ప్రైవేటుకు నైవేద్యం
ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌తో సహా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.22.15 కోట్లు మంజూరు.. జూన్ నెలలో ఎన్నికల ప్రక్రియ ముగిసేనాటికి 90 శాతం వరకు పనులు పూర్తి.. ఇది నిన్నటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం.. డయాలసిస్ సెంటర్‌ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నందున రోగులపై భారం.. ఇది నేటి దుస్థితి. కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఇచ్చిన కానుక ఇది.
ప్రభుత్వ వైద్యం..
మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి కృషితో రూ.22.15 కోట్ల కేంద్ర నిధులు మంజూరు
క్రిటికల్ కేర్ బ్లాక్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి
కూటమి సర్కారు నిర్లక్ష్యంతో ఈనాటికీ ఎక్కడి పనులు అక్కడే
డయాలసిస్ యూనిట్‌ను పీపీపీ పద్ధతిలో నెలకొల్పేందుకు కుట్ర
అనకాపల్లి సమీప ప్రాంత కిడ్నీ రోగులపై భారం
సాక్షి, అనకాపల్లి:
రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులకు మెరుగైన తక్షణ వైద్య సేవలను అందించాలని వైద్యురాలైన అనకాపల్లి మాజీ ఎంపీ బి.వి.సత్యవతి ఆశించారు. జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్‌ఐఎం)కింద రూ.రూ.22.15 కోట్ల కేంద్ర నిధులను రాబట్టారు. జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఒక్క నర్సీపట్నంలోనే ఉన్నందున అనకాపల్లి పరిసర ప్రాంత రోగుల కోసం ఈ నిధులతోనే ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ ఎల్ మాండవియా వర్చువల్ విధానంలో ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇది పూర్తయితే కార్పొరేట్ ఆస్పత్రులకు మించి పేద వాడికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చు. మే, జూన్ నాటికి పనులు 90 శాతం పూర్తయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండుంటే డిసెంబరు నెలాఖరుకు ప్రారంభోత్సవం కూడా జరిగేది. కూటమి సర్కారు వచ్చి పరిస్థితిని తారుమారు చేసింది.
ఆశలు ఆవిరి
తుది దశకు చేరిన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులను కొత్త ప్రభుత్వం నిలిపివేసింది. పీపీపీ పద్ధతిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీఆర్ ఆస్పత్రి వైద్య సిబ్బందితో సంబంధం లేకుండా ఆ సంస్థే ప్రైవేట్ ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి నుంచి దాదాపుగా రూ.1000 నుంచి 1500 వరకూ కనీస చార్జీలు వసూలు చేసి రోగులకు డయాలసిస్ వైద్యం అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
క్రిటికల్ కేర్ బ్లాక్ పూర్తయితే అందే సౌకర్యాలివి..
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలందించాలనే ముందుచూపుతో డాక్టర్ బి.వి.సత్యవతి కృషితో క్రిటికల్ కేర్ బ్లాక్ తీసుకురావాలని ఆశించారు. ఇందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ యూనిట్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డయాలసిస్ బ్లాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది. డాక్టర్స్ డైనింగ్ హాల్స్ (మేల్, ఫిమేల్), ఎంసీహెచ్ (2 బెడ్స్), ఎల్‌డీఆర్, ఆల్ట్రా సౌండ్ రూమ్, ప్లాస్టర్ రూమ్, పీఎంసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూమ్, డ్యూటీ డాక్టర్ ఎగ్జామినేషన్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు, నర్సెస్ రూమ్, ఇంజక్షన్ డ్రెస్సింగ్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆనాటి ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్‌లో ఐఎస్‌ఓ రూమ్, డైనింగ్ హాల్స్, ఐఎస్‌ఓ వార్డు, అత్యాధునిక ఐసీయూ, స్టాఫ్ రూమ్ కోసం కేటాయించారు. సెకండ్ ఫ్లోర్‌ను హెచ్‌డీయూ, అనస్తీషియా రూమ్, ఐసీయూ, ఓపీ కోసం కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment