గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు ● జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల తనిఖీ
పాడేరు: జిల్లా ఆస్పత్రికి వచ్చే గిరిజన రోగులతో వైద్యులు, సిబ్బంది ప్రేమగా వ్యవహరించి, మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి.వి.జి. శంకర్‌రావు సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయనతోపాటు, కమిషన్ సభ్యులు జంపరంగి లిల్లీ, కొర్రా రామలక్ష్మి, వడిత్య శంకర్‌నాయక్‌లు జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తనిఖీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలతో పాటు సరఫరా చేస్తున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్టీ కమిషన్ బృందం వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ టి.నర్సింగరావు తదితరులు ఉన్నారు.
అరకులోయ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి
అరకులోయటౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేషంగా కృషిచేసినట్టు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డి.వి.జి. శంకరరావు తెలిపారు. గురువారం ఆయన అరకులోయలో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు ఫామ్ హౌస్‌లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు దంపతులతోపాటు కమిషన్ సభ్యులను ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పాంగి చిన్నారావు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కొర్రా రామలక్ష్మి, తడబారికి లిల్లీ సురేష్, వైఎస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ తడబారికి సురేష్ కుమార్, మాజీ సర్పంచ్‌లు గుడివాడ ప్రకాష్, గొల్లోరి ప్రసాద్,పాంగి సురేష్‌కుమార్, పొట్టంగి రామ్ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ భూర్జ సుందర్‌రావు, పార్టీ నాయకుడు నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment