అయ్యన్న వ్యాఖ్యలపై సుమోటోగా కేసు
● రాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ లేఖలు ● ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్
సాక్షి, పాడేరు: గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని వ్యాఖ్యలు చేయడంపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని, సుమోటా కేసుగా స్వీకరిస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్ చెప్పారు. పంచాయతీ కేంద్రమైన మినుములూరులోని ఏకలవ్య ఫౌండేషన్ రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయనకు సర్పంచ్ లంకెల చిట్టమ్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం సేవలపై ఆయన సమీక్షించారు. పంచాయతీలోని ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధ్యాతయుతమైన స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించి, ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మాట్లాడడంపై గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో గిరిజన, ప్రజాసంఘాలు ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు. గిరిజనుల హక్కులు, చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్‌పైన, సభ్యులమైన తమపైన ఉందన్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై రాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపుతామని ఆయన తెలిపారు. మినుములూరు అభివృద్ధికి విశేషంగా కృషిచేయడంతో పాటు ఉత్తమ సర్పంచ్ పురస్కారం అందుకున్న లంకెల చిట్టమ్మను ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్ దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment