నేడు, రేపు పెందుర్తిలో దూదేకుల జనగర్జన సభ
అనకాపల్లి: ఇండియన్ ముస్లిం మైనారిటీ రాష్ట్ర నూర్భాషా, దూదేకుల సంఘం ప్రతినిధుల ఫ్లీనరీ సమావేశం విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నట్టు ప్రొగ్రాం సమన్వయకర్త, ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక రింగ్‌రోడ్డు సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల జనాభా ఉండగా.. 45 లక్షల మంది ముస్లింలు ఉన్నట్లు తెలిపారు. ప్లీనరీ సమావేశాలకు ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 20 వేల మంది ముస్లింలు హాజరు కానున్నట్టు ఆయన తెలిపారు. దూదేకుల ముస్లింలు అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. పెందుర్తిలో రూ.25 లక్షలతో నిర్మించిన దూదేకుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా భవనాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ప్రారంభించనున్నారని తెలిపారు. కశింకోట ఆర్‌ఈసీఎస్ మాజీ ఎండీ, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘం చీఫ్ అడ్వైజర్ దావుద్ ఆలీ మాట్లాడుతూ జిల్లాలో శ్మశాన వాటికలు, షాదీఖానా ఏర్పాటు చేయాలని కోరారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మేలు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ఆయన కోరారు. సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ దూదేకుల ముస్లిం విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం నూర్భాషా/దూదేకుల జనగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొండా సాహెబ్, జాబీ, షేక్‌అన్సరీ, షేక్ సముద్దీన్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment