అధికారులు రాని సమావేశాలెందుకు ?
మాట్లాడుతున్న ఎంపీపీ బోదెపు గోవింద్
యలమంచిలి రూరల్ : అధికారులంతా గ్రామాల్లో ప్రజలతో ఎన్నుకోబడిన వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్‌లు,ఎంపీటీసీలకు ప్రాధాన్యమివ్వకుండా అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఎంపీపీ బోదెపు గోవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల సమావేశానికి అధికారుల్లో ప్రాధాన్యం గల రెవెన్యూ,కొన్ని శాఖల అధికారులు హాజరుకావడం లేదు. ఇలా అయితే సమావేశాలెందుకు అంటూ ఆయన శనివారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్‌లో జరిగిన మండల సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్నారన్నారు. మండల కో ఆప్షన్ సభ్యుడు సిధ్ధా నూకేశ్వర్రావు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రం నిర్మించినపుడు నీటిని తోడేందుకు ఉపయోగించిన మోటారు, పైపులను పనులు చేపట్టిన కాంట్రాక్టరు అక్రమంగా తీసుకుపోయారన్నారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడంలేదని నిలదీశారు. రేగుపాలెం సర్పంచ్ మహాలక్ష్మి మాట్లాడుతూ గోకులం షేడ్ల మంజూరులో నిబంధనలు పాటించలేదన్నారు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment