గంజాయి స్మగ్లర్ల నుంచి ఆస్తులు కొనడం నేరం
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
సాక్షి, అనకాపల్లి: గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముద్ధాయిలు, గంజాయి స్మగ్లర్ల నుంచి ఆస్తులు కొనుగోలు చేయకూడదని, అలా చేస్తే నేరంగా పరిగణిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ.. అలా కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు కొన్నవారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన పడాల నాగేశ్వరరావుకు ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన పదేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చిన విషయం గుర్తు చేశారు. అనేక సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పడాల నాగేశ్వరరావు..తన భార్య పేరు మీద 15.36 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడన్నారు. పోలీసులు జరిపిన ఆర్థిక విచారణలో గంజాయి రవాణా ద్వారా వచ్చిన ఆదాయమని తేలిందన్నారు. అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తులను కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment