‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెబాట
● మూడు రోజులపాటు రిలే దీక్షలు ● ప్రభుత్వం నుంచి స్పందన కరువు ● నేటి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యాశాఖలో కీలకంగా వ్య వహరిస్తున్న సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. ఈనెల 6 నుంచి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నా రు. ఎమ్మార్సీ, సీఆర్‌సీ స్థాయిల్లో పనులకు అటంకం ఏర్పడనుంది. అలాగే కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు.
క్రమబద్ధీకరణ కోసం..
సమగ్ర శిక్షా పరిధిలో క్లస్టర్ స్థాయి, జిల్లా స్థాయితో పాటు కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో రాష్ట్రవ్యాప్తంగా 19వేల మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2017 మంది సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పదేళ్లకు పైగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధస్థాయిల్లో వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడంతో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 6 నుంచి మూడు రోజులపాటు రిలే దీక్షలు చేపట్టారు.
సేవలకు ఆటంకం
సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి సమ్మె చేపడుతుండటంతో విద్యాశాఖలో పలు సేవలు నిలిచిపోనున్నాయి. డీపీవో స్టాఫ్, అకౌంటెంట్స్, ఏఎన్‌ఎం, సీఆర్‌టీ, పీజీ సీఆర్‌టీ, స్పెషల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీ, ఎంఐఎస్‌సీసీవో, పార్ట్‌టైం టీచర్లుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్, భవిత కేంద్రాల్లో బోధన నిలిచి విద్యార్థుల చదువుపై ప్రభావం పడనుంది. డీఈవో, ఎంఈవో కార్యాలయాలు, వృత్తి విద్యా ఇన్‌స్ట్రక్టర్లు విధులకు దూరంగా ఉండనుండటంతో ఆన్‌లైన్ పనులు నిలిచిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే సమ్మె నోటీసులు అందించారు.
‘సమగ్ర’ ఉద్యోగుల వివరాలు
జిల్లా ఉద్యోగులు
ఆదిలాబాద్ 607
మంచిర్యాల 513
కుమురంభీం 473
నిర్మల్ 424
పోరాటం ఆగదు
సమ్మె నోటీసు అందించి 20 రోజులు గడుస్తోంది. క్రమబద్ధీకరణపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వరకు పోరాటం ఆగదు.
– పడాల రవీందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment