తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
కోవిడ్‌ను మరిచిపోతున్న తరుణంలో మరో వైరస్
భయాందోళన అవసరం లేదంటున్న వైద్యారోగ్యశాఖ
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆదిలాబాద్‌టౌన్: కోవిడ్ మహమ్మారి చేసిన అతలాకుతలం అంతా ఇంతా కాదు. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోగా, కోట్లాది కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆర్థికంగానూ చితికిపోయాయి. లాక్‌డౌన్‌తో పేదలకు తిండి దొరకని పరిస్థితి సైతం నెలకొంది. చనిపోయిన వారి అంత్యక్రియలు సైతం చేయలేని దీన స్థితి కనిపించింది. డ్రాగన్ దేశంలో ఐదేళ్ల క్రితం కోవిడ్ పుట్టి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను జనం మర్చిపోతున్న తరుణంలో మరో కొత్త వైరస్‌కు చైనా పుట్టినిల్లుగా మారింది.
హ్యూమన్ మెటా ఫిన్యూమో వైరస్ అక్కడ వందలాది మందిని ఆస్పత్రి పాలు చేస్తున్న దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్‌తో ముప్పేమి లేదని చైనా చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు కానరావడం లేదని వార్తలు వస్తున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఈసారి ముందుగానే అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కోవిడ్‌ను మర్చిపోతున్న తరుణంలో..
2020 సంవత్సరంలో జిల్లాలో కోవిడ్ మహమ్మారి ప్రవేశించింది. మొదటి విడతలో కేసులు నమోదైనప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. రెండో విడతలో చిన్నాపెద్ద తేడా లేకుండా బారిన పడి మరణించారు. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 7లక్షల 36వేల 344 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 19,704 మందికి నిర్ధారణ అయ్యింది. 92 మంది మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. అనధికారికంగా 300పైగానే మరణించినట్లు అంచనా. ఈ సమయంలో కొత్తరకం వైరస్ మళ్లీ దడ పుట్టిస్తోంది. అయితే కోవిడ్ నివారణకు టీకాలు ఇవ్వడంతో చాలా మందిలో రోగనిరోధక శక్తి పెరిగిన విషయం తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉంటే వైరస్ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
హెచ్‌ఎంపీవీ అంటే..
హ్యూమన్ మెటా ఫిన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) శ్వాసకోశ సంబంధిత వైరస్‌ను పోలి ఉంటుంది. శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉండగా, రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కొత్త కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ మాదిరిగా ఈ వైరస్ లక్షణాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు చికిత్స లేకపోగా, జాగ్రత్త ఒక్కటే నివారణ అని అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తలే అవసరమని పేర్కొంటున్నారు.
భయాందోళన అవసరం లేదు
కొత్త రకం వైరస్ హెచ్‌ఎంపీవీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే కోవిడ్‌లో పాటించిన నిబంధనలు పాటిస్తే ప్రమాదం ఉండదు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం చేయాలి. దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ వైరస్ కూడా కోవిడ్ లక్షణాలు కలిగి ఉంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment