మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 2 నుంచి 30 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పరిధిలో జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, నిత్యాన్నదానం, ప్రసాదం కౌంటర్, క్యూలైన్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను వెనక్కి జరపాలన్నారు.
ప్రతి రోజూ అన్నదానం
భక్తుల సౌకర్యార్థం ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉదయం 11.00 గంటల నుంచి జగన్నాథస్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ ఉంటుందని, డిసెంబర్ 26న సున్నపువీధి దిగువ నుంచి కొత్తరోడ్డు వరకు ఉన్న రోడ్డుపై మహాన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప కమిషనర్, ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఉచిత, సర్వ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ పాసులను పరిమితం చేసి, దర్శన వేళలను కూడా కుదించామన్నారు.
దర్శన వేళలు
నాలుగు గురువారాలు(డిసెంబర్ 05, 12, 19, 26) తెల్లవారు జాము నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 11.30, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5.30, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, ఈఈ సీహెచ్‌వీ రమణ, సహాయక ఈవో తిరుమలేశ్వరరావు, అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment