tribal woman
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
ప్రజాసంక్షేమమే అభిమతం
పార్వతీపురం మన్యం: విశ్వసరాయి కళావతి.. సామాన్య గిరిజన మహిళ... తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవకాశం ఇవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేయ డంలో సఫలమయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని అందుకునేందుకు ప్రచారం ఆరంభించారు. ఉగాది సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. ఆమె మాటల్లోనే.. జగనన్న స్ఫూర్తితో.. 2014–19 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించింది. నా నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంది. కానీ నేను వై.ఎస్.జగన్మోహన్రెడ్డినే స్ఫూర్తిగా తీసుకున్నాను. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒకే మాట మీద నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం. నిత్యం ప్రజలతోనే ఉండాలన్నది జగన్ మాకు చూపిన బాట. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ఆయన చూపిన బాటలోనే సాగుతాం. ఆ స్ఫూర్తే గత రెండు ఎన్నికల్లో విజయా న్ని చేకూర్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. గిరిజనాభివృద్దికి పెద్దపీట... ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందజేస్తోంది. జిల్లాలో 54 వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను గిరిజనులకు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతు భరోరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయం అందుతోంది. ఏజెన్సీలోని గ్రామ సచివాలయాలన్నింటిలోను ఉద్యోగాలను గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్మోహన్రెడ్డి అందించిన గొప్ప వరం. 50 ఏళ్లు నిండిన ప్రతీ గిరిజనుడికి వైఎస్సార్ పింఛన్‌కానుక అందిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, మరే ఇతర సమస్యలు ఉన్నా వలంటీర్లు వ్యవస్థ ద్వారా గుర్తించాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెంటనే పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడింది. ప్రతీ సచివాలయం పరిధిలో రూ. 20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అవసరాల దృష్ట్యా రూ.40 లక్షలు చొప్పున కేటాయించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి కృషిచేశారు. ప్రగతి పథం.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వందలాది కోట్ల రూపాయాలతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ వదిలేసిన తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులకు రూ.193 కోట్లతో జీవంపోశారు. రూ.38 కోట్ల ఉపాధిహామీ నిధులతో గ్రామీ ణ రోడ్లు బాగుచేశారు. రూ.34.64 కోట్ల వ్యయంతో 93 గ్రామ సచివాలయాలు, రూ.21.25 కోట్ల ఖర్చుతో ఆర్బీకేలు నిర్మించారు. నాడు–నేడు నిధు లు రూ.19.57 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అభివృద్ధి చేశాం. వివిధ సంక్షేమ, అభివృద్ది పనులను చేపట్టి ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు తీసుకువచ్చాం. అందుకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నాం. -
గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి,ఎవరీ శ్రీపతి?
తమిళనాడు తిరుపట్టూరు జిల్లాఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు.నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. శ్రీపతి పరిచయం... ఆరు నెలల క్రితం... తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో ‘తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్’(టి.ఎన్.పి.ఎస్.సి) ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె ‘సివిల్ జడ్జ్’ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే చరిత్రే. చురుకైన అమ్మాయి తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసి΄ాపగానే చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ (తిరుపట్టూరు జిల్లా)కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్ వరకూ చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్ వరకూ చదువుకుంది. ‘ఇప్పుడు చదివి ఏం చేయాలంటా’ అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి. గిరిజనుల హక్కుల కోసం ‘మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు ΄÷ందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను’ అంది శ్రీపతి. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్ట్ కోసం టి.ఎన్.పి.ఎస్.సి పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. ‘తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని... ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని’ స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
గిరిజన మహిళా రైతుకు ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్’
సాక్షి, పాడేరు: బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ కాఫీ సదస్సు–2023లో నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని అవార్డు పొందారు. అరాబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల విభాగంలోని అన్ని ఫార్మెట్లలో నాణ్యమైన కాఫీ గింజలుగా అశ్విని పండించిన కాఫీ గింజలను జ్యూరీలోని అధికారుల బృందం గుర్తించింది. దేశంలోని 10 రాష్ట్రాల పరి«ధిలో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించారు. మన రాష్ట్రానికి సంబంధించి 124 మంది గిరిజన రైతులు పార్చ్మెంట్ కాఫీ గింజల శాంపిళ్లను ప్రదర్శించారు. వీటిలో పెదబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు అశ్విని పండించిన కాఫీ గింజలు నాణ్యతలో భారత్‌లోనే నంబర్ వన్‌గా నిలిచాయని కాఫీ ప్రాజెక్ట్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు–2023’ అశ్వినిని వరించింది. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె భర్త గాసన్న ఈ అవార్డును అందుకున్నారు. కాఫీ గింజల ఉత్తమ నాణ్యత అవార్డు రావడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, కేంద్ర కాఫీ బోర్డు డీడీ రమేష్, ఐటీడీఏ కాఫీ ఏడీ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. -
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రమ్య
అనకాపల్లి: డోలీ మోతతో ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళ కథ సుఖాంతమైంది. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. గొట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామానికి చెందిన తాంబెళ్ల రమ్య అనే గర్భిణికి నెలలు నిండి ఆదివారం పురిటినొప్పులు రావడంతో ఆందోళన చెందిన గిరిజనులు హుటాహుటిన డోలీలో మోసుకెళ్లి కోటవురట్ల ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున రమ్య ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. రమ్యకు రక్తం తక్కువగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రమ్య, సూరిబాబు దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
పెళ్లీడుకొచ్చిన నా కూతురుతో ఎస్ఐ హేమంత్ అసభ్యంగా ప్రవర్తించాడు
కదిరి: ముదిగుబ్బ ఎస్ఐ హేమంత్‌కుమార్‌పై కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన గిరిజన మహిళ బుక్యా రాధమ్మ మంగళవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ఫిర్యాదు తీసుకోవడానికి రూరల్ సీఐ సూర్యనారాయణ నిరాకరించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుమ్మరవాండ్లపల్లి సర్పంచ్ శాంతమ్మ, ఆమె కుమారుడు మణికంఠనాయక్, కుటుంబ సభ్యులు స్టేషన్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. చివరకు చేసేది లేక 100కు ఫోన్ చేసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని డీఎస్పీ శ్రీలతకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితురాలు రాధమ్మ ఫిర్యాదు మేరకు.. ఎస్ఐ హేమంత్, కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథరెడ్డితో పాటు టీడీపీ నాయకుడు కలాం ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమ ఇంటికి వచ్చారన్నారు. నీ భర్త గోవింద్‌నాయక్ మా దగ్గర ఉన్నాడు.. కావాలంటే ఫోన్లో మాట్లాడు అని ఫోన్ చేసి ఇచ్చారని తెలిపారు. ‘పోలీసులతో ప్రాణహాని ఉంది. పోలీసులు చెప్పినట్టు చేయండి అని తన భర్త చెప్పడంతో మేం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ హేమంత్ బీరువా తాళాలు ఎక్కడున్నాయని బెదిరించాడన్నారు. అక్కడే నిల్చున్న పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. భయంతో ఆయనకు బీరువా తాళాలు ఇచ్చేశామని చెప్పారు. అమ్మాయి పెళ్లి కోసం తెచ్చిన 50 గ్రాముల బంగారంతో పాటు రూ. 5 లక్షల నగదు తీసుకున్నారన్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే గోవిందనాయక్‌ను చంపేస్తామని ఎస్ఐ బెదిరించాడని ఆరోపించారు. అంతలోనే తన తమ్ముడు మణికంఠనాయక్‌తో పాటు చుట్టుపక్కల వారు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. తమ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కులం పేరుతో దూషించడమే కాకుండా నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఎస్ఐ హేమంత్‌తో పాటు కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథ్, టీడీపీ నాయకుడు కలాంపై కఠిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గిరిజన మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామానికి గిరిజన వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ(30)కు భర్త , పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు, ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు, ఆదివారం ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు, బబాధితురాలు పేర్కొన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు, గ్యాంగ్ రేప్ సమాచారం అందుకున ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
అదృష్టం: పేదమహిళ సుడితిరిగి లక్షాధికారిగా!
భోపాల్: అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కంటపడని అదృష్టం.. ఆమెకు అనుకోకుండా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే ఆమె నసీబ్‌ను మార్చేసింది. కట్టెల కోసం వెళ్లిన ఓ పేద గిరిజన మహిళకు.. అక్కడ దొరికిన వస్తువు ఒకటి లక్షాధికారిని చేసేసింది. మధ్యప్రదేశ్ వజ్రాల జోన్ అయిన పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే బుధవారం రోజున పొయ్యి కట్టెల కోసం అడవికి బయలుదేరింది జెందా బాయి. అక్కడ ఆమె మట్టిలో కూరుకుపోయి మెరుస్తున్న ఓ రాయి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. అయితే దాని మెరుపు ఆయనకు అనుమానంగా అనిపించి.. అధికారులను సంప్రదించాడు. వాళ్లు పరీక్షించి అదొక 4.39 క్యారట్ వజ్రమని, చెప్పడంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్.. డైమండ్ డిపాజిట్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. వేలంలో అది ఫలానా ధర దక్కించుకోవడమే తరువాయి. కనీసం దాని విలువ రూ.20 లక్షల దాకా పలకవచ్చని అనుపమ్ సింగ్ అంటున్నారు. వచ్చేదాంట్లో ప్రభుత్వం తరపున రాయల్టీ, ట్యాక్సుల రూపంలో 12.5 శాతం మినహాంచుకుని.. మిగతాది జెందా బాయి కుటుంబానికి ఇచ్చేస్తారు. పన్నా జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తంపూర్ గ్రామం.. జెండా బాయి కుటుంబం ఉంటోంది. భర్త కూలీపనులు.. జెందా బాయి రోజూ కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో వజ్రం రూపంలో ఆ పేద కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. వచ్చిన డబ్బుతో సొంతగా ఒక ఇల్లు కట్టించుకోవడంతో పాటు కూతుళ్ల పెళ్లిలకు కొంత డబ్బును డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు ఆ భార్యభర్తలు. Video: A tribal woman, out gathering firewood in a forest in MP’s #Panna , found a diamond worth at least Rs 20 lakh. #MadhyaPradesh pic.twitter.com/x0dLlBYXMJ — TOI Bhopal (@TOIBhopalNews) July 29, 2022 -
Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళ సగర్వంగా కూర్చోవడం ఖాయమైనట్టే. ప్రాంతీయ పార్టీల నుంచి రోజురోజుకూ పోటెత్తుతున్న మద్దతు నేపథ్యంలో రాష్టపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(ఎస్), అకాలీదళ్, శివసేన, జేఎంఎం, టీడీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలుపగా తాజాగా యూపీలో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ సంకీర్ణ భాగస్వామి, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) కూడా ఈ జాబితాలో చేరింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేస్తారని రాజభర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు ఏకంగా 62 శాతం దాకా ఓట్లు ఖాయమయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువయ్యే సూచనలు కూడా కన్పిస్తున్నాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆమె ఓటర్లు 50 శాతం కంటే తక్కువే తేలారు. ఆదివాసీ మహిళ కావడం, రాష్ట్రాలన్నీ చుడుతూ మద్దతు కోరుతుండటంతో ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మొత్తం 10,86,431 ఓట్లకు ఆమెకు ఇప్పటికే 6.68 లక్షల ఓట్లు ఖాయమైనట్టే. ఎస్పీతో తమ బంధం కొనసాగుతుందని రాజ్‌భర్ చెప్పినా, ముర్ముకు మద్దతు నిర్ణయంతో దానికి బీటలు పడ్డట్టేనని భావిస్తున్నారు. -
Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య
సాక్షి, చౌటుప్పల్: ‘లైంగికదాడికి పాల్పడిన సమయంలో గిరిజన మహిళ నన్ను గుర్తించింది. విషయాన్ని భర్తతో పాటు నేను పనిచేస్తున్న తాపీమేస్త్రీలకు చెబుతానని హెచ్చరించడంతో భయపడి హత్య చేశా’ అని ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఈడిగి హరీష్‌గౌడ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం తన కార్యాలయంలో స్థానిక ఏసీపీ ఉదయ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడూరు మండలం మైలారం పరిధిలోని కర్రెన్నబండతండాకు చెందిన ముడావత్ క్రిషీనా అతడి భార్య లావణ్య(28) ఇటీవల ఉపాధి నిమిత్తం మల్కాపురానికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ గోడౌన్లో లావణ్య వాచ్‌మన్‌గా, సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 9న భర్త విధులకు వెళ్లగా భార్య గోడౌన్ వద్ద ఒంటరిగా ఉంది. ఐదురోజులుగా వ్యూహరచన దండుమల్కాపురం శివారులో మూతబడిన ఓ డెయిరీలో కొంత మంది తాపీ మేస్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీష్‌గౌడ్(25).. అంజనేయులు అనే మేస్త్రీ వద్ద కూలి పని చేస్తున్నాడు. ఈనెల 5న వారుంటున్న ప్రాంతంలో బోరు వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మూతబడిన గోడౌన్లో లావణ్య ఒంటరిగా ఉండడాన్ని నిందితుడు గమనించి వివరాలు తెలుసుకొని అప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నాడు. హరీష్‌గౌడ్.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి భర్త డ్యూటీకి వెళ్లగానే.. ముడావత్ క్రిషీనా సోమవారం డ్యూటీకి వెళ్లడాన్ని హరీష్‌గౌడ్ గమనించి సమయం కోసం వేచిచూశాడు. సాయంత్రం 4గంటలకు బాత్రూంకు వెళ్లిన లావణ్య వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తలపై కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతన్ని గుర్తించిన మృతురాలు విషయాన్ని భర్తతో పాటు ఇతరులకు చెబుతానంది. దీంతో నిందితుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. అనంతరం మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన భర్త చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (మాటేసి.. కాటేసి..) 24గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు లైంగికదాడి, హత్య ఘటనను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ఘటనాస్థలిలో లభించిన కాళ్ల చెప్పుల ఆధారంగానే నిందితుడిని అతడు నివసించే మూతబడిన డెయిరీలోని గదిలో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. అతడి వద్ద 2బంగారు పుస్తెలు, 2 వెండి పట్టీలు, 4 వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అభినందించారన్నారు. ఛేదించిన పోలీసులకు రివార్డు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో సీఐలు ఎన్.శ్రీనివాస్, ఏరుకొండ వెంకటయ్య, ఎస్సైలు బి.సైదులు, డి.అనిల్, డి.యాకన్న పాల్గొన్నారు. -
వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!
సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది. ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్‌లు పంపింది. అయితే ఫోన్ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. చదవండి👉🏾: (మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా) పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్ బెంచ్ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది. బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. -
అవమానాలు దిగమింగి.. గిరిజన లిపిని ఆవిష్కరించా
కృష్ణా జిల్లా సీతానగరం స్వగ్రామమైనప్పటికీ తండ్రి రైల్వేలో ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్, బిహార్లలో పెరిగా. చదువు కొనే వయసు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డాం. తాత స్కూలు హెడ్మాస్టర్ కావడంతో నాకు కూడా విద్యాబోధన పట్ల ఆసక్తి పెరిగింది. గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు, అవమానాలు పడాల్సి వచ్చేది. వాటిని అధిగమిస్తూ ఉన్నత విద్య పూర్తిచేశా. సత్తుపాటి ప్రసన్న శ్రీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ – చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షణ, గిరిజన భాషలకు నూతన రచనా విధానాలు అభివృద్ధి చేస్తుంటారు. భగత, గదభ, కొలామి, కొండ దొర మొదలైన 19 గిరిజన భాషలకు లిపి (అక్షరాలను) రూపొందించిన ప్రపంచంలోనే తొలి మహిళ. ఆమె సాహిత్య రచనలలో ’ఈస్ట్ అండ్ వెస్ట్ పోస్ట్ మాడర్న్ లిటరేచర్‌లో మహిళల సైకోడైనమిక్స్’ వంటి రచనలు ఉన్నాయి. ’షేడ్స్ ఆఫ్ సైలెన్స్’, ’ఉమెన్ ఇన్ శశి దేశ్‌పాండే నవల – ఒక అధ్యయనం,’ రచించారు. వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎన్డేంజర్డ్ ఆల్ఫాబెట్స్, యూఎస్ఏ (2019)లో ప్రదర్శించబడిన తొలి భారతీయ, ఆసియా మహిళ. మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షణ నిమిత్తం చేసిన విశేష కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది. ‘గిరిజనురాలివి అందులోనూ మహిళవి.. ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని బయల్దేరావు.. నీకు ఇంక వేరే పనిలేదా.. వంటి అనేక అవహేళనలు, అవమానాలు దిగమింగి గిరిజనుల కోసం లిపిని రూపొందించా’ అంటున్నారు నారీశక్తి–2021 పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తానని ధీమాగా చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొన్న సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. గిరిజనుల సంక్షేమం, విద్య కోసం చేసిన ప్రస్థానం ఆమె మాటల్లోనే... ‘‘గిరిజనుల కోసం చేస్తున్న కృషికి బూస్టప్ డోస్‌లా నారీశక్తి పురస్కారం దక్కింది. సుమారు మూడున్నర దశాబ్దాలుగా గిరిజనుల కోసం చేసిన ఒంటరి పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎన్ని అవమానాలు ఎదురైనా విద్య ఒక్కటే శాశ్వతమని నమ్మి నాలాగా ఇతర గిరిజనులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పట్టుదలతో ముందుకెళ్లా. నాన్న నా చదువుకోసం ఎన్నో త్యాగాలు చేస్తే, భర్త నా ఆశయ సాధన కోసం ఎంతో ఆసరా ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో కొండ ప్రాంతాల్లోని గిరిజనులను కలిసి వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించా. ఈ క్రమంలో సెలవు రోజుల్లో ఉదయానికే విశాఖపట్నం చేరుకొని రైల్వేస్టేషన్లోనే కొండప్రాంతాల వారి మాదిరి దుస్తులు ధరించి అరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లేదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి మరింత సులభమైంది. తెలిసిన వారు ‘ఇదంతా ఎందుకమ్మా పనిపాటా లేదా’ అని హేళన చేసేవారు. ‘నిన్ను ప్రోత్సహిస్తే మాకు ఎన్ని ఓట్లు పడతాయి?’ అని అడిగిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అవమానాలకు, అవహేళనలకు తట్టుకోలేక వెనక్కి తగ్గి ఉంటే 30కిపైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యేదాన్ని కాదు. 106 రిసెర్చి ఆర్టికల్స్, 18 ఎంఫిల్స్, 32 పీహెచ్‌డీలు 32 పుస్తకాలు రచించాను. అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు చేశా. అల్జీరియా, అమెరికా ఫ్రాన్స్, ఇథియోపియా తదితర దేశాల్లో నా పొయిట్రీని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. సమానత్వం కోసం మాట్లాడేవారు గిరిజనుల సమానత్వం కోసం కూడా అదేస్థాయిలో పోరాడాలి. నేను రూపొందించిన లిపిని పాఠ్యపుస్తకాలుగా మార్చితే గిరిజనులు మాతృభాషలో విద్యాభ్యాసం చేయొచ్చు. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్ సంఖ్య తగ్గించొచ్చు. నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే బోధన అని చేర్చారు. భవిష్యత్తులో గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకానొక సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నా ప్రయత్నం గురించి చెప్పా. ఎనిమిది భాషల లిపి రూపొందిస్తున్నా అని చెబితే.. అవన్నీ పూర్తిచేసి వస్తే సముచిత గౌరవం దక్కేలా చేస్తానన్నారు. తొలిసారి గిరిజన మహిళకు వైస్ చాన్సలర్ హోదా దక్కేలా చూస్తానంటూ నన్ను ప్రోత్సహించారు. గిరిజనుల్లో కొండ, మైదాన ప్రాంతాల వారి విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కొండప్రాంతాలవారు మనల్ని నమ్మితే∙కానీ ఏమీ చేయలేం. వారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వారికి నాగరక సమాజంతో తక్కువ సంబంధం ఉండటం వల్ల వారిలో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం సెలవుల సమయంలో ఉత్తరాది నుంచే కాదు క్యూబా, కొరియా, జర్మనీ తదితర విదేశాల నుంచి కూడా యువత వచ్చి గిరిజనులకు చదువు చెబుతున్నారు. గిరిజన లిపిని పాఠ్యాంశాలుగా మార్చితే వారెంతో రుణపడి ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశ సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించా. సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇందాకా ఏదో చెబుతున్నారంటూ ఆసక్తిగా అన్ని విషయాలు విన్నారు. ప్రధాని సిబ్బంది నా ఫోన్ నంబరు కూడా తీసుకున్నారు. ఇదే స్థాయిలో ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ సాక్షితో తన భాషా సేవ గురించి వివరించారు ప్రసన్నశ్రీ. – సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ -
ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి
MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. (చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత) మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్‌లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్‌ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది. జరిగిన సంఘటనతో కిరణ్ బైగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్‌ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. (చదవండి: బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే) చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు కిరణ్బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj) Not like today's gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ — Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021 చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్చార్జిగా నియమించారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
షారూక్ ఖాన్ మెచ్చిన అరకు గిరిజన మహిళ
-
తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని..
అసలే పేదరికం, దానికి తోడు పదహారేళ్ల చెల్లికి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రం. డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ అంతగా లేకపోవడంతో చెల్లి నిరాశా నిస్పృహలకు లోనై రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని దగ్గర నుంచి గమనించిన 31 సంవత్సరాల అక్క సుమిత్ర గాగ్రై మనసు చలించి పోయింది. వైద్యం చేయించినప్పటికీ అవగాహన లేమి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో మానసిక ఆరోగ్యంపై ఎలాగైనా అందరిలో చైతన్యం తీసుకురావాలనుకుంది. మారుమూల గ్రామాల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలను దూరం చేసి వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని పల్లెటూళ్లు, గ్రామాలు, గిరిజన తండాలను సందర్శించి వీధినాటకాలు, కథలు, చెప్పడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ద్వారా మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ‘హో’తెగకు చెందిన సుమిత్ర స్థానిక ఎజెక్ట్ ఎన్జీవో కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ...సెల్ఫ్‌హె ల్ప్ గ్రూపులకు, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె కూడా గిరిజన మహిళ కావడంతో ఆయా గ్రామాల్లోని మహిళలతో సులభంగా కలిసిపోయి వారికి అర్థమయ్యేలా చెప్పేవారు. గత పన్నెండేళ్లుగా 24 మారుమూల గ్రామాలను సందర్శించి 36 వేల మందికిపైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. మానసిక ఆరోగ్యంతోపాటు, మహిళలు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, శిశు మరణాల రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రసవం అయిన తరువాత బొడ్డు తాడు కత్తిరించడం నుంచి శిశువును పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలన్న అవగాహన లేమితో చాలామంది పురిటి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. సుమిత్ర, తన ఎన్జీవో సభ్యులతో కలిసి అవగాహన కల్పించి మరణాల రేటును 45 శాతం తగ్గించారు. మానసిక ఆరోగ్యంపై సుమిత్ర చేసిన సేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది ‘ఉమన్ ఎగ్జంప్లర్’ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ‘దలాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో సుమిత్రా సేవా కార్యక్రమాలను ప్రస్తావించడం విశేషం. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, నీతి ఆయోగ్ ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలో మూఢనమ్మకాలు దయ్యం పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక దారుణాలు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సుమిత్ర వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, పోషకాహారంపై మంచి అవగాహన కల్పించడంతో ఇప్పుడు వారంతా మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. -
Photo Story: చలాకీ సీక్రెట్, నవ్వుతూ బతకాలి
జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటన్నింటిని చిరునవ్వుతో జయించాలని అంటున్నట్టుగా ఉంది కదూ ఈ ఆదివాసీ వృద్ధురాలి చిత్రం!. తరగని చిరునవ్వులే తన ఆస్తిపాస్తులని చెప్పే ఈ వృద్ధురాలు.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అయితే ఏనాడూ ఓడిపోలేదని అంటోంది. మెడలో సర్రి, కాళ్లు, చేతులకు కడలు వేసుకొని ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెమెరి మండలం పెద్దపాట్నాపూర్లో కనిపించిందీ చిత్రం. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చలాకీ సత్యం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సత్యంకు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ పది తాడిచెట్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కి కల్లు గీస్తాడు. గీసిన కల్లును సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తాడు. 16 ఏళ్లుగా కల్లు గీస్తున్నానని, చెట్లెక్కినా అలసటనేదే రాదని అంటున్న ఈయన.. చెట్లు ఎక్కకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయని ‘సాక్షి’కి చెప్పాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదని, మధ్యాహ్న జొన్న జావ, రాత్రికి వరి అన్నం తింటానని చెబుతున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం వాగు దాటితేనే నాట్లు ముమ్మరంగా నాట్లుపడే సమయంలో వానలు దంచికొడుతున్నాయి. పొలాలకు వెళ్దామంటే వాగులు వంకలూ ఉప్పొంగుతున్నాయి. అలాగని అదను దాటిపోతుంటే రైతులు చూస్తూ ఉండలేరు కదా.. అందుకే ఓ రైతు వరద నీట మునిగిన అర్కండ్ల వాగు (కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం) లోలెవల్ బ్రిడ్జి మీదుగా తన పొలానికి కూలీలను ఇలా ట్రాక్టర్‌పై తరలించాడు. – శంకరపట్నం పరుచుకున్న పచ్చదనం ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఇలా పచ్చదనం నింపుకుంది. దట్టమైన అడవి, కొండ ప్రాంతంతో పాటు పార్క్ సమీపంలో నుంచి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారి ఇటు వ్యవసాయ పొలాలు చూడటానికి ఆకట్టుకుంటున్నాయి. – పాలమూరు పాకాలకు కొత్త అతిథులు ఖానాపురం: తెల్లని రంగుతో, గరిటె లాంటి పొడవైన ముక్కు కలిగిన ఈ కొంగను తెడ్డుమూతి కొంగ అంటారు. ఇవి శీతాకాలంలో ఉష్ణ మండలాలకు వలస వస్తుంటాయి. నీటి మడుగులు, చెరువులు, నదీ ప్రాంతాల్లో, బురద నేలల్లో సంచరిస్తుంటాయి. ఈ కొంగలు మొదటిసారిగా పాకాల పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చెల్పూరి శ్యాంసుందర్ వీటిని కెమెరాలో బంధించారు. -
అడవి పంపిన బిడ్డ
తప్పిపోయిన కొడుకు తిరిగొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కుంతల కుమారికి ఇప్పుడు అంతకు మించిన సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం అరణ్యంలో కనిపించిన అడవి పంది కూనను ఇంటికి తెచ్చి పెంచుకుందామె. వారం క్రితం అటవీ అధికారులు వచ్చి ఆ పందిని అలా పెంచుకోకూడదని అడవిలో వదిలి వచ్చారు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏడ్చింది. ఆ బిడ్డ ఆ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరింది. రోమాంచితమైన ఈ అనురాగబంధపు కథ ఒడిసాలో జరిగి ప్రచారంలో ఉంది. మీడియాకు భావోద్వేగాలు ఉండవు అని అంటారుగాని కుంతల కుమారి కోసం మీడియా కూడా కన్నీరు పెట్టినంత పని చేసింది. వారం క్రితం ఒడిసాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ అనే చిన్న పల్లెలో నివసించే కుంతల కుమారి ఆక్రందనలు విని మీడియా కూడా అక్కడకు చేరుకుంది. ‘నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నాకు న్యాయం చేయండి’ అని వారి ముందు ఏడ్చింది కుంతల కుమారి. ఆ బిడ్డ పేరు ‘ధుడ’ (పాలు). అది ఒక అడవి పంది. ‘నా సొంతబిడ్డ కంటే దానిని ఎక్కువ సాక్కున్నాను’ అని చెప్పింది కుంతల కుమారి. దేవుడు పంపిన కొడుకు రెండేళ్ల క్రితం కుంతల కుమారి కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి భీతిల్లి తిరుగుతున్న రోజుల వయసున్న అడవి పంది పిల్ల కనిపించింది. ‘అది నన్ను చూడగానే నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. దానిని చూసి నేను నా కూతురు చనిపోయిందని బాధ పడాలా... ఈ పంది పిల్ల నా దగ్గరకు వచ్చిందని ఆనంద పడాలా తెలియలేదు. మొత్తం మీద ఆ కూన నాకు దేవుడు పంపిన కొడుకు అనుకున్నాను’ అంటుంది కుంతల కుమారి. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లీ కూతుళ్లు కలిసి ఆ పంది పిల్లకు ‘ధుడ’ అని పేరు పెట్టి పెంచసాగారు. అప్పటినుంచి ఆ అడవి పంది ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే పరిగెత్తుకుని వస్తుంది. ఇంటి ముందే ఉంటుంది. అడవి పందితో ఆడుకుంటున్న కుంతలకుమారి కుమార్తె అటవీ అధికారుల ప్రవేశం అయితే ఒడిసా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారుల ఇన్నాళ్లు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి ‘ధుడ’ను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. పురుషోత్తం పూర్‌కు దగ్గరలోనే టెల్కొయ్ అభయారణ్యం ఉంది. అధికారులు దానిని తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచి పెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లబలబమని నోరుకొట్టుకొని తీవ్రంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘అటవీ అధికారులు చేసింది తప్పు’ అని అందరూ తిట్టిపోశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవి లో ధుడా తప్పిపోయింది. దాని ఆహారం ఎలా? ‘ధుడా ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు’ అని కుంతల కుమారి అంటే ‘అడవి పందులకు తాము అడవిలో ఎలా బతకాలో తెలుసు’ అని అధికారులు అన్నారు. కాని అది నిజం కాదు. అడవిలో పడ్డ ధుడా తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో భీతిల్లిపోయింది. ‘ధుడా’ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతున్న కుంతలను చూసి గ్రామస్తులు కూడా ధుడాను వెతికారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేదదీరింది. కుంతల, కుంతల కుమార్తె ధుడాను ఇంటికి తెచ్చుకున్నారు. ‘అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం’ అని అటవీ అధికారులు ఇప్పుడు నత్తులు కొడుతున్నారు. వారం రోజుల ఎడబాటు వల్ల భీతిల్లిపోయిన ధుడా, కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు. ‘పడుకో నాన్నా.. కళ్లు మూసుకొని పడుకో’ అని కుంతల దాని ముట్టె మీద చేయి వేసి ఊరడిస్తే అది కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోవడం వీడియో లో చూసి ఆశ్చర్యపోయేవారు వారిద్దరికీ అభిమానులుగా మారారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవరూ విడదీయకపోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
వెలుగోడు/గుంటూరు రూరల్: గిరిజన మహిళ (45)పై ముగ్గురు గిరిజన యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం నల్లమల అటవీ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ► వెలుగోడు జమ్మినగర్ తండాకు చెందిన భార్యాభర్త గాలేరుపై నిర్మిస్తున్న వంతెన వద్ద వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ► దీని పక్కనే ఉన్న గూడెంలో కొందరు నాటుసారా కాస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని నారపురెడ్డికుంట గూడేనికి చెందిన కొంతమంది జూలై 31 అర్ధరాత్రి భర్తపై దాడి చేసి భార్యపై లైంగికదాడికి ఒడిగట్టారు. ► సోమవారం వెలుగోడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. ► దీంతో పోలీసులు తోట నాగన్నతోపాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. ► కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.