● ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెంకటరావు
మాడుగుల రూరల్ : గ్రంథాలయాలకు చెల్లించాల్సిన గ్రంథాలయ సెస్సును పంచాయతీలు, జీవీఎంసీలు చెల్లించకపోవడం వల్ల గ్రంథాలయాలు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని విశాఖ ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.సిహెచ్. వెంకట్రావు అన్నారు. కె.జె.పురం శాఖా గ్రంథాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా సాక్షితో ఆయన మాట్లాడారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో వసూలైన కోట్లాది రుపాయల గ్రంథాలయ సెస్సు గ్రంథాలయ సంస్థకు చెల్లించలేదని, దీని వల్ల గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 64 గ్రంథాలయాలు వున్నాయని, వీటిలో రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ కలిపి 62 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, గ్రంథాలయాల్లో కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులు భర్తీ చేస్తారన్నారు. గ్రంథాలయాలకు పోటీ పుస్తకాలు, నవలలు వంటి వాటి కొనుగోలుకు బడ్జెట్ విడుదల చేయలేదన్నారు. గ్రంథాలయంలో పాఠకుల ధరావత్తును సంఖ్య పెంచాలని గ్రంథాలయ అటెండర్ వి.శృతికి కార్యదర్శి వెంకట్రావు సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 65 బుక్ డిపో సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కె.జె.పురం గ్రంథాలయ అటెండర్ శృతి, సిబ్బంది పాతాళం అప్పలనర్సమ్మ, వంటర్లపాలెం బుక్ డిపో సెంటర్ సిబ్బంది దోని చిన అప్పారావు పాల్గొన్నారు. అంతకు ముందు వడ్దాది గ్రంథాలయం సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment