కాఫీ రైతులకు శుభవార్త
● మార్కెటింగ్‌కు ముందుకు వచ్చిన
టాటా సంస్థ
● అభినందించిన కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : గిరిజనులు పండించే కాఫీ మార్కెటింగ్ చేసేందుకు ప్రముఖ వాణిజ్య సంస్థ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు రావడం హర్షణీయమని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో టాటా సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్థకు అవసరమైన మేర కాఫీ గింజలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సంస్థ ఆశించిన స్థాయిలో గ్రేడింగ్ చేయిస్తామన్నారు. ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ రకాలకు వేరు చేస్తామన్నారు. ప్రస్తుతం సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక గిరిజన రైతులు దళారులను నమ్మి మోసపోతున్నారన్నారు. నూతన మార్కెటింగ్ కోసం తాము అన్వేషిస్తున్న తరుణంలో టాటా గ్రూప్ ముందుకు రావడం శుభపరిణామమన్నారు. సంస్థ ప్రతినిధులు లోగో గురించి మాట్లాడగా లోగోను రూపొందించి కాపీ రైట్స్ తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ అమిత్ పంత్ మాట్లాడుతూ రెండు రోజులుగా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించామన్నారు.
స్థానికంగా సాగవుతున్న కాఫీ నాణ్యతను పరిశీలించామన్నారు. కాఫీ పంట నాణ్యత బాగుందన్నారు. ఐటీడీఏ, జీసీసీ తరఫున కాఫీ కొనుగోలు, బ్రాండింగ్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాఫీ పంటకు అదనపు విలువలు జోడించేందుకు అవసరమైన శిక్షణను రైతులకు అందిస్తామన్నారు. ఐటీడీఏ, జీసీసీ, కాఫీ బోర్డు, రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. అరకు కాఫీకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తించామని చెప్పారు. భీసుపురం, సుంకరమెట్ట కాఫీ తోటలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. ఈ సమావేశంలో టాటా మార్కెటింగ్ లీడ్ మేనేజర్ వెంకటేష్‌బాబు, ఐటీడీఏ ఏపీవో(పీవీటీజీ) ఎం. వెంకటేశ్వరరావు, కాఫీ బోర్డు సీనియర్ లైజన్ ఆఫీసర్ రమేష్, కాఫీ ఏడీ అశోక్, జీసీసీ పాడేరు, చింతపల్లి డీఎంలు బుక్కా సింహాచలం, దేవరాజు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు బీఎస్ నందు, రమేష్‌కుమార్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment