అధికారులు వీరే.. బోధన కార్యక్రమాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలు, ఎంపీడీఓలు, సెక్టోరియల్ అధికారులు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు బిగ్గరగా చదివే అభ్యాసాన్ని ప్రోత్సహిస్తారు. పఠనం మరియు సంఖ్యా గణనలో పురోగతి వయస్సుకు తగిన గణిత శాస్త్ర కార్యకలాపాలను చేయడంతో విద్యార్థుల పురోగతిని పరిశీలిస్తారు. దోషాలు తెలుస్తాయి బోధన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెరుగుతుంది. బిగ్గరగా చదవడం వల్ల దోషాలు తెలుస్తాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి బుధవారం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చదువులో విద్యార్థులు పురోగతి సాధిస్తారు. –కానుగుల నర్సింహ, డీఈఓ చదవండి👉🏻స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి.. టీచర్ బ్రెయిన్ డెడ్.. జీవన్ దాన్ సంస్థ ద్వారా -
టీచర్ల పరస్పర బదిలీలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కోర్టు తీర్పునకు లోబడి ఉంటామని ఒప్పంద పత్రం సమర్పించిన 1,260 మంది టీచర్ల పరస్పర బదిలీలపై ఈ నెల 20వ తేదీ.. సోమవారం నాటికి ఉత్తర్వులిచ్చే వీలుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను శుక్రవారం క్లియర్ చేసి, విద్యాశాఖకు పంపుతామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి తెలిపారని యూటీఎఫ్ నేతలు చావా రవి, లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, జీఏడీ నుంచి ఫైల్ అందిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, సోమవారం బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని శేషాద్రి స్పష్టం చేశారని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది. దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదోన్నతుల మాటేంటి? బదిలీలు, పదోన్నతులను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు. ఉపాధ్యాయులకు 2015లో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పటినుంచి తదుపరి పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. త్వరలో వివాదం పరిష్కరించి, ప్రమోషన్లు ఇస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను కొత్తవారితో భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. -
నెలాఖరుకల్లా గురుకుల సెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించిన గురుకుల సొసైటీలు ఇప్పుడు ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఐదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఒకట్రెండు సొసైటీల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నాలుగైదు రోజుల్లో పరీక్ష పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా అన్నిరకాల ప్రవేశపరీక్షల ఫలితాలు ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. జూలై నెలాఖరుకు ప్రవేశాల ప్రక్రియను కొలిక్కి తెచ్చి, అవసరమున్న కేటగిరీల్లో రెండు, మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. -
ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిదేళ్లుగా నో నోటిఫికేషన్.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే.. సర్కారు బడుల్లో భారీగా చేరిక.. గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. రెండు మాధ్యమాల్లో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ కోసం.. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్– 1, బీఈడీ చదివినవారు పేపర్– 2 రాయడానికి అర్హులు. ఎన్సీఈఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్– 1, పేపర్– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. -
క్యాలెండర్ విడుదల: తెలంగాణలో బడులు ఎన్ని రోజులంటే..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్ విడుదలైంది. విద్యా శాఖ అధికారులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఈయర్ విడుదల చేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినమని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల పని దినాలు 213, 47 రోజులు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని వివరించారు. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ క్యాలెండర్ ఇలా.. FA1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి SA1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 8 డిసెంబర్ వరకు FA2 పరీక్షలు పదో తరగతి జనవరి 31 నుంచి FA2 పరీక్షలు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుంచి SA2 పరీక్షలు 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి18 వరకు పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు మార్చి లేదా ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు దసరా సెలవులు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 16 వరకు -
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 13 వరకు వెబ్ఆప్షన్స్ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి) -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!
మంత్రివర్గ ఉప సంఘం సూచనలివీ.. స్కూళ్లకు పక్కా భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులను నిర్మించాలి. వివిధ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించాలి. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం నుంచి కొంత మేరకు నిధులు వస్తాయి. సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలలకు కొంతైనా పోటీ ఇవ్వొచ్చు. రానున్న రోజుల్లో అదనంగా 10 లక్షల మంది విద్యార్థులు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను విడతల వారీగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. మూడేళ్లలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేయాలని పేర్కొంది. మొత్తం 27 వేల స్కూళ్లలో, తొలుత ఈ ఏడాది 9 వేల స్కూళ్లను అభివృద్ధి చేయాలని, అందులో కొన్నింటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. అందుకోసం ఈ ఏడాది రూ.2వేల కోట్ల మేరకు ఖర్చు చేయా లని సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సర్కారుకు నివేదిక సమర్పించింది. మొత్తం అన్ని స్కూళ్ల అభివృ ద్ధికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు అవస రమవుతాయని అంచనా వేసింది. మూడేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణులు, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నివేదికను తయారు చేసింది. అలాగే అధికారుల బృందం ఏపీలోని నాడు నేడు పథకం స్కూళ్లతో పాటు ఢిల్లీలోని స్కూళ్లనూ పరిశీలించింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారణకు వచ్చింది. గదులు లేకపోవడం, పాత భవనాలు కావడంతో పెచ్చులూడి పోవడం, ప్రహారీ గోడలు లేకపోవ డంతో పశువులు, ఇతర జంతువులు సంచరించడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు యాతనలు పడుతున్నారు. గోడలకు పెయింటింగ్ వేయకపోవడంతో అనేక స్కూళ్లు బూజు పట్టి దర్శనమిస్తున్నాయి. బల్లలు, కుర్చీలు లేక విద్యా ర్థులు, టీచర్లు కూర్చోవడానికి వీలు లేకుండా పోతుంది. మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు లేక పోవడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం పలు సూచనలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు నిధులు సమకూర్చి ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. నివేదిక అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యాశాఖ వర్గాలు వేచి చూస్తున్నాయి. తొలి ఏడాది అత్యధిక విద్యార్థు లున్న స్కూళ్లను ఎంపికచేస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఒక ఉన్నతాధి కారి తెలిపారు. రెండో ఏడాది కూడా ఇదే పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తారన్నారు. -
తెలంగాణ: మొదటిసారి 100 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికి ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో మార్కులను ఇంటర్మీడియట్ బోర్డు కేటాయించింది. ఈ ఫలితాలను తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 4,51,585 మంది ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఫలితాలను బోర్డు వెబ్సైట్ (https:// tsbie. cgg. gov. in, http:// examresults.ts nic. in, http:// results. cgg. gov. in) లో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ప్రథమ సంవత్సర హాల్ టికెట్ నంబర్‌ను పొందుపరిచి ద్వితీయ సంవత్సర ఫలితాలను పొందవచ్చని, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ ద్వారా మార్కులు పొందవచ్చని మంత్రి వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన మొత్తం రెగ్యులర్ విద్యార్థుల్లో 1,76,722 మంది ఏ గ్రేడ్ వారున్నారు. బీ గ్రేడ్‌లో 1,04,891 మంది, సీ గ్రేడ్‌లో 61,889 మంది, డి గ్రేడ్‌లో 1,08,083 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ప్రాక్టికల్స్‌లో 100 శాతం... కరోనా కారణంగా ఈసారి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఆయా సబ్జెక్టులకు కేటాయించింది. ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఉంటే.. వాటికి 35 శాతం పాస్ మార్కులను కేటాయించింది. ద్వితీయ సంవత్సరంలోనూ ఆ సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయించింది. అలాంటి విద్యార్థులు 1,99,019 మంది ఉన్నారు. వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులను కేటాయించి పాస్ చేసింది. ఈసారి ప్రాక్టికల్స్ కూడా నిర్వహించని కారణంగా విద్యార్థులందరికి అందులో 100 శాతం మార్కులను కేటాయించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి 35 శాతం పాస్ మార్కులను ఇచ్చింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వొకేషనల్ బ్రిడ్జికోర్సు, అదనపు సబ్జెక్టుల్లో 35 శాతం పాస్ మార్కులు వేసింది. ప్రస్తుతం కేటాయించిన మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక రాత పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొంది. జూలై 1 నుంచి మార్కుల మెమోలు... మార్కుల మెమోలను (కలర్ షార్ట్ మెమో) విద్యా ర్థులు బోర్డు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత http://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040–24600110 ఫోన్ నంబర్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనూ (www. bigrs. telangana. gov. in), బీఐజీఆర్ఎస్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. కాలేజీల వారీగా ఫలితాలను కాలేజీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి పొందవచ్చు. కాలేజీల వారీగా మార్కుల రిజిస్టర్లను జూలై 5 నుంచి కాలేజీ లాగిన్ ద్వారా పొందవచ్చు. మొదటిసారి 100 శాతం పాస్.. కరోనా కారణంగా ఈసారి పరీక్షలు లేనందున విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఈసారి 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, గతేడాది 4,85,166 మంది (62.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2018–19 విద్యా సంవత్సరంలో 4,90,308 (59.37%), 2017–18లో 5,07,906 మంది (60.97%), 2016–17లో 5,01,119 మంది (59.91%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థుల వివరాలివే.. స్ట్రీమ్ విద్యార్థులు రెగ్యులర్ జనరల్ 4,28,921 4,07,684 వొకేషనల్ 44,929 43,901 మొత్తం 4,73,850 4,51,585 పాసైన వారిలో బాలురు-2,36,409 బాలికలు-2,37,441 ప్రధాన గ్రూపుల వారీగా విద్యార్థుల వివరాలు.. గ్రూపు విద్యార్థులు ఎంపీసీ 1,74,945 ఎంఈసీ 20,716 బైపీసీ 1,00,547 సీఈసీ 1,18,750 హెచ్ఈసీ 12,954 -
తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్లైన్లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్లైన్లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. (చదవండి: కూకట్‌పల్లిలో విషాదం: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య) -
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు వివరాలు సమర్పించారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ బోధన కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో వారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. చదవండి: TS: కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం -
పిల్లలూ సిద్ధంకాండ్రి: 1 నుంచి 8, 9, 10 తరగతులు
విద్యాశాఖ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ.. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం. వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బోధనను కొనసాగించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనతోపాటు బడులకు హాజరుకాని విద్యార్థుల కోసం ఆన్లైన్ బోధనను కూడా చేపడతారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని టీచర్లు ఈనెల 25 నుంచి బడులకు రావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను అమలు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 30 శాతం ఫీజులను తగ్గించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తులపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాబోధనను దశలవారీగా చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి బడులను ప్రారంభించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు జూలై 1 నుంచి విద్యా బోధనను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది. 6, 7 తరగతు లకు జూలై 20 నుంచి బోధనను చేపట్టాలని, 3, 4, 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేలా ప్రతిపాదించింది. ఒకటి, రెండో తరగతుల అం శాన్ని ప్రస్తావించలేదు. పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన మార్గదర్శకాల కోసం విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. దాదాపు ఆ షెడ్యూలు ప్రకారమే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలను కూడా ప్రారంభించాల్సి ఉన్నందున సన్నద్ధతపై ఆయా శాఖల మంత్రులతోనూ చర్చించాకే ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 25 నుంచి బడులకు హాజరయ్యే ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మోడల్‌స్కూళ్లు, కేజీబీవీలు, విద్యా శాఖ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్లు అంతా ఆయా విద్యా సంస్థల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వారం సెకండియర్ ఫలితాలు వచ్చే వారంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు (ప్రత్యక్ష బోధన) ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో 46 ప్రకారమే యాజమాన్యాలు ఫీజులను తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ మూలాన భయపడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతామన్నారు. ఈ విషయంలో మరోసారి మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారు బాలురు 2,62,917 బాలికలు 2,53,661 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535 పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది.