చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్ వివాదం
● ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
నార్నూర్: మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిమిత్తం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్ కార్యకర్తలతో కలిసి అక్కడి చేరుకున్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, తమ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చేతుల మీదుగానే చెక్కుల పంపిణీ జరగాలని ఆయనతో వచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ప్రజలతో ఎమ్మెల్యేగా ఎన్నికై న తనకు ప్రొటోకాల్ వర్తిస్తుందా.. లేక ఓడిన వ్యక్తికి వర్తిస్తుందా అని ఆమె వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు నినాదాలతో హోరెత్తించగా.. సీఐ రహీంపాషా అక్కడికి చేరుకుని కార్యకర్తలను బయటకు పంపించారు. అనంతరం ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా కాంగ్రెస్ నాయకులు తనను అవమానించారని ఆరోపించారు. అనంతరం నార్నూర్ మండలంలో 74, గాదిగూడ మండలంలో 24 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ఆడే సురేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాదవ్ కై లాస్, తహసీల్దార్లు జాడి రాజలింగు, విజయనందం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment