డ్వాక్రా సభ్యులకు తెలియకుండానే ఖాతాల్లోకి డబ్బులు
● మూడు సంఘాల అకౌంట్లలో రూ.60 లక్షలు జమ ● విచారణ జరిపిన అధికారులు
రాజవొమ్మంగి: మండలంలోని మూడు డ్వాక్రా గ్రూపులకు చెందిన సభ్యులకు తెలియకుండానే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.20 లక్షల చొప్పున జమ అయ్యాయి. తమ సంఘాల అకౌంట్లలో అంత సొమ్మును చూసిన సభ్యులు అవాక్కయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజవొమ్మంగి వెలుగు కార్యాలయం పరిధిలోని సుబ్బంపాడు గ్రామానికి చెందిన అరుణ, స్రవంతి సంఘాలతో పాటు మరో సంఘానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు జనవరి 31వ తేదీన జయ అయ్యాయి. పాత బకాయిలు కట్టేందుకు స్థానిక యూనియన్ బ్యాంకుకు వెళ్లిన సభ్యులు తమ ఖాతాల్లో ఉన్న భారీ మొత్తాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సంఘం తరఫున తీర్మానం లేకుండా, సంఘ సభ్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా ఈ సొమ్ము ఖాతాల్లోకి ఎలా వచ్చిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఆ రుణాలకు చెందిన వడ్డీ భారం తమపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన స్థానిక వెలుగు ఏపీఎం రామాంజనేయులు గురువారం సీసీలతో విచారణ జరిపించారు. రుణాలు మంజూరు కావాలంటే తీర్మాన పత్రాలపై వెలుగు ఏపీఎం, వెలుగు సీసీల సంతకాలు తప్పని సరిగా ఉండాలని, అవేవీ లేకుండానే మూడు సంఘాలకు రూ. 60 లక్షల మేర రుణాలు మంజూరైనట్టు విచారణలో తేలిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారలు దృష్టికి తీసుకొని వెళతామని ఏపీఎం రామాంజనేయులు విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment