No Headline
ముంచంగిపుట్టు: తూనికల్లో తేడాలుంటే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా తూనికలు,కొలతలశాఖ డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో తూనికలు, కొలతల జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సంతలో తూనిక కాటాలను పరిశీలించారు. ముగ్గురు వ్యాపారుల కాటాల్లో తూకంలో తేడాను గుర్తించారు. పది కిలోల తూకపు రాయి 9 కిలోల చూపించడంతో వారిపై కేసు నమోదు చేశారు. తూనిక రాళ్లు, కాటాలకు సీళ్లు లేకపోవడంతో గుర్తించిన వారు వ్యాపారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ మాట్లాడుతూ వ్యాపారులు తూనికల్లో ఎటువంటి మోసాలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువుల బరువులను సరి చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తూనికలు, కొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య, విశాఖపట్నం జిల్లా పరిశీలకులు వి.రామారావు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment