అనారోగ్యంతో గల్ఫ్ కార్మికుడు మృతి
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గుగ్లావత్ గణేశ్ (38) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. పది నెలల క్రితం అప్పులు చేసి ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిన గణేశ్ అనారోగ్యానికి గురికావడంతో ఈనెల 18న స్వదేశానికి తిరిగివచ్చాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
మోటారు దించేందుకు వెళ్లి వ్యక్తి మృతి
లోకేశ్వరం: వాగులో మోటారు దింపడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన పడాల నర్సయ్య(42) మంగళవారం కన్కపూర్ శివారు ప్రాంతంలోని వాగులో అదే గ్రామానికి చెందిన తోట గంగాధర్‌కు చెందిన విద్యుత్ మోటారు దింపేందుకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. జాలర్లసాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య సాయవ్వ, కుమారుడు, కుమారై ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆగిఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి
భైంసారూరల్: ఆగి ఉన్న లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మాలిక్ తెలిపిన వివరాల మేరకు కుంటాల మండలంలోని ఓల గ్రామానికి చెందిన బొంతల గంగాప్రసాద్ (36) సోమవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై భైంసాకు వచ్చాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మాటేగాం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గీతిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment