‘సమగ్ర’ ఉద్యోగుల నిరసన
కై లాస్‌నగర్: ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె పదోరోజుకు చేరింది. గురువారం ‘సడక్ పే పడ్‌నా’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఉద్యోగులు పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా సత్వరమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ఉన్న దీక్ష శిబిరం నుంచి కలెక్టర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, సీపీఎస్ రాష్ట్ర నాయకులు చిన్నారెడ్డి, సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, దారట్ల జీవన్ తదితరులు మద్దతు తెలిపారు.
కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ
ఆదిలాబాద్‌టౌన్: ఇటీవల ఇద్దరు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు మృతి చెందగా గురువారం రాత్రి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి వినాయక్‌చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు, సమగ్ర శిక్షా ఉద్యోగులు దీప్తి, ప్రియాంక, హిమబిందు, సువర్ణ, అర్చన, సంధ్యారాణి, అనురాధ, సంగీత, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment