వాల్తేరు
ఉండాల్సిందే..!
2023–24లో వాల్తేరు డివిజన్ ఆదాయమిదీ..
శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న డివిజన్ వదులుకోలేం..
కేకే లైన్‌తో కూడిన డివిజన్ ఉండాలని డిమాండ్
ఉద్యమ బాటలో వివిధ ప్రజాసంఘాలు, రైల్వే యూనియన్లు
డివిజన్ కొనసాగించాలని ఆది నుంచీ పట్టుబడుతున్న వైఎస్సార్‌సీపీ
శతాబ్దాల చరిత్ర గల వాల్తేరు డివిజన్‌ను
కాలగర్భంలో కలిపేసేందుకు కూటమి
ప్రభుత్వం కుట్రపన్నుతోంది. పంచభక్ష్య
పరమాన్నాలు పక్క రాష్ట్రానికి అప్పగించి..
ప్రసాదం చేతులో పెడుతుంటే ఆహా ఓహో
అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి
నేతల వైఖరిపై విశాఖవాసులు
మండిపడుతున్నారు. ఆదాయం వచ్చే
మార్గాల్ని వాల్తేరు నుంచి వేరు చేస్తుంటే
పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. కేకే లైన్‌తో కూడిన విశాఖ
డివిజనే కావాలంటూ వివిధ ప్రజాసంఘాలు,
రైల్వే యూనియన్‌లు డిమాండ్ చేస్తున్నాయి.
వాల్తేరు చరిత్ర ఇదీ..
● 1893లో బ్రాడ్‌గేజ్ ఆపరేషన్స్‌తో కటక్–
విశాఖ–విజయవాడ మధ్య ప్రారంభమైంది
● 1931 నుంచి వాల్తేరు డివిజన్ బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే పరిధిలో నడిచింది.
● 1952 నుంచి ఈస్ట్రన్ రైల్వే పరిధిలో వాల్తేరు డివిజన్ ఉండేది.
● 1955 నుంచి సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోకి వెళ్లింది
● 2003 నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లింది
● 1968లో కేకే లైన్ ప్రారంభం
● 1996లో కొరాపుట్–రాయగడ లైన్ ప్రారంభం
● వాల్తేరు రూట్ విస్తీర్ణం– 1106 కి.మీ
● వాల్తేరు ట్రాక్ విస్తీర్ణం– 2,364 కిమీ
● మొత్తం స్టేషన్లు– 115
● డివిజన్ పరిధిలో ఉద్యోగులు–
గెజిటెడ్–126, నాన్‌గెజిటెడ్– 17571
సరకు హ్యాండ్లింగ్
76.48
మిలియన్ టన్నులు
సరకు రవాణా
ఆదాయం
రూ. 9,222.77 కోట్లు
ప్రయాణికుల రాకపోకల ద్వారా ఆదాయం
రూ.788.29 కోట్లు
ప్రయాణికుల
రాకపోకలు
29.55 మిలియన్లు
డివిజన్ వార్షికాదాయం
రూ.10,268.72 కోట్లు
మొత్తం కోచింగ్ రెవెన్యూ
రూ.855.05 కోట్లు
వాల్తేరుకు ప్రత్యేక గుర్తింపు
దశాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరికాదు. ఈ డివిజన్‌కు దేశ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కేకే లైన్ అంటే వాల్తేరు.. వాల్తేరు అంటే.. కేకే లైన్. అలాంటి ప్రాంతాన్ని రాయగడకు అప్పగించడం సరికాదు. కొత్త విశాఖ డివిజన్ వల్ల జోన్‌కు పెద్దగా ఒరిగేది లేదు. జోన్ ఎంత సెంటిమెంటో.. డివిజన్ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు అంతే సెంటిమెంట్. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు రాజీలేని పోరాటం చేయాలి.
– బి.కృష్ణారావు, విశ్రాంత రైల్వే ఉద్యోగి
సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్.. తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా.. వాల్తేర్ డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే.. వాల్తేరు డివిజన్‌ని కొనసాగించాలంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. దీనిపై పునరాలోచిస్తామంటూ కేంద్రం డివిజన్ అంశాన్ని హోల్డ్‌లో పెట్టింది. ఇప్పుడు అత్యధిక రాబడిని ఇచ్చే కేకే లైన్ లేకుండానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేస్తూ కేంద్ర రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అరకు లోయతో సహా కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడనుంది. దీనిపై సర్వత్రా వ్యతిరేకతా వ్యక్తమవుతోంది.
వాల్తేరు కనుమరుగైతే..
కూటమి నేతలకు ఆనందమా.?
శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరును విచ్ఛిన్నం చేసి.. కొత్తగా ఆదాయ మార్గాల్లేని విశాఖ డివిజన్‌గా ప్రకటిస్తే కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు నేతలకు వాల్తేరు చరిత్ర గురించి తెలియదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం వల్ల.. విశాఖ కేంద్రంగా రాబోతున్న జోన్ ఆదాయానికి గండి పడుతుందని అంతా ఆందోళన చెందుతుంటే.. కూటమి నేతలు మాత్రం ఆనందం వ్యక్తం చేయడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా మేల్కొని కేకే లైన్‌తో కూడిన విశాఖ డివిజన్ లేదా.. పాత వాల్తేరు డివిజన్ సాధించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వాల్తేరుపై పట్టున్న అధికారినే జీఎంగా నియమించాలి
ఆదాయ మార్గాలు లేని విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ విభజించాల్సి వస్తే.. పలాస ప్రాంతాన్ని ఖుర్దాలోనే ఉంచి.. కిరండూల్ మార్గాన్ని విశాఖ డివిజన్‌లో కలపాలి. జోన్ కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జీఎంని నియమించాలి. వాల్తేరు డివిజన్‌లో పనిచేసిన అనుభవం ఉండి.. పీపుల్స్ డీఆర్‌ఎంగా పేరుతెచ్చుకున్న వారిని ఇక్కడ నియమిస్తే.. జోన్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది.
– కార్తీక్ వంశీ,
సేవ్ వాల్తేర్ ప్రతినిధి, విశాఖపట్నం
ఆవేదన కలిగిస్తోంది..
వాల్తేరు డివిజన్ విభజించి.. విశాఖ డివిజన్ ఏర్పాటు చేసినా.. ఆదాయం పూర్తిగా కోల్పోయే ప్రమాదముంది. దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌లో 17 వేల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం తెచ్చిపెట్టే కొత్తవలస–అరకు రాయగడ డివిజన్‌కు వెళ్లిపోవడం ఆవేదన కలిగిస్తోంది. కొత్త జోన్ అభివృద్ధి చెందాలంటే ఈ మార్గం వాల్తేరులోనే ఉండాలి.
– డా.పెదిరెడ్ల రాజశేఖర్‌రెడ్డి,
సౌత్ కోస్ట్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్
అసోసియేషన్ అధ్యక్షుడు
కొత్త జోన్‌కు వాల్తేరే కీలకం
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టికెట్ల ద్వారా ఏటా రూ.788.29 కోట్లు వరకూ వస్తోంది. ఇది ఈస్ట్ కోస్ట్ జోన్ ప్రధాన కేంద్రం భువనేశ్వర్ కంటే 30 శాతం ఎక్కువ. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా రూ.9,222.77 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. కొత్త జోన్‌కు రావాల్సిన ఆదాయం మొత్తం ఒడిశా పరిధిలోని రాయగడకు వెళ్లిపోతుంది. జోన్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేకే లైన్ వాల్తేరు పరిధిలో ఉండాల్సిందేనని డివిజన్ అధికారులు చెబుతున్నారు. కేకే లైన్ లేకపోతే.. విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. దీంతో కొత్త జోన్ అభివృద్ధి సక్రమంగా జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment