అలల జోరు.. విన్యాసాల హోరు
యుద్ధ ట్యాంకర్ల హోరు
కడలిపై కదన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా సాగరతీరంలో గురువారం జరిగిన నావికాదళ పూర్తిస్థాయి విన్యాసాలతో నగరవాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దాదాపు గంటన్నరపాటు కనులార్పకుండా ప్రజలు వీటిని వీక్షించారు. భారత నావికాదళం తమ సాయుధ సంపత్తిని ప్రజలకు తెలిపే విధంగా ఈ విన్యాసాలు సాగాయి. 15 యుద్ధ విమానాలు, జలాంతర్గామి, పలు నౌకలు పాల్గొన్నాయి. తొలుత మూడు హెలికాప్టర్లు భారత జాతీయ పతాకాన్ని, నావికాదళ పతాకాన్ని గగనతలంలో ఎగురవేస్తూ.. ప్రయాణించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. వెంటనే ఐదు హాక్ విమానాలు గగనతలంలో గర్జిస్తూ కనువిందు చేశాయి. మైరెన్ కమాండోలు హెలికాప్టర్ నుంచి ఎంతో చాకచక్యంగా సముద్రంలోకి దిగి, అక్కడి నుంచి జెమిని బోట్లలో తీరానికి చేరుకుని బందీలను విడిపించారు. తిరిగి సముద్రంలోకి వెళ్లిపోవడం ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఆయిల్ రిగ్‌ను విజయవంతంగా పేల్చి సముద్రంలో జరిగే యుద్ధాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. భారత్‌లో తయారైన ఎల్‌సీఎం హెలికాప్టర్ నుంచి పారాచూట్‌ల సహాయంతో మైరెన్ కమాండోలు ఎంతో చాకచక్యంగా కిందకు దిగిన విధానం ఆకట్టుకుంది. ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ మైసూర్, ఐఎన్‌ఎస్ ఢిల్లీ నౌకలపై చేతక్ హెలికాప్టర్లు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు దిగిన తీరు అబ్బురపరిచింది. అనంతరం రెండు హాక్ విమానాలు రెండు వైపులా వాయువేగంతో దూసుకువెళ్లడం, ఏంజెల్స్‌గా పిలిచే చేతక్ హెలికాప్టర్లు ఎంతో సమన్వయంతో చేసిన విన్యాసాలు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లో అత్యవసర, విపత్తు సమయాల్లో ప్రజలను రక్షించే విధానం చూపిన తీరు అదరహో అనిపించింది. అనంతరం సీ కేడెట్ కార్‌ప్స్ నృత్యం, నౌకల నుంచి నమూనా ఫైరింగ్, బాణం ఆకారంలో వెళ్లిన ఏఎల్‌హెచ్ విమానాలు, డార్నియర్ విమానాల శ్రేణి, పీహెచ్‌ఐ విమానం, జెట్ ఫైటర్‌ల విన్యాసాలు అందరిలో ఉత్సుకతను పెంచాయి. చివరిగా నావికాదళం బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. విద్యుత్‌కాంతులతో, నౌకలు మెరిసిపోయాయి. నావికాదళ సైనికులు చేసిన కవాతు ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. ఈ విన్యాసాలను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వీక్షించారు. నావికాదళ తుది దశ విన్యాసాలు ఈ నెల 4వ తేదీన జరగనున్నాయి.
– ఏయూ క్యాంపస్
హెలికాప్టర్ విన్యాసాలు
అబ్బురపరిచిన నౌకాదళ విన్యాసాలు
4న తుది విన్యాసాలకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment