మరణంలోనూ వీడని స్నేహ బంధం
ఎటపాక: మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. గాయపడిన ప్రాణ స్నేహితుడిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా మరో ఇద్దరు స్నేహితులు కానరాని లోకానికి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి లారీ రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఎటపాక స్టేషన్ సీఐ కన్నపరాజు, ఎస్‌ఐ అప్పలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ కన్నాపురం గ్రామంలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. ఆ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కారం సీతారామయ్య, పొడియం రాజారావు, కుర్సం భద్రయ్య ఎంతో సరదాగా గడిపారు. అనుకోనిరీతిలో కింద పడిన సీతారామయ్య కాలికి గాయం కావడంతో బంధువులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శుభకార్యం ముగిసిన వెంటనే తమ స్నేహితుడిని పరామర్శించేందుకు రాజారావు(31), భద్రయ్య(41) ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో వారు ఇంటికి తిరిగి వస్తుండగా చింతూరు వైపు నుంచి ఐరన్ లోడుతో భద్రాచలం వెళ్తున్న లారీ చోడవరం పంచాయతీ పరిధి భీమవరం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కోసం వచ్చిన ఇద్దరు మిత్రులు ప్రమాదంలో శవాలుగా మారి తన గది పక్కనే ఉన్న మార్చురీలో ఉన్నారని తెలిసిన సీతారామయ్య భోరున విలపించాడు. మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను ఎటపాక స్టేషన్‌కు తరలించి సీఐ కన్నపరాజు, ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావుకు భార్య నాగమణి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భద్రయ్యకు భార్య సాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ రెండు కుటుంబాల సభ్యులు భోరున విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
గాయపడిన స్నేహితుడిని పరామర్శించి
వస్తుండగా ఘటన
బైక్‌ను ఢీకొట్టిన లారీ
కన్నాపురంలో తీవ్ర విషాదం
Comments
Please login to add a commentAdd a comment