కైలాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నియంత్రించి కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ జిల్లాలో చేపట్టాల్సిన పనుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సిద్ధం చేసింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో రూ.234.13 కోట్ల వ్యయంతో కూడిన 46.82 లక్షల పనిదినాలను కల్పించేలా ప్రణాళిక తయారు చేసింది.
జల సంరక్షణకు ప్రాధాన్యత
ఉపాధి హామీ ద్వారా చేపట్టాల్సిన పనుల్లో జలసంరక్షణకు తొలి ప్రాధాన్యతనివ్వనున్నారు. వర్షపునీటిని సంరక్షించి భూగర్భజలాలను పెంపొందించేలా ఇంకుడుగుంతలు, వాటర్‌షెడ్లు, చెక్‌డ్యాములు, చెరువుల్లో పూడిక తీత, పంట కాలువలు, నీటికుంటల నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే పశువుల పెంపకందారులకు సైతం లబ్ధిచేకూర్చేలా ఉపాధిహామీ నిధులతో పశువుల షెడ్లు, నీటితొట్టీలను నిర్మించుకునే అవకాశం కల్పించారు. నర్సరీల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నీటిపారుదలకు సంబంధించి కాలువల పూడికతీత, పంట పొలాలకు అనుసంధాన రోడ్లు, హరితహారం కింద మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం, మొక్కల సంరక్షణకు నీటిని సరఫరా చేయడం వంటి పనులతో పాటు ఆయా గ్రామాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఇతరత్రా ఉపాధి పనులను చేపట్టనున్నారు.
భారీ డిమాండ్..
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ 87,722 కుటుంబాల్లోని 1,58,286 మంది కూలీలకు 45,70,033 పనిదినాలను కల్పించారు. ఇందుకోసం రూ.113.54 కోట్లు వెచ్చించారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 52 రోజుల సమయం మిగిలి ఉండడంతో 50 లక్షల వరకు పనిదినాలను కల్పించే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఉపాధి పనులకు ఈసారి భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయం అందిస్తోంది. దీంతో జాబ్‌కార్డు కలిగి ఉండి ఇన్నిరోజులు పనులకు వెళ్లనివారు, జాబ్‌కార్డు తీసుకోకుండా ఉన్న నిరుపేదలంతా ఉపాధిహామీ పనులకు హాజరయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా పనులు కల్పించేదిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రూ.300 కూలి గిట్టుబాటయ్యేలా పనులు
జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను ఉపాధిహామీ పఽథకం కింద 46,82,700 పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. కూలీలు చేసిన ఉపాధి పనులతో పాటు మెటిరియల్ కాంపోనెంట్ కింద చెల్లించేందుకుగానూ మొత్తం రూ.234.13 కోట్ల నిధులు వ్యయం కానున్నట్లుగా ప్రతిపాదించారు. కూలీలకు రోజుకు రూ.300 కూలీ గిట్టుబాటయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదించిన నిధులను పరిశీలిస్తే .. కూలీలు చేసిన పనులకుగానూ రూ.14.04 కోట్లు అవసరం అవుతుండగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.9.36 లక్షల నిధులు వ్యయం అయ్యే అవకాశం ఉన్నట్లు కార్యాచరణ ఖరారు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు మహత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గతేడాది అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతీ పంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించి చేపట్టాల్సిన పనులను ఎంపిక చేశారు.
జిల్లా వివరాలు
మండలాలు : 20
గ్రామ పంచాయతీలు : 473
జాబ్‌కార్డులు : 1.74 లక్షలు
నమోదు చేసుకున్న కూలీలు : 3.46 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు : 1.13 లక్షలు
పనులకు హాజరయ్యే కూలీలు: 2.11 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment