ఆనంద హేల
ఉత్సవ్ వేళ..
అరకులోయకు మరింత సొబగులు
అరకులోయ టౌన్/ డుంబ్రిగుడ: అరకు చలి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజు కన్నా జనం భారీగా తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం నిండిపోయింది. సందర్శిత ప్రాంతాలు కూడా కిటికిటలాడాయి. పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్‌కు విశేష స్పందన లభించింది. హెలీకాప్టర్‌లో విహరించి అరకు అందాలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. హెలీరైడ్‌లో పాల్గొనే అవకాశం అందరికీ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు.
పుష్ప ప్రదర్శనలో సెల్ఫీలు, ఫొటోలు..
అరకు పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. పూలతో రూపొందించిన నెమలి, ఏనుగు నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటి వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్ సందర్శించారు. రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. హెలీకాప్టర్‌లో విహరించి అరకులోయ అందాలను తిలకించారు.
సైక్లింగ్‌లో అపశ్రుతి
ఉత్సవాల్లో భాగంగా బొర్రా నుంచి అరకులోయ వర కు నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన అభిషేక్, ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే అభిషేక్‌ను 108 వాహనంలో అనంతగిరి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
నాలుగు నిమిషాలకు రూ.4 వేలా..
చలి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన హెలీరైడ్‌కు రూ.4 వేలు తీసుకుని నాలుగు నిమిషాలు మాత్రమే తిప్పుతున్నారని పర్యాటకులు అసంతృప్తికి గురయ్యారు. కనీసం పది నిమిషాలైనా విహరించే అవకాశం కల్పిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు.
సమ్మర్ ఫెస్టివల్‌లో అందుబాటులో ఉండేలా..
హెలీ రైడ్‌కు జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆదివారం కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆమోదం వస్తే ఆదివారం కూడా హెలీరైడ్ అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో నిర్వహించే సమ్మర్ ఫెస్టివల్‌లో హెలీరైడ్ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ దినేష్ కుమార్ కుటుంబ సభ్యులతోపాటు 5కే రన్ మహిళా విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన జీవనతన్య (7) కుటుంబంతో కలిసి హెలీకాప్టర్‌లో విహరించారు. ప్రకృతి అందాలను తిలకించారు. భవిష్యత్తులో విమానంలో విహరించాలని జీవనతన్య చెప్పిందని, ఈ మేరకు హెలీకాప్టర్‌లో విహారానికి ఆమె కుటుంబానికి అవకాశం కల్పించామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
చెక్క భజన బృందం, అరకు చొంపి గిరిజనుల థింసా నృత్యాలు, శ్రీకాకుళం తప్పెట గుళ్లు, పార్వతీపుపురం మన్యం జిల్లా నందికొట్ట ప్రదర్శన, డుంబ్రిగుడ బ్యాండ్‌మేళా, ప్రకాశం జిల్లా సంగాలి డ్యాన్స్, సూఫీ డాన్స్, మిర్రం డాన్స్, జబర్దస్‌కళాకారుల కామిడీ స్కిట్, వందేమాతరం శ్రీనివాస్ సినీ గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పనశ్రీ దంపతులు, పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ దంపతులు, విశాఖ జిల్లా జడ్జి ఎం.గిరిధర్ దంపతులు,మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు వీక్షించారు.
అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అరకు చలి ఉత్సవం రెండో రోజు శనివారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ నిళుదగల్ అని నామకరణం చేశారు. మాతృమూర్తి షణ్ముగవల్లి పేరిట మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందాల అరకులోయ పూల బొకేలను రాష్ట్రానికి పరిచయం చేస్తామన్నారు. పూల సాగుకు అరకు ప్రాంత వాతావరణం ఎంతో అనుకూలమన్నారు. పూల బొకేల తయారీలో అనుభవం ఉన్నవారిని తీసుకువచ్చి గిరిజనులకు శిక్షణ అందిస్తామన్నారు. బొర్రా గుహల నుంచి నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో 12 మంది పాల్గొన్నారని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓపీ అగర్వాల్ (66) ప్రథమ స్థానం, అరకులోయ మండలం దండపాడుకు చెందిన పాంగి అజయ్ (13) ద్వితీయ స్థానం, విశాఖకు చెందిన ప్రియదర్శని తృతీయస్థానంలో నిలిచారన్నారు. వీరిలో అరకు ప్రాంతానికి చెందిన పాంగి అజయ్ సైకిలిస్ట్‌గా జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు. పాడేరు ఐటీడీఏ నుంచి అతనికి రైడ్ సైకిల్ అందజేస్తామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా 2వ తేదీన సుంకరమెట్ట నుంచి గాలికొండ వ్యూ పాయింట్ వరకు ట్రెక్కింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఫ్యాషన్ షోతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించే గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సైక్లింగ్ విజేతలకు బహుమతులు అందజేశారు. సబ్ డీఎఫ్‌వో ఉమా మహేశ్వరి, ఎంపీడీవో లవరాజు, డీఎల్పీవో పీఎస్ కుమార్, డీఈ రామం పాల్గొన్నారు.
రూ.4వేలు వసూలు సరికాదు
హెలీరైడ్‌కు రూ.4వేల చొప్పున సందర్శకుల నుంచి వసూలు చేయ డం సరికాదు. విశాఖపట్నం నుంచి హైదరా బాద్‌కు విమాన చార్జీ రూ.4 వేలు ఉంది. ఇక్క డ నాలుగు నిమిషాలు హెలికాప్టర్‌లో తిప్పి రూ.4 వేలు వసూలు చేయడం భారంగా ఉంది.
– దంగేటి నానాజీ,
పర్యాటకుడు, మాడుగుల
మరుపురాని అనుభూతి
చాలాసార్లు విమానంలో విదేశాలకు వెళ్లాం. కానీ ఇలాంటి మంచి అనుభూతి ఎప్పుడూ పొందలేదు.హెలీకాప్టర్‌లో అరకు అందాలు తిలకించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇటువంటి అవకాశం కల్పించిన అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు.
– రాజమౌళి,
జబర్దస్త్ కళాకారుడు
రెండో రోజు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కిటకిటలాడిన సందర్శిత ప్రాంతాలు
పుష్ప ప్రదర్శన వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి
భారీగా తరలివచ్చిన
పర్యాటకులు
లోటుపాట్లు లేకుండాపర్యవేక్షించినఅధికార యంత్రాంగం
పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి
కలెక్టర్ దినేష్‌కుమార్
మాతృమూర్తి పేరిట మొక్క నాటి పార్కు నిర్మాణానికి శ్రీకారం
తనివితీరా వీక్షించా
అరకు అందాలను తనివితీరా వీక్షించాం. ఈ ప్రాంతాన్ని ఎన్నిసార్లు సందర్శించినా కొత్తగానే కనిపిస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన అరకు చలి ఉత్సవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సందర్శకుల్లో ఉల్లాసం, ఉత్సాహం నింపాయి.
– ఎస్.మోనాలి,
పర్యాటకురాలు, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment