ఇసుక దందా!
వైలోవలో
నేవీ ప్రహరీ వద్ద కుప్పలుగా పోసిన తడి ఇసుక
రాంబిల్లి(యలమంచిలి) కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో రాంబిల్లి మండలంలో కొందరు నాయకులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ పేట్రేగిపోతున్నారు. వైలోవ గ్రామం శారదానదిలో నుంచి తడి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ శారదానదిలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. దీంతో ఇక్కడి ఇసుకకు డిమాండ్ ఎక్కువ. దీన్ని ఆసరాగా చేసుకున్న ఇసుక వ్యాపారులు ధనార్జన ధ్యేయంగా గ్రామంలో సిండికేట్‌గా ఏర్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా మాముళ్లు తీసుకొని ఇసుక దందాను దగ్గరుండి జరిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఇక్కడ శారదానదిలోకి రాత్రులు, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లను తీసుకెళ్లి తడి ఇసుకను తవ్వి తీసుకొస్తున్నారు. ఆ ఇసుకను నది పక్కన నేవీ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అనంతరం రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లతో నాయకులు గుట్టుచప్పుడు కాకుండా సుదూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ తంతుపై గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది.
గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
శారదానదిలో ఇసుక తవ్వకాల వల్వ వై.లోవ, పెదకలవలాపల్లి గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఇసుక ట్రాక్టర్లు రాత్రులు, పగలు తేడా లేకుండా వైలోవ, పెదకలవలాపల్లి గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శారదానదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగడం వల్ల తుపానులు, వరదలు వచ్చినప్పుడు సముద్రంలో పోటు కారణంగా ఉప్పుటేరులో నీరు ప్రవాహం పెరిగి గ్రామాలు, పంట పొలాలు మునిగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాలు ఫణంగా పెట్టి తవ్వకాలు
శారదానదిలో దిగి తడి ఇసుకను తీసే సమయంలో కొందరు కార్మికులు ప్రాణాలకు తెగించి ఇసుకను తవ్వుతున్నారు. ఇసుకను తవ్వే క్రమంలో నదిలో కార్మికులు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక డిమాండ్‌ను బట్టి రూ.3 వేలు నుంచి రూ.6 వేలు వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ ఇసుకను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపారులు తరలించి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికై నా ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి అధికారులు చర్యలు తీసుకోవాలని వైలోవ, పెదకలవలాపల్లి పరివాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
స్టాక్ పాయింట్‌గా నేవల్‌బేస్ ప్రహరీ
వైలోవ గ్రామంలో ఉన్న శారదానదిలో ఇసుక తరలించడానికి ఇసుక వ్యాపారులు ఏకంగా నేవల్‌బేస్ ప్రహరీ లోపల స్టాక్ పాయింట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. నేవల్ బేస్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా శారదానదిని ఆనుకొని కొండల చుట్టూ ఇక్కడ కొన్నేళ్లుగా నేవీ రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. శారదానదిలో ఇసుక తవ్వకాల వల్ల లీ రక్షణ గోడ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అయినా సంబంధిత నేవల్ బేస్ ప్రాజెక్ట్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. నేవల్ ప్రహరీ పక్కన యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం.. వాహనాలు రాకపోకలు సాగించడం నిత్యకృత్యంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment