vishnukumar raju
-
బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజుకు షోకాజ్ నోటీస్?
సాక్షి విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. -
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సభ జరగలేదు : ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
-
‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారు..? ఇంతకీ మీది టీడీపీనా..? బీజేపీనా..? ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మైక్ బీజేపీది.. మాట టీడీపీదని... అలాగే మాట్లాడే ఆఫీస్ బీజేపీది.. అజెండా టీడీపీదని ఎద్దేవా చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో కేకే రాజు మాట్లాడారు. చదవండి: సబ్బం హరి ఆస్తులు సీజ్! నా జెండా.. అజెండా వైఎస్సార్ సీపీనే అని... ఊపిరున్నంత వరకు సీఎం వైఎస్ జగనన్న వెంటేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీటుపై, రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. విష్ణుకుమార్ రాజుకు మాత్రం రాజకీయ భవిష్యత్‌పై బెంగ ఉంటే వైఎస్సార్ సీపీలో కార్యకర్తలా చేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉంటూ చంద్రబాబు, లోకేష్‌పై ప్రేమ ఒలకపోస్తూ జ్యోతిష్యుడి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఊపిరున్నంత వరకూ జగనన్న వెంటే నిలుస్తానని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా...? అని విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు. అసలు నోట్ల రద్దు, కరెన్సీ ముద్రణ అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. 22 ఏ భూములపై నిర్లక్ష్యం వహిస్తున్నామంటున్నారని... అయితే గతంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే దుష్ప్ర చారం రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణిపై టీడీపీ, బీజేపీ నాయకులు దు్రష్పచారం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగితే భారతమ్మపై దు్రష్పచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీ‹Ù, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరూరా సంబరాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా ప్రజలు సంబరాలతో సందడి చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి నూతన జిల్లా ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరానికి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలిలో సంబరాలు ఘనంగా జరిగాయి. పలాస డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అభినందన సభ జరిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టెక్కలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సోంపేటలో పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన అభినందన సభకు హాజరైన ప్రజలు తిరుపతి జిల్లా ఆవిర్భావ నేపథ్యంలో వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో వేలాది మంది భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పాదయాత్ర జరిగింది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు పాదయాత్రలు జరిగాయి. పెదగంట్యాడలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బుచ్చెయ్యపేట మండలంలో ఎమెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు పది వేల మంది హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో భారీ ర్యాలీ జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు శుభపరిణామం సీతమ్మధార (విశాఖ ఉత్తర): రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజించటం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. బుధవారం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’తో మహిళలకు ఎంతో మేలు
సాక్షి, అమరావతి/సీతమ్మధార (విశాఖ ఉత్తర)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం అగ్రవర్ణాల పేదలైన లక్షలాది మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్, ఏపీ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజశ్వనిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ గతంలోనే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి వద్దని చెప్పినా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. చదవండి : అమరావతి.. విఫల ప్రయోగమే మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు వికేంద్రీకరణకే మొగ్గు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ -
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హైపవర్ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా సూచించిందని చెప్పారు. -
'వైఎస్ జగన్ కర్తవ్య నిర్వహణ చాలా బాగుంది'
సాక్షి, విశాఖపట్నం : రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక సంతోషకరమైనదిగా ఉందంటూ బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కాగా కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సూచించే విధంగా ఉందంటూ ప్రశంసించారు. కమిటీ ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యం చేయకుండా అందరు స్వాగతించాల్సిన విషయమని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఎన్ రావుతో రాష్ట్రమంతా సర్వే చేయించారని, ఒకవేళ నివేదికకు అనుకూలంగా పనిచేస్తే త్వరలోనే ఉత్తరాంధ్ర సస్యశామలమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరుల దృష్యా ఇది అద్భుత విజయమని, ఇది ఒక్క జగన్‌కే సాధ్యమైందని ఆయన వెల్లడించారు.' విశాఖకు చెందిన వాడిగా నేను దీనిని సమర్థిస్తున్నా. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని' ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి పని చేసినప్పుడు తాను రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. కానీ మా వాదన పట్టించుకోకుండా రైతులను మభ్యపెట్టి చివరకు తాత్కాలిక భవనాలు నిర్మించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా అచ్చెనాయుడు పని చేసినప్పటికి శ్రీకాకుళం ప్రాంతం అభివృద్ధి చెందలేదని వివరించారు. వైఎస్ జగన్ మొండి మనిషి అనుకున్నా, కానీ కర్తవ్య నిర్వహణను ఫెంటాస్టిక్‌గా చేస్తున్నారని ప్రశంసించారు. -
గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితానికి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పనున్నారని అన్నారు. సోమవారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన తాను, లేక వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మంత్రి గంటా మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఏపీలో బీజేపీకి లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశం లేదన్నారు. మూడు అసెంబ్లీ సీట్లలో గట్టిపోటీ ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీడియా ప్రశ్నించగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ కోట్లాది రూపాయాల డబ్బు ఖర్చు చేశాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. కేంద్రంలో ఇక నుంచి నరేంద్ర మోదీ వ్యతిరేక ఆటల సాగవని అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ 280 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమితో కలిపితే ఎవరూ ఊహించని ఫలితాలు రానున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని అన్నారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తున్నాయని చాలామంది బాధపడేవారు ఎక్కువయ్యారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటలా ఉందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి 20 సీట్లు వస్తాయని అన్నారు. తమ దగ్గర ఉన్న పక్కా సమాచారంతోనే చెబుతున్నామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. -
‘విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారు’
సాక్షి, అమరావతి : విశాఖలో జరిగిన రేవ్‌పార్టీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. దీని వెనుక మంత్రి ఘంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోమ్ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ లైసెన్స్‌లు తీసుకున్నారని విమర్శించారు. విశాఖకు చెందిన మంత్రి పేషీ నుంచి 8సార్లు ఫోన్ చేశారని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ మంత్రే కాబట్టి సీఎం మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ నార్త్‌లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం అనవసరంగా మోదీపై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎంకు అసహనం ఎక్కవైపోతోందన్నారు. -
మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ
-
మంత్రి అండదండలతోనే రేవ్ పార్టీ
సాక్షి, విశాఖపట్నం : మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆ మంత్రి పలుకుబడితోనే రేవ్ పార్టీ నిర్వహించారని పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో పదిమంది యువతులు ఉన్నారని, కోడ్ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మంత్రి పేషీనుంచి 8ఫోన్లు ఎక్సైజ్ అధికారులకు వెళ్లాయని అన్నారు. బీచ్ ఫ్రంట్ నిర్వాహకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ధైర్యంలేదన్నారు. డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే బీచ్‌ఫ్రంట్ నిర్వాహకులను కనీసం విచారించడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందని అభిప్రాయపడ్డారు. రేవ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. -
‘బాబు నటన ముందు వారు ఎందుకూ పనికిరారు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నటన ముందు చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎందుకూ పనికిరారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయంలో లేకపోతే సింగిల్ టేక్‌లో క్లిక్ అయ్యేవాడన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ విపరీతంగా జరిగిందని ఆరోపించారు. భూదోపిడీపై గొడవ చేస్తే సిట్ వేశారని, సిట్ నివేదికను బయటపెట్టకూడదని జీఓ ఇచ్చి బహిర్గతం చేయలేదన్నారు. సిట్ రిపోర్ట్ బయటపెడితే పసుపుపచ్చ రంగులో ఉన్న పాములు బయటకు వస్తాయనే భయం పట్టుకుందన్నారు. రెండుసార్లు అసెంబ్లీ సమావేశాల్లో సిట్‌పై చర్చను రెవెన్యూ మంత్రి దాటవేశారని తెలిపారు. పసుపు, కుంకుమ ద్వారా ఇస్తున్న సొమ్ము.. ఓట్లను కొనుక్కోవటమేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ఏయూ గ్రౌండ్స్ ఇవ్వకపోవటం పెద్ద కుట్ర, అప్రజాస్వామికమన్నారు. ఏయూలో టీడీపీ అధికారిక కార్యక్రమాల పేరిట రాజకీయ కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. -
గోరంతకు కొండంత ప్రచారంలో టీడీపీది గిన్నిస్ రికార్డు
సాక్షి, అమరావతి: గోరంతకు కొండంత ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’ పై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచామని చెప్పుకుంటున్నారు. కానీ మరోవైపు కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులు పెన్షన్ పొందుతుంటే ఒకరిని తొలగిస్తున్నారు’ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కాగా, పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన ప్రసాదమైతే అధికారపార్టీ నేతలు ప్రపంచమంతా తమ ఘనతేనంటూ డప్పు కొట్టుకుంటున్నారని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. గురువారం శాసనసభలో నదుల అనుసంధానంపై జరిగిన చర్చ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. దీంతో విష్ణుకుమార్‌రాజు పైవిధంగా ప్రతిస్పందించారు. విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలకు మంత్రి జవహర్ అభ్యంతరం తెలిపారు. ‘డప్పు’ అంటూ ఒక కులాన్ని కించపరిచేలా విష్ణుకుమార్ మాట్లాడుతున్నాడని తప్పుపట్టారు. విష్ణుకుమార్‌రాజు బదులిస్తూ.. డప్పు కాకపోతే హర్మోనియం వాయించుకుంటున్నారంటూ చురకలంటించారు. మంత్రి ఉమా కలుగజేసుకుంటూ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కట్టట్లేదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ.. పోలవరం ప్రాజెక్టు ప్రజల హక్కు అంటూ బదులిచ్చారు. అలాగైతే పెన్షన్లు, పసుపు–కుంకుమ కూడా ప్రజల హక్కు కిందకే వస్తాయని విష్ణుకుమార్‌రాజు అన్నారు. -
టీడీపీ ప్రతిదానికీ రాజకీయం చేస్తోంది
-
‘ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారు’
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్‌పై బుధవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకూమార్ రాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యలపై కేంద్ర ప్రభుత్వం గతంలో అనేకసార్లు వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు దగ్గరు పడుతుండటంతో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారని విమర్శించారు. టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే విశాఖ రైల్వేజోన్ కూడా చంద్రబాబే ప్రకటించుకునేలా ఉన్నారని విష్ణుకూమార్ రాజు ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశాడో సమాధానం చెప్పాలని విష్ణుకుమార్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడంలేదని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ‘ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసు. అందుకే ఆయన నల్ల చొక్కా ధరించలేదు’ అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ పోరు ఉధృతం చేశారని గ్రహించిన టీడీపీ యూటర్న్ తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘మొన్నటివరకు జగన్, పవన్, బీజేపీ ఒకటి అని విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. -
రాష్ట్రంలో మెడికల్ ఫీజుల దోపిడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వమే అధిక ఫీజులను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునే పరిస్థితులు లేకుండా చేస్తోందని, రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది మెడికల్ ఫీజులే అని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మెడికల్ అడ్మిషన్లపై బుధవారం కాలింగ్ అటెన్షన్‌పై ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఫీజులు రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని విమర్శించారు. వసూలు చేసుకోండని స్వయానా ప్రభుత్వమే జీవో ఇవ్వడం దారుణమన్నారు. చంద్రన్న బీమా అంశంపై కూడా ఆయన మాట్లాడుతూ కేంద్రం 45 శాతం నిధులిస్తున్నా మోదీ ఫొటో పెట్టకుండా కేవలం సీఎం ఫొటోనే పెట్టడం అన్యాయమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పారదర్శకంగా కౌన్సెలింగ్ చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చెయ్యలేకపోయారని నిలదీశారు. దీనికి మంత్రి యనమల సమాధానమిస్తూ ఫీజుల పెంపుపై యాజమాన్యాలు సుప్రీం నుంచి ఆర్డరు తెచ్చుకున్నాయన్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌లో 30 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి యనమల వెల్లడించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యే కలమట అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. వేతనాలు చాల్లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు మానేస్తున్నారని, అందువల్ల రెగ్యులర్ నియామకాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని మోదీని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నందు వల్లే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంజేజేవై)కు ఆయన ఫొటో పెట్టలేదని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ (రెండవ సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ (నెం.3) బిల్లులను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
‘ఆ మంత్రికి 10సార్లు ఫోన్ చేశా.. స్పందించలేదు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. ‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దాడులు సహించేది లేదు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ప్రభుత్వం బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మట్లాడుతూ.. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ నవయుగ సంస్థను ఢిల్లీ పిలిపించి నితిన్ గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను సహించేదిలేదని పురందేశ్వరి హెచ్చరించారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం : విష్ణుకుమార్ రాజు బీజేపీతో కలిసి ఓట్లు అడిగిన టీడీపీ లాభం పొందినప్పటికీ స్వప్రయోజనాల కోసం మధ్యలోనే దోస్తీకి కటీఫ్ చెప్పిన ఘనత చంద్రబాబుదేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారంటూ బీజేపీని విమర్శిస్తున్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలపై సిట్ నివేదిక బయటపెట్టాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంపుసెట్ల విషయంలో 60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక్క క్యూబిక్ మట్టికి 21 వేల రూపాయలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు 69 కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు..
సాక్షి, తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎండగట్టారు. చంద్రబాబు తిరుపతిలో చేసింది అధర్మ దీక్ష అని ఆయన విమర్శించారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు సరిపోవడం లేదని చెప్పడం దారుణం. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి ఆదరణ వస్తుండటంతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగువాళ్లు ఓటు వేయవద్దని చంద్రబాబు చెప్పడం సరికాదు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోకుండా యూటర్న్ తీసుకున్న ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు సైకోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి వల్లే బ్రిటిష్ వారితో టీడీపీ పోరాటం చేసిందంటూ తిరుపతి సభలో చెప్పారు. అన్ని వర్గాలను మభ్యపెడుతున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తాయి. ఇప్పటివరకూ ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు.’ అంటూ జోస్యం చెప్పారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
సాక్షి, విశాఖ: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. -
ప్రధానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే కేసులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/నెల్లూరు(బారకాసు)/ సాక్షి, అమరావతి: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు ఆయన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పకపోతే, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
హరిబాబు రాజీనామా..చేశారా.. చేయించారా?
జాతీయ పార్టీకి మూడేళ్లకుపైగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు.. ఒక దశలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన్ను ఊరించింది.. టీడీపీ, బీజేపీ పొత్తు పెటాకులైన తర్వాత సీను మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని టీడీపీ సర్కారుపై అస్త్రశస్త్రాలు సంధించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కేంద్రంపై టీడీపీ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పలు వేదికలపై తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఎంపీ హరిబాబు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ కూడా ఆవిష్కరించారు. అంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చర్చోపచర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పట్ల ఆయన మెతక వైఖరితో ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అందుకనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. ఈ క్రమంలో హరిబాబు విమర్శలకు వగచి తనంత తానుగా రాజీనామా చేశారా?.. అధిష్టానం చేయించిందా?? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. హరిబాబు రాజీనామా స్వచ్ఛందంగానే చేశారా? లేక చేయమని ఒత్తిడి చేశారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మిత్రపక్షంతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారని ఓ వాదన విన్పిస్తుండగా, తనపై పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి రాజీనామా చేసి ఉంటారని మరో వాదన బలంగా విన్పిస్తోంది.ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్‌కు బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయిన తర్వాత 13 జిల్లాలకు పార్టీ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన కంభంపాటి హరిబాబుకు అప్పగించారు. 2014 జనవరిలో బా«ధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో సైతం ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై హరిబాబును మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు పార్టీ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి హరిబాబుకు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో రాజధాని నుంచి వచ్చిన పిలుపుతో హరిబాబు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కాగా తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో కేంద్ర కేబినెట్లో ఏపీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. సొంత పార్టీలోనే విమర్శల సెగ ఆది నుంచి సౌమ్యునిగా ముద్ర పడిన హరిబాబు ఏనాడు విపక్షాలపై కూడా ఘాటైన విమర్శలు చేసిన పాపాన పోలేదు. నాలుగేళ్ల కాపురం తెగతెంపులు చేసుకోవడంతో టీడీపీపైన, ఆ పార్టీ పెద్దలపై సొంత పార్టీ నేతలు ఓ వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే హరిబాబు మాత్రం కొద్దికాలం మౌనముద్ర వహించారు. దీంతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తన సహజశైలికి భిన్నంగా ఇప్పుడిప్పుడే టీడీపీ పెద్దలపై విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటికీ హరిబాబుపై పార్టీలో విమర్శలు మాత్రం తగ్గలేదు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తక్షణమే అధ్యక్ష మార్పు చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదన ఆయన వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. ఆ లేఖను గుట్టుచప్పుడు కాకుండా పార్టీ అధినేత అమిత్‌షాకు పంపడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజీనామా చేస్తే తాను ఫలానా కారణంగా రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత ఎవరైనా సమర్పిస్తారు. కానీ హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అ«ధ్యక్షునికి పంపగా.. ఆ విషయాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం పార్టీని కుదుపేస్తోంది. ఆ తర్వాత తన రాజీనామా విషయాన్ని హరిబాబు ధ్రువీకరించారు. కొలిక్కి రాకుండానే.. సాధారణంగా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఖరారైన తర్వాత పాత అధ్యక్షునితో రాజీనామా చేయిస్తారు. పాత అధ్యక్షుడి నుంచి కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. కానీ ఇక్కడ కొత్త అధ్యక్షుడెవరనేది కొలిక్కి రాకుండా హరిబాబు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శలను హరిబాబు సమర్ధ వంతంగా తిప్పికొట్టలేక పోతున్నారని తక్షణమే ఆయన్ని తప్పించాలంటూ పార్టీ అధినాయకత్వంపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటారని పార్టీలో ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షత పదవి మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో అధిష్టానమే గౌరప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చునని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. రాజకీయ కోణం లేదన్న విష్ణుకుమార్‌రాజు ఆది నుంచి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ఈ వ్యవహారంపై ఆచీతూచి స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయకోణం ఏమీ లేదంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ కోణం లేనప్పుడు ఎందుకు రహస్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టిపారేశారు. కొత్త అధ్యక్షుడు కావాలంటే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాలి కదా? అని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యానించారు. హరిబాబుకు కచ్చితంగా కేబినెట్లో స్థానం లభిస్తుందన్న విశ్వాసం తమకుందని ఈ ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రేసులో ఉన్న సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పురందేశ్వరిలతో పాటు తాజాగా విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.