![‘స్థానిక’ పోరుకు సన్నద్ధం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06adi180-340152_mr-1738872484-0.jpg.webp?itok=szk54eN5)
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
● జిల్లాకు చేరిన ‘పరిషత్’ ఎన్నికల సామగ్రి ● పంచాయతీ బ్యాలెట్ పత్రాల పరిశీలన ● వేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కై లాస్‌నగర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పంచాయతీ ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంకాగా బుధవారం హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ సైతం పూర్తయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రి ఇప్పటికే జిల్లాకు చేరింది. ఆర్‌వో, ఏఆర్‌వో, నామినేషన్ పత్రాలు, బరిలో నిలిచే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలతో కూడిన హ్యాండ్‌బుక్, ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలతో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి అన్నిరకాల సామగ్రి జిల్లా పరిషత్‌కు చేరుకోగా జాగ్రత్తగా భద్రపరిచారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయింది. 5 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రించిన అధికారులు గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేసేందుకు వీలుగా వాటిని సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టారు. జెడ్పీ కార్యాలయంలో మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల సీరియల్ నంబర్లు, గుర్తులు వంటి వాటిని నిశితంగా పరిశీలించి 50 పత్రాలకు ఒకటిగా కట్టలను కట్టి సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం కూడా బ్యాలెట్ పత్రాల పరిశీలన కొనసాగే అవకాశముంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఆర్‌వో, ఏఆర్‌వోలతో పాటు ఇతర సిబ్బందిని నియమించాలనే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వాటి జాబితాను కూడా సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులు ఎన్నికల ప్రక్రియ చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టతవస్తే మరింత కోలాహలం నెలకొనే అవకాశం ఉంది. ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందనే ప్రభుత్వ సంకేతాలతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తునే రిజర్వేషన్లకోసం నిరీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment