60 రోజుల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం
అనకాపల్లి (కశింకోట) : విద్యుత్ సమస్యలపై వినియోగదారులు చేసే ఫిర్యాదులను 60 రోజుల వ్యవధిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని వినియోగదారుల పరిష్కార వేదిక చైర్‌పర్శన్, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి. సత్యనారాయణ అన్నారు. ఏపీఈపీడీసీఎల్ కశింకోట డివిజన్ పరిధిలోని అనకాపల్లి మండలం కొత్తూరు విద్యుత్ సబ్ స్టేషన్‌లో శనివారం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న 11 జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీలో ఎదురయ్యే సేవా లోపాలను సత్వరమే పరిష్కరించడానికి 2005లో పరిష్కార వేదికను ఏర్పాటు చేశారన్నారు.
2006 నుంచి ఇప్పటి వరకు 107 మంది వినియోగదారులకు రూ.14.26 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశామన్నారు. వినియోగదారుల నుంచి 884 ఫిర్యాదులు అందగా, వాటిలో 60 ఫిర్యాదులు మాత్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా 20 మంది వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. వీటిని సాధ్యమైనంత తొందరలో పరిష్కరిస్తామన్నారు. డివిజన్ ఈఈ ఎస్.రామకృష్ణ, సాంకేతిక సభ్యురాలు ఎస్. మసిలమణి, ఏవో మధు, ఏఈలు, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment