● కోటాకు అదనంగా కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనల
సాక్షి,ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నా ఫెడ్‌కు అనుబంధంగా రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ సో యా కొనుగోళ్లు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అయితే రెండు కేంద్రాలను మార్క్‌ఫెడ్ అక్కడ పంట దిగుబడులు పూర్తయ్యాయని కొనుగోళ్లను నిలిపివేసింది. ఇదిలా ఉంటే జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా అదనంగా రైతుల నుంచి పంట కొనుగోలు కోసం అనుమతి ఇవ్వాలని అదనపు కలెక్టర్ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి అనుమతి వస్తే మరింత వేగంగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో అక్టోబర్ 7న సోయా కొనుగోళ్లు మొదలయ్యాయి. మొత్తంగా 9 సెంటర్లు ఏర్పాటు చేయగా, అందులో ఆదిలాబాద్‌లో మొదట ప్రారంభించారు. ఆ తర్వాత తాంసి, బేల, జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండలో షురూ చేశారు. కేంద్రం సోయా క్వింటాలుకు మద్దతు ధర రూ.4,892 ఇస్తుంది. అయితే ప్రైవేట్‌లో రూ.4,100లోపే ఉండడంతో రైతులు ప్రభుత్వరంగ సంస్థకే పంటను విక్రయించేందుకు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రెండు సెంటర్లను మార్క్‌ఫెడ్ మూసివేసింది. మరోవైపులక్ష్యం పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చిన పక్షంలో మిగిలిన సెంటర్లలో మార్క్‌ఫెడ్ సోయాను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమేరకు సోయా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందని మార్క్‌ఫెడ్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
దిగుబడి అధికం..
జిల్లాలో 24,301 మంది రైతులు 65,306 ఎకరాల్లో సోయా సాగు చేశారు. 5,00,920 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 2లక్షల 70వేల క్వింటాళ్లను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే అదనపు కొనుగోళ్లకు సంబంధించి ప్రతిపాదనలు వెళ్లినప్పటికి వాటికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే మార్క్‌ఫెడ్ మిగతా కొనుగోళ్లు వేగిరం పెంచే అవకాశం ఉంది. తద్వారా జిల్లా రైతులకు మద్దతు ధర లభించే అవకాశాలు ఉన్నాయి.
అదనంగా 60వేల క్వింటాళ్ల కోసం..
జిల్లాలో రెండు సెంటర్లు మినహా ప్రారంభించిన మిగతా అన్ని సెంటర్లలోనూ సోయా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అదనంగా 60వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు జిల్లా ఉన్నతాధికారుల ద్వారా పంపాం. దానికి అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంటకు సంబంధించి వేగిరంగా రైతులకు డబ్బులు అందేలా చూస్తున్నాం.
– ప్రవీణ్‌రెడ్డి, డీఎం మార్క్‌ఫెడ్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment