వర్షాలు
మరో 2 రోజులు
వర్షపాతం వివరాలు మండలాల వారీగా....
మండలం మిల్లీ మీటర్లు రావికమతం 18.8 సబ్బవరం 12.8 పరవాడ 12.0 బుచ్చెయ్యపేట 10.9 కె.కోటపాడు 9.7 అనకాపల్లి 9.4 కశింకోట 9.1 మునగపాక 8.8 దేవరాపల్లి 7.7 చోడవరం 7.6 మాడుగుల 6.5 నర్సీపట్నం 6.3 రోలుగుంట 5.6 అచ్యుతాపురం 5.4 చీడికాడ 5.1 ఎస్.రాయవరం 2.0 మొత్తం 160.1
● జిల్లా యంత్రాంగం అప్రమత్తం
● కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా తుపాను వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో రైతుల్లో గుబులు పట్టుకుంది. పలు గ్రామాల్లో వరికోత కోసి పొలాల్లోనే పనలుగా వదిలేయడంతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా యంత్రాంగం అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు చేసింది. ప్రజలకు తక్షణ సహాయంగా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ నంబర్లు 08924–226599, 08924–222888 సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలో వర్షపాతం
జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి 160.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా అత్యధికంగా రావికమతం 15.8 కాగా, అత్యల్పంగా ఎస్.రాయవరం 2.0 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 6.7 మిల్లీ మీటర్లుగా వాతావరణ శాఖ లెక్కలు నమోదయ్యాయి.
పెరుగుతున్న పెద్దేరు నీటిమట్టం
మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో జలాశయం కేచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 50 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ఒక గేట్ నుంచి దిగువకు 129 క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా వర్షాలు అధికమైతే మిగిలిన రెండు గేట్లు ఎత్తి వరదనీరు విడుదల చేస్తామని జేఈ తెలిపారు. జలాశయం వద్ద గురువారం 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment