సమ్మెలో ‘సమగ్ర’ ఉద్యోగులు
● కేజీబీవీల్లో నిలిచిన విద్యాబోధన ● ఈ నెల 10 నుంచి కొనసాగుతున్న సమ్మె ● జిల్లాలో 657 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈనెల 10 నుంచి విధులు బహిష్కరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా వినూత్న నిరసనలు చేపడుతున్నారు. దీంతో విద్యా శాఖలో సేవలు నిలిచిపోగా, కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ల్లో బోధనపై ప్రభావం చూపుతోంది. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు సమీపంలో ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. అయితే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
657 మంది విధులకు దూరం..
జిల్లాలో 18 కేజీబీవీలున్నాయి. ఇందులో 12 పాఠశాలల్లో ఇంటర్, 17పాఠశాలల్లో పదోతరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 4,432 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయి తే ఈ కేజీబీవీల్లో 357 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే పాఠశాలల్లో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు 51మంది,క్లస్టర్ రిపోర్స్‌పర్సన్లు 58మంది,ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 17మంది, సీసీవో లు 13 మంది, మె స్సెంజర్లు 10 మంది, కేర్‌గీవర్లు 10 మంది, ఏపీఓ, టీపీ, సిస్టమ్ అనలసిస్ట్ ఒక్కరు చొప్పున పనిచేస్తున్నారు.ముగ్గురు డేటాఎంట్రీ ఆపరేటర్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు.
నిలిచిన సేవలు..
సమగ్ర ఉద్యోగుల సమ్మెతో విద్యా శాఖలో సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో విద్యాబోధనకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నా న్ టీచింగ్ సిబ్బంది మాత్రమే విద్యార్థులకు భో జనం పెడుతున్నారు. సమగ్ర శిక్షలో కొంత కాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీలు సమ్మెలో ఉండడంతో రిపోర్టులు ఆగిపోయాయి. కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీవోలు విధులకు హాజరుకాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. భవిత రిసోర్స్ సెంటర్‌లో బుద్ధి మాంద్యం, వైకల్యం గల పిల్లలకు ఐఈఆర్పీలు వి ద్యాబోధన చేస్తారు. ఆ సేవలు సైతం నిలిచిపోయా యి. మండల విద్యాధికారి కార్యాలయాల్లో ఎంఐ ఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెస్సెంజర్లు విధులకు వెళ్లకపోవడంతో ఎంఈఓ కార్యాలయాలకు తాళం పడే పరిస్థితి నెలకొంది.
కొద్ది నెలలుగా ఆందోళన..
సమగ్ర శిక్ష ఉద్యోగులు కొద్ది నెలలుగా ఆందోళన బాట పట్టారు. గత ప్రభుత్వ హయాంలో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 2023 సెప్టెంబర్‌లో 29 రోజుల పాటు సమ్మె చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 16న అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. నవంబర్ 16న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు కలెక్టరేట్ల ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో డిసెంబర్ 10 నుంచి సమ్మెను కొనసాగిస్తున్నారు. రోజుకో రీతిలో నిరసనలు చేపడుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.
డిమాండ్లు ఇవే..
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి.
తక్షణమే పే స్కేల్ ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించాలి.
రూ.10లక్షల చొప్పున జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.
రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్ కింద రూ.25లక్షలు చెల్లించాలి.
ప్రభుత్వ నియామకాల్లో ఉద్యోగులకు వెయిటేజీ అమలు చేయాలి.
పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లకు 12 నెలల వేతనం ఇవ్వాలి.
తొమ్మిదో రోజుకు సమ్మె..
కై లాస్‌నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట గల సమ్మె శిబిరంలో ధూంధాంతో నిరసన తెలిపారు. కళాకారులు అశోక్, లక్ష్మణ్, అశన్న, దత్తు, కబీర్‌ఖాన్ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆటపాటలతో హోరెత్తించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు వారితో పదం కలిపి నిరసన వ్యక్తం చేశారు.
రెగ్యులరైజ్ చేయాలి..
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చే స్తామని సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ వేదికగా హామీ ఇ చ్చారు. నెలరోజుల్లో అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఏడాది గడిచినా అతీగతీ లేదు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంచేంత వరకు సమ్మెను కొనసాగిస్తాం. ఇప్పటికే 130 మంది ఉద్యోగులు మృతిచెందారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్, పేస్కేల్ అందిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.
– పడాల రవీందర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment