తాటికమ్మే బంగారు పళ్లెం.. చారన్నమే విందు భోజనం
చీడికాడ: రైతులకు మేలు చేస్తూ అర్ధాకలితో మెలిగే మందకాపరుల జీవన శైలి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈకాలంలో కూడా ఇలాంటివి కొనసాగుతున్నాయా అనిపిస్తుంది. విశేషమేమిటంటే సంప్రదాయ సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరగడంతో ఈమధ్య కాలంలో మందకాపరులకు మరింత పని దొరికింది. ప్రతి ఏడాది విశాఖ జిల్లాలోని భీమిలి, పద్మనాభం, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలాల్లోని పలు గ్రామాల నుంచి దమ్ములు సమయంలో గడిచిన 20 ఏళ్లుగా గొర్రెలు, మేకలతో పొలాల్లో మందలు కాసేందుకు 40 కుటుంబాల వారు వస్తుంటారు. వీరు ఈ రెండు జిల్లాల్లోని అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, సబ్బవరం, చోడవరం, మాడుగుల, చీడికాడ, వేపాడ, ఎస్.కోట, దేవరాపల్లి, కె.కోటపాడు తదితర మండలాలను దాటుకుంటూ మందలను తరలిస్తుంటారు. ప్రస్తుతం చీడికాడ మండలం నలుమూలలా మందలు కాస్తున్నారు. గొర్రెలు, మేకలు పొలంలో వేసే పేడ, మూత్రం వలన ఆయా పంట భూముల్లో మిథేన్ వాయువు విడుదలై నేల సారవంతంగా మారుతుందని రైతుల నమ్మకం. ఒక్కొక్క మందలో సుమారు 500 వందల నుంచి 600 వందల వరకు గొర్రెలు, మేకలు ఉంటాయి. 10 నుంచి 12 మంది కాపరులు ఉంటారు. వీరు పొలాల్లో మందలు కాసేందుకు రైతుల నుంచి రోజుకు మందను బట్టి 4 నుంచి 10 కుంచాల బియ్యం, రూ.600 నగదు తీసుకుంటారు. ఈ విధంగా రైతు ఎకరాకు మూడు నుంచి నాలుగు రోజులపాటు మందకాపు కాయిస్తుంటారు. వీరు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, తిరిగి రాత్రి 7 గంటలకే భోజనం చేస్తారు. మధ్యాహ్నం ఖాళీ కడుపుతోనే ఉంటారు. ఒక్కొక్క మంద వద్ద వీరిలో ఒకరు పొలం వద్దే ఉండి మిగిలిన వారికి వంట చేస్తూ.. కొత్తగా పుట్టిన గొర్రె, మేక పిల్లలకు కాపలాగా ఉంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తాటి చెట్లు ఎక్కి తాటి కమ్మలతో అన్నం తినేందుకు బొల్లలు తయారు చేస్తారు. అలా చెట్టెక్కి కమ్మ బొల్లలు కట్టేవారికి అదనంగా ఒక వాటా అన్నం, లేదా బియ్యం అందిస్తారు. పొలం గల రైతుకు ఒక బొల్లన్నం ఇస్తారు. చింతపండు చారుతోనే సొంతూరు వెళ్లే వరకు గడిపేస్తారు. వీరు తినగా మిగిలిన బియ్యాన్ని ఆయా గ్రామాల్లో నిల్వచేసి సొంతూరు వెళ్లేటప్పుడు తీసుకెళతారు. అలా ఏడాదిలో సగం రోజులు వీరు అర్థాకలితో, చలి, చీకటిలో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తూ, కుటుంబ పోషణకు అంకితమవుతారు. ఇలా వీరు మందలను గ్రామాలకు తీసుకొచ్చి నాటి నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేనాటికి మరొక 100 నుంచి 150 పిల్లల వరకు పుడతాయని తెలిపారు.
రైతులతో విడదీయలేని అనుబంధం
పదేళ్లుగా ఈ ప్రాంతం వస్తుండంతో మాకు ఇవన్నీ సొంతూళ్లు అయిపోయాయి. మాతో రైతులందరూ బాగా ఉంటారు. ప్రతి రోజు ఒకరిని మా మంద వద్దకు మాతో భోజనానికి పిలుస్తాం. అలాగే వారు వస్తుంటారు. అదే మాకు పెద్ద సంతృప్తినిస్తుంది. –బుద్ధల ముసలినాయుడు,
తిమ్మాపురం, భీమిలి మండలం
పిల్లలు వేరే వృత్తుల్లో..
మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించకుండా చిన్న నాటి నుంచి వారి వెంట మందలతో తీసుకెళ్లేవారు. ఈ చాలీచాలని బతుకులు మాతోనే అంతరించి పోవాలని మా పిల్లలకు వారసత్వంగా అందించదలుచుకోలేదు. అందువలనే వారు వివిధ వృత్తుల్లో స్ధిరపడ్డారు.
–పల్లా అప్పన్న, వాయిలపాడు, ఎస్.కోట మండలం
గొర్రెలు, మేకలతో ఆరు నెలల సంచారం
నేల సారవంతం కోసం అన్నదాతల ఆదరణ
తరతరాలుగా కొనసాగుతున్న మందకాపరుల వ్యవస్థ
Comments
Please login to add a commentAdd a comment