కదలిక
అక్రమ రిజిస్ట్రేషన్లపై..
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై ‘సాక్షి’ కథనంతో కదలిక వచ్చింది. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డిటేల్ రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్ (డీఆర్) రవీందర్‌రావు నుంచి మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కరీంనగర్ డీఐజీకి రిపోర్టు పంపనున్నారు. ‘పైసలిస్తే..సై’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన అక్రమ రిజిస్ట్రేషన్ కథనం జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. రూ.50వేలు దొడ్డిదారిన ఇస్తే అనధికారిక లేఅవుట్లు సైతం ఇట్టే రిజిస్ట్రేషన్ అవుతున్న అంశాన్ని ప్రస్తావించిన విషయం విదితమే.
సెలవులో సబ్‌రిజిస్ట్రార్..
జిల్లా కేంద్రంలోని రణదీవెనగర్ కొత్త లేఅవుట్‌కు డీటీసీపీ అనుమతి లేదు. అయినా గత నవంబర్ 7 నుంచి పలు ప్లాట్‌లకు సంబంధించి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరిగా యి. ఇందులో ఓ డాక్యుమెంట్ ‘సాక్షి’ చేతికి చిక్కింది. ఈసీలో ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎలాంటి లింక్ డాక్యుమెంట్ వివరాలు లేవు. ఓ వైపు సామాన్యులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే.. అనధికారిక లే అవుట్‌లో రిజిస్ట్రేషన్లు చేయడం లేదని నిబంధనలు వల్లే వేసే అధికారులు రూ.50వేలు ఇస్తే మాత్రం ఆ రిజిస్ట్రేషన్ ఠంచన్‌గా చేసేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ‘సాక్షి’ సేకరించింది. ఇదిలా ఉంటే.. ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌రిజిస్ట్రార్ మంగళవారం నుంచి సెలవులో వెళ్లడం గమనార్హం.
తవ్విన కొద్ద్దీ..
ఆదిలాబాద్‌లో ప్రస్తుతం పని చేస్తున్న ఈ సబ్ రిజి స్ట్రార్ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అనధికారిక లేఅవుట్‌లో అక్రమంగా డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో గతంలోనూ అక్రమ పద్ధతుల్లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా టాక్ మొదలైంది. ప్రధానంగా అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్లలోనూ ఎన్‌ఓసీ లేకపోయినా అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శాఖా పరంగా లోతుగా విచారణ చేస్తే అక్రమాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
డీఐజీకి నివేదిక పంపిస్తాం..
అనధికారిక లేఅవుట్‌లో రిజిస్ట్రేషన్లు చేసినట్లు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. డిటేల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌రిజిస్ట్రార్‌కు మెమో ఇస్తున్నాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదికను కరీంనగర్ డీఐజీకి పంపిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఎం.రవీందర్‌రావు,
జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్
విచారణకు ఆదేశించిన జిల్లా రిజిస్ట్రార్
డిటేల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
మరోవైపు
సెలవులో వెళ్లిన సబ్‌రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment