Trekking
-
Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే! హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం! అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్‌ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్రాజ్ బైర్వా వివరించారు. ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్లో ఎవరున్నారు, బిర్‌లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్‌లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్‌కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
కమి రిటా షెర్పా రికార్డు
కఠ్మాండు: నేపాలీ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు. -
పర్వతారోహణలోనే పరలోకాలకు.. నల్లగొండ యువకుడు మృతి..
చిట్యాల: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే చిన్ననాటి కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల ఉపేందర్, ఉమ దంపతులు 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సాయినగర్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఓ కూతురుతో పాటు కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(32) ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతితో వివాహం జరిగింది. 2నెలలు శిక్షణ పొంది.. రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అసోంలో రెండు నెలల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. ఈ నెల 3వ తేదీన మరికొంత మంది పర్యాతారోహకులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. ఖాట్మండు నుంచి వాహనంలో సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని సల్లేరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పది రోజుల పాటు ప్రయాణించి 4,910 మీటర్ల ఎత్తులో ఉండే లోబూచే పర్వతాన్ని ఈ నెల 21న చేరుకున్నాడు. అక్కడ సీప్ర లాడ్జిలో బసచేశాడు. ఇక్కడి నుంచి మరో 600 మీటర్లు ట్రెక్కింగ్(పర్వతారోహణ) చేస్తే రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపు(5,500 మీటర్ల దూరం) చేరుకునేవాడు. అయితే, ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వాతావరణం అనుకూలించక రాజశేఖర్‌రెడ్డి లాడ్జిలోనే ఉండిపోయాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఈ నెల 22న రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, మృతదేహాన్ని అక్కడి అధికారులు నేపాల్‌లోని ఖాట్మండు వరకు తీసుకువచ్చారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సోమవారం వరకు రాజశేఖర్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుందని, సాయినగర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్
పెంపుడు జంతువులు మానవుని దైనందిన జీవితంలో మంచి ఆత్మీయులుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందులోనూ కుక్కులకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదు. తన యజమాని కోసం ఏం చేసేందుకైన వెనుకాడవు. తమ ప్రాణం ఉన్నంతవరకు యజమాని ఇంటిని కాపాడుతాయి. అంతేకాదు తమ యజమానిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటాయి కూడా. అచ్చం అలానే ఇక్కడొక కుక్క ప్రమాదంలో చిక్కుకున్న తన యజమానిని రక్షంచేందుకు ఏం చేసిందో తెలుసా! కాలిపోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన రెండున్నరేళ్ల పెంపుడు కుక్క ఎవాతో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లింది. ఈ మేరకు ఆమె పర్వత ట్రెక్కింగ్ వెళ్లినపుడూ ఒక సింహం ఆమెపై దాడి చేస్తుంది. దీంతో ఆమె భయంతో తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. అది తన యజమానిని రక్షించేందుక తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి సింహంతో పోరాడి తన యజమానిని రక్షించింది. ఈ క్రమంలో ఎవా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఎవా ఆస్పుత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
Visakhapatnam: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!
‘మహిళలు, ఆడపిల్లలు అవరోధాల్ని అధిగమించి.. ఖండాతరాల్లో ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఇలాంటి వారందరికీ విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఇది ఎంతో గర్వకారణం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.’ – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ఈ ఒక్క ప్రశంస చాలు.. ఆమె సాధించిన ఘనత గురించి చెప్పుకోవడానికి.! బుడి బుడి అడుగులు వేసే వయసులోనే.. కొండలెక్కడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన సమయంలో పర్వతారోహణ చేపట్టింది. అలా మొదలైన ప్రయాణం.. రికార్డులు తిరగరాసేంత వరకు చేరింది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్ట్, పదేళ్లకే కిలిమంజారో.. ఇప్పుడు సాహస్.. ఇలా ఆ బాలిక సంకల్పబలం ముందు శిఖరం సైతం సాహో అంటోంది. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ.. ఇప్పటికే ఐదు అతి ఎత్తయిన శిఖరాగ్రాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది. వచ్చే నెలలో ఉత్తర అమెరికాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆ సాహసి పేరే కామ్య కార్తికేయన్. – సాక్షి, విశాఖపట్నం ఐదు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలు ఒక్కో రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్న కామ్య.. 2017 మే 16 నుంచి రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. అప్పుడే ‘సాహస్’యాత్రకు బీజం పడింది. ఏడు ఖండాల్లోని అతి ఎత్తయి న పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పం కామ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనుకున్నదే తడవుగా.. ఎవరెస్ట్ ఎక్కిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించింది. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా మరో రికార్డు సాధించింది. పదేళ్ల వయసులో స్టాక్ కాంగ్రీ పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఖండంలో 7,310 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను 2019లో పూర్తి చేసింది. తల్లి లావణ్యతో కలిసి వెళ్లిన కామ్య.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. మౌంట్ కోసియాజ్కోను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. అనంతరం దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అవలీలగా అధిరోహించేసింది. రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఆ అలవాటే.. అవార్డులు తెచ్చిపెడుతోంది! విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయన్ స్పోర్ట్స్ పర్సన్‌గా నేవీలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది కామ్య కార్తికేయన్. కామ్యకు నడక రాని సమయంలో తండ్రి కార్తికేయన్, తల్లి లావణ్య ఆ చిన్నారిని ఎత్తుకొని ట్రెక్కింగ్‌కు, వాకింగ్‌కు వెళ్లేవారు. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. ఆ అలవాటే.. కామ్యకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. అలా నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. మూడేళ్ల ప్రాయంలో ముంబయిలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గడ్ పర్వతాలను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో హిమాలయ పర్వత శ్రేణిలో 12 వేల అడుగుల చంద్రశీల, 2016లో 13,500 అడుగుల హర్‌కిదున్, 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ, 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు పర్వతారోహణ పూర్తి చేసింది. తొమ్మిదేళ్ల వయసులోనే హిమాలయాల్లోని రూప్‌కుండ్ మంచు సరస్సును అధిరోహించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు అర్హత సాధించింది. ప్రశంసించిన మోదీ మన్‌కీ బాత్‌లో విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆసియా ఆవల ఉన్న దేశాల్లో 7 వేల మీటర్ల అత్యంత ఎత్తయిన శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కామ్య ధైర్యం అందరిలోనూ స్ఫూర్తినింపిందంటూ కొనియాడారు. ‘మిషన్ సాహస్’లో భాగంగా పర్వతారోహణ చేస్తున్న కామ్య వివిధ దేశాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు. ఈ మిషన్‌లో కామ్య సఫలీకృతమై. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శక్తి సామర్థ్యాల విషయంలో భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సాహస యాత్రలకు గుర్తింపుగా ఇటీవలే పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా కామ్య అందుకుంది. ఉత్తర అమెరికా వైపు అడుగులు.. విశాఖ నేవీ స్కూల్లో చదువుతున్న కామ్య కార్తికేయన్.. ఆరో ఖండంలోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. సాహస్ యాత్రలో ఉత్తర అమెరికాలోని అలస్కాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేయాలని భావిస్తోంది. జూన్ 22వ తేదీన ఈ యాత్రను ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో కామ్య ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. డెనాలీ పర్వత శిఖరం 20,310 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని అధిరోహించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తే.. మిగిలినది అంటార్కిటికాలో అతి ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సెన్ మాసిఫ్. ఇది అంటార్కిటికా మంచు పర్వత శ్రేణుల్లో 16,050 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని కూడా అధిరోహిస్తే.. కామ్య కార్తికేయన్ సాహస్ యాత్ర పూర్తవుతుంది. ఏడు ఖండాల్లోనూ దేశ కీర్తిని పెంచడమే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య నా వెన్నంటే ఉంటుంది. అందుకే.. అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. జూన్‌లో ఉత్తర అమెరికా శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. అంటార్కిటికాలోని చివరి పర్వతాన్ని ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. కష్టమైనా ప్రతి ఒక్క విజయాన్ని సాధించే తీరుతాను. –కామ్య కార్తికేయన్, పర్వతారోహణ చేస్తున్న బాలిక ఇకపై వేసే ప్రతి అడుగూ ఒక సవాలే.. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. అలా అలవాటు చేసుకున్న కామ్య.. శారీరకంగానూ మానసికంగానూ పర్వతారోహణకు సిద్ధపడుతూ వచ్చింది. ఇప్పటి వరకూ ఐదు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. అయితే.. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. అంతే కాదు.. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. ఈ రెండు శిఖరాలను అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. – లావణ్య కార్తికేయన్, కామ్య తల్లి -
కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర
కనువిందు చేసే ట్రెక్కింగ్‌తో పాటు వణుకుపుట్టించే చరిత్ర కూడా ఆ కోట సొంతం. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా గుర్తింపు తెచ్చుకున్న కళావంతిన్ దుర్గం గురించి మీరెప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర, ముంబై సమీపంలోని పశ్చిమ కనుమలలో, మాథేరాన్, పన్వేల్ మధ్య ఉన్న ఈ కోట.. సముద్ర మట్టానికి 701 మీటర్ల (2,300 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ కోటను కళావంతిన్ అనే రాణి గౌరవార్థం నిర్మించారనేది పురాణగాథ. ఎటువంటి ఆధారం లేని ఇరుకైన రాతి మెట్లు, ఏటవాలు మార్గం.. వర్షంతో ఏర్పడిన నాచు, జారుడు స్వభావం గల రాళ్ళు.. ఇవన్నీ ఆ కోట పైకి ఎక్కేందుకున్న అడ్డంకులు. అయితే అది ఎక్కిన తర్వాత తేలియాడే మేఘాల నడుమ.. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో తడిసి ముద్దవ్వాల్సిందే. కోట శిఖరాగ్రంలో చిరస్మరణీయమైన క్షణాలను మూటకట్టుకోవాల్సిందే. అందుకే ఈ కోటను climb to heaven ‘స్వర్గారోహణం’గా పిలుస్తారు. స్థానికుల ప్రకారం ఈ కోట వెనుక భయానక కథలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనేది వారి వాదన. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. ‘ఆ కోట నుంచి అర్ధరాత్రి.. వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తాయి. అందుకే మేము ఆ కోటకు కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం’ అంటారు. ఏదేమైనా జీవితంలో ఒకసారైనా ఈ కోటను ఎక్కి తీరాల్సిందే అని చెప్తారు పర్వతారోహకులు. -
లడఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్.. ఫోటోలు వైరల్
లడఖ్: లడఖ్‌లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళాలు నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్‌లో 100 మంది బార్డర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ మథూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ అభినందించారు. Ladakh: Watch the glimpses of the Ice wall climbing competition in Ladakh organised for the 1st time in the Country by North West Frontier ITBP, Leh. More than 100 climbers are taking part.#Himveers@nwftr_itbp pic.twitter.com/KeOCtkBrfD — ITBP (@ITBP_official) February 27, 2022 ఆయన మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డర్ పోలీసుల ట్రెక్కింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Some glimpses of Ice Wall Climbing Competition in Ladakh organised for the 1st time in the Country by HQrs NW Frontier ITBP, Leh.#Himveers#IceWallClimbing pic.twitter.com/Mp2qLHTtFc — ITBP (@ITBP_official) February 27, 2022 -
62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్‌డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!. వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్కూడమ్ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది. ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్కూడమ్కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ని చూసి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Vishnu (@hiking_._) (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్‌లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్‌ని జోడించి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
-
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
నగరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ముక్కు కొండ ఉంది. హనుమంతుని ముక్కు ఆకారంలో ఉండటంతో కొండకు ముక్కు కొండ అన్నపేరు వచ్చింది. పుత్తూరు, నగరి జాతీయ రహదారిలో వెళ్లే వారికి సుదూర ప్రాంతం వరకు ఈ కొండ కనిపిస్తుంది. పడుకున్న మనిషి ముక్కు ఆకారంలో ఉండటంతో ఈ కొండకు ఈ పేరు వచ్చిందని నానుడి. సముద్ర మట్టానికి 855 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వంద కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది. ట్రెక్కింగ్ ఇలా... నారాయణవనం మండలం, సముదాయం గ్రామంలోని అవనాక్షమ్మ ఆలయ సమీపం నుంచి ముక్కుకొండ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. గైడ్లు లేకుండా కొండపైకి చేరుకోలేము. వారు కూడా వెళ్లే మార్గంలో చెట్లపై గుర్తులు పెట్టుకుంటూ, రాళ్లు పేర్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ ఆ గుర్తుల ఆధారంగా క్రిందకు చేరుస్తారు. ఈ కొండపైకి వెళ్లడం సాహసంతో కూడుకున్న పని. కొండ ఎక్కడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. పైకి వెళ్లేవారు తినడానికి అవసరమైన ఆహారం, నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే దారి పూర్తిగా రాళ్లతోను, ముళ్లకంపలతోను, బోదలతోను నిండి చిట్టడవిలా ఉంటుంది. ప్రాచీన లైట్ హౌస్ మధ్యయుగ కాలంలో ముక్కుకొండ బంగాళాఖాతంలో వచ్చే పడవలకు చెన్నై మార్గం చూపే దిక్సూచిగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థన మేరకు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కార్వేటినగరం రాజుల ఈ కొండ శిఖరంపై అఖండ ధీపం వెలిగించడానికి అంగీకరించారు. కొండశిఖరంపై ఒక అఖండాన్ని ఏర్పాటుచేసి అక్కడ మంటపెట్టడానికి జంగములనే చెంచులను నియమించారు. సూచించిన సమయాల్లో వారు అఖండం వెలిగించే ప్రక్రియను కొనసాగించడానికి కొండ క్రింద వారికి భూములు కేటాయించారు. అఖండంలో ఒక టన్ను కొయ్యలు వేసి నిప్పంటించగా అది సముద్రంలో ప్రయాణించే షిప్పులకు చిన్న దీపంలా కనిపించేది. ఇలా ముక్కుకొండపై వెలిగించే మంటలు సముద్రంలో ప్రయాణించే షిప్పులకు దారిచూపే లైట్హౌస్గా మారింది. ఈ దీపం ఆధారంగా షిప్పులు చెన్నై పోర్టుకు చేరుకునేవి. చెన్నై హార్బరులో లైట్ హౌస్ నిర్మించిన పిదప కొండపై షిప్పులకోసం దీపం వెలిగించడాన్ని ఆపేశారు. ప్రస్తుతం షిప్పులకోసం దీపం వెలిగించక పోయినా ప్రతి చిత్రాపౌర్ణమికి చెంచులు కొండపై అఖండాన్ని వెలిగిస్తారు. ముక్కుకొండ ఊరిపేరుగా మారింది ఈ కొండ కారణంగానే కొండ అంచున ఉన్న ప్రాంతానికి నగరి అనే పేరు వచ్చింది. ముక్కు ఆకారంలో ఉన్న ఈ కొండను ముక్కు కొండ అని నాశికగిరి అని పిలిచే వారు. నాశిక గిరి కాలక్రమేణా నగిరి అని క్రమేణా నగరి అని మారింది. హనుమంతుడు ప్రతిష్ఠించిన గగన వినాయకుడు కొండశిఖరంపై వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉండటంతో ఈ వినాయకుని గగన వినాయకునిగా పిలుస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ చేసే సమయంలో ఢీకొన్న కారణంగా కొండ ఇలా ముక్కు ఆకారంలో మారిందని దీంతో హనుమంతడు అక్కడ ఆగి కొండపై ఆగి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున కొండపై ధీపం వెలిగిస్తే హనుమంతుడు వచ్చి ఆశీర్వదిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. కొండపైకి వెళ్లే వారు గగన వినాయకుని, ఆదిశేషుని ఆకారంలో ఉన్న బండను, అఖండాన్ని చూడవచ్చు. వీటితో పాటు వివిధ ఆకారాలోల్లో ఉన్న రాతి బండలను, చెట్లను చూడవచ్చు. చారిత్రక ప్రసిద్దిగాంచిన ఈ కొండపైకి ఆంద్రప్రదేవ్ టూరిజం వారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొండ విశేషాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, చిత్తూరు: ఉరుకులు పరుగుల జీవితం. కాంక్రీటు వనాల్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైన పని. ఒకేచోట నివసిస్తున్నామనే మాటే కానీ.. నోరు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. పక్కింట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా మనిషి మారిపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతూ.. ఆయుష్షు క్షీణిస్తోంది. రోజంతా కష్టపడినా.. సాయంత్రానికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితులు ఉంటే జీవితంలో అంతకు మించిన సుఖం మరొకటి లేదనేది వాస్తవం. కనీసం వారంలో ఒక్క రోజైనా స్నేహితులు, బంధువులతో కలిస్తే.. మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ సంతోషమే సగం బలం. ఇలా కలవాలనుకునే వారిని ఒక్కటి చేస్తోంది ‘ట్రెక్కింగ్’. ఆ విశేషాల సమాహారమే ఈవారం ‘సాక్షి’ సండే స్పెషల్.. రొటీన్ జీవితానికి భిన్నంగా ఆటవిడుపు కోసం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలో వీకెండ్లో పర్వతారోహణం చేస్తుంటారు. భారత దేశంలో పర్యటన పూర్తిగా మతంతో ముడిపడి ఉంటుంది. తీర్థయాత్రలు, యాత్రలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా తిరుపతికి చెందిన బీవీ రమణ, పున్నా కృష్ణమూర్తి, ఈశ్వరయ్య 25 ఏళ్ల క్రితం అడవిలో చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లడం ఆరంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, లోయలు, సెలయేళ్లు, నీటి ప్రవాహాలు, ఆ నీటి ప్రవాహ ఒరిపిడికి ఏర్పడిన శిలా రూపాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తరువాత శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్(74), సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ(70), మధు(స్విమ్స్‌లో డయాలసిస్ టెక్నీషియన్), యుగంధర్, ట్రెక్కింగ్ బాలసుబ్రమణ్యం గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఆదివారం ట్రెక్కింగ్‌కు వెళ్లి వస్తున్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు వైఎస్సార్సీపీ యువ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డి మిత్ర బృందం సభ్యులు మరో గ్రూపుగా ఏర్పడి ట్రెక్కింగ్‌ను ఆస్వా దిస్తున్నారు. 1997లో జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి విజయవాడ నుంచి తిరుపతికి బదిలీపై వచ్చి.. విధులు ముగించుకుని అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆ తరువాత స్థానిక ఉద్యోగి బీవీ రమణతో కలిసి శేషాచలంలో అన్వేషణ ప్రారంభించారు. ఇలా ట్రెక్కింగ్‌కు బీజం పడింది. ఆషామాషీ కాదు.. ట్రెక్కింగ్ అనేది ఆషామాషీ కాదు. సాహసంతో కూడుకున్న యాత్ర. చెప్పాలంటే మిలిటరీలో ట్రైనింగ్ లాంటిది. తాళ్లు, ట్యూబ్స్, టెంట్లు, నీరు, భోజనం, పండ్లు, బిస్కెట్స్ తీసుకుని నిట్టనిలువుగా ఉండే కొండలు, గుట్టలు ఎక్కడం సరికొత్త అనుభూతి. ఒక్కొక్కరు కనీసం 20 నుంచి 30 కిలోల బరువు మోసుకెళ్లాల్సి వస్తుంది. 25 ట్రెక్కింగ్ గ్రూపుల్లో కొందరు 100 నుంచి 200 సార్లు కొండా కోనల్లో తిరిగిరావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రెక్కింగ్‌తో లాభాలు ► ఫిట్‌నెస్‌కు, కష్టానికి శరీరం అలవాటు పడుతుంది. ► శరీరాన్ని ఎలా అయినా తిప్పేందుకు వీలు కలుగుతుంది. ► సమష్టితత్వం అలవడుతుంది. ► ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం నేర్పుతుంది. ► నడవలేని వారికి చేయి అందించడం, లేదా మోసుకెళ్లడం ద్వారా పరోపకారాన్ని తెలియజేస్తుంది. ► అడవిలో మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. ► కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వం. పక్కా ప్రణాళికతో.. ►ట్రెక్కింగ్‌కు వారం ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ► ఏ అడవికి వెళ్లాలి, అక్కడకు ఎన్ని కిలోమీటర్లు? దారి ఎలా ఉంటుంది? అందుకు సంబంధించిన ఏర్పాట్లు. ► ట్రెక్కింగ్‌లో భాగస్వాములయ్యే సభ్యులతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవడం. ► ఎలాంటి సమాచారమైన అందులోనే చర్చించుకోవడం. లొకేషన్ షేరింగ్. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు వేకువజామునే లేచి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి ఉదయం 6–7 గంటల మధ్య చేరుకోవాలి. ► ప్రతి సభ్యుడు ఒక బ్యాగు, అందులో 2, 3 నీళ్ల బాటిల్స్, స్నాక్స్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్లాలి. ► కొండలు, గుట్టలు ఎక్కేందుకు వీలుగా కాటన్ దుస్తులు ధరించాలి. విధిగా షూ ధరించాలి. ► మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందస్తు ఏర్పాట్లు. ► ఎంపిక చేసుకున్న ప్రాంతానికి వెళ్లే కంటే ముందు సమీపంలోని గ్రామాల ప్రజలతో మమేకం కావడం. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం నేను 30 ఏళ్లకు ముందే ట్రెక్కింగ్ మొదలు పెట్టాను. ఇప్పటి వరకు సుమారు 200 ట్రెక్కింగ్‌లు చేసుంటా. నాతోపాటు ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు అందరినీ తీసుకెళ్తుంటా. నా భార్యను కూడా ట్రెక్కింగ్‌లో భాగస్వామిని చేశా. ప్రకృతి ఒడిలోకి వెళ్తే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. జీవవైవిధ్యంతో పాటు జంతువులు, అనేక రకాల మొక్కలు, పూల మధ్య గడపడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. – భూమన్, శ్వేత మాజీ డైరెక్టర్ పెద్ద పులిని చూసి షాక్ అయ్యాం 2006లో తలకోన నుంచి సుమారు 30 కి.మీ దూరంలో రుద్రగళతీర్థం వరకు వెళ్లాం. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశాం. రాత్రి 10 గంటల సమయంలో కణితి అరుపులు వినిపించాయి. ఇది మామూలే అనుకున్నాం. 15 నిమిషాల తర్వాత పెద్దపులి గాడ్రింపుతో భయమేసింది. ఆ పెద్దపులి కణితి గొంతును పట్టుకుని ఈడ్చుకెళ్తుండడం చూసి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ చప్పుడు చేయకుండా ఉండిపోయాం. – కుమార రాధాకృష్ణ, కృష్ణాపురం, రాత్రి విగ్రహాల శిల్పి -
Ponmudi: కేరళ బంగారం.. పొన్ ముడి
కశ్మీరు లోయ... కన్యాకుమారి చెంతకు వచ్చినట్లుంది. సముద్రం అంటే ఏమిటో ఎరుగని కశ్మీర్ పశ్చిమ కనుమలను ఆసరాగా చేసుకుంటూ అరేబియా తీరం వెంబడే దక్షిణాదికి నడిచి వచ్చినట్లు ఉంటుంది పొన్ముడి. పొన్ముడి అంటే బంగారు శిఖరం అని అర్థం. ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్లు ఈ ప్రదేశాన్ని కశ్మీర్‌తో పోలుస్తారు. కేరళలోని ఈ హిల్స్టేషన్లో ఏడాదంతా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. పర్వత శిఖరాలను తాకుతూ ప్రయాణించే మబ్బులను దక్షిణాదిలో చూడాలంటే ఈ పొన్ముడిలోనే సాధ్యం. ఈ కేరళ కాశ్మీరం ఆ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరాన ఉంది. జ్ఞాపకంగా ఓ రాయి త్రివేండ్రం నుంచి మొదలైన రోడ్డు ప్రయాణంలో నగరాన్ని వదిలినప్పటి నుంచి పశ్చిమ కనుమల పచ్చదనం ఆహ్వానిస్తుంది. రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ మధ్యలో కల్లేరు నది పలకరిస్తుంది. ఈ నదిలో రాళ్లు నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలి ఉంటాయి. బాగా నునుపుదేలిన ఒక రాయిని వెంట తెచ్చుకుంటే పొన్ ముడి టూర్ జ్ఞాపకంగా ఉంటుంది. పొన్ ముడి శిఖరం మీద నిలబడి ఆత్మప్రదక్షిణం చేసుకుంటే ప్రకృతి విజయం కనువిందు చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌లు, సునామీలు ఎన్ని విపత్తులు వచ్చినా ప్రకృతి తిరిగి చిగురించడం మానదు. అదే ప్రకృతి సాధించే విజయం. ఇక పొన్ ముడి టూర్లో తీరాల్సిన అద్భుతం అందమైన సూర్యోదయం. పశ్చిమ కోన వరయాడు అంటే నీలగిరి థార్. నీలగిరి థార్ ఉండే ఎల్తైన ప్రదేశమే వరయాడు మొట్ట. ఇది మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. కల్లేరు నదికి పొన్ ముడి పర్వత శిఖరానికి మధ్యలో వరయాడు మొట్ట వస్తుంది. ఇది పదమూడు శిఖరాల సమూహం. ఇందులో సెకండ్ హయ్యస్ట్ వరయాడు మొట్ట. సౌత్ ఇండియాలో అడ్వంచరస్ ట్రెక్కింగ్ పాయింట్. ట్రెకింగ్ మొదలైన అరగంటకే ఉచ్ఛ్వాశ నిశ్వాసల వేగం పెరుగుతుంది, శబ్దం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ట్రెకింగ్‌కి రెండు నెలలు ముందు బుక్ చేసుకోవాలి. జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు వాళ్ల ఆసక్తిని బట్టి వరయాడు మొట్ట, సీతతీర్థం మీదుగా పొన్ ముడి చేరుకోవచ్చు. ట్రావెల్ టిప్ ట్రెకింగ్‌కి వెళ్లే వాళ్లు షూస్ పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. పాదానికి, మడమకు అదనపు ఒత్తిడి కలగకుండా సౌకర్యంగా ఉండాలి. అలాగే ట్రెకింగ్ మొదలు పెట్టేటప్పుడు సాక్స్ ధరించడానికి ముందు పాదానికి, వేళ్ల సందుల్లో టాల్కమ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల రోజంతా షూస్‌తోనే ఉన్నప్పటికీ పాదాలు తాజాగా ఉంటాయి. చెమటతో చిరాకు కలగదు. వరయాడు మొట్టకు పర్యాటకుల ట్రెకింగ్ -
ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ
సరిగ్గా వారం క్రితం మే 23 వ తేదీ ఆదివారం ఈ ‘ఫీట్’ను సాధించారు హంగ్. బేస్ క్యాంప్ నుంచి ఆ ముందు రోజు మధ్యాహ్నం గం.1.20 లకు ఎవరెస్టును ఎక్కడం ప్రారంభించి, మర్నాడు మధ్యాహ్నం గం. 3.10 ని.లకు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆమె తన సంతృప్తి కోసం చకచకా ఎవరెస్టును ఎక్కారు తప్ప.. ‘ఫాస్టెస్ట్ ఉమన్’ అని అనిపించుకోడానికి ఎక్కలేదట! 25 గంటల 50 నిముషాల్లో ఎక్కడం పూర్తి చేశారు. అది రికార్డు అని అప్పుడు ఆమెకు తెలియదు. పక్కనే ఉన్న టీమ్ లీడర్ షేర్పాకు, ఆ టీమ్‌లోని తక్కిన పర్వతారోహకులకూ అంత కచ్చితంగా తెలీదు. వారంతా కిందికి దిగి వచ్చాక ఈ శుక్రవారం నేపాల్ ప్రభుత్వాధికారులు త్సాంగ్ ఇన్ హంగ్ 12 గంటల తేడాతో పాత రికార్డును బద్దలు కొట్టినట్లు ప్రకటించారు! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మహిళగా నేపాల్‌కు చెందిన ఫున్జో ఝంగ్ము లానా పేరుతో రికార్డు ఉంది. 2018 మే 17న ఆమె ఆ రికార్డును నెలకొల్పారు. 39 గంటల 6 నిముషాల్లో బేస్ క్యాంప్ నుంచి ఫున్జో ఆ రికార్డును నెలకొల్పారు. ఫున్జో రికార్డును ఇప్పుడీ హాంకాంగ్ మహిళ త్సాంగ్ ఇన్ హంగ్ తనకు తెలియకుండానే బ్రేక్ చేశారు. నిజానికి మే 12 నే శిఖరాన్ని చేరుకోవలసింది హంగ్. ఆ రోజు గాలులు ఉద్ధృతంగా ఉన్నాయి. కుమ్మరించినట్లుగా ఒకటే మంచు. 8,750 మీటర్ల ఎత్తుకు వెళ్లి కూడా అక్కడే ఆగిపోయారు. ఇక వంద మీటర్లే కదా, ఎక్కేద్దాం అనుకోలేదు. తొలిసారి ఆమె 2017 మే 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ ‘డ్రీమర్స్ డెస్టినేషన్ ట్రెక్స్ అండ్ ఎక్స్‌పెడిషన్’ కంపెనీ తరఫున మరొకసారి ఎవరెస్టును చేరుకున్నారు. అదీ అత్యంత వేగంగా. హంగ్ టీచర్. ఎవరెస్టు కంటే ముందు 2016లో ఆమె చైనాలోని ముజ్టాగ్ పర్వతాన్ని ఎక్కారు. ‘‘ఇదంతా నా స్టూడెంట్స్, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం’’ అంటారు హంగ్. కలను నిజం చేసుకోలేకపోతే జీవితంలో మనం తర్వాతి అడుగు వేయలేం అని హంగ్‌కు వాళ్ల అమ్మ చెబుతుండేవారట. 2011–2019 మధ్య కాలంలో హంగ్ ఐదు వేల నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను ఇరవై సార్లు ఎక్కి దిగారు. పర్వతాలు సానుకూల ఆలోచనల్ని కలిగిస్తాయని, ఒదిగి ఉండటం నేర్పుతాయనీ హంగ్ అంటారు. -
Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం
మీన్ముట్టి... జలపాతం... వయనాడు తలమీద జల కిరీటం. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి దూకే ప్రవాహవేగం తెల్లగా ... పాలధారను తలపిస్తుంది. నీటిచుక్కల సవ్వడి... ఝంఝామారుతాన్ని గుర్తు చేస్తుంది. కేరళ రాష్ట్రం అనగానే మనకు ఇండియా మ్యాప్‌లో దక్షిణాన అరేబియా సముద్రతీరానికి ఆనుకుని ఉన్న సన్నటి స్ట్రిప్ గుర్తుకు వస్తుంది. కేరళలో నివాస ప్రాంతాలన్నీ అరేబియా తీరానే ఉన్నాయేమో అని కూడా అనుకుంటాం. కానీ సాగరతీరాన్ని తాకకుండా కొన్ని జిల్లాలున్నాయి. వాటిలో ఒకటి వయనాడు. ఇది ఓ దశాబ్దం కిందట పర్యాటక ప్రదేశంగా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాహుల్‌గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో వయనాడు దేశమంతటికీ సుపరిచయమైంది. పశ్చిమ సుగంధం వయనాడు సుగంధ ద్రవ్యాలు పుట్టిన నేల. పశ్చిమ కనుమల మీద విస్తరించిన హిల్‌స్టేషన్, ఏడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిజం ఆధారంగా అభివృద్ధి చెందిన హోటళ్లు పెద్ద పెద్ద హోర్డింగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంటాయి. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకులు, మిరియాలు, లవంగాల చెట్లు, అక్కడక్కడా మామిడి, పేర్లు తెలియని లెక్కలేనన్ని జాతులు... అన్ని ఆకులూ పచ్చగానే ఉన్నా, దేని పచ్చదనం దానిదే. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అందంగా ఉంటాయి. వయనాడుకు వెళ్లే దారిలో కొండల్లో ప్రమాదకరమైన మలుపులున్నాయి. వాటిని హెయిర్‌పిన్ బెండ్లు అంటారు. మీన్ముట్టికి వెళ్లే దారిలో... వయనాడు కొండ మీదకు చేరేలోపు ఒక చోట పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టుకు రెండు పెద్ద ఇనుప గొలుసులు ఉంటాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఒక విదేశీయుడు గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి బయలుదేరాడు. దట్టమైన కొండల్లో దారి తప్పి పోకుండా ఉండడానికి స్థానిక గిరిజనుడిని సహాయంగా తీసుకెళ్లాడని, ఆ గిరిజనుడి మార్గదర్శనంతో దారి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తను మాత్రమే తెలియాలనే దురుద్దేశంతో ఆ విదేశీయుడు, తనకు సహాయం చేసిన గిరిజనుడిని ఈ చెట్టుకు గొలుసులతో కట్టేశాడని చెబుతారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం తర్వాత పూకాట్ లేక్‌కు చేరుకుంటాం. కొండల మీద ఉన్న పెద్ద మంచి నీటి సరస్సు ఇది. ఇందులో బోట్ షికారు చేయవచ్చు. మీన్ముట్టి జలపాతానికి చేరాలంటే ట్రెక్కింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూకాట్ సరస్సులో బోటింగ్‌కి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడమే మంచిది. పూకాట్ నుంచి ముందుకు సాగే కొద్దీ జనం ఆనవాళ్లు తగ్గుతుంటాయి. జలపాతం రెండు కిలోమీటర్లు ఉందనగా రోడ్డు ఆగిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాళ్ల బాటలో నడక. తర్వాత కొండవాలులో నడక. ఫారెస్ట్ సెక్యూరిటీ పాయింట్ దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. వాళ్ల రిజిస్టర్లో మన పేరు, ఊరు, ఫోన్ నంబరు రాయాలి. బృందంలో ఎంతమంది ఉంటే అన్ని కర్రలతో ఒక గార్డును సహాయంగా వస్తాడు. ఆ చెక్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లిన వాళ్లు తిరిగి ఆ పాయింట్‌కు చేరే వరకు బాధ్యత వాళ్లదే. అదో జానపద చిత్రమ్ కొండవాలులో దట్టమైన అడవిలో ట్రెకింగ్. చెట్లకు పెద్ద పెద్ద తాళ్లు కట్టి ఉంటాయి. గార్డు పర్యాటకుల చేతికి కర్రలిచ్చి, ముందుగా తాను నడుస్తూ, ఎక్కడ రోప్‌ను పట్టుకోవాలో హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కువ లగేజ్ లేకపోతే ట్రెకింగ్ సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండ తమిళనాడుది, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు కూడా కనిపిస్తాయి. నడుస్తూ ఉంటే చెట్ల సందుల్లో జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. పొరపాటున కాలు జారితే... లోయలో ఎక్కడకు చేరుతామో కూడా ఊహించలేం. ‘ఇంతదూరం వచ్చిన తర్వాత భయపడి వెనక్కి పోవడమేంటి’ అని మనసులో సాహసాన్ని ఒడిసిపట్టుకుని ముందుకు నడిస్తే అద్భుతానికే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అదే మీన్ముట్టి జలపాతం. పచ్చటి చెట్ల మధ్య తెల్లటి నీటిధారలు. ఆ జల్లులో తడిస్తే తప్ప టూర్ పరిపూర్ణం అనిపించుకోదు. మీన్ ముట్టి అంటే... చేపలకు అడ్డుకట్ట అని అర్థం. – వాకా మంజులారెడ్డి -
కొన్నిరోజులు మీకు కనిపించనంటున్న బిగ్ బాస్ బ్యూటీ
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే ఆటతో పాటు తన దూకూడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీగా మారిపోయింది. తాజాగా ఈ భామ కొన్ని రోజులు మీకు కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది. నేను అక్కడికి ఒంటరిగానే వెళ్తున్న తాజాగా ఆరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, ఈ నెల 12వ తేదీ వరకు నేను కనిపించను. హిమాలయాలకు ట్రెక్కింగ్ కోసం ఒంటరిగానే వెళ్తున్నాను. ఒంటరిగా అంటే అక్కడ ట్రెక్కింగ్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కూడా ఉండదు కాబట్టి కొన్న రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేను. కనుక నన్నుఅర్థం చేసుకోండి. వచ్చాక అన్ని విషయాలను చెబుతానని అరియానా తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోను షేర్ చేసింది. ఈ అమ్మడు రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోతే, తెగ బాధ పడిపోతున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలోనూ ఇదే జరిగింది. ఈ కారణంగానే తాజాగా తన ఫాలోవర్లకు ఈ వీడియో పోస్ట్ చెసిందీ బోల్డ్ బ్యూటీ. ( చదవండి: వర్షపై బాడీషేమింగ్ చేసిన హైపర్ ఆది ) -
అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది
అనంతపురం నుంచి సమీరా ఖాన్ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్‌లోని అమా దబ్లమ్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ను అందరిలా నేపాల్ వైపు నుంచి కాక టిబెట్ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్‌కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది. సమీరా ఖాన్ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్‌లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని టైలర్‌గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది. ‘నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్. ‘2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్‌గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్ చేశాను. ధైర్యం వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్‌లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్. ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్ ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్ తీసుకోలేదు. లండన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్షిప్ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం. – సాక్షి ఫ్యామిలీ -
సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు
సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు సెలక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయా మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఔట్రైవల్ అడ్వెంచర్స్ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్వెంఛర్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు. పర్వతారోహణ ఇలా.... 2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు. కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్ (ఫైల్) యువకిరణం చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్ కాలనీకి చెందిన సాయికిరణ్‌కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్ క్లైంబింగ్లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్‌టెంజింగ్‌కాన్‌లో శిక్షణ పొంది ఏ గ్రేడ్ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్‌లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్ 2019 డిసెంబర్లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సంధ్య ఇంటర్ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్‌లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్‌కు తరలించి అక్కడ ఫైనల్ సెలక్షన్స్ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తోంది. -
కొండనెక్కిన ‘కొండ’
సాక్షి, హైదరాబాద్ : కొండ కొండనెక్కడం ఏంటనుకుంటున్నారా? అవునండి నిజమే, వయసుతో సంబంధం లేకుండా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ సాహసం చేశారు. సంక్షిష్టమైన దారులతో, ఒళ్లు గగుర్పొడిచేలా ఏటవాలుగా ఉండే మార్గాలతో ఆద్యంతం ప్రమాదకరంగా ఉండే అత్యంత కఠినమైన కలావంతిన్ దర్గ్‌పై విజయవంతంగా ట్రెక్కింగ్ చేశారు. మహారాష్ట్రాలో రాయిఘడ్ జిల్లాలోని కలావంతిన్ దర్గ్‌పై ట్రెక్కింగ్ చేసిన ఫోటోలను కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దారులు భయంకరంగా ఉన్నా, శారీరకంగా అలసిపోయినా, ఈ ట్రెక్కింగ్ మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కొండనెక్కాలంటే.. కొండంత ధైర్యం ఉండాలంటూ నెటిజన్లు విశ్వేశ్వరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పశ్చిమ కనుమల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కొండపై ట్రెక్కింగ్‌కి వెళ్లి 2016లో హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల రచిత గుప్త అనే యువతి మృతిచెందారు. మరణించిన 10 రోజుల అనంతరం ఆమె మృతదేహం లభ్యమైంది. 2018లో పూణేకి చెందిన 28 ఏళ్ల చేతన్ దండే అనే ట్రెక్కర్ కొండ అంచు, ఇంకా 15 అడుగుల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. -
శేషాచలం సానువుల్లో....
భ్రమణ కాంక్షే అసలైన మానవ కాంక్ష అని పెద్దలు అంటారు. తిరిగినవారే గెలుస్తారు అని కూడా అంటారు. నాలుగు వైపులకు వెళ్లకపోతే, నాలుగు దిశలలో నడవకపోతే బతుకు బావిలా మారుతుంది. కనుచూపు కురచబారుతుంది. ‘ఎదగాలంటే తిరగాలి’ అంటారు భూమన అభినయ్ రెడ్డి. అతనికి శేషాచలం కొండలు కొట్టిన పిండి. పదిహేనేళ్ల కిందట బ్రహ్మదేవుని గుండంకు చేసిన తొలి ట్రెక్కింగ్ నుంచి ఇటీవల తలకోనతో మొదలెట్టి యుద్ధగళ వరకు వారం రోజుల పాటు శేషాచలం అడవుల్లో సాగిన ట్రెక్కింగ్ వరకు అతడు పోగు చేసుకున్న అనుభూతులు ఎన్నో. వాటిలో కొన్ని ఇవి. ‘పదేళ్ల క్రితం మా అమ్మ రేవతి ‘యుద్ధగళ’కు వెళ్లి వచ్చి, ఆ విశేషాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలను కున్నాను. అందురూ నడిచే మార్గంలో కాకుండా కొత్తదారిలో ఆ తీర్థానికి వెళ్లాలనుకున్నాను. ట్రెక్కింగ్ చేసే ఔత్సాహికులతో కలిసి యుద్ధగళకు పయనమయ్యాను. యుద్ధగళ ట్రెక్కింగ్ అడుగడుగునా ఆశ్చర్యంతో పాటు ఆనందానుభూతిని కలిగించింది. వారం రోజులు అడవిలోనే! యాభై మందితో సాగిన మా ట్రెక్కింగ్ యాత్ర.. శేషాచలం కొండలకు పడమర దిక్కున ఉన్న తలకోన నుంచి తాబేలు బావి, యుద్ధగళ, మూడేళ్ల కురవ, కంగుమడుగు, ఆదిమానుబండలు, ఎర్రంరెడ్డి మడుగు మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని కుక్కలదొడ్డి వరకు సాగింది. ఎత్తైన తలకోన జలపాతాన్ని తనివి తీరా చూసుకుంటూ, ఆ కొండ ఎక్కి నాగరికత ఆనవాళ్లకు దూరంగా వారం రోజులు అడవిలోనే గడిపాం. నా చిరకాల కాంక్షను తీర్చే నడక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహావృక్షాలు, మానవ అలికిడికి భయపడి పారిపోయే జంతు జాలాలు, లెక్కలేనన్ని వృక్షజాతులు ఈ శేషాచలం అడవుల్లో ఉన్నాయి. జలపాత సోయగాల తలకోన అక్టోబర్ 8న ఉదయం తిరుపతి నుంచి తెల్లవారుజామునే బయల్దేరి తలకోనకు వెళ్ళాం. ఒక్కొక్కరి వీపుమీద దాదాపు ఇరవై కిలోల బరువుతో కొండపైకి నడక మొదలు పెట్టాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమైన తలకోన అందాలను, ఆ జలపాత సోయగాలను వీక్షిస్తూ ఆ కొండ కొసకు చేరాం. ఉదయం తొమ్మిదైంది. అప్పుడు కానీ మాకు సూర్యదర్శనం కాలేదు. అలా అడవిలో నాలుగు గంటలు నడిచాక మాకు అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు కనిపించింది. ఆ ఏరు ప్రవాహానికి ఎదురుగా వెళితే తాంబేలేరు కనిపించింది. కొండపైన అంత ఎత్తులో ఎంతో స్వచ్ఛమైన నీళ్లు.! ఇక నేరుగా యుద్ధగళ తీర్థానికి వెళ్లాం. బొట్లు బొట్లుగా.. యుద్ధగళ యుద్ధగళ తీర్థంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గీసిన హనుమంతుడి బొమ్మలు చూశాం. ఆ రాత్రికి అక్కడే బసచేశాం. అడవిన కాసిన వెన్నెలను మేం తనివితీరా అనుభవించాం. మర్నాడు యుద్ధగళ తీర్థం దిగువున ఉన్న విష్ణుగుండంలోకి దిగాం. ఎనిమిది వందల మీటర్ల లోపలికి తాడు సాయంతో కిందకు దిగాం. అదొక గొప్ప అనుభూతి. మధ్యాహ్నం యుద్ధగళ తీర్థం సమీపంలో పెట్రోగ్లిఫ్‌లుగా పిలిచే చిత్రాలను పెద్ద బండపై ఉలితో చెక్కి ఉండడాన్ని చూశాం. ఆ చిత్రాలను ఎన్నో సామాజిక, సాంస్కతిక, మార్మిక అంశాలను పొందపరిచారు. ఉరకడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆంబోతులు, ఒక గణాచారి ఈ చిత్రసంచయానికి హైలైట్. ఈ చిత్రాలపై పూర్తిస్థాయిలో పురావస్తు శాస్త్ర పరిశీలన జరగాల్సి ఉంది. పరిశోధన జరిగితే అదిమానవునికి సంబంధించిన ఆనవాళ్లు మరిన్ని బయటపడచ్చు. సాయంత్రం తిరిగి మడుగు వద్దకు వచ్చాం. యుద్ధగళ అసలు పేరు రుద్రగళ. ఆ తీర్థంలో రాత్రి నిద్రించినప్పుడు అందులో బొట్లు బొట్లుగా పడే నీళ్లు యుద్ధ శబ్దాలను తలపించేటట్టు ఉంటాయి. అందుకే ఈ తీర్థానికి యుద్ధగళ అని పేరొచ్చింది. మూడేర్ల కురవ.. కంగుమడుగు కంగుమడుగుకు సమీపంలో మూడేర్ల కురవ అనే ఏరు ఉంది. మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఏర్లు కలిసి ప్రవహించడం వల్ల దీనికా పేరొచ్చింది. మరుసటి రోజు కంగు మడుగుకు ప్రయాణమయ్యాం. కంగు మడుగు పెద్ద ఏరు. ఏనుగులు నీటి కోసం, జలకాలాడటం కోసం వస్తాయి. కనుకే ఏనుగుల రాకను గమనిస్తూ ఉండాలి. అవి వచ్చి పడ్డాయంటే, తప్పించుకోవడం కష్టమే. ఇక్కడ ఏనుగులు సంచరించిన ఆనవాళ్లను గమనించాం. ఇక్కడ అటవీ శాఖ వారి బేస్ క్యాంప్ కూడా ఉంది. ఆ రాత్రి కంగుమడుగు ప్రాంతంలోనే బస చేశాం. తెల్లని వెన్నెల్లో.. అరిమాను బండలు మరుసటి రోజు ఉదయమే మళ్లీ మా నడక. మ«ధ్యాహ్నానికి అరిమాను బండలకు చేరుకోగలిగాం. అదొక ఎత్తైన ప్రదేశం. పౌర్ణమికి సరిగ్గా రెండు రోజులు ముందు కావడంతో ఆ రాత్రి చందమామ కురిపించే తెల్లని వెన్నెల ఎంత చల్లగా ఉందో. మరుసటి రోజు అరిమాను బండ కింద నుంచి గద్దలపీతుగుండం వెళ్లాం. ఇక్కడ కొన్ని గద్దలు సంచరించడం మాకు కనిపించింది. ఈ గుండానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో అద్బుతమైన సుందర ప్రదేశం బూడిదపునుకు. ఇది రమణీమైన గుండం. లేలేత సూర్యకిరణాలు నీటిని తాకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఇక్కడ కూడా చరిత్ర పూర్వయుగం నాటి ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఉన్నాయి. అనంతరం ఓ నాలుగు వందల మీటర్ల దూరాన్ని చిన్న కొండల మధ్య నడిచాం. అక్కడ ఓ చిత్రం మా కంటపడింది. అది ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేది. జంతువులను వేటాతున్న మహిళల చిత్రం చూసి అబ్బుర పడ్డాం. సాయంత్రం ఆరిమానుబండకు తిరిగి వచ్చాం. రాత్రి అక్కడే బస చేశాం. నీటి మడుగుల్లో దీపాలు మా అడవి యాత్రలో ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరింది. బూడిదపునుకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమరెడ్డి మడుగుకు మరుసటి రోజు నడక ప్రారంభించాం. ఆ రోజంతా అక్కడే గడిపాం. అక్కడ దగ్గర దగ్గరగానే రెండు మడుగులున్నాయి. ఆ రోజు పున్నమి. మడుగులను దీపాలతో అలంకరించాం. ఆ దీపాల ప్రతిబింబాలతో మడుగులు చూడచక్కగా ఉన్నాయి. కళ్లార్పకుండా ఎంత సేపైనా చూడాలనిపించేంత అద్భుతంగా వెలుగొందాయి. పౌర్ణమి రాత్రి నీటిలో దాదాపు మూడు గంటల పాటు తనివితీరా గడిపాం. మా యాత్రలో ఆ చివరి రాత్రి ఎర్రమరెడ్డి మడుగు వద్దే గడిచింది. మరునాడు సోమవారం ఉదయం అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా కుక్కల దొడ్డికి చేరుకున్నాం.’ అని ముగించాడు అభినయ్. జీవవైవిధ్యం అన్ని సదుపాయాలూ ఉన్న నగరాలను, కాంక్రీటు వనాలను వదిలి అచ్చమైన, స్వచ్ఛమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి వారం రోజుల పాటు ఉండటం గొప్ప అనుభూతి. ప్రకృతితో లీనమైపోవడం, ప్రకృతిపైన ప్రేమను పెంచుకోవడం, అడవి అంటే ఇష్టం పెంచుకోవడం, అడవులను కాపాడాలన్న భావన కలిగించుకోవడం స్వయంగా అనుభూతించాం. మానవ మనుగడకు అడవుల రక్షణ, వాటిలోని జంతుజాలం రక్షణ ఎంతగా ఉపకరిస్తాయో స్వయంగా తెలుసుకున్నాం. – భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి