ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి | - | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి

Published Thu, Nov 21 2024 12:12 AM | Last Updated on Thu, Nov 21 2024 12:12 AM

ఆర్గా

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి

● ఏటా ఉమ్మడి జిల్లా నుంచి తరలింపు ● చెన్నయ్‌ మీదుగా జర్మనీకి.. బట్టలకు వినియోగం ● క్వింటాల్‌కు రూ.500 అదనం

జన్నారం: పత్తి పంట చేతికి రావాలంటే రసాయన ఎరువులు వాడాల్సిందే. మొలక నుంచి మొదలు పంట చేతికొచ్చేదాకా చీడపీడల నుంచి రక్షణకు వేల రూపాయలు ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేస్తారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల రైతులు పూర్తిగా సేంద్రియ ఎరువులతో పత్తి పండిస్తున్నారు. దిగుబడి వచ్చిన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చేత్నా ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ ప్రొడ్యూసర్‌ సంస్థ రైతులు, జర్మనీలోని డిబెల్ల టెక్స్‌టైల్‌ కంపెనీ ప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు మండలాల్లో సుమారు 5,500మందికి పైగా రైతులు ఆర్గానిక్‌ పత్తి పంట పండిస్తున్నారని చేత్నా ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ ప్రొడ్యూసర్‌ సంస్థ సీఈవో నందకుమార్‌ తెలిపారు.

అ‘ధనం’

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూర్‌, కెరమెరి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌–యూ, జైనూర్‌, ఉట్నూర్‌ మండలాల్లోని 170 గ్రామాల్లో ఆర్గానిక్‌ పత్తి పండిస్తున్నారు. ఈ ఏడాది ఆయా గ్రామాల్లోని 5,500 మంది రైతులు 7,900 ఎకరాల్లో సాగు చేసి 55,300 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పత్తికి మార్కెట్‌ ధర కన్నా పది శాతం ఎక్కువ ధర చెల్లిస్తారు. ఆర్గానిక్‌ పద్ధతిలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని గ్రహించి ఈ ధర చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,500 ఉండగా.. సంస్థ రూ.8వేలు చెల్లిస్తోంది. దీంతోపాటు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన సేంద్రియ ఎరువులకు సహకారం అందిస్తున్నారు.

చెన్నయ్‌ మీదుగా జర్మనీకి సరఫరా..

పత్తి పంట చేతికి వచ్చాక పత్తిని తీసే విధానంపై అవగాహన కల్పించడానికి జర్మనీ దేశస్తులు ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. పత్తిని తీశాక ఇంద్రవెల్లి మండలంలో జిన్నింగ్‌ చేసి అక్కడి నుంచి చెన్నయ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సదన్‌ ఫాస్ట్‌ ఇండియా కంపెనీ నుంచి జర్మనీ దేశానికి తరలిస్తారు. ఈ పత్తితో జర్మనీలో టవల్స్‌, బెడ్‌షీట్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రతీ సంవత్సరం పత్తి పండించి ఎగుమతి చేస్తుండగా.. ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందుగా 800 మందితో పంట పండించగా.. ప్రస్తుతం ఆ రైతులు సంఖ్య 5,500మందికి చేరింది.

సేవా కార్యక్రమాలు

జర్మనీ, నెదర్లాండ్‌ దేశాలకు చెందిన ప్రతినిధులు రైతులతో ఆర్గానిక్‌ పంట పండించడమే కాకుండా వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. సిర్పూర్‌ మండలంలో కంప్యూటర్‌ ల్యాబ్‌, సిర్పూర్‌–యూ మండలం రాఘవాపూర్‌లో విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.

జన్నారం మండలంలో ప్రోత్సాహం

రైతులు ముందుకు వస్తే జన్నారం మండలంలో కూడా ఆర్గానిక్‌ పత్తి పంట పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ మండలంలోని గిరిజన గ్రామాలను ఎంచుకుని ఆర్గానిక్‌ పంటపై అవగాహన కల్పించి రైతులు ముందుకు వస్తే వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.

రైతులతో కలిసి పోతున్నాం

ప్రతీ సంవత్సరం పత్తి పంటను పరిశీలించేందుకు ఇక్కడికి వస్తుంటాం. ఇది రెండోసారి రావడం. గ్రామానికి వెళ్తే గ్రామస్తులు మమ్ములను గౌరవంగా చూసుకుంటున్నారు. వారితో కలిసి మేము పత్తి చేలకు వెళ్తాం. వారితో కలిసిపోతున్నాం.

– మిచీల్‌ ఎలెన్‌కాంప్‌, నెదర్లాండ్‌

ఇష్టంగా కొంటారు

జర్మనీ దేశంలో ఆర్గానిక్‌ పత్తితో చేసిన బట్టను ఇష్టంగా కొంటారు. అందుకే ఈ ప్రాంతంలో రైతులకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చాం. రైతులు ముందుకు వచ్చి ఆర్గానిక్‌ పత్తి పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో మరింత ఆర్గానిక్‌ పత్తి సాగు అయ్యేలా చూస్తున్నాం. రైతులకు లాభ సాటిగా కూడా ఉంటోంది. – రాల్ఫ్‌

హెల్మన్‌, డిబెల్ల కంపెనీ ప్రతినిధి, జర్మనీ

చెన్నయ్‌ నుంచి తరలిస్తాం

ముందుగా ఇక్కడి నుంచి పత్తిని ఏరి జిన్నింగ్‌ చేయిస్తాం. తర్వాత చెన్నయ్‌లోని కంపెనీకి తరలిస్తాం. అక్కడ బట్ట తయారు చేసి దానిని జర్మనీకి పంపుతాం. జర్మనీలో కంపెనీ ద్వారా టవల్స్‌, బెడ్‌ షీట్లు, కాటన్‌ వంటివి తయారు చేసి విక్రయిస్తారు. జర్మనీ ప్రజలు ఆర్గానిక్‌ పత్తితో తయారు చేసిన వాటిని ఇష్టపడుతారు. – రంగరాజన్‌,

సదన్‌ఫాస్ట్‌ ఇండియా అధికారి, చెన్నయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి1
1/3

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి2
2/3

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి3
3/3

ఆర్గానిక్‌ పత్తి.. విదేశాలకు ఎగుమతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement