ఎన్నికలకు ఓటరు జాబితా కీలకం
తుమ్మపాల: ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా కీలకమని, దీని తయారీలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, మైన్స్, జియాలజీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సంక్షిప్త సవరణ –2025 ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటరు జాబితా సవరణ సక్రమంగా నిర్వహిస్తే, ఎన్నికల నాటికి శుద్ధమైన జాబితా తయారవుతుందన్నారు. ఎన్నికల సంవత్సరంలో తొలగింపులు చేయుటకు ఎన్నికల కమిషన్ నుంచి ఆంక్షలు ఉంటాయని, ప్రస్తుతం అటువంటివి ఉండవన్నారు. పెండింగు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు సరైన సమాచార మార్పిడి ఉండాలని, సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పోలింగు బూత్ స్థాయిలోనే ప్రతి క్లెయింను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తే, తదుపరి స్థాయిలలో ఇబ్బందులు ఎదురు కావన్నారు. ఓటర్లు జాబితాలో చేర్పులు, తొలగింపులపై రాజకీయ పార్టీ ల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా పరిశోధించి జనాభా నిష్పత్తికి, ఓటరు నిష్పత్తికి భారీ వ్యత్యాసం వచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు.
24లోగా క్లెయింలు, అభ్యంతరాలు పరిష్కరిస్తాం
జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ వివరాలను కలెక్టర్ విజయ కృష్ణన్ వివరించారు. 2024 అక్టోబర్ 29న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం.. జిల్లాలో 6,27,566 మంది పురుషులు, 6,62,276 మంది సీ్త్రలు మొత్తం 12,89,870 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నూరు శాతం ఫొటో గుర్తింపు కలదని, 99.99 శాతం ఓటర్లు ఓటరు కార్డు కలిగి ఉన్నారని తెలిపారు. ఈ నెల 24వ తేదీలోగా క్లెయింలు, అభ్యంతరాలు పరిష్కరిస్తామన్నారు. 2025 జనవరి 1వ తేదీకి ఓటరు జాబితా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్ అనుమతితో అదే నెల 6న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. జిల్లాలో 18–19 ఏళ్ల యువతను ఓటరుగా చేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వీరు 67,050 మంది ఉండగా, 16,016 మందిని డ్రాఫ్ట్ పబ్లికేషను నాటికి ఓటరుగా చేర్చామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి. రమణ, ఫారెస్ట్ సెటిల్మెంటు అధికారి సిహెచ్. గౌతమికుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, గృహ నిర్మాణ శాఖ పీడీ వై.శ్రీనివాస్, ఎన్నికల సెక్షను సూపరింటెండెంటు ఎస్.వి.ఎస్. నాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బొలిశెట్టి శ్రీనివాసరావు, ఎం. జానకిరామరాజు, కొణతాల హరినాధ్‌బాబు, మలపురెడ్డి కోటేశ్వరరావు, గంటా శ్రీరామ్, పి.నాగేశ్వరరావు, బి.తులసిరాం పాల్గొన్నారు.
పెండింగు దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment