జత కుదిరేనా?
● ఆడ, మగపులుల దోబూచులాట ● లక్సెట్టిపేట రేంజ్‌లోకి తాజాగా ఆడపులి ● అంతకుముందు ఇక్కడే మగ పులి సంచారం ● ఈ రెండూ కలిస్తే సంతతి పెరిగే అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తోడు, ఆవాసం వెతుక్కుంటూ వలస పులులు కిలోమీటర్ల కొద్దీ సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా పులుల అభయారణ్యాలతోపాటు అభయారణ్యం వెలుపల ఉన్న పెద్దపులులు ఇరుకు ఆవాసాలు, తోడు వెతుక్కుంటూ తెలంగాణ వైపు వస్తున్నాయి. యేటా చలికాలంలో ఇక్కడికి తోడు కోసం వస్తూ అడవుల్లో సంచరిస్తూ తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే పత్తిచేన్లు, సాగు భూములు, రోడ్లు దాటుతూ స్థానికులకు నేరుగా కనిపిస్తున్నాయి. అలా వచ్చిన ఓ పులి కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాంలో ఒకరిపై దాడి చేసి చంపేయగా.. సిర్పూర్(టి) పరిధిలో మరొకరిపై దాడి చేసి గాయపర్చింది. ఆ పులి ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో సంచరిస్తోంది. నిర్మల్ జిల్లా మామడ, సారంగపూర్ అడవుల్లోనూ ఓ మగ పులి తోడు కోసం వెతికి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది.
ఈ రెండు కలిస్తే..
గత నెలలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజ్ పరిధిలో ఓ మగపులి ఏసీసీ క్వారీ, మేడారం, అందుగులపేట, బెల్లంపల్లి రేంజ్ కాసిపేట అడవుల్లో సంచరించింది. సిర్పూర్ మీదుగా మహారాష్ట్ర నుంచి వచ్చిన రెండు నుంచి మూడేళ్ల మధ్య ఉన్న మగ పులి(ఎస్12) ఈ ప్రాంతంలో నాలుగైదు రోజులు కలియదిరిగింది. గత నెలలో సంచరించిన ఈ పులి ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉడుంపూర్, ఇందన్‌పల్లి, జన్నారం రేంజ్‌ల్లో సంచరిస్తోంది. తా జాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, జో డేఘాట్ అడవుల్లో సంచరించిన సుమారు మూడేళ్ల ఆడ పులి లక్సెట్టిపేట రేంజ్ క్వారీ, మేడారం అటవీ ప్రాంతంలోకి వచ్చింది. దాదాపు మగ పులి తిరిగిన అదే దారిలో ఆడపులి రావడంతో అధికారులు అప్రమత్తమై ట్రాక్ చేస్తున్నారు. ప్రస్తుతం హాజీపూర్ మండలం ముల్కల అటవీ ప్రాంతంలో ఆ పులి సంచరిస్తోంది. ఈ రెండు పులులు కూడా సమీప ప్రాంతాల గుండానే వెళ్తున్నాయి. ఈ పులి కూడా లక్సెట్టిపేట, జన్నారం వరకు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఈ పులులు జత కలిస్తే కవ్వాల్‌లో పులి సంతతి పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏళ్లుగా కోర్ ఏరియాలోకి పులులు స్థిర నివాసం కోసం చేస్తున్న అధికారుల ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.
భిన్నంగా పరిస్థితులు
కవ్వాల్ కోర్ ఏరియాలో కాకుండా బయటనే సంచరిస్తున్న పులులకు క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మానవ సంచారం అతిపెద్ద ముప్పుగా ఉండడంతోపాటు పత్తి చేన్లు, పంటలు కాపాడుకునేందుకు వేసే ఉచ్చులు, వన్యప్రాణుల వేటగాళ్లతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పులి సంచారంపై ఆయా రేంజ్‌ల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. తమ పరిధిలో పులి వస్తే నిత్యం అధికారులు ట్రాక్ చేస్తున్నారు. కవ్వాల్ పరిధిలో కోర్‌లో ఇన్నాళ్లు ఒక్క పులి కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రేస్ కుక్కల బెడదతోనూ పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయనే వాదనలున్నాయి. ఇప్పటివరకు చాలా పులులు కవ్వాల్ వరకు వచ్చి వెళ్లిపోయాయి. జే1 అనే మగపులి కొన్నాళ్లు ఉన్నా, తోడు లేక తిరిగి వెళ్లిపోయింది. తాజాగా ఈ రెండు పులులు కలుస్తాయా? లేదా? అనేది వేచి చూస్తున్నారు. ఒకసారి కోర్ ఏరియాలో పులి ఆవాసం ఏర్పాటు చేసుకుంటే పులుల సంతతి పెరుగుతుందని అటవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment