YSR Jagananna Saswatha Bhoomi Hakku Bhoomi Rakshana
-
AP: ఆస్తి మీ హక్కు.. తనఖా పెట్టుకోవచ్చు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ చేసే ఇల్లు ఉండి కూడా పిల్లల పెద్ద చదువుల కోసమో, ఇంకే పెద్ద అవసరానికైనా ఆ ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం లేక ఇబ్బందులు పడే లక్షలాది మధ్య తరగతి ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. వైఎస్సార్ జగనన్న భూ హక్కు – భూ రక్ష కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులందరికీ వారి ఆస్తి యాజమాన్య హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి బ్యాంకులను సైతం ప్రభుత్వం తాజాగా ఒప్పించింది. ఈ పత్రాల డిజైన్‌ను కూడా రుణాలు సులభంగా లభించేలా రూపొందించారు. ఈ హక్కు పత్రాలను అవసరమైన వారు నచ్చిన బ్యాంకులో తనఖా పెట్టుకొనేందుకు గతనెల 27న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య కోఆర్డినేటర్ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర పరిధిలోని అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అథారిటీలకు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. గ్రామాల్లో వారసత్వంగా వచ్చే ఈ ఇళ్లకు నిర్దిష్ట అధికారిక హక్కు పత్రాలు ఉండవు. అందువల్ల ప్రభుత్వం తాజాగా ఇచ్చే ప్రాపర్టీ కార్డులను తనఖా పెట్టుకునే సమయంలో ఆ ఆస్తి లింకు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి చేయవద్దని ఎస్ఎల్బీసీ కోరింది. సంబందిత ఆస్తికి రిజి్రస్టేషన్ శాఖ అధికారికంగా సూచించే మార్కెట్ విలువ ఆధారంగా తనఖా విలువ లెక్కగట్టుకోవచ్చని తెలిపింది. తొలి దశలో లక్షన్నరకు పైగా హక్కు పత్రాలు రాష్ట్రవ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాలన్నింటికీ వైఎస్సార్ జగనన్న భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంతో ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తోంది. దాదాపు 11,150 గ్రామాల పరిధిలోని గ్రామ కంఠాల ఇళ్ల సర్వే కూడా చేపట్టింది. 294 గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయింది. ఒక్కో ఆస్తికి (ఇల్లు లేదా దొడ్డి లేదా ఖాళీ స్థలం వారీగా) యాజమాన్య హక్కు పత్రాల నిర్ధారణ చేసే ఫైనల్ ఆర్వోఆర్ నోటిఫికేషన్ జారీ కూడా పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 262 గ్రామాల్లో శుక్రవారం నాటికి 1,22,943 ప్రాపర్టీ కార్డులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన 32 గ్రామాల్లో హక్కు పత్రాలు కూడా త్వరలో సిద్ధమవుతాయని వెల్లడించారు. మొత్తంగా 294 గ్రామాల్లో లక్షన్నర వరకు ప్రాపర్టీ కార్డులు సిద్ధమైనట్లేనని తెలిపారు. వీటిలో 42 గ్రామాల్లో యజమాన్య హక్కు పత్రం నమూనా కాపీని సంబంధిత యజమానులకు ఇప్పటికే అందజేసినట్టు చెప్పారు. అక్టోబరు 2న పండుగలా పంపిణీ అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున 300 – 350 గ్రామాల పరిధిలోని అన్ని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాల వారీగా యజమానులకు హక్కు పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా వీటిని పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీ కార్డుల ముద్రణ టెండర్లకు కూడా ఏర్పాట్లు చేశారు. -
Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్
22(ఏ) చెర నుంచి విముక్తి గుంటూరు జిల్లా కుర్నూతల గ్రామంలోని జాస్తి వీరయ్య, ఆయన ఇద్దరు సోదరులు, చెల్లెళ్లకు కలిపి సర్వే నంబర్ 159లో 6.60 ఎకరాల భూమి ఉంది. ఆయన సోదరి.. తన కుమార్తె పెళ్లికి కొంత భూమిని పసుపు కుంకుమ కింద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నిస్తే కాలేదు. 2016 నుంచి దానిపై వారు పోరాడుతూనే ఉన్నారు. ఈ పొలం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆ కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రీ సర్వే మొదలైంది. సర్వే నంబర్ 159లోని మొత్తం 25.69 ఎకరాలు 19 మంది రైతుల పేరు మీద ఉంది. అందులో ముగ్గురు రైతులకు చెందిన 3.25 ఎకరాలను 2016లో దేవదాయ శాఖ తన భూమిగా పేర్కొంది. దీంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22 (ఏ)1 (సి)లో నమోదు చేయడంతో మిగిలిన 16 మంది రైతుల భూమి కూడా వివాదంగా మారింది. ఇప్పుడు రీ సర్వేలో సబ్ డివిజన్ ద్వారా 16 మంది రైతులకు, దేవదాయ శాఖగా చెప్పిన భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్లు రావడంతో సమస్య పరిష్కారమైంది. ప్రతి గ్రామంలో నిత్యం భూ తగాదాలు.. ఏ కోర్టుకు వెళ్లినా దాదాపు సగం కేసులు భూ సమస్యలే. భూ పంపకాలు చేసుకోవాలన్నా, పిల్లల పెళ్లిళ్లు.. చదువుల కోసం విక్రయించాలన్నా, తుదకు దానమివ్వాలన్నా కూడా సమస్యే. ఈ సమస్యలన్నింటికీ ఒకే సమాధానం భూముల రీ సర్వే. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో జరిగింది. ఆ తర్వాత దేశంలోనే ఎవరూ అంత ధైర్యం చేయలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి ఈ సాహసానికి పూనుకున్నారు. ఒక్క కలం పోటుతో రీ సర్వేకు ఆదేశించారు. వెరసి లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరిస్తూ వారి రాతలు తిరగరాస్తున్నారు. బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేతో లక్షల సంఖ్యలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, నిషేధిత ఆస్తులు, వారసత్వ అంశాలు వంటి ఎన్నో చిక్కు ముడులను విప్పుతూ రీ సర్వే సమాధానం చూపుతోంది. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని వందలాది పనులను రీ సర్వే బృందాలు ప్రతి గ్రామంలో కొలిక్కి తెస్తున్నాయి. రీ సర్వే జరిగిన తీరు, రైతులకు కలిగిన ప్రయోజనాలను ‘సాక్షి’ బృందం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు, అనంతవరప్పాడు గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిచోటా భూ వివాదాలు, సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో జరుగుతున్న రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో పూర్తయింది. ఆ గ్రామాల్లో తాజా వివరాలతో డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి భూ కమతాన్ని కొలిచి అక్షాంశ, రేఖాంశాలతో హద్దులు నిర్ణయించారు. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చులతోనే సర్వే రాళ్లు పాతారు. ప్రతి రైతుకు భూ హక్కు పత్రం ఇచ్చారు. వారి భూ కమతానికి సంబంధించి ఆధార్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (యునిక్ కోడ్) కేటాయించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలోనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి భూమి వివరాలను ఎప్పుడైనా చూసుకునే అవకాశం కల్పించారు. ఇవన్నీ చేయడానికి ముందే రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ప్రయోజనాలు ► 2 వేల గ్రామాల తుది ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)లు సిద్ధం ► 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ ► హద్దుల్లో 25.8 లక్షల సర్వే రాళ్లు పాతారు ► 2 లక్షల మ్యుటేషన్లు, 4.3 లక్షల సర్వే సబ్ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం ► 1.08 లక్షల మంది రైతుల పేర్లు తొలిసారి రికార్డుల్లోకి ఎక్కాయి ► 2 వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ► 4 లక్షలకుపైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం ► 18.3 లక్షల ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) జారీ.. (సర్వే నంబర్లు) ల్యాండ్ కన్వర్షన్ సమస్యకు పరిష్కారం కుర్నూతల గ్రామానికి చెందిన దూపాటి శివనాగేంద్రం దంపతులకు సర్వే నంబర్ 151, 152లో 4 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ భూమిగా ఉన్న వారి భూమిని వ్యవసాయేతర భూమిగా (గజాల్లో) నమోదు చేయడంతో ఆ భూమి విలువ ఉన్న దాని కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అదే సర్వే నంబర్లో ఉన్న మరో రైతు తన అవసరాల కోసం తన వాటా భూమిని వ్యవసాయేతర భూమిగా (ల్యాండ్ కన్వర్షన్) మార్చుకున్నారు. సబ్ డివిజన్ జరక్కపోవడంతో మొత్తం ఆ సర్వే నంబర్లోని భూమి అంతా వ్యవసాయేతర భూమిగా నమోదైంది. దీంతో మిగిలిన రైతులు తమ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని విలువ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది. రీ సర్వేలో సబ్ డివిజన్ జరిగి ప్రతి భూ కమతానికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్ ఇవ్వడంతో శివనాగేంద్రం కుటుంబంతోపాటు చాలా మంది రైతులకు మేలు జరిగింది. కాలువ పోరంబోకుగా నమోదైన భూమికి విముక్తి వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన బొడ్డపాటి నర్సారెడ్డికి ఉన్న 3.3 ఎకరాలను కాలువ పోరంబోకు భూమిగా చూపుతూ నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. సర్వే నంబర్ 115లో నర్సారెడ్డి భూమితోపాటు కాలువ పోరంబోకు భూమి కూడా ఉంది. కాలువ భూమి ప్రభుత్వ పోరంబోకు కావడం, ఆ సర్వే నంబర్లోని భూములు సబ్ డివిజన్ కాకపోవడంతో నర్సారెడ్డి భూమి 22 (ఏ)1 (బీ)లో నమోదైంది. రీ సర్వేలో ప్రతి భూమికి సబ్ డివిజన్ జరిగి నర్సారెడ్డి భూమికి ప్రత్యేకంగా ఎల్పీఎం నంబర్‌ను ఇచ్చి వెబ్‌ల్యాండ్–2లో నమోదు చేశారు. దీంతో నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించింది. 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన రాయపాటి ఇస్సాకుకు 0.37 సెంట్ల భూమి ఉంది. తన తండ్రి 50 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో స్టాంప్ పేపర్ మీద ఈ భూమి కొన్నట్లు రాయించుకున్నారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఆ భూమి ఉన్నా, రిజిస్టర్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అనేక సంవత్సరాలుగా అలాగే వదిలేశారు. రీ సర్వేలో సాదాబైనామా కేసుల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఇస్సాకు పేరును అడంగల్‌లో నమోదు చేశారు. పట్టాదార్ పాస్‌బుక్ కూడా జారీ అయింది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి మ్యుటేషన్ వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన యామర్తి వెంకట నాగదుర్గా శ్రీలక్ష్మికి వారసత్వంగా 75 సెంట్ల భూమి వచ్చింది. 50 ఏళ్ల నుంచి ఆమె కుటుంబం చేతిలోనే ఆ భూమి ఉంది. ఆమె తాత నరసింహారావు, ఆ తర్వాత ఆయన కొడుకు సీతారామాంజనేయుల నుంచి ఆమెకు భూమి వచ్చింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. పాత రెవెన్యూ రికార్డుల్లో నరసింహారావు పేరు తప్ప ఇతర వివరాలు లేవు. అనారోగ్య కారణాలతో ఆ భూమిని అమ్ముకుందామని శ్రీలక్ష్మి తండ్రి ప్రయత్నిస్తే ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి కుదరదన్నారు. రీ సర్వేలో విచారించి ఎవరి నుంచి అభ్యంతరాలు లేకపోవడం, భూమి వారి ఆ«దీనంలో ఉండడంతో ఇటీవలే ఆమె పేరుతో మ్యుటేషన్ చేశారు. ఏపీ రీ సర్వే దేశానికి రోల్ మోడల్ దేశంలో వందేళ్ల తర్వాత ఏపీలో మాత్రమే జరుగుతున్న రీ సర్వే కార్యక్రమం విజయవంతమైంది. మన రీ సర్వేను ఇతర రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయి. ఈ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాం. రాష్ట్రంలోని మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికిగాను డ్రోన్లు, విమానాలతో ఇప్పటికి 1.06 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సర్వే చేశాం. త్వరలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తవుతుంది. 2 వేల గ్రామాల్లో అన్ని దశల రీ సర్వే పూర్తయి ఆ గ్రామాల ఆర్‌ఓఆర్‌లు సిద్ధమయ్యాయి. రీ సర్వే ప్రతి దశలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన లక్షలాది భూ సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతున్నాయి. ఇప్పటి వరకు 23 వేలకుపైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు, కొత్త ఎంట్రీలు.. వంటివి లక్షల్లో జరుగుతున్నాయి. భావితరాలకు సైతం తమ భూముల గురించి తెలిసేలా డిజిటల్ రికార్డులు రూపొందుతున్నాయి. రీసర్వేలో వాటికి భద్రత ఏర్పడుతుంది. టాంపరింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ స్థాయిలోనే భూముల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. – సిద్ధార్ధ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక.. 80,581 మందికి ఆస్తి సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ కంఠాల పరిధిలో రూ.లక్షలు విలువ చేసే ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండి.. దానికి ఎలాంటి హక్కు పత్రాల్లేని యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం సాంత్వన చేకూరుస్తోంది. వాటికి కొత్తగా యాజమాన్య హక్కుతో కూడిన ఆస్తి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలి విడతగా 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో 80,581 మంది ఇళ్ల యజమానులకు వీటి జారీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వీటి జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష కార్యక్రమంలో భాగంగా సర్వే అనంతరం గ్రామ కంఠాల్లోని ఇళ్లకు సంబంధించి వాటి యజమానులకు స్థానిక తహసీల్దార్ ద్వారా ఈ ఆస్తి సర్టిఫికెట్ల జారీకి గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,078 గ్రామాల్లోని గ్రామకంఠాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఇందులో 987 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) ప్రక్రియ కూడా ముగిసింది. ఒక్కో ఆస్తికి సంబంధించి సంబంధిత యజమాని ధృవీకరణ.. తదితర ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటివరకు.. బాపట్ల జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో నోటిఫికేషన్ల జారీకి కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అలాగే, గ్రామాల్లోని ఇళ్ల యజమానుల వారీగా ఆర్ఓఆర్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ల జారీ పూర్తవుతుందని, ఆ వెంటనే తొలివిడతగా.. ఆయా గ్రామాల్లోని సంబంధిత యజమానులకు ప్రభుత్వం ఆస్తి సర్టిఫికెట్లను జారీచేస్తుందన్నారు. డిసెంబరు నాటికి దశల వారీగా అందరికీ.. ఇక దశల వారీగా డిసెంబరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠాల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేసి ఆ పరిధిలో ఉండే ఇళ్లు, ఇళ్ల స్థలాలకు ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏ నెలలో ఎన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న దానిపై జిల్లాల వారీగా నిర్ధారించి, అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లాల అధికారులకు సమాచారమిచ్చారు. -
AP: భూ వివాదాలకు చెక్
సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష’ పథకం కింద మూడు దశల్లో భూముల సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా తొలి దశ సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. అప్పట్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, శాశ్వత భూహక్కు పత్రాలు సైతం పంపిణీ చేసింది. ప్రస్తుతం రెండో దశ సర్వే జిల్లాలో యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. రెండో దశ 50 శాతం పూర్తి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 గ్రామాల పరిధిలోని 16,52,706 ఎకరాల్లో వివిధ దశల్లో రీసర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో 44 గ్రామాల్లోని 64,336 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 47,189.2 ఎకరాల రీసర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 10 గ్రామాల్లోని 22,223.91 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి, సుమారు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలోని 24,965.78 ఎకరాల్లో సైతం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పకడ్బందీగా.. రెండో దశ రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు.. ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. తొలుత గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేస్తున్నారు. సర్వే చేస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా సమయం అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కమతాల వరకూ ప్రతీది నమోదు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకూ 1,474.629 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే నిర్వహించారు. హద్దు రాళ్లు సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్ యాక్టివిటీస్ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టారు. రాళ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. రెండో దశలో 15,113 రాళ్లు పాతాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 5,522 రాళ్లు పాతారు. కొలిక్కి వస్తున్న వివాదాలు ఈ సర్వే పుణ్యమా అని దశాబ్ద కాలం నాటి భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వేలో 5 శాతం అలవెన్సు అమలు చేశారు. అప్పట్లో చైన్లతో కొలతలు వేయడంతో అటూ ఇటూ భూ విస్తీర్ణంలో 5 % సరిహద్దులు నిర్ణయించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు రావడంతో కొందరు రైతులు వాగ్వాదాలకు దిగుతున్నారు. 1906లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రస్తుతం భూ సంబంధిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఒకే సర్వే నంబరుపై పలుమార్లు లావాదేవీలు జరిగాయి. వారసులు పంచుకోవడం, బహుమతిగా ఇవ్వడం, క్రయవిక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా భూమి మీద సబ్ డివిజన్ జరగకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల మీద లావాదేవీలు జరిగినా క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే నోషనల్ ఖాతాల వల్ల అనేక సమస్యలు మొదలయ్యాయి. తప్పుడు సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ కావడం, రిజిస్ట్రేషన్ అయిన భూమికి, వాస్తవంగా భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండటం, నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేయడం వంటి కారణాలతో రెవెన్యూ సమస్యలు నిత్యకృతమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, ప్రక్రియ పర్యవేక్షిస్తున్నా. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. రెండో దశలో ఇప్పటికే 50 శాతం లక్ష్యాలను అధిగమించాం. మిగిలిన వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. నిజమైన హక్కుదారుకు న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం. – ఎన్.తేజ్‌భరత్, జాయింట్ కలెక్టర్ లక్ష్యాలను అధిగమిస్తాం రెండో దశ రీసర్వే ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. వివాదాల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22,223.91 ఎకరాల్లో పూర్తి చేశాం. మిగిలినది సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – పి.లక్ష్మణరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా అధికారి -
సర్వేతో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న భూముల సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే) పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. తొలివిడత గ్రామాల్లో జనవరికి పత్రాలు ‘రీ సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం. వందేళ్ల తర్వాత మళ్లీ సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మంది సర్వేయర్లు, సిబ్బంది మన వద్ద అందుబాటులో ఉన్నందున వేగంగా చేయగలుగుతున్నాం. తొలివిడత సర్వే పూర్తైన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కావాలి’ అని సీఎం సూచించారు. మరో 2 వేల గ్రామాల్లో.. సర్వే పూర్తైన రెండు వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యుటేషన్లు, 92 వేల ఫస్ట్ టైం ఎంట్రీస్ జరిగాయని, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని అధికారులు తెలిపారు. 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి కాగా 19 వేల భూ వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేర డబ్బు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను అధికారులు సీఎంకు తెలియచేశారు. 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేసి అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం యూనిట్‌గా.. సమగ్ర సర్వేను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని కావల్సినంత మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో తగినంత సిబ్బందిని సమకూర్చుకుని ఖాళీలున్న చోట వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారమైన లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు.. ‘ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ‘22 ఏ’ భూములు, ఇతర సమస్యలను పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలి. వారికి జరిగిన మేలును వివరిస్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లేఖలు పంపాలి. సర్వే రాళ్ల ఉత్పత్తి వేగాన్ని పెంచాలి. రాళ్ల తయారీ వేగం పెరిగేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి జాప్యానికి తావుండరాదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయగా మార్చి కల్లా సర్వేకు అవసరమైన రాళ్లు సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాల్లో సర్వేపై.. అర్బన్ ప్రాంతాల్లోనూ భూముల సర్వేను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 4,119 వార్డు సచివాలయాల్లో సర్వే బృందాల ఏర్పాటు, శిక్షణ ఇప్పటికే పూర్తైందని అధికారులు తెలిపారు. హద్దుల మార్కింగ్, రోవర్ల సహాయంతో జీసీపీ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను 2023 జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 1,16,685 ప్రభుత్వ, పోరంబోకు ల్యాండ్ పార్సిల్స్‌కు సంబంధించి 3,37,702 ఎకరాలను గుర్తించినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. 2023 జూలై నాటికి పట్టణ ప్రాంతాల్లో సమగ్ర సర్వే హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష
-
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వే కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు, సర్వే రాళ్లను సీఎం పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మైనింగ్ శాఖ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ ఇద్దరే: కొడాలి నాని) -
రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన భూముల రీ సర్వేలో గ్రామ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వం చురుకైన యువకులకు అన్ని రకాల శిక్షణ ఇప్పించి, వారి ద్వారా ప్రాజెక్టును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులను రీ సర్వే చేసి యజమానులకు హక్కు పత్రాలు ఇస్తున్నారు. దీనివల్ల లక్షల్లో పేరుకుపోయిన భూ వివాదాలు పరిష్కారమవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డుల స్వచ్ఛీకరణ జరిగి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వస్తాయి. తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయి 8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా రీసర్వే విజయవంతంగా జరుగుతోంది. గ్రామ సర్వేయర్లతో కొత్త తరం సమగ్ర రీ సర్వే కోసం వేలాది మంది సర్వేయర్లు అవసరం. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి మండల సర్వేయర్లు మాత్రమే ఉండేవాళ్లు. అదీ కొన్ని మండలాల్లోనే ఉన్నారు. చాలా మండలాల్లో సర్వేయర్లు లేక ఇబ్బంది కలిగేది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ సమగ్ర సర్వేకి అక్కరకు వచ్చింది. సచివాలయాల్లో 11,600 మందికిపైగా సర్వేయర్లు నియమితులయ్యారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీలు 3,300 మందిని ప్రభుత్వం నియమించింది. మొత్తంగా ఈ 14,900 మందిని సమగ్ర సర్వేలో ప్రభుత్వం వినియోగిస్తోంది. వీరందరికీ శిక్షణ ఇచ్చింది ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి ఇద్దరు మండల సర్వేయర్లు, ముగ్గురు గ్రామ సర్వేయర్లను బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం 275 బృందాలకు తొలి దశలో శిక్షణ ఇచ్చింది. వారిద్వారా వివిధ డివిజన్లలోని సర్వేయర్లు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇప్పించింది. వారిలో 70 శాతం మంది సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు కావడంతో సర్వే అంశాలను తేలిగ్గా ఆకళింపు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా కరోనా సమయంలోనూ ఏడాదిన్నరలో 11,187 మందికి శిక్షణ ఇచ్చింది. గ్రామ సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన మూడు రకాల డిపార్ట్మెంటల్ పరీక్షల్లో 94 శాతం మంది ఉత్తీర్ణులవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. శిక్షణ ఇలా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వే అకాడమీ ద్వారా సర్వే సెటిల్మెంట్ శాఖ వీరికి శిక్షణ ఇచ్చింది. ఒక ప్రణాళిక ప్రకారం భూ సర్వేకి సంబంధించి 50కి పైగా అంశాల్లో శిక్షణ ఇచ్చింది. సంప్రదాయ సర్వే విధానాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి సిలబస్ రూపొందించింది. కీలకమైన డ్రోన్ పైలట్ సర్వే, డ్రోన్ డెస్టినేషన్ సర్వే కోసం జిల్లాల్లో డ్రోన్ పైలట్, కో పైలట్లు గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా మండలాల వారీగా మిగిలిన వారికి ఇవే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లోనూ మండలానికో డ్రోన్ సర్వే ట్రైౖనర్‌ను నియమించారు. వీరి ద్వారానే ప్రస్తుతం డ్రోన్ సర్వే జరుగుతోంది. రీసర్వే విజయవంతంగా జరగడానికి గ్రామ సర్వేయర్లే కారణం సర్వే అకాడమీ ద్వారా ఆధునిక, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమయ్యేలా సంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థాయి ప్రత్యక్ష సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చాం. దీని ఫలితంగా రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. – సీహెచ్వీఎస్ఎన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ -
చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: భూ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయమని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. 14 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు, కొన్నిమీడియా సంస్థలు కలిసి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కావడం జరగదన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చదవండి: (CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్) -
రైతుల హక్కుకు మరింత భద్రత
రైతులు సబ్ డివిజన్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆ పని ఎప్పటికి అవుతుంది? వారు ఎంత శ్రమ పడాలి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరగాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటి దాకా నిర్దిష్ట సమాధానం లేదు. ఇకపై భూముల రీ సర్వే ద్వారా ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎవరైనా చెబుతారు. సాక్షి, అమరావతి: వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 92 వేల మంది రైతుల పేర్లు భూముల రీ సర్వే ద్వారా కొత్తగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయ్యాయి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా వచ్చిన ఫలితమిది. భూమి వారిదైనా, ఆ భూమిని వారే సాగు చేసుకుంటున్నప్పటకీ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటి వరకు వారి పేర్లు లేవు. ఇలాంటి 92 వేల మంది అడక్కుండానే, వారి భూములను ప్రభుత్వం రీ సర్వే చేసి, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించింది. ఆ భూముల్లో హద్దు రాళ్లు పాతించి, భూ హక్కు పత్రాలిచ్చింది. రీ సర్వే ఎందుకని ప్రశ్నిస్తున్న వారికి ఇదే చక్కటి సమాధానం. మామూలుగా అయితే ఇది సాధ్యమా? సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 4.3 లక్షల సబ్ డివిజన్లు జరిగాయి. అంటే సుమారు 6.5 లక్షల రెవెన్యూ అంశాలు పరిష్కారమయ్యాయి. ఇవి కాకుండా ఈ గ్రామాల్లో 10 వేలకు పైగా వివాదాలను మొబైల్ మెజిస్ట్రేట్లు పరిష్కరించారు. అలాంటిది 17 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయితే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తయింది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించిన 7,29,381 మంది రైతుల భూ హక్కు పత్రాలు జారీ అయ్యాయి. అడుగడుగునా రైతుల భాగస్వామ్యం సర్వే పూర్తయి ఆర్ఓఆర్ జారీ అయ్యాక కూడా తప్పులుంటే రైతులు అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. – జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, -
దుష్ట చతుష్టయం.. రాక్షస మూక
రాజకీయం అంటే ఒక జవాబుదారీతనం. ప్రజలకు.. ఇంటింటికీ మనం మంచి చేస్తే, ఆ మంచిని చూసి వారు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారనే ఆలోచన కలగాలి. లేదంటే అధికారం నుంచి పోవాలనే మెసేజ్ వెళ్లాలి. అదీ రాజకీయం. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే.. వాళ్లను ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక జగన్ అని అంటారు. కానీ సొంత కూతురును ఇచ్చిన మామకు, మామ పెట్టిన పార్టీకి, మామ పెట్టిన ట్రస్టుకు, చివరకు మామకు ప్రజలు ఇచ్చిన సీఎం కుర్చీకి.. వెన్నుపోటు పొడిచి కబ్జా చేసే వాళ్లను చంద్రబాబు అంటారు. రావణుడిని సమర్థించిన వాళ్లను మనమంతా రాక్షసులంటాం. దుర్యోధనుడికి కొమ్ము కాసిన వాళ్లను దుష్ట చతుష్టయం అని అంటున్నాం. మరి మామ కుర్చీని కబ్జా చేసి, మామ పార్టీని దందా చేసి, ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి, ఆ తర్వాత ప్రజలను గాలికొదిలేసి మోసం చేసే చంద్రబాబును సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని ఏమనాలి? దుష్ట చతుష్టయమని అనాలా? వద్దా? రాక్షస మూకలనాలా? వద్దా?.. అనేది ప్రజలు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం ఆయన జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష కార్యక్రమం తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కుల పత్రాల పంపిణీ, రెండో విడత సర్వే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు అండ్ కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. లబ్ధిదారు వెలమల శ్రీదేవికి జగనన్న భూహక్కు పత్రాన్ని అందజేస్తున్న సీఎం జగన్ చంద్రబాబు రాముడా.. రావణుడా? ► తన ఆస్తిని తాను అనుభవించే వాళ్లను హక్కుదారుడు అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఆక్రమించే వారిని కబ్జాదారుడు అంటారు. తన భార్యతో సంసారం చేస్తే, ఆమె కోసం యుద్ధం చేస్తే.. ఆ మనిషిని శ్రీరాముడు అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్ను వేసి ఎత్తుకుపోతే.. అలాంటి వాళ్లను రావణుడు అంటారు. చంద్రబాబు రాముడా.. రావణుడా? రావణుడికి, దుర్యోధనుడికి, మోసం చేసిన వారికి, వెన్నుపోటు పొడిచే వారికి మరో చాన్స్ ఎవరైనా ఇస్తారా? ► తమను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాటను నాయకులు నిలబెట్టుకోవాలి. అప్పుడే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అంటారు. కానీ గెలిపించిన ప్రజలను ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. అనేక సార్లు మోసం చేసి, మాట తప్పి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడిని మరోసారి అసెంబ్లీకి పంపాలా? మీ సేవలు మాకొద్దని బైబై చెప్పి ఇంటికి పంపాలా? అనేది ప్రజలు ఆలోచించాలి. ► ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే.. కేవలం నలుగురు తోడుగా ఉంటే చాలు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే దుస్థితికి వచ్చాయి. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. నాకు వీళ్లుంటే చాలు.. ఇక ప్రజలతో అవసరం లేదు, ప్రజలను మోసం చేసినా, వాళ్లకు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవ్వరూ రాయరు. ఎవ్వరూ చూపరు. ఎవ్వరూ ప్రశ్నించరనుకునే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ► నేను నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను మాత్రమే. చంద్రబాబులా దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదు. మీ అందరితో నేను ఇదే చెబుతున్నాను. వీళ్లు చెప్పే అబద్ధాలను నమ్మొద్దండి. టీవీల్లో వీళ్లు చూపించే అబద్ధాలను చూడొద్దండి. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. అన్నదే కొలమానంగా పెట్టుకోండి. మంచి జరిగి ఉంటే.. మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ జగన్‌కు తోడుగా నిలబడండి. -
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
భూ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూస్తున్నాం. 80–90 శాతం సివిల్ కేసులన్నీ కేవలం భూ వివాదాలవే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికి గద్దల్లా వేరెవరో తస్కరిస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేందుకే సమగ్ర భూ సర్వే దిశగా వేగంగా అడుగులు వేశాం. తద్వారా ఎలాంటి సివిల్ వివాదాలకు, లంచాలకు, కబ్జాలకు తావు లేకుండా చేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలుపెరగకుండా, ఖర్చుకు వెనకాడకుండా, అత్యంత సాంకేతికంగా, శాస్త్రీయ పద్ధతిలో భూముల రీసర్వే చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల రీ సర్వేను 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని, సర్వే పూర్తయితే తమ భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని, అక్రమాలకు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గత మూడున్నరేళ్ల కాలంలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపట్టారు. అక్కడే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైందన్నారు. రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే.. అందులో తొలి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయడమే కాకుండా 7,92,238 మంది రైతుల భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ హక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో మొదటి దశలోని 2 వేల గ్రామాల రైతులందరికీ భూ హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నరసన్నపేట బహిరంగ సభకు హాజరైన జనసందోహంలోని ఓ భాగం దశల వారీగా భూ హక్కు పత్రాలు ► 2023 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తి చేస్తాం. అంటే మరో నాలుగు నెలల్లో ఇంకో నాలుగు వేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ వాళ్ల భూ హక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో మూడో దశలో ఆరు వేల గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానులకు 2023 మే నాటికి భూ హక్కు పత్రాలు అందజేస్తాం. ► 2023 ఆగస్టు నాటికి మరో 9 వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి సర్వే పూర్తి చేస్తాం. ఐదో దశలో మిగతా గ్రామాలు, పట్టణాలతో కలిపి మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో, పట్టణాల్లో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి, రికార్డులను ప్రక్షాళన చేసి.. 2023 డిసెంబర్ నాటికి భూ హక్కు పత్రాలను అందజేస్తాం. ప్రతి కమతానికి యూనిక్ నంబర్ ► ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటినీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో.. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ఈ సర్వే ద్వారా ఇస్తారు. ప్రతి కమతానికి డిజిటల్‌గా, ఫిజికల్‌గా దాన్ని నిర్ణయించి, క్యూ ఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాపింగ్ చేస్తాం. ► ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా సర్వ హక్కులతో కూడిన భూ హక్కు పత్రాలను ప్రక్షాళన చేసి వారి చేతికి ఇవ్వబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞంలా సాగుతోంది. ► భూ కమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమంలో విభజన జరిగినా.. మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికి పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా.. ► జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నాం. 10,185 మంది గ్రామ సర్వేయర్లు (గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి 13,849 మంది), 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, రూ.1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 80 డ్రోన్లు, 2 వేల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటే జీఎన్ఎస్ఎస్ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ బేస్‌లు అంటే కోర్స్ బేస్‌లు ఏర్పాటు చేశాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులు, 2.47 కోట్ల సర్వే నంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుంది. మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కూడా సర్వే జరుగుతుంది. ► సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన సబ్ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటి కార్యక్రమాలన్నీ గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా మార్పులు తీసుకొస్తున్నాం. ► ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసి, ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్, మ్యుటేషన్ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎల్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. మ్యుటేషన్ సేవలను ఉచితంగా అందిస్తాం. ఇప్పటిదాకా సర్వే జరిగిందిలా.. ► 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17వేలకు పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తయ్యింది. ఈ రోజు (బుధవారం) వరకు 2 వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూ పట్టాల ప్రక్షాళన, మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూ హక్కు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది. ► రీ సర్వే వల్ల ఈ 9 నెలల్లోనే 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గతంలో సంవత్సరానికి 35 వేల సబ్ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్ డివిజన్ జరిగేవి. ఈ లెక్కన ఏటా 21 వేలు మాత్రమే సబ్ డివిజన్లు జరిగే పరిస్థితి నుంచి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 9 నెలల్లోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు పూర్తి చేసుకున్న మెరుగైన స్థితికి వచ్చాం. ఈ ప్రక్రియలో రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్టు అవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒక్కసారి గమనించాలి. మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ► అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున 2 లక్షల 60 వేల మందిని నియమించాం. వలంటీర్లు ప్రతి ఒక్కరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ► 13 నుంచి 26 జిల్లాలు చేశాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం వల్ల జరిగే మంచికన్నా.. మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, పాఠశాలల్లో, హాస్టళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ లైబ్రరీలు, మహిళలకు భద్రత కల్పించేలా ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్లు ఇలా ఎన్నో అమలు చేస్తున్నాం. ► ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటే కన్పించేవారు. పాలకులు, వారితో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టరూ వచ్చేవారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. అయినా ఇచ్ఛాపురం, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు వారికి గుర్తుకు రాలేదు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతాల్లో రూ.765 కోట్లతో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించేలా అడుగులు వేశాడు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో రీసెర్చ్ ఆస్పత్రిని కడుతున్నాం. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నాం. ► ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 295 మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ శాఖ పరంగా గ్రేడ్–3 విలేజ్ సర్వేయర్లను గ్రేడ్–2గా రీ డిజిగ్నేట్ చేయనున్నాం. ► ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతోనే సిక్కోలు ప్రగతి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసింది వైఎస్ కుటుంబమే. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి.. వందేళ్ల నుంచి ఉన్న భూ సంబంధిత సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 23 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు. సీఎం జగన్ వంశధార రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల నిధులిచ్చి, ఉద్దానం ప్రాంతంలో తాగునీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్.. ఒడిశా వెళ్లి అక్కడి సీఎంను కలిశారు. గత 15 ఏళ్లలో ఈ పని ఎవరూ చేయలేదు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు విశాఖ పాలన రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇక్కడకు వచ్చి అదే మాట చెబితే ప్రజలే తగిన సమాధానమిస్తారు. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి ఆనందంగా ఉంది మా గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ హక్కు పత్రాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ మేం ఇలాంటివి చూడలేదు. ఈ సర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. – రౌతు పోలయ్య, సంతలక్ష్మీపురం, పోలాకి మండలం నా చేతికి హక్కు పత్రం నాకు కరగాం పంచాయతీలో 40 సెంట్ల భూమి ఉంది. నోషనల్ ఖాతాలో ఉండిపోవడంతో ఇన్నాళ్లూ పాస్ బుక్ రాలేదు. ఎలాంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గ్రామంలో రీ సర్వే పూర్తయింది. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూమిని నా పేరున మార్చి భూ హక్కు పత్రం ఇచ్చారు. ఇది ఈ రోజు సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. – పాగోటి దమయంతి, కంబకాయ, నరసన్నపేట మండలం వేగంగా రిజిస్ట్రేషన్ నా ఇంటి స్థలాన్ని కరగాం సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాను. ఇతరుల వద్ద కొనుగోలు చేసిన ఈ స్థలం రిజిస్ట్రేషన్ నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించేందుకు ప్రయత్నించాను. అయితే గ్రామ సచివాలయంలో కూడా చేస్తారని తెలియడంతో అక్కడికే వెళ్లి చేయించుకున్నాను. వివరాలన్నీ తెలుసుకుని శ్రమ లేకుండా, అదనపు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఈ రోజు తీసుకున్నాను. ఆనందంగా ఉంది. – వెలమల శ్రీదేవి, నారాయణవలస, నరసన్నపేట మండలం -
అలాంటి వాళ్లను చంద్రబాబు అంటాం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్ కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్ తెలిపారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తాం. ప్రతి కమతానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. కుప్పం సహా 25 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలుంటే ప్రస్తుతం మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. రైతన్నల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ దుష్టచతుష్టయాన్ని ఏమనాలి? తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటాం. ఎన్నికలపుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారు. పరాయి స్త్రీమీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటాం. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కుని, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్‌ను మరి ఏమనాలి? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతాం: సీఎం జగన్
12:56 PM పత్రాల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్ సభలో ప్రసంగం అనంతరం.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ►ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్.. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. 12:50 PM ►తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్ ఎన్టీఆర్ జగన్ అంటారు ►కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారు ►ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు ►అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమన్నాలి? 12:32 PM ►అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి నెంబర్ ఇస్తాం: సీఎం జగన్ ►హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం ►సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు ►ఆ పరిస్థితులు మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం ►భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతాం 12:25 PM ►ఆగస్ట్ 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి: సీఎం జగన్ ►వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి ►80 శాతం నుంచి 90 శాతం సివిల్ కేసులు భూములకు సంబంధించినవే ►రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు ►ఎలాంటి సివిల్ వివాదాలు తావుండకూడదని అడుగులు ముందుకేస్తున్నాం. 12:19 PM ►రెండేళ్ల కిందట గొప్ప కార్యక్రమం ప్రారంభించాం: సీఎం జగన్ ►2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ►7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు ►ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే ►మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు 12:14 PM రైతులందరికీ భూ హక్కు పత్రాలు: సీఎం జగన్ భూ సర్వే రికార్డుల ప్రక్షాళన రెండేళ్ల కిందట మొదలైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలు అందిస్తామన్నారు. 11:57 AM రైతులకు ఎంతో మేలు: ధర్మాన ప్రసాదరావు వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. జిల్లాకు చంద్రబాబు ఒక్క ప్రయోజనకరమైన పనిచేయలేదని మంత్రి ధర్మాన అన్నారు. 11:20 AM స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం ► జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం.. లబ్ధిదారులు, సర్వేయర్లతో ముచ్చటించారు. కాసేపట్లో తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు. 11:05 AM ►సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను సీఎం జగన్ పరిశీలించారు. అధికారులతో వివరాలడిగి తెలుసుకున్నారు. 10:35 AM ►శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట చేరుకున్న సీఎం జగన్ 10:05 AM ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా నరసన్నపేట బయలుదేరిన సీఎం ►విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ 09:10 AM ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►శ్రీకాకుళం పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం 08:43 AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బయల్దేరారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేయనుంది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ జారీ చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ తరహాలో ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నెంబర్), క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. ఉచితంగా.. రికార్డు వేగంతో తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం పట్టే సమయం, తిప్పలు అందరికీ తెలిసిందే. అయితే రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్ డివిజన్ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.600 చెల్లించాలి. మ్యుటేషన్ కోసం అయితే రూ.100 కట్టాలి. ఈ లెక్కన 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను రైతులు సొంతంగా చేసుకోవాలంటే రూ.37.57 కోట్లు ఖర్చవుతుంది. రీసర్వే ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈ పనుల్ని చేపట్టి రైతులకు డబ్బులు మిగల్చడంతోపాటు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించింది. 2 వేల గ్రామాల్లో రీ సర్వేను కేవలం 8–9 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డు. మరో 15 రోజుల్లో ఈ గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు. భూహక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్ష్యం. ప్రతి భూమికీ జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు ఏర్పరచడం, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో నవ శకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్ డెస్క్ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి 12.55 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడ బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
జూన్ నాటికి పట్టణ సర్వే పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింట పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల పరిధిలో సర్వే పనుల్ని జూన్ నాటికి పూర్తిచేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 123 పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన ఈ సర్వేని పటిష్టంగా చేయాలని సూచించారు. రూ.120 కోట్లతో చేపట్టిన ఈ సర్వే వల్ల కోటిన్నరమంది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన సర్వే పనుల ప్రగతిపై ఆయన బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరే విధంగా వారి భూములు, స్థలాలు, ఆస్తులను పటిష్టంగా సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేసి భూహక్కు పత్రాలు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పథకాన్ని చేపట్టలేదని, గత వందేళ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని సీఎం తలపెట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే వార్డు సచివాలయాల నుంచి అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, డ్రోన్ సర్వేని కూడా ప్రారంభించాలని చెప్పారు. ఈ పథకం సమగ్ర సమాచారంతో ఎస్వోపీ తయారు చేయాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన సాంకేతిక పరికరాలైన రోవర్స్, ట్యాబ్, ప్రింటర్స్ వంటివాటిని తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. తద్వారా పథకం పురోగతిని సమీక్షించడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి యూఎల్బీల్లో డ్రోన్లతో మ్యాపింగ్ సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సర్వే పనులు చేపడుతున్నామని మంత్రికి చెప్పారు. రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం రీజియన్లుగా డ్రోన్ ఫ్లయింగ్ షెడ్యూల్ రూపొందించుకున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, అనంతపురం, గుంటూరు రీజియన్లలో గురువారం మ్యాపింగ్ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. అర్బన్ సర్వేపై ఇప్పటికే 20 వేలమంది వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, అన్ని యూఎల్బీల్లో సర్వేకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇప్పటికే సీడీఎంఏలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. దాదాపు 40 లక్షల ఆస్తులను సర్వేచేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించారు. ఈ సమావేశంలో అర్బన్ సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు, డీటీసీపీ విద్యుల్లత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
1,940 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూరక్ష, శాశ్వత భూహక్కు పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే 1,940 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 17 లక్షల 25 వేల 690 ఎకరాలను పూర్తిగా కొలిచి సర్వే పూర్తిచేశారు. ఆ గ్రామాల్లో సర్వే పూర్తికి సంబంధించిన నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 351 గ్రామాల్లో రీ సర్వే పూర్తిచేశారు. విజయనగరం జిల్లాలో 181, అనకాపల్లిలో 143, చిత్తూరులో 125, కాకినాడలో 121, నెల్లూరు జిల్లాలో 118 గ్రామాల్లో భూముల కొలత పూర్తయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా రెండుగ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి చేయగలిగారు. ఆ జిల్లాలో వ్యవసాయ భూములు కొండలు, గుట్టల్లో ఉండడం, మొబైల్ సిగ్నల్స్ అందకపోవడంతో డ్రోన్ల ద్వారా సర్వేచేయడం ఇబ్బందికరంగా మారింది. అందుకే అక్కడ త్వరలో డీజీపీఎస్ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఐదుగ్రామాలు, నంద్యాల జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 16 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. ఇక్కడా డీజీపీఎస్, ఏరియల్ సర్వేకి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో 1,329 గ్రామాల్లో పూర్తికానున్న సర్వే త్వరలో మరో 1,329 గ్రామాల్లో రీ సర్వే పూర్తికానుంది. కొద్దిరోజుల్లోనే ఈ గ్రామాలకు సంబంధించిన 13 నంబర్ నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. రీ సర్వేకి సంబంధించి రైతులు, భూ యజమానుల నుంచి 18,387 వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 18,277 వినతులను మొబైల్ మేజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. ఇప్పటివరకు 6,533 గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తయింది. అందులో 3,258 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి చేసిన డ్రోన్ ఛాయాచిత్రాలను సర్వే బృందాలకు అందించారు. వాటి ఆధారంగా 2,273 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్) పూర్తయింది. 2,022 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ (హద్దుల నిర్దారణ) పూర్తిచేశారు. విభాగాల వారీగా రీ సర్వేను అనుకున్న దానికంటె వేగంగా నిర్వహిస్తున్నట్లు సర్వే, సెటిల్మెంట్ అధికారులు చెబుతున్నారు. -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు పథకం కింద వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో రికార్డుల స్వచ్ఛీకరణ అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయితేనే ఆయా గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రీ సర్వే ప్రారంభానికి ముందే గ్రామాల్లో భూ రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌ల్యాండ్ అడంగల్స్ను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడటం, అడంగల్‌లో పట్టాదారుని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం వంటి పనులు పక్కాగా చేయాలి. ఈ పనిని కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాల్లోనే రీ సర్వేలో మొదట నిర్వహించే డ్రోన్ ఫ్లైయింగ్‌ను సర్వే బృందాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేయిస్తున్నారు. అనంతపురంలో నూరు శాతం పూర్తి అనంతపురం జిల్లాలోని మొత్తం 504 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 315 గ్రామాలకు గాను.. 314 గ్రామాల్లో స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 846 గ్రామాలకు గాను 835 గ్రామాల్లోను, సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను 455 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో స్వచ్ఛీకరణ నెమ్మదిగా జరుగుతుండటంతో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రీ సర్వే షెడ్యూల్‌కు అనుగుణంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించారు. దాని ప్రకారం ఆరు రకాల సర్క్యులర్ ప్రకారం రికార్డులను అప్డేట్ చేసే పని వేగంగా జరుగుతోంది. తద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సర్వే బృందాలు వడివడిగా నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా సమీక్ష స్వచ్ఛీకరణ ఎలా చేయాలనే దానిపై రెవెన్యూ శాఖ ఆరు సర్క్యులర్లు జారీ చేసింది. ఒక్కో సర్క్యులర్ ప్రకారం ఒక్కో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం స్వచ్ఛీకరణ ఎంత మేరకు జరిగిందనే దానిపై ప్రతి నెలా కలెక్టర్లు, జేసీలతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఆరు రకాల సర్క్యులర్ల ప్రకారం పని జరిగిందో పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. -
ఒకటి నుంచి పట్టణ సర్వే పనులు
సాక్షి, అమరావతి: పట్టణ ఆస్తుల సమగ్ర భూ హక్కు సర్వే పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వేగవంతం చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆయా నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలోని ఆస్తుల హక్కుదారులకు నోటీసులు జారీచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతమున్న రికార్డుల ప్రకారం ఆస్తులు, వాటి యజమానుల గుర్తింపు ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. మొత్తం 123 స్థానిక సంస్థల్లో 38 లక్షల ఆస్తులున్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పట్టణాల్లోని ఆస్తుల సర్వే ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. ఇప్పటికే 20 వేల మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ప్రతి వార్డుకి ఐదుగురు సర్వే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. 648 గ్రామాల రికార్డులు పరిశీలన పట్టణాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలతోపాటు ఒకే స్థలం లేదా ఇల్లు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటి సమస్యలు లేకుండా ఆయా ఆస్తిదారులకు నమ్మకమైన గుర్తింపు పత్రం ఇచ్చేందుకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ఆస్తుల సర్వేకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ పూర్తయినట్లయితే వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నట్లుగానే. పట్టణాల్లోని స్థలాలు, ఇళ్లకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ఆస్తులకు సమగ్రమైన రికార్డులు సిద్ధమవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాలు ఉండగా, వాటిల్లో వందలాది గ్రామాలు చేరాయి. దాంతో పట్టణాల్లో విలీనమైన 648 గ్రామాల రికార్డులు, ప్రస్తుతమున్న రికార్డులతో సరిపోల్చి ఏ ఆస్తి ఎవరి పేరిట నమోదైందో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేతో పాటు రెవెన్యూ రికార్డులు, ప్లానింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ కమిషనరేట్‌లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేశారు. ఇందులో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఇదే తరహాలో 123 మున్సిపాలిటీల్లోనూ పీఎంయూ విభాగాలను ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. నవంబర్ ఒకటి నుంచి ఆస్తుల యజమానులకు నోటీసులు జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. యజమానుల నుంచి అభ్యంతరాలను సైతం తీసుకుని, వాటిని పరిష్కరించి మొత్తం సర్వే పనులను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నట్లు ఆయన వివరించారు. రికార్డుల్లో 38 లక్షల ఆస్తులు ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 31 లక్షల ఆస్తులు, ఏడు లక్షల ఖాళీ స్థలాలున్నట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. అయితే, సర్వే ప్రక్రియ మొదలైతే రికార్డుల్లోకి రాని ఆస్తులు మరో 10 శాతం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. వేటికవి ప్రత్యేకంగా గుర్తించి డేటా తయారుచేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాలు పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సమగ్రంగా సర్వే ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి సరిహద్దుల సర్వేను పూర్తిచేశామని, సర్వేలో పాల్గొనే సిబ్బందికి మూడంచెల్లో మొత్తం 20 వేల మందికి శిక్షణ ఇచ్చామని రీ సర్వే ప్రత్యేకాధికారి బి.సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల రికార్డులను సమగ్రంగా ఆన్లైన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
క్యూఆర్ కోడ్‌లో భూమి
సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు. భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు. రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి. 70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్వర్క్ జీపీఎస్ కార్స్ నెట్వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు. నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది. సర్వేతో ఇవీ ప్రయోజనాలు.. ► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు ► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు ► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు ► పకడ్బందీగా హద్దులు, కొలతలు ► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది ► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు ► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. ► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది. సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
6 జిల్లాల్లో జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్
సాక్షి, అమరావతి: భూముల రీసర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం జగనన్న భూరక్ష సర్వే ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆరు జిల్లాల్లో 2,225 బృందాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ జిల్లాల పరిధిలో భూమి ఎక్కువ ఉంది. సర్వేకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండడంతో ఈ బృందాలను నియమించారు. అవసరం మేరకు ఈ జిల్లాల్లోని కొందరిని డిప్యూటేషన్‌పై పక్క జిల్లాల బృందాల్లో నియమించారు. ప్రతి బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏ ఉంటారు. ఈ బృందం ప్రతిరోజూ 20 నుంచి 30 ఎకరాల్లో క్షేత్ర స్థాయి సర్వే చేయాలి. రోజుకు 50 వేల ఎకరాల సర్వే ఈ బృందాల ద్వారానే రోజుకు 50 వేల ఎకరాల సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు ఏ జిల్లాల పరిధిలోని ఉద్యోగులతో ఆ జిల్లాల్లోనే సర్వే చేయించారు. సర్వే జరిగే గ్రామంలో 20 నుంచి 30 మంది సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏతో కూడిన బృందాన్ని వినియోగించారు. గ్రామంలో క్షేత్ర స్థాయి సర్వే పూర్తయ్యాక మరో గ్రామానికి ఈ బృందాలను పంపుతున్నారు. పక్క మండలాల్లోని సర్వేయర్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా రీసర్వేలో నిమగ్నమయ్యాయి. ప్రధానంగా గ్రామ సర్వేయర్లే కీలకం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 11,118 గ్రామ సర్వేయర్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. రీసర్వేలో వీరే అత్యంత కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారు లేకపోతే రీసర్వే పట్టాలెక్కడం కూడా సాధ్యమయ్యే పని కాదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్రామానికి ఒక సర్వేయర్ ఉండాలని ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వీరిని నియమించింది. ఈ గ్రామ సర్వేయర్లే వైఎస్సార్ జగనన్న భూహక్కు, భూరక్ష పథకానికి వెన్నెముకలా నిలబడ్డారు. వారితోనే వేల బృందాలను నియమించి రీసర్వే చేయిస్తున్నారు. -
రీసర్వేలో మరో మైలురాయి.. వెయ్యి గ్రామాల్లో భూములకు హద్దులు
సాక్షి, అమరావతి: భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేపట్టిన జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో ప్రభుత్వం మరో మైలురాయి అధిగమించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారానికి 1,000 గ్రామాల్లో రీసర్వే విజయవంతంగా ముగించి.. దీనికి సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల 509 ఎకరాలను రీసర్వేలో కొలిచి కొత్త సరిహద్దులు నిర్ణయించారు. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేట్ ఏజెన్సీలు డ్రోన్ సర్వే చేసి ఇచ్చిన చిత్రాలు (ఓఆర్ఐ), భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే పూర్తి చేశారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వచ్చినప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్లతో మళ్లీ సర్వే చేశారు. రైతుల ఆమోదంతో సరిహద్దులు నిర్ధారణ పూర్తయ్యాక పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారవుతున్నాయి. అత్యధికం శ్రీకాకుళం.. అత్యల్పం అల్లూరి జిల్లా జిల్లాల వారీగా గ్రామాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 193 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 89, వైఎస్సార్ జిల్లాలో 72, నెల్లూరు జిల్లాలో 67, తిరుపతి జిల్లాలో 62 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. విస్తీర్ణ పరంగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,04,018 ఎకరాలను (58 గ్రామాలు) కొలిచి సర్వే పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 89,475 ఎకరాలు (28 గ్రామాలు), నెల్లూరు జిల్లాలో 78,102 ఎకరాలు (67 గ్రామాలు) కొలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 2 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. గుంటూరు జిల్లాలో 5 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామాల్లో కొత్త రికార్డులు తయారయ్యాయి. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం– భూకమతాల మ్యాప్), ఆర్ఎస్ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. కొత్త హద్దులు, తాజా భూయజమానుల వివరాలతో ఈ రికార్డులు రూపొందాయి. రీసర్వే పూర్తయిన కొత్త భూముల రికార్డులు అందుబాటులోకి వచ్చిన గ్రామాల్లో ఇకపై ఎలాంటి భూసంబంధిత పనులకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. భూ యజమానులు ఎక్కడ నుంచైనా రికార్డులను సరిచూసుకోవచ్చు. భూ యజమాని అనుమతి లేకుండా, అతనికి తెలియకుండా భూమి రికార్డులలో ఎలాంటి మార్పు చేయలేని విధంగా భూ సమాచార వ్యవస్థను రీసర్వే ద్వారా తయారు చేస్తున్నారు. రీసర్వే వేగంగా జరుగుతోంది రాష్ట్రంలో భూముల రీసర్వే వేగం పుంజుకుంది. సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. మొదటి దశలో 5,300 గ్రామాలకు 4,600 గ్రామాల్లో రీసర్వేలో మొదట చేపట్టే డ్రోన్ ఫ్లైయింగ్ (డ్రోన్లతో కొలత) పూర్తయింది. సెప్టెంబర్ నాటికి మొదటి దశ అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తవుతుంది. వర్షాలు తగ్గాక ఇంకా వేగంగా సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – సిద్ధార్థ్ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
సమర్థంగా పట్టణ భూ రీ సర్వే
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారని, అందులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం ఒకటని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వందేళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ బృహత్తర సర్వేను అధికారులు సమర్థంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర సిబ్బందికి పట్టణ భూ రీ సర్వే, శాశ్వత హక్కుపై అవగాహన సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించారు. డీటీసీపీ విద్యుల్లత, సీసీఎల్ఏ అదనపు కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఈ సర్వే ద్వారా ఎంతో కాలంగా ఉన్న భూ, ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఎవరి ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో పక్కాగా తెలుసుకోవడంతోపాటు హక్కుపత్రం కూడా పొందుతారని తెలిపారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లో ఒకటి ఉంటే.. వాస్తవంగా మరొకటి ఉంటుందని, ఒకరి స్థలం మరొకరి పేరుతో ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయన్నారు. రీ సర్వే తర్వాత ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లతో పట్టణ భూ సర్వే ప్రాజెక్టు చేపట్టిందని, ఈ చారిత్రక ఘట్టంలో మున్సిపల్ అధికారులు భాగమవ్వాలని పిలుపునిచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు పట్టణ భూ సర్వేకు పనిచేయాలన్నారు. మొదట సమర్థులైన వారిని మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, వారికి సామర్లకోటలోని ఏపీ సర్వే అకాడమీలో శిక్షణనిస్తామని చెప్పారు. వీరి ద్వారా యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి శిక్షణనిచ్చి పని ప్రారంభించాలని సూచించారు. సచివాలయాల సిబ్బంది, ప్రజలను భాగస్వాములను చేయాలి నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, ఆ ఆస్తుల యాజమాన్యాలపై దృష్టి పెట్టలేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. టాక్స్ అసెస్మెంట్ నంబర్లున్న ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో అధికారులకు కూడా అవగాహన లేదన్నారు. తొలుత స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని, ఇందులో వార్డు సచివాలయాల సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆస్తికి సంబంధించి అన్ని అంశాలపై సర్వే చేయాలని తెలిపారు. అనంతరం డ్రోన్ ఆధారంగా ఆస్తులను సర్వే చేయడంపై అవగాహన కల్పించారు. -
పట్టణాల్లోనూ భూసర్వే
సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను సర్వే చేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన పత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్షా పథకంలో భాగంగా పట్టణాల్లో సర్వేకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే చేపట్టిన ప్రభుత్వం.. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలకు వారి ఆస్తికి సంబంధించి కచ్చితమైన సమాచారంతో ధృవీకరణ పత్రం అందించనుంది. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్టుగా రెండు రెవెన్యూ వార్డుల్లో చేపట్టిన సర్వే విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అమలు చేయనుంది. పట్టణ ప్రాంత భూములకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఈ నెల 15 తర్వాత సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది జూలైకి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే ముందే పూర్తి చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. అధికారికంగా 37 లక్షల ఆస్తుల గుర్తింపు సరిహద్దులు, సర్వే నంబర్లతో కూడిన రికార్డులు పక్కాగా ఉండడంతో పంచాయతీల్లో సర్వేలో పెద్దగా ఆటంకాలు ఎదురవలేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రక్రియ సవాలుగానే మారనుంది. ముఖ్యంగా ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు వంటి వివాదాలు చాలానే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పట్టణ ప్రాంత ప్రజలు ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ ఆ భవనం ఏ సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్ను చెల్లించని వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 37 లక్షల ఆస్తులు ఉన్నట్టు మున్సిపల్ శాఖ గుర్తించింది. సర్వేలో ఇవి మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. ఇలా వేటికవి ప్రత్యేకంగా గుర్తిస్తారు. గత ప్రభుత్వాలు పురపాల సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్ సమయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ సమస్యలు లేకుండా ఎవరి ఆస్తిపై వారికి అన్ని వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. దీనిద్వారా సర్వే నంబర్లు, పట్టా నంబర్లు, అధికారిక సరిహద్దులు వంటి సమగ్ర వివరాలతో హక్కుదారులకు పత్రాలు అందుతాయి. నేడు శిక్షణ ఈ సర్వే ప్రక్రియ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించే ఈ శిక్షణలో డ్రోన్ ఉపయోగించి ఆస్తుల కొలతలు తీసుకోవడం, రికార్డుల ప్రకారం రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, ఆయా సర్వే నంబర్లుపై తర్ఫీదునిస్తారు. అనంతరం యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు. సర్వేతో పట్టణ ప్రజలకు ఎంతో మేలు పట్టణ భూ సర్వేతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి దాకా పట్టణాల్లో ఆస్తులకు పన్ను చెల్లిస్తున్న డేటా ఉంది. సర్వే నంబర్ల డేటా కూడా ఉంది. అయితే ఏ సర్వే నంబర్లో ఏ ఆస్తులు.. ఎవరి ఆస్తులు ఉన్నాయో లేదు. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి డేటాను రూపొందిస్తాం. అన్ని సరిహద్దులను వివరిస్తూ సర్వే నంబర్‌తో సహా హక్కుదారుకు సర్టిఫికెట్ ఇస్తాం. ఇందుకోసం మున్సిల్ చట్టంలో సవరణలు చేస్తాం. సర్వేలో అనుభం ఉన్న రెవెన్యూ, సీసీఎల్ఏ, ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం గతంలో ఎప్పుడూ చేపట్టలేదు. – ప్రవీణ్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్