భైంసాలో కిలాడీ జంట అరెస్ట్
భైంసాటౌన్(ముధోల్): జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన పులి ప్రదీప్, కొడాలి వెంకటలక్ష్మితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 22న రాత్రి ఒంటిగంటకు భైంసా నుంచి కారులో వెళ్లి కుభీర్ మండలం పార్డి (బి)లోని రాజరాజేశ్వర ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు అపహరించారు. అనంతరం అదేరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో చొండిలోని దత్తసాయి ఆలయంలో చోరీకి యత్నించగా ఏం లభించకపోవడంతో ఆలయ ఆవరణలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కారులో మహారాష్ట్రకు వెళ్లి దొంగిలించిన సొత్తుతో జల్సా చేసి తిరిగి భైంసా వస్తుండగా కుభీర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గతంలో కుభీర్, భైంసా, ముధోల్, బాసర, నర్సాపూర్ (జి)లో చోరీలకు పాల్పడినట్లు తేలడంతో రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10,910 నగదు, కారు, రెండు ఫోన్లు, పుస్తెలు, కాళ్ల పట్టీలు, చెవి రింగులు, గ్యాస్ సిలిండర్, పగులగొట్టిన తాళాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రూరల్ సీఐ నైలు, ఎస్సైలు రవీందర్, ఎండీ గౌసుద్దీన్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment