గుడిహత్నూర్‌లో ఉద్రిక్తత..
గుడిహత్నూర్: మండలకేంద్రంలో ఓ బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి(25) గతంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఏడాది క్రితం తిరిగి వచ్చి స్థానిక బస్టాండ్‌లో కొంతకాలం టిఫిన్ సెంటర్ నడిపాడు. ప్రస్తుతం దుకాణం బంద్ చేసి జులాయిగా తిరుగుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలనీకి చెందిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. కుటుంబ సభ్యులు బాలిక ఆచూకీ కోసం పలుచోట్ల వెదికారు. రాత్రి 6గంటల సమయంలో పోశెట్టి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై మహేందర్ అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు.. లైంగిక దాడికి పాల్పడిన అతడిని అప్పగించాలంటూ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఆయన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఇచ్చోడ సీఐ భీమేష్ పెద్ద సంఖ్యలో గుమిగూడిన వారికి సర్ది చెప్పారు. వారు వినకపోవడంతో పాటు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సీఐ, ఎస్సైకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు చెదిరిపోయారు. అదే సమయంలో నిందితుడిని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలపై వారు మరోసారి రాళ్లు రువ్వగా అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం కాలనీకి చేరుకొని నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తలకు గాయమైన సీఐని స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి అనంతరం రిమ్స్‌కు తరలించారు. అలాగే ఇచ్చోడ ఎస్సై తిరుపతి కాలుకు గాయమవగా స్థానికంగా చికిత్స అందించారు. కాగా, నిందితుడు గతంలో పలు దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. మండలకేంద్రంలో సుమారు మూడున్నర గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment