మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో సంచరిస్తూ కెమెరాకు చిక్కిన పులి (ఫైల్)
ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం
కోర్‌కు వెళ్లలేక మధ్యలో సమస్యలు
నెల రోజులుగా టైగర్ గాండ్రింపులు
మనుషులు, పశువులపైనా దాడులు
ఆందోళనలో అటవీ సమీప ప్రజలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులుల సంచారంతో అటవీ సమీప ప్రాంతాల్లో భయం తొలగడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా పెద్దపులుల సంచారం, దాడులు చేయడం తెలిసిందే. ఇటీవల కాగజ్‌నగర్ మండలం గన్నారానికి చెందిన ఓ యువతిపై దాడి చేసి చంపేసింది. మరుసటి రోజే సిర్పూర్ (టీ) పరిధి దుబ్బగూడలో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. ప్రస్తుతం ఈ పులి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సంచరిస్తోంది. తాజాగా సిర్పూర్ (టీ) మండలం హుడ్కిలి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న దూడపై దాడి చేసింది. అంతకుముందు చీలపల్లి అటవీ ప్రాంతంలో సంచరించింది. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నా రు. ఈ పులి కాకుండా ఇంకా వేర్వేరు చోట్ల సంచరిస్తున్న పులులు అటవీ అధికారులు, స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆవాసాలకు వెతుకులాట
ఏటా శీతాకాలంలోనే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లా అడవుల వైపు ఆవాసం, తోడు కోసం పులులు పదుల సంఖ్యలో వస్తున్నాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దు గుండా ఉమ్మ డి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే కవ్వాల్ కోర్ ఏరియాలో పులులకు రక్షిత ఆవాసాలున్నాయి. కానీ, పులులు అక్కడి వరకు వెళ్లకుండానే తోడు, ఆవాసాలను వెతుక్కుంటున్నాయి. ఇక్కడి పరిస్థితులు అనుకూలించకపోతే కొన్ని రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. గత నెలలో ఓ మగపులి నిర్మల్– ఆదిలాబాద్ రహదారి మహబూబాబాద్ ఘాట్‌లో స్థానికులకు కనిపించింది. బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లి, సారంగపూర్, మామడ, కడెం, ఉట్నూరు, పెంబి, ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి అటవీ ప్రాంతాల్లో కలియతిరిగింది. పశువులపై దాడి చేసింది. మరో పులి కెరమెరి, జోడేఘాట్, నార్నూరు మండలం గుంజాలలో సంచరించింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ, మందమర్రి మండలం మేడారం అటవీ ప్రాంతంలోనూ ఓ పులి సంచరించింది.
వీడని భయం
పులి ఇద్దరిపై దాడి చేయడంతో స్థానికుల్లో ఆందో ళన నెలకొంది. ఎక్కడ ఏ పులి సంచరిస్తుందోననే భయం వారిలో నెలకొంది. వాంకిడి మండల పరిధిలో ఓ రైతు పులిని చూశానంటూ ఆందోళనకు గురయ్యాడు. భీమిని మండలం చెన్నాపూర్‌లో పులి సంచరించినట్లు ప్రచారం జరిగింది. దీంతో పత్తి చేలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొన్నిచోట్ల చిరుతపులిని కూడా పులిగా భావిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. భవిష్యత్‌లో ఈ పులుల రాక మరింత పెరగనుంది. అందుకు ఇక్కడి పరిస్థితులు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
అటవీ అధికారుల ట్రాకింగ్
కవ్వాల్ కోర్ ఏరియాలో కాకుండా వెలుపల తిరుగుతూ అధికారులు, స్థానికుల్ని బెంబేలిస్తున్న పులులను అటవీ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తున్నారు. అయితే పులి గమనాన్ని కచ్చితంగా గుర్తించలేకపోవడంతో దాడులు జరుగుతున్నాయి. ఇక తమవైపు పులులు వస్తున్నాయని రైతులు, స్థానికులు ఆందోళనతోనూ పులి జీవనానికి ఆటంకం కలుగుతోందని అధికారులు అంటున్నారు. చాలాచోట్ల పులి ఆవాసాలకు అనుకూలత ఉన్నా స్థానికంగా ఉన్న పరిస్థితులతో వాటి సంచారానికి సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులూ పులి సంచరించే ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే కాగజ్‌నగర్‌ను శాటిలైట్ కోర్ ఏరియాగా గుర్తించాలంటూ వన్యప్రాణుల బోర్డులో ఆమోదం తెలిపింది తెలిసిందే. అయితే పులి సంరక్షణ పేరుతో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కోర్ ఏరియాకు పులి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ జన్నారం మండలం కవ్వాల్ వరకు చేరడం లేదు. దీంతో పులులు కోర్ వెళ్లే మార్గ మధ్యలోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
బోథ్ మండలంలో పులి సంచారం?
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధ న్నూర్ బి, నాగాపూర్ గ్రామాల మధ్య పులి సంచరిస్తున్నట్లు ధన్నూర్ బి గ్రామానికి చెందిన పలువురు పేర్కొన్నారు. ఓ చేనులో కుక్కపై దాడి చేసి లాక్కెళ్లినట్లు ఓ రైతు తెలిపాడు. ఈ మేరకు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో మైక్‌లో అప్రమత్తం చేశారు. కాగా, మంగళవారం రాత్రి అటవీ అధికారులు చేనులో పులి అడుగుల కోసం పరిశీలించారు. చిరుత సంచరించి ఉండొచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దూడపై దాడి.. ఆపై పట్టాలు దాటి
సిర్పూర్(టి): సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో పెద్దపులి మంగళవారం హడలెత్తించింది. సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావుజీ ఇంటి వద్ద కట్టేసిన ఉన్న గేదె దూడపై వేకువజామున దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. భయంతో ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రాలేదు. అనంతరం సిర్పూర్(టి)– మాకోడి రైలు పట్టాలు దాటుతుండగా పెద్దపులి కెమెరాకు చిక్కింది. సరిహద్దు ప్రాంతంలోని మహరాష్ట్రలోని మాకోడి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటి అడవుల్లోకి వెళ్లింది. గమనించిన రైల్వే ఉద్యోగులు వీడియో తీశారు.
Comments
Please login to add a commentAdd a comment