దారులన్నీ అమ్మ సన్నిధికే..
కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన గురువారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు, వేదపండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. మార్గశిరమాసం మూడో గురువారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే బారులుదీరారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు, నాదస్వరాలతో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు తీసుకొచ్చిన పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. అర్ధరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు ఈ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వెండి కవచాలు తొడిగారు. గురువారం మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి మహానివేదన(రాజభోగం), సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన చేశారు. మిగిలిన సమయాల్లో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మంచినీటి సౌకర్యం కల్పించింది. మధ్యాహ్నం 12 నుంచి వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ప్రసాదం అందజేశాయి. పోలీసులకు ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నప్పటికీ.. టూవే కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సింహాచలం, మధురవాడ నుంచి ఉచిత బస్ సర్వీసులు నడిపినట్టు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ జ్యోతిర్మయి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, సుందరపు విజయ్‌కుమార్‌చే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేయించారు.
కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఘనంగా మార్గశిర మూడో గురువారం పూజలు
Comments
Please login to add a commentAdd a comment